Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? భార్యాభర్తల బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?

Advertiesment
దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? భార్యాభర్తల బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
, సోమవారం, 30 మే 2022 (18:32 IST)
ప్రణాళిక ప్రకారమే ఒకరికొకరు దూరంగా ఉంటూ సమయం గడుపుతోన్న దంపతుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలా దూరంగా ఉండటం వల్ల ప్రేమ పెరుగుతుందా? అందరిలాగే కరోనా మహమ్మారి సమయంలో వివా, ఆమె భర్త జాన్ ఇద్దరూ ఒకరితోఒకరు చాలా సమయం గడిపారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన 40 ఏళ్ల వివా యూకేలో ఉంటారు. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆమె తన కుటుంబం వద్దకు వెళ్లాలి అనుకున్నారు. అదే సమయంలో జాన్‌ పనులతో బిజీ అయ్యారు. కానీ, జాన్‌కు ఒక ఆలోచన వచ్చింది.

 
లాక్‌డౌన్ తర్వాత ఎలా గడపాలో వారు ముందే అనుకున్నారు. ఇద్దరికీ ఒకేసారి కుదరడం లేదు కాబట్టి ఇద్దరూ రాజీ పడే బదులుగా విడివిడిగా అనుకున్న ప్రణాళికలను పాటిస్తే ఎలా ఉంటుందనేది ఆయన ఆలోచన. అప్పుడప్పుడే గర్భస్రావం బాధ నుంచి వారిద్దరూ కోలుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లడం కాస్త ఉపశమనంగా ఉంటుందని వారు భావించారు.

 
మొదట వివాకు ఏమీ అర్థం కాలేదు. వారిద్దరికీ ఏడేళ్ల క్రితం పెళ్లి అయింది. అప్పటి నుంచి ఆమె, జాన్‌కు ఎక్కువ కాలం దూరంగా ఉండలేదు. కానీ, ఎట్టకేలకు ఆమెను జాన్ ఒప్పించారు. వారిద్దరూ దూరంగా ఉండి మూడు నెలలు అవుతుంది. మనీలాలో తన కుటుంబంతో వివా, ఐర్లాండ్‌లో తన కుటుంబంతో జాన్ ఉన్నారు. ఈ సమయంలో జాన్ వర్క్ ట్రిప్స్‌కు కూడా వెళ్లారు. డెన్మార్క్‌లో విహారయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారు.

 
చాలా కాలం దూరంగా ఉండటం వల్ల రిలేషన్‌షిప్ ప్రమాదంలో పడుతుందని కొందరు అనుకోవచ్చు. కానీ, ఈ జంట మాత్రం పెళ్లి నాటి తొలిరోజుల్లోకి మళ్లీ వెళ్లినట్లుగా భావిస్తున్నారు. ''మేం ప్రతీరోజూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా మాట్లాడుకుంటాం. మా బంధం మొదలైన తొలి రోజుల్లో ఎలా ఉండేదో ఇప్పుడే అలాగే అనిపిస్తోంది'' అని వివా చెప్పారు.

 
కనీసం తాత్కాలికంగా కూడా తమ భాగస్వామి నుంచి వేరుగా ఉండేందుకు ఇష్టపడనివారిలో వివా ఒక్కరే లేరు. తమ భాగస్వామి లేకుండా కొత్త జీవితాన్ని చూసే కోరిక చాలామందిలో లేదని ఎన్నో జంటలను పరిశీలించిన కొంతమంది కౌన్సెలర్లు, రిలేషన్‌షిప్ థెరపిస్టులు తెలుపుతున్నారు. దూరంగా ఉంటే తమ బంధం బీటలు వారుతుందని వారు భయపడుతుంటారు. కానీ, మరికొంతమంది మాత్రం దీనికి విరుద్ధంగా ''రిలేషన్‌షిప్ గ్యాప్ ఇయర్''‌లను ఎంచుకుంటున్నారు. తమ అభిరుచులను, ఆసక్తులను అన్వేషించుకోవడానికి ఈ గ్యాప్‌ను తీసుకుంటున్నారు. కొంతమంది లైంగిక భాగస్వాములన కూడా అన్వేషిస్తున్నారు. కానీ, ఏడాది పాటు దూరంగా ఉండటం (గ్యాప్ ఇయర్) వల్ల వారి బంధం నిజంగా బలోపేతం అవుతుందా? లేక ఆ జంటలు విడిపోతారనడానికి ఇదో సంకేతమా?

 
స్వయం ప్రాధాన్యత
కొన్ని పరిమితులు పాటిస్తేనే బంధాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. మీ కోరికలు, ఆకాంక్షల్లో రాజీ పడటం... లైంగికంగా ఒక భాగస్వామికే కట్టుబడి ఉండటం లాంటివి దీర్ఘకాలం బంధం కొనసాగించడానికి పాటించాల్సి ఉండొచ్చు. అయితే అందరూ ఇలాగే ఉండరు. బంధాలు విచిత్రంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో కొందరు తమ సొంత నియమాలను రూపొందించుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.

 
''ఉద్యోగ అవకాశాల కోసం, ఇంటికి దూరంగా తమకు ఎంతో నచ్చిన ఏదైనా ప్రదేశంలో నివసించడానికి లేదా వ్యక్తిగత అభిరుచులను సాధించడం కోసం జంటలు రిలేషన్‌షిప్ గ్యాప్-ఇయర్‌ వైపు చూస్తుండొచ్చు'' అని సైకాలజీ ప్రొఫెసర్, రిలేషన్‌షిప్ సైంటిస్ట్ మరిసా టి కోహెన్ చెప్పారు. డేటింగ్ యాప్ 'హిలీ'లో ఆమె రీసెర్చర్‌గా కూడా పనిచేస్తున్నారు. ''ఉద్యోగాలు మారడం, జీవితంలో ఒక దశ నుంచి ఇంకో దశకు మారుతున్నప్పుడు వ్యక్తులు తమ బంధం నుంచి కాస్త విరామం తీసుకునే అవకాశం ఉంది'' అని ఆమె అన్నారు.

 
మార్క్ (31), సామ్ (32) జంట రిలేషన్‌షిప్ గ్యాప్ తీసుకున్నారు. చాలా జంటలకు పెళ్లి అంటే ఒక సాహసయాత్రను కలిసి ప్రారంభించడం. కానీ, లండన్‌కు చెందిన మార్క్-సామ్ జంట మాత్రం తమ హనీమూన్‌ను విడిగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మార్క్, మెరైన్ బయాలజీ చదవాలని నిర్ణయించుకోగా... సామ్, యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా శిక్షణ తీసుకోవాలనుకుంది. దీంతో ఈ కొత్త దంపతులు తమ రిలేషన్‌షిప్‌కు కొన్ని నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సామ్ భారత్‌లోని ఒక ఆశ్రమంలో ఉండగా, బహమాస్‌లోని షార్క్ రీసెర్చ్ స్టేషన్‌లో మార్క్ పనిచేస్తున్నారు.

 
''మేం ఒంటరిగా ఏదైనా పని చేయడానికి బహుశా ఇదే చివరి అవకాశం అని మేం తెలుసుకున్నాం. మా ఇద్దరికీ కొన్ని కలలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టకూడదని అనుకున్నాం. ఇది మాకు నిజంగా ఒకరి గురించి ఒకరు ఆలోచించడానికి, పెళ్లి అంటే ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడింది'' అని మార్క్ చెప్పారు. ఇప్పుడు వారిద్దరూ కలిసే ఉన్నారు. తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. సామ్‌కు దూరంగా గడిపిన సమయం తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని మార్క్ అన్నారు.

 
క్లినికల్ సైకాలజీ, యోగా థెరపీతో సామ్ తన కెరీర్‌ను మొదలుపెట్టగా... షార్క్‌లతో పనిచేయాలన్న కలను తీర్చుకున్నాడు మార్క్. ''పెళ్లి అంటే మీకు ఇష్టమైన పనులను, అభిరుచులను వదులుకోవడం కాదు. మీకు మద్దతుగా నిలిచే వ్యక్తిని కలుసుకోవడం, మీ అభిరుచులను సాధించేందుకు మద్దతుగా నిలవడం'' అని మార్క్ చెప్పారు.

 
ఈ విరామం తీసుకునే వారి సంఖ్య ఎందుకు పెరుగుతుంది?
పెళ్లి చేసుకుని కూడా వ్యక్తిగత ఆసక్తులు, ఆకాంక్షలు నెరవేర్చుకోవచ్చని నమ్మే వారిలో మార్క్ కూడా ఒకరు. ఈ దృక్పథమే, రిలేషన్‌షిప్ గ్యాప్ ఇయర్స్ సర్వసాధారణం కావడంలో కీలక పాత్ర పోషిస్తుండొచ్చు. కనీసం 1960ల నాటి నుంచి వ్యక్తివాదం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛతో ఉండేవారు కుటుంబాలతో పోలిస్తే స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్వీయ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని వీరు భావిస్తారు. వ్యక్తిగత లక్ష్యాలు, ఆశయాలు, ఆసక్తులపై ఫోకస్ చేయడానికి రిలేషన్‌షిప్ గ్యాప్ తీసుకోవాలనే ఆలోచనను ఈ వైఖరి మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది. సర్దుకుపోవడం, త్యాగం చేయడం వంటి సంప్రదాయ వైవాహిక లక్షణాలు కొంతమందికి తక్కువ ఆకర్షణీయంగా కనిపించవచ్చు.

 
లైంగికంగా ఒక భాగస్వామికే కట్టుబడకపోవడం, ప్లాటోనిక్ జీవిత భాగస్వాములను ఎంచుకోవడం వంటి సంప్రదాయేతర బంధాల్లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. యూఎస్‌లో విడాకులు తీసుకుంటోన్న మిలీనియల్స్ సంఖ్య తగ్గుతున్నట్లు డేటా చూపుతోంది. రిలేషన్‌షిప్‌లో ఆనందంగా లేమని భావించే వ్యక్తులు ఆ బంధాన్ని పూర్తిగా వదులుకోవడానికి బదులుగా ఈ విరామాన్ని పాటించడం వల్ల ఇరువురికి మంచి జరుగుతుంది.

 
''భాగస్వాములు ఇద్దరూ ఒకే రకమైన భావనలో ఉన్నప్పుడు ఆ బంధంలో విరామం తీసుకోవడం వల్ల రిలేషన్‌షిప్ బలోపేతం కావొచ్చు. వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల మళ్లీ వారి మధ్య బంధం బలంగా మారుతుంది'' అని కోహెన్ చెప్పారు.

 
సౌమ్యంగా విడిపోవడం లేదా తాజా దృక్పథం?
రిలేషన్‌షిప్ గ్యాప్ తీసుకోవడం వల్ల తమ బంధానికి ప్రయోజనం కలిగిందని వివా-మార్క్ జంట అనుకొని ఉండొచ్చు. కానీ, అందరికీ ఇలాగే అనిపించకపోవచ్చు. వేరుగా కొంతకాలం ఉందామనే తమ భాగస్వామి సలహా కొందరికీ హెచ్చరికగా కనిపించొచ్చు. కొన్ని జంటల్లో ఇది లోతైన సమస్యలను సూచిస్తుందని అమెరికాలోని అడ్లర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, సెక్స్ థెరపిస్ట్ టామ్ మర్రే నమ్ముతారు. భాగస్వామి పట్ల విసుగు, లైంగిక కోరికలు, బయట ఆనందాన్ని వెదుక్కోవచ్చనే కారణాలతో జంటలు ఈ విరామం తీసుకోవాలని అనుకుంటారని ఆయన అన్నారు. ఈ గ్యాప్ విషయంలో ఇద్దరికీ ఒకే అభిప్రాయం లేకపోయినా, ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోయినా ఆ బంధం మరింత తొందరగా విచ్ఛిన్నం అవుతుందని చెప్పారు.

 
''ఇందులోని మొదటి ప్రతికూలత ఏంటంటే... మనుషులు చాలా చంచలంగా ఉంటారు. మనం సంఘ జీవులం కాబట్టి ఒక సమూహంలో జీవించాలి అనుకుంటాం. బంధంలో విరామం తీసుకున్నప్పుడు మనలో అభద్రతాభావం లేదా అసూయ పెరిగితే అది ఎక్కువ కాలం నిలబడటం కష్టమే. దీనితో పాటు సదరు వివాహ బంధం నుంచి బయటపడాలనే ఎజెండా మనసులో ఉంటే దీని వల్ల అది మరింత త్వరగా జరిగిపోతుంది.''

 
రిలేషన్‌షిప్ గ్యాప్ ఇయర్స్ గురించి సందేహాలు ఉన్నప్పటికీ మర్రే... భాగస్వాములు ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటే ఇది వర్కవుట్ అవ్వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యతలు, దూరంగా ఉన్న సమయంలో భావోద్వేగ సంక్లిష్టతలు, ఖర్చులు వంటి ప్రాక్టికల్ సమస్యల గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని అన్నారు. చాలాకాలం పాటు దూరంగా ఉంటూ బంధాన్ని పటిష్టం చేసుకోవడం ఒక సవాలు లాంటిది.

 
ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉన్న వివా త్వరలోనే ఆయనను కలవనున్నారు. ఈ సమయంలో తన అనుభవం గురించి వివా చెప్పారు. ''దూరంగా ఉండటం మా బంధానికి మంచే చేసింది. మా విషయంలో దూరం మా హృదయాలను మరింత చేరువ చేసింది. మా బంధాన్ని తాజాగా మార్చింది. మేం ఒకరినొకరం మరింత ఎక్కువగా ప్రేమిస్తాం'' అని వివా తెలిపారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను.. బాదుడే బాదుడు: నారా లోకేష్ పాదయాత్ర ప్లాన్?