Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

Advertiesment
సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'
, శుక్రవారం, 6 డిశెంబరు 2019 (18:52 IST)
గతవారం జరిగిన 'దిశ' అత్యాచారం, హత్య కేసు నిందితులు శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్లో మరణించారని పోలీసులు తెలిపారు. "విచారణలో భాగంగా నేరం జరిగిన తీరును రీకన్‌స్ట్రక్ట్ చెయ్యడానికి ఘటనా స్థలానికి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వద్ద నున్న ఆయుధాన్ని లాక్కొన్న నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితులు నలుగురూ మరణించారు" అని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

 
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ బీబీసీతో మాట్లాడుతూ, "సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తుండగా నిందితులు తిరగబడ్డారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా నలుగురూ చనిపోయారు. ఇప్పటివరకు ఇదీ మాకు తెలిసిన సమాచారం. మిగతా వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే ధ్రువీకరించగలను. ఈ ఘటనలో మా పోలీసులు ఇద్దరికి గాయాలయ్యాయి' అని చెప్పారు.

 
"నేరం జరిగిన తీరును రీకన్‌స్ట్రక్ట్ చేసేందుకు నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చాం. ఆ సమయంలో వారు మా దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని మాపై కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆ నలుగురు నిందితులూ మరణించారు" అని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసులు మీడియాకు వివరించారు.

 
కమిషనర్ సజ్జనార్ ఏమన్నారు?
27 రాత్రి ఓ వెటర్నరీ డాక్టరుపై షాద్ నగర్ సమీపంలో చటాన్ పల్లి గ్రామం దగ్గర అత్యాచారం, హత్య జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా గానీ, ఈ కేసును అనేక కోణాల్లో విచారణ చేశాం. చాలా శాస్త్రీయ ఆధారాలు సేకరించాం. వాటి ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. ఆ తర్వాత వారిని చర్లపల్లి జైలుకు రిమాండ్ కోసం తరలించాం. ఆ తర్వాత కోర్టు విచారణలో పదిరోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పోలీసులకు అప్పగించారు.

 
4వ తేదీన వారిని విచారణ కోసం మా కస్టడీలోకి తీసుకున్నాం. 4, 5 తేదీల్లో విచారణ సందర్భంగా వారు చెప్పిన మరిన్ని వివరాల ఆధారంగా బాధితురాలి సెల్‌ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఘటన విచారణలో భాగంగా వారిని ఇక్కడకు తీసుకొచ్చాం. అయితే, వారు వస్తువులు అక్కడ ఉంచాం, ఇక్కడ ఉంచాం అంటూ పోలీసు బృందాలకు చెబుతూ వచ్చారు. ఉన్నట్లుండి అక్కడ దొరికిన కర్రలు, రాళ్లు పట్టుకుని పోలీసులపై దాడికి దిగారు.

 
ఆ తర్వాత ఇద్దరు పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కొని కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారితో సంయమనం పాటించాలని, ఆయుధాలను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, వారు వినలేదు. మొదట ఏ1 నిందితుడు కాల్పులు ప్రారంభించారు, ఆ తర్వాత ఏ4 నిందితుడు కాల్పులకు దిగారు. ఈరోజు నిందితులతో 10మంది పోలీసుల బృందం ఉంది. ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా గాయపడ్డారు. మహబూబ్ నగర్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో పోస్ట్ మార్టం నిర్వహించాం.

 
ఈ ఘటన ఉదయం 5.45 నుంచి 6.15 గంటల మధ్యలో జరిగింది. శరీరాలపై ఏ భాగాలపై బులెట్లు దిగాయనేది పోస్ట్ మార్టం తర్వాత తేలుతుంది. ఎన్ని బులెట్లు ఫైర్ అయ్యాయనేది కూడా విచారణ తర్వాత తేలుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోయిందనుకుంటున్నా. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో వారి చేతులకు బేడీలు వెయ్యలేదు. ఈ ఘటనపై సంబంధిత విభాగాలకు పూర్తి వివరాలతో నివేదిక పంపిస్తాం.

 
వీళ్లు ఇంకా మరిన్ని నేరాల్లో పాలుపంచుకున్నారనే అనుమానాలపై కూడా విచారణ చేస్తున్నాం. తెలంగాణ, కర్ణాటకల్లో జరిగిన మరికొన్ని నేరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా విశ్లేషించాలని నిర్ణయించాం. ఇలాంటి సంచలనాత్మకమైన, సున్నితమైన కేసుల్లో అధికారుల నుంచి ధ్రువీకరణ లేకుండా ఏదీ ప్రచారం చెయ్యవద్దు. మా పని మమ్మల్ని చెయ్యనివ్వండి. బాధితుల కుటుంబాలకు సంబంధంచిన 2008లో వరంగల్లులో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై స్పందించేందుకు సజ్జనార్ ఈ సందర్భంగా నిరాకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవానీ దీక్ష విరమణకు పక్కాఏర్పాట్లు