Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

Advertiesment
Allu Arjun

బిబిసి

, శనివారం, 21 డిశెంబరు 2024 (11:29 IST)
పుష్ప 2 సినిమా రిలీజ్‌కు ముందురోజు సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే, మునుపటితో పోల్చితే కాస్త మెరుగవుతోందని అంటున్నారు. గత 17 రోజులుగా శ్రీతేజ్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి ట్రాకియోస్టమీ చేసి మెడ భాగం నుంచి శ్వాస తీసుకునేలా ట్యూబ్ ఏర్పాటు చేసినట్లు హెల్త్ బులిటెన్‌లో వివరించారు వైద్యులు.
 
''శ్రీతేజ్‌కు ఐనొట్రోప్స్ (గుండె పనితీరు మెరుగుదలకు ఇచ్చే డ్రగ్), వెంటిలేటర్ సాయంతో తొలుత చికిత్స అందించాం. ఇప్పుడు వాటి అవసరం లేకుండా చికిత్స కొనసాగుతోంది. నాసోగ్యాస్ట్రిక్ (శ్వాసజీర్ణకోశ నాళం) ద్వారా కొద్దికొద్దిగా ఆహారం అందిస్తున్నాం'' అని ఆసుపత్రి వైద్యులు చేతన్.ఆర్.ముందాడ, విష్ణు‌తేజ్ పూడి చెప్పారు. బాలుడి నాడీ వ్యవస్థ పనితీరులో మాత్రం పెద్దగా మెరుగుదల కనిపించలేదని అంటున్నారు వైద్యులు. ''చేతులు, కళ్లలో కొంత కదలికలు ఉన్నప్పటికీ, కళ్లు తెరవలేకపోతున్నాడు. పిలిచినప్పుడు కూడా స్పందన లేదు.'' అని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వివరించారు. తొక్కిసలాట ఘటనలో ఊపిరాడక బాలుడి నాడీ వ్యవస్థ, మెదడుపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పారు.
 
బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది - పోలీసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా డిసెంబరు 17న ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలుడికి బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని చెప్పారు సీవీ ఆనంద్. ''ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక హైపోక్సియా వల్ల శ్రీ తేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. రికవరీకి చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.'' అని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బాలుడి చికిత్స తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చెప్పారు. బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ అల్లు అర్జున్ భరిస్తానని చెప్పారు కదా.. అని మీడియా అడిగిన ప్రశ్నకు, ''ఆ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది'' అని సీవీ ఆనంద్ జవాబిచ్చారు.
 
అల్లు అర్జున్ ఎందుకు రాలేదంటే..
శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని, కుటుంబాన్ని కలుస్తానని జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ మీడియాకు చెప్పారు. ఆయన తరఫున బాలుడిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. డిసెంబరు 18న ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించి మీడియాతో మాట్లాడారాయన. ''తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు ఆసుపత్రికి వద్దామని అల్లు అర్జున్ అనుకున్నా ఆసుపత్రి అధికారులు వద్దని చెప్పడంతో రాలేకపోయారు. అదే రోజు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. తర్వాత ఆసుపత్రికి వెళ్లడం లేదా బాలుడి తల్లిదండ్రులను కలవడం చేయకూడదని న్యాయవాదులు గట్టిగా చెప్పారు. ఆ తర్వాత రావడానికి అనేక నిబంధనలు అడ్డు వచ్చాయి'' అన్నారు అల్లు అరవింద్.
 
అల్లు అర్జున్ విజ్జప్తి మేరకు తాను ప్రభుత్వ అనుమతి తీసుకుని బాలుడిని చూసేందుకు వచ్చానని అరవింద్ చెప్పారు. ''బాలుడు కోలుకోవడానికి ఎంతయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా బాలుడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.'' అని అన్నారాయన. పుష్ప2 మూవీ డైరెక్టర్ సుకుమార్ కూడా శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు.
 
అసలేం జరిగిందంటే..
డిసెంబర్ 5న 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఒకరోజు ముందు, అంటే డిసెంబరు 4న ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ్ (9), కుమార్తె శాన్వికతో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి, శ్రీ తేజ్‌లు ఊపిరాడక స్పృహ కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు.
 
వెంటనే వారిని థియేటర్ నుంచి బయటకు తీసుకువచ్చి పోలీసులు సీపీఆర్ చేసి సమీపంలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రేవతి చనిపోగా, శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 5న కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బందితో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది, పుష్ప 2 నిర్మాతలను నిందితులుగా పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ11గా అల్లు అర్జున్ పేరును పోలీసులు చేర్చారు. డిసెంబరు 13న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
 
తొలుత చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సుమారు రెండు గంటలపాటు ప్రశ్నించారు. తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబరు 14న అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది.
 
సంధ్య థియేటర్ యాజమాన్యానికి నోటీసులు
చనిపోయిన రేవతి కుటుంబానికి ఏ సాయం చేయడానికైనా సిద్ధమని ఇప్పటికే అల్లు అర్జున్ ప్రకటించారు. ఘటన జరిగిన తర్వాత, జైలు నుంచి విడుదలయ్యాక కూడా అల్లు అర్జున్ ఈ ప్రకటన చేశారు. కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. త్వరలో కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో థియేటర్ దగ్గర 11 రకాల లోపాలను గుర్తించామని, వాటిపై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. థియేటర్ యాజమాన్యం నుంచి వచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న