ఉన్నావ్ సామూహిక అత్యాచార బాధితురాలి అంత్యక్రియల సందర్భంగా హిందూనగర్ గ్రామంలో ఏర్పడిన ఉద్రిక్తతలు మెల్లమెల్లగా చల్లారుతున్నాయి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించే పనిలో ఉన్న పోలీసులు మాత్రమే ఇప్పుడక్కడున్నారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో బిహార్ పోలీస్ స్టేషన్ హెడ్ సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
బాధితురాలి కుటుంబం, అధికారుల మధ్య సుదీర్ఘ వివాదం తరువాత బాధితురాలి మృతదేహాన్ని ఆదివారం హిందూనగర్ సమీప గ్రామంలో ఖననం చేశారు. తమ కుటుంబానికి గృహవసతి కేటాయించాలని, బాధితురాలి సోదరికి ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబానికి భద్రత కల్పించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
వారి డిమాండ్లన్నీ నెరవేరుస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. బాధిత కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఉందని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని లఖ్‌నవూ కమిషనర్ ముఖేశ్ మేష్రామ్ వెల్లడించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రెండు ఇళ్లు కేటాయిస్తామని.. అందులో ఒకటి బాధితురాలి తండ్రికి, మరొకటి బాధితురాలి సోదరుడికి కేటాయిస్తున్నట్లు చెప్పారు.
అధికారులు, మంత్రులు ఈ మేరకు హామీ ఇచ్చిన తరువాతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అక్కడకు రావాలన్న తమ డిమాండ్‌ను విరమించుకుని బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బాధిత కుటుంబం అంగీకరించింది. తమకిచ్చిన హామీలన్నీ వారంరోజుల్లో నెరవేర్చాలని వారు అధికారులకు, ప్రభుత్వానికి గడువిచ్చారు.
వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలని, వారం రోజుల్లోనే తమకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని.. లేనిపక్షంలో తాను ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటానని బాధితురాలి సోదరి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఉన్నావ్‌లోని హిందూనగర్‌కు బాధితురాలి మృతదేహం చేరుకున్నప్పుడు ఊరుఊరంతా విషాదంలో మునిగిపోయింది. మృతదేహంతో పాటు బాధితురాలి సోదరుడు, ఒక సోదరి, తల్లి వచ్చారు.. తండ్రి, మిగతా బంధువులు గ్రామంలోనే ఉన్నారు. తెల్లని దుప్పటిలో చుట్టిన బాధితురాలి మృతదేహాన్ని వారి ఇంటి ముందు ఉంచారు. కుటుంబసభ్యులే కాదు అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీరు ధారలైంది.
మా కుమార్తెకు న్యాయం చేయండి..
అంత్యక్రియలకు అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేయడం.. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఆ రాత్రికే అంత్యక్రియలు నిర్వహిస్తారన్న సూచనలు కనిపించాయి. కానీ, బాధితురాలి కుటుంబం మాత్రం అందుకు సిద్ధం కాలేదు. ఈ సంగతి తెలియడంతో అక్కడే ఉన్న కలెక్టర్ దేవేంద్ర పాండే.. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఆ కుటుంబ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని చెప్పారు.
మరోవైపు మృతదేహం గ్రామానికి చేరుకోవడానికి కొంచెం ముందు ఉత్తర్ ప్రదేశ్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, ఉన్నావ్ జిల్లా ఇంచార్జి మంత్రి కమలా రాణి వరుణ్‌లు అధికారులతో కలిసి అక్కడికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన రూ. 25 లక్షల డబ్బును బాధిత కుటుంబానికి ఇవ్వబోయారు. అయితే, బాధితురాలి తండ్రి మాత్రం తమకు న్యాయం కావాలి కానీ డబ్బు కాదని స్పష్టం చేశారు.
తీవ్రమైన వేదనతో ఆయన ''చనిపోయిన నా కుమార్తె ఈ డబ్బుతో తిరిగొస్తుందా? నా కుమార్తెకు న్యాయం చేయండి. దోషులకు శిక్ష విధించండి'' అన్నారు. బాధితురాలి ఇంటి వద్ద అధికారులు, నాయకులు, కుటుంబసభ్యులే కాకుండా పెద్దఎత్తున ప్రజలు పోగయ్యారు. స్థానిక నాయకులు, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ పెద్ద సంఖ్యలో చేరారు.
మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల చెక్కు ఇవ్వబోయినప్పుడు సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే సునీల్ సజన్, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు కూడా అక్కడే ఉన్నారు. పరిహారం మొత్తం పెంచాలని సమాజ్‌వాది పార్టీ నాయకులు మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యను కోరినప్పడు గతంలో ఇలాంటి సందర్భాల్లో ఏం చేశారన్నది చెప్పడం ప్రారంభించారాయన. ఆ తరువాత ఎలాగైతేనేం రూ. 25 లక్షల చెక్‌ను బాధితురాలి తండ్రికి అందజేసి స్వామి ప్రసాద్ మౌర్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాజ్‌వాది పార్టీ నేతలు మాత్రం పరిహారం పెంచాలంటూ నినాదాలు చేస్తూ చాలాసేపు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, వారికి మధ్య గొడవ జరిగింది. చివరకు పోలీసులు సమాజ్‌వాది పార్టీ కార్యకర్త ఒకరిని తమతో తీసుకుపోయారు.
దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి అత్యాచార బాధితురాలు మరణించిన తరువాత ఉన్నావ్‌లోని హిందూనగర్‌లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు జరిగాయి. నిందితులను శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖ్‌నవూ నుంచి నేరుగా ఉన్నావ్ చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆమె ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ప్రియాంకను ఆపిన నిందితుల బంధువులు..
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల కుటుంబసభ్యులు కూడా బాధితుల ఇంటికి కొద్దిరూపంలో నిల్చుని చూస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రియాంకా గాంధీ తిరిగొస్తుండగా వారు ఆమెను చుట్టుముట్టారు. నిందితుల్లో ఒకరి సోదరి కూడా అక్కడే ఉంది. ''ప్రియాంక గాంధీ తొలుత మాతో మాట్లాడటానికి కారు నుంచి దిగినా ఆమె వెంట ఉన్నవారు మేం నిందితుల కుటుంబసభ్యులమని చెప్పడంతో ఆమె మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్లీ కారెక్కేశారు'' అని చెప్పారామె.
నిందితుల కుటుంబసభ్యులు ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. వారు కూడా ఉదయం నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. కానీ, తాము మాట్లాడిందెవరూ మీడియాలో చూపించడం లేదని వారు ఫిర్యాదు చేశారు. తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. వారు కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతోనూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, ఆయనా వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తరువాత మౌర్య మీడియాతో మాట్లాడుతూ ''ఈ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు'' అన్నారు.
మరోవైపు బాధితురాలి తండ్రి ఉదయం నుంచి ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన నేతలు, మీడియాతో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బీబీసీతో మాట్లాడారు. అంతకుముందు రోజు కూడా ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్టయినవారిపై ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ''ప్రభుత్వం మాకు న్యాయం చేయాలనుకుంటే హైదరాబాద్ సామూహిక అత్యాచారం కేసులో దోషులను శిక్షించినట్లుగా శిక్షించాలి. ఆ పని చేయగలిగితే మంచిది. లేదంటే మా ఇంటిపై ఒక బాంబు వేసి మా కుటుంబం అందరినీ చంపేయాలని కోరుతున్నాను'' అన్నారు.
నిందితుల కుటుంబ సభ్యుల్లో భయం..
హైదరాబాద్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి కుటుంబసభ్యుల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిందూనగర్‌లోని 2,500 మంది జనాభాలో ఎవరూ దీనిపై ఏమీ మాట్లాడడం లేదు. బాధితురాలి ఇంటికి సమీపంలోని ఒక గుడిలో కొద్దిమంది గుమిగూడారు. వారిలో ఒకరు మాట్లాడుతూ.. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదంటే అందుకు కారణం అనవసరంగా మాట్లాడి ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలనుకోవడమేనన్నారు.
గుడికి ఎదురుగా రోడ్డుకు రెండో వైపున ఒక కిరాణా దుకాణాన్ని అప్పుడే మూసేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ దుకాణ యజమాని రాజేశ్ మాతో మాట్లాడారు. ''ఈ కేసులో ఎవరు రైటో ఎవరు తప్పో మాకు తెలియదు. కానీ, ఇంతవరకు మా ఊళ్లో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. పోలీసులు రావడం, వారికి మేం జరిగింది చెప్పడం వంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. ఇంతమంది పోలీసులను చూడడం కూడా మా ఊరి ప్రజలకు ఇదే మొదటిసారి'' అన్నారు రాజేశ్.