Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సులేమానీ కుమార్తె: నా తండ్రిని చంపిన అమెరికాకు 'చీకటి రోజు' తప్పదు

సులేమానీ కుమార్తె: నా తండ్రిని చంపిన అమెరికాకు 'చీకటి రోజు' తప్పదు
, సోమవారం, 6 జనవరి 2020 (18:53 IST)
ఇరాన్ సైనిక ఉన్నతాధికారి కాసిం సులేమానీని హత్య చేసినందుకు అమెరికాకు 'చీకటి రోజు' తప్పదని ఆయన కుమార్తె జీనాబ్ సులేమానీ హెచ్చరించారు. ఈ నెల 3న ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో సులేమానీని అమెరికా డ్రోన్ దాడితో చంపేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సులేమానీ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.

 
టెహ్రాన్‌లో ప్రజలనుద్దేశించి జీనాబ్ మాట్లాడుతూ- "నా తండ్రి అమరత్వంతో అంతా ముగిసిపోయిందని అనుకోవద్దు" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సూచించారు. సులేమానీ హత్యకు తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతినబూనింది.

 
సులేమానీ వయసు 62 సంవత్సరాలు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లో అత్యున్నత విభాగమైన కడ్స్ దళానికి ఆయన 1998 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఈ దళం విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది. లెబనాన్‌, ఇరాక్, సిరియా, ఇతర దేశాల్లో ఇరాన్‌ ప్రాబల్యాన్ని పెంచడంలో సులేమానీ కీలక పాత్ర పోషించారు.

 
ఆయన్ను ఉగ్రవాదిగా అమెరికా పరిగణిస్తుంది. టెహ్రాన్లో సులేమానీ అంతిమ సంస్కారాల్లో జనం పెద్దయెత్తున పాల్గొన్నారు. ఎంతో మంది ఏడుస్తూ కనిపించారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా ఖమేనీ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. టెహ్రాన్‌లో అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత సులేమానీ మృతదేహాన్ని షియా పవిత్ర కేంద్రాల్లో ఒకటైన క్వోమ్‌కు ఒక కార్యక్రమం నిమిత్తం తీసుకెళ్లనున్నారు. సులేమానీ సొంత నగరమైన కెర్మన్‌లో మంగళవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.

 
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ టెహ్రాన్‌లో సులేమానీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమెరికన్లకు వాళ్లు ఎంత పెద్ద తప్పు చేశారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఈ ప్రాంతంలో ఎన్నటికీ తలదూర్చకుండా అమెరికా మురికి చేతులను తొలగిస్తామని చెప్పారు.

 
సులేమానీ మృతికి ప్రతిగా అమెరికన్లపైగాని, అమెరికాకు చెందిన దేనిపైనైనాగాని ఇరాన్ దాడులకు దిగితే తాము విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు హెచ్చరించారు. దాడులకు 52 ఇరాన్‌ లక్ష్యాలను గుర్తించామని, ప్రతిదాడులను చాలా వేగంగా, చాలా బలంగా చేస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాలు