Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?

Advertiesment
దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
, గురువారం, 4 జులై 2019 (15:27 IST)
దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ అల్ మక్తోమ్ భార్య ప్రిన్సెస్ హాయా బింట్ అల్-హుసేన్ తన భర్తతో విడిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాచకుటుంబంలో ఇలా జరగటం అసాధారణం.

ఈ యువరాణి ఇప్పుడు లండన్‌లోని ఒక టౌన్‌హౌస్‌లో రహస్యంగా జీవిస్తున్నట్లు చెప్తున్నారు. ఆమె ఒలింపిక్‌ హార్స్ రేస్‌లో రైడర్‌గా పాల్గొన్నారు. హార్స్ రేస్‌లకు తరచుగా హాజరవుతుంటారు. అయితే.. ఈ సంవత్సరం రాయల్ ఆస్కాట్ (రాచరిక గుర్రప్పందెం)లో ఆమె కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగించింది.

 
భర్త మీద కోర్టులో పోరాడటానికి సిద్ధపడటంతో తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆమె భయపడుతున్నట్లు సంబంధిత వర్గాలు బీబీసీకి చెప్పాయి. ప్రిన్సెస్ హాయా 1974 మేలో జన్మించారు. ఆమె తండ్రి జోర్డాన్ రాజు హుసేన్. తల్లి రాణి అలియా అల్-హుసేన్. హాయా మూడేళ్ల వయసులో ఆమె తల్లి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. జోర్డాన్ ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా-2.. హాయాకు సవతి సోదరుడు. ప్రిన్సెస్ హాయా చిన్నపుడు చాలా కాలం పాటు బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడే స్కూల్ విద్యాభ్యాసం చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఫిలాసఫీ, ఎకానమిక్స్ అధ్యయనం చేశారు.

 
గద్దలు పెంచటం, షూటింగ్, భారీ యంత్రాలు తనకు చాలా ఇష్టమని ఆమె చెప్తారు. జోర్డాన్‌లో హెవీ ట్రక్కులు నడపటానికి లైసెన్స్ ఉన్న ఏకైక మహిళను తానే అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చిన్నపుడే గుర్రపు స్వారీ నేర్చుకుంటూ దాని మీద చాలా ఇష్టం పెంచుకున్నారు. ఇరవయ్యో పడి మధ్యలో పూర్తికాలపు ప్రొఫెషనల్ హార్స్ రైడింగ్ అథ్లెట్‌గా కొనసాగారు.దాదాపు ఇరవై ఏళ్ల కిందట జరిగిన 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్‌లో హార్స్ రైడర్‌గా జోర్డాన్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించారు. తమ దేశ జండాను పట్టుకుని పాల్గొన్నారు.

 
హాయా ముప్పై ఏళ్ల వయసులో 2004 ఏప్రిల్ 10న యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్‌ను పెళ్లాడారు. అప్పుడు ఆయన వయసు 53 సంవత్సరాలు. ప్రిన్సెస్ హాయా ఆయనకు ఆరో భార్య. జూనియర్ భార్య కూడా. షేక్ మొహమ్మద్‌కు వేర్వేరు భార్యల ద్వారా 23 మంది పిల్లలు ఉన్నారని చెప్తారు.

 
హాయా లాగానే షేక్‌కి కూడా గుర్రాలంటే ఇష్టం. గోడాల్ఫిన్ హార్స్ రేసింగ్ స్టేబుల్స్ వ్యవస్థాపకుడు యజమాని. వీరికి అమ్మాన్‌లో పెళ్లయింది. తన కుటుంబ జీవితం చాలా బాగుందంటూ ప్రిన్సెస్ హాయా చాలాసార్లు బహిరంగంగా మాట్లాడేవారు. ''ప్రతి రోజూ ఆయన చేసే పనులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయనకు సన్నిహితంగా ఉండటం నా అదృష్టమని రోజూ దేవుడికి కృతజ్ఞతలు చెప్తా'' అని హాయా 2016లో ఎమిరేట్స్ వుమన్ మేగజీన్‌తో పేర్కొన్నారు. కానీ.. గత ఏడాది షేక్ మొహమ్మద్ కుమార్తెల్లో ఒకరైన షేక్ లతీఫా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించినపుడు వీరిద్దరి సంబంధాల్లో పగుళ్లు మొదలయ్యాయి.

 
యువరాణి లతీఫా.. తనకు, తన కుటుంబానికి తమ జీవితాల్లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవని, తను అకృత్యాలకు గురయ్యానని చెప్తూ చిత్రీకరించిన వీడియో సందేశం ప్రపంచమంతటా సంచలనం సృష్టించింది. యూఏఈ నుంచి ఒక ఫ్రాన్స్ వ్యక్తి సహాయంతో సముద్ర మార్గంలో తప్పించుకున్న షేక్ లతీఫాను భారతదేశ తీరం సమీపంలో సాయుధులు అడ్డుకుని దుబాయ్‌కు తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. ఎమిరేట్స్‌లోని తన ఇంట్లో ఐర్లండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్ పక్కన కూర్చుని ఉన్న లతీఫా ఫొటోలను గత డిసెంబర్‌లో విడుదల చేశారు.

 
ప్రిన్సెస్ లతీఫాను ఐర్లండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్ కలిసినట్లు యూఏఈ ఫొటోలు విడుదల చేసింది. షేక్ లతీఫాను ''స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకునే'' ప్రయత్నాలు జరిగాయని, ఆమె ఇప్పుడు ''దుబాయ్‌లో క్షేమంగా'' ఉన్నారని దుబాయ్ అధికారులు చెప్పారు. ఆ సమయంలో ప్రిన్సెస్ హాయా కూడా అదే మాటను బలపరిచారు. ''ఈ విషయం నిజానికి ఇంత దూరంగా పోవటం అనూహ్యం'' అని పేర్కొన్నారు.

 
కానీ.. ఆరు నెలల తర్వాత ఇప్పుడు.. షేక్ లతీఫా పారిపోయే ప్రయత్నానికి సంబంధించి చేదు నిజాలు ప్రిన్సెస్ హాయా తెలుసుకున్నారని.. తన భర్త ఇతర కుటుంబ సభ్యుల నుంచి శత్రుత్వాన్ని, ఒత్తిడిని ఎదుర్కొన్నారని ఆమె సన్నిహిత వర్గాలు బీబీసీకి చెప్పాయి. ఆమె తనకు ఇంట్లో రక్షణ లేదని భావించారని చెప్తున్నారు. దీంతో జర్మనీ పారిపోయి అక్కడి నుంచి బ్రిటన్ చేరుకున్నారు. అయితే.. ప్రిన్సెస్ లతీఫాను ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అపహరించుకెళ్లారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

 
ఇప్పుడు తనను కూడా అపహరించి తిరిగి దుబాయ్ తీసుకెళతారని హాయా భయపడుతున్నట్లు ఆమె సన్నిహత వర్గాలు చెప్పాయి. ఈ అంశంపై వ్యాఖ్యానించటానికి లండన్‌లోని యూఏఈ రాయబార కార్యలయం నిరాకరించింది. ఇది ఇద్దరు వ్యక్తల మధ్య విషయమని అభివర్ణించింది. ప్రిన్సెస్ హాయాతో వివాహానికి సంబంధించిన వార్తలపై ఆమె భర్త అధికారికంగా స్పందించలేదు. అయితే.. ''ద్రోహం, మోసం'' చేసిందని వివరాలు చెప్పకుండా ఒక మహిళమీద ఆరోపణలు చేస్తూ ఆయన జూన్ 10న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.

 
ప్రిన్సెస్ హాయా కింగ్‌స్టన్ ప్యాలస్ గార్డెన్స్‌లో 10 కోట్ల డాలర్ల విలువ చేసే ఇంట్లో నివసిస్తున్నారని, బ్రిటన్ హైకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్ నుంచి పారిపోయిన ప్రిన్సెస్ హాయా తొలుత జర్మనీ వెళ్లారు. అక్కడ ఆశ్రయం కోరాలని భావించారు. అనంతరం లండన్ వచ్చారు. అయితే.. ఇప్పుడు ప్రిన్సెస్ హాయా బ్రిటన్‌లోనే నివసించాలని కోరుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఆమెను తిరిగి పంపించాలని షేక్ మొహమ్మద్ డిమాండ్ చేస్తే అది బ్రిటన్‌కు దౌత్యపరమైన తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే యూఏఈతో బ్రిటన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

 
ఈ ఉదంతం జోర్డాన్‌కు కూడా ఇబ్బందికరమైనదే. ఎందుకంటే జోర్డాన్ రాజు అబ్దుల్లాకు ప్రిన్సెస్ హాయా సవతి సోదరి. యూఏఈలో దాదాపు 2.5 లక్షల మంది జోర్డాన్ పౌరులు పనిచేస్తున్నారు. వారి నుంచి స్వదేశంలోని వారి కుటుంబాలకు ఆదాయం లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో దుబాయ్‌తో విభేదాలు జోర్డాన్‌కు ప్రతికూలంగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 6000కే స్మార్ట్ ఫోన్... 2 సంవత్సరాల వారెంటీతో... కావాలనుకుంటున్నారా?