Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్యా, యుక్రెయిన్ ఉద్రిక్తతలు: గత కొన్ని గంటల్లో ఏం జరిగింది? 10 పాయింట్స్

రష్యా, యుక్రెయిన్ ఉద్రిక్తతలు: గత కొన్ని గంటల్లో ఏం జరిగింది? 10 పాయింట్స్
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (21:30 IST)
యుక్రెయిన్, రష్యా సంక్షోభం మరింత ముదిరింది. పుతిన్ నిర్ణయంతో ఉద్రిక్తతలు పెరిగాయి. గత కొన్ని గంటల్లో అసలు ఏం జరిగింది.. పది పాయింట్స్ మీకోసం.

 
1. యుక్రెయిన్‌లో రష్యా మద్దతున్న వేర్పాటువాదుల నియంత్రణలోని రెండు ప్రాంతాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంఛనంగా గుర్తించారు.

 
2. ఆ రెండు ప్రాంతాలైన లుహాన్క్, డోనెస్క్‌‌లకు రష్యా సైనిక బలగాలను పంపుతానని పుతిన్ చెప్పారు. ఆ సైనిక బలగాలు ''శాంతి పరిరక్షణ'' కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని పుతిన్ చెప్తున్నారు. రష్యా ప్రజలను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు. యుక్రెయిన్ అనేది ‘‘ప్రాచీన రష్యా భూమి’’ అంటూ.. ఆధునిక యుక్రెయిన్‌ను సోవియట్ రష్యా ‘‘సృష్టించింది’’ అని చెప్పారు. యుక్రెయిన్‌ను కీలుబొమ్మ ప్రభుత్వం నడిపిస్తోందని, ఆ దేశం ‘‘అమెరికా కాలనీ’’గా ఉందని ఆరోపించారు

 
3. అయితే, యుక్రెయిన్ మీద సైనిక ఆక్రమణకు ఇది నాంది పలుకుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రష్యా చెబుతున్న ''శాంతి పరిరక్షణ'' అనేది 'నాన్‌సెన్స్' అని ఐరాసలో అమెరికా ప్రతినిధి అభివర్ణించారు. రష్యా మీద మంగళవారం మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా చెబుతోంది. యుక్రెయిన్‌ మీద దండయాత్ర చేయటానికి రష్యా సిద్ధంగా ఉందని అమెరికా నమ్ముతోంది.

 
4. పుతిన్ ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రాత్రి పొద్దుపోయాక అత్యవసరంగా సమావేశమైంది. శాంతి నెలకొల్పాలని, యుద్ధాన్ని నివారించటానికి దౌత్య ప్రయత్నాలు జరగాలని పలు దేశాలు పిలుపునిచ్చాయి.

 
5. యుక్రెయిన్ విషయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. యుక్రెయిన్‌లో తాజా పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.

 
6. పరిస్థితులు మరింతగా దిగజారే చర్యలను నివారించాలని ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్ జున్ భద్రతామండలి సమావేశంలో సూచించారు. సంక్షోభానికి దౌత్య పరిష్కారం కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్నీ చైనా ఆహ్వానిస్తోందన్నారు.

 
7. అయితే, స్వతంత్ర ప్రాంతాల మీద యుక్రెయిన్ దురాక్రమణకు పాల్పడుతోందని, దాని నుంచి వేర్పాటు ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఉందని ఐరాసలో రష్యా రాయబారి వాసిలి నెబెన్జ్యా వాదించారు. దౌత్య చర్చలకు రష్యా ఇంకా సుముఖంగానే ఉందన్నారు.

 
8. రష్యా చర్యలు.. యుక్రెయిన్ సార్వభౌమత్వం, సమగ్రతను అతిక్రమించటమేనని యుక్రెయిన్ అధ్యక్షుడు వాలోద్‌మిర్ జెలెన్స్కీ తప్పుపట్టారు. ఆయన మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. రష్యా ఎలాంటి ప్రకటనలు ఇచ్చినప్పటికీ యుక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దులు యధాతధంగా ఉంటాయని స్పష్టం చేశారు.

 
9. యుక్రెయిన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిరిండియా ప్రత్యేక విమానం అక్కడికి వెళ్లిందని ప్రసారభారతీ న్యూస్ సర్వీస్ పేర్కొంది. ఒక విమానం ఇవాళ యుక్రెయిన్‌కు బయలుదేరి వెళ్లింది. ఫిబ్రవరి 24న మరొక విమానం, 26న ఇంకో విమానం యుక్రెయిన్‌కు వెళ్తాయి.

 
10. తూర్పు యుక్రెయిన్‌లోకి సైనిక బలగాలను పంపించాలన్న పుతిన్ నిర్ణయంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే, ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యలో మార్పు వస్తుందని పుట్టింటికి పంపిస్తే...