అత్యాచార బాధితురాలి ప్రవర్తనను సందేహించేలా కోర్టు ఆదేశంలో ఓ జడ్జి వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. సామాజిక ఉద్యమకారులు, ప్రజల నుంచి రోజుల తరబడి నిరసనలు వ్యక్తం కావడంతో కోర్టు ఆదేశం నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించారు. ఓ అత్యాచార నిందితుడికి బెయిలు మంజూరు చేసే సమయంలో.. ‘బాధితురాలు చెప్పేది నమ్మశక్యంగాలేద’ని గతవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ వ్యాఖ్యానించారు.
‘ఆఫీస్‌కు రాత్రి 11 గంటలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అతడితో కలిసి డ్రింక్స్ తాగడానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? తెల్లవారే వరకు తనతో కలిసి అతడు ఉండేందుకు ఆమె ఎందుకు అనుమతించింది?’ లాంటి ప్రశ్నలను ఆయన అడిగారు. ఘటన జరిగిన తర్వాత ఆమె అలసిపోయి, నిద్రలోకి జారుకున్నానని చెప్పడం.. భారత మహిళ వ్యవహరించిన తీరులాలేదని చెబుతూ.. ‘అత్యాచారం అయిన తర్వాత మన మహిళలు ఇలా స్పందించర’ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అత్యాచారానికి గురైన మహిళ ఇలా నడుచుకోవాలని ఏదైనా రూల్‌బుక్ ఉందా? అని కొందరు భారతీయ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి గురైన మహిళ ఎలా నడుచుకోవాలి? అని వివిధ సందర్భాల్లో జడ్జిలు చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన ఓ గ్రాఫిక్ వైరల్ అవుతోంది. తీర్పుపై నిరసన వ్యక్తంచేస్తూ దిల్లీలో సీనియర్ న్యాయవాది అపర్ణ భట్.. భారత ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీం కోర్టులోని ముగ్గురు మహిళా న్యాయవాదులకూ బహిరంగ లేఖ రాశారు.
"అత్యాచారం జరిగిన తర్వాత ఇలా నడుచుకోవాలి అని చట్టంలో ఏదైనా ప్రొటోకాల్ ఉందా? నాకు తెలియకుండా?" అని లేఖలో ఆమె ప్రశ్నించారు. "అత్యాచారం అనంతరం అత్యున్నత ప్రమాణాలు పాటించడానికి మన భారతీయ మహిళలు ఏమైనా ప్రత్యేకమైనవారా?" ఈ విషయంలో కలగ జేసుకోవాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్ని ఆమె కోరారు. "ఇది అత్యంత దారుణమైన మహిళా వ్యతిరేక ధోరణి. దీన్ని ఖండించకుండా ఉంటున్నామంటే మద్దతు పలికినట్టే" అని ఆమె వ్యాఖ్యానించారు.
జడ్జి ఉపయోగించిన పరిభాష చాలా విశ్మయానికి గురిచేసిందని, ఇలాంటి పదాలు ఉపయోగించకూడదని బెంగళూరులోని మహిళా హక్కుల న్యాయవాది మధు భూషణ్ వ్యాఖ్యానించారు. "ఆయన వ్యాఖ్యలను గట్టిగా ఖండించాలి. అసలు మహిళల గురించి ఆయన ఏమనుకుంటున్నారు? రావిష్డ్.. ఈ పదం కాలం చెల్లినది. చాలా తీవ్రమైనది. మహిళపై హింస మీద పోరాటంలో తీవ్రతను ఇది తక్కువగాచేసి చూపేలా ఉంది."
"నేను ఆదేశాన్ని తప్పుపట్టడం లేదు.. బాధితురాలి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టేలా అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నాను.". "మహిళలు ఇలా ప్రవర్తించబోరని చెప్పడం అర్థరహితం. దీనితో చట్టానికి ఏం సంబంధమూ లేదు. ఇది ఆమె ప్రవర్తనను శంకించడమే". ఈ తీర్పు తీవ్ర అసంతృప్తికి గురిచేయడంతోపాటు కలచివేసేలా ఉందని జస్టిస్ దీక్షిత్‌కు బహిరంగ లేఖ రాసిన పౌరహక్కుల కార్యకర్తలు, రచయితలు, నటులు, గాయకులు, పాత్రికేయుల్లో భూషణ్ కూడా ఒకరు. ఈ వ్యాఖ్యలను ఆదేశం నుంచి తొలగించాలని వీరు డిమాండ్ చేశారు.
"స్వతంత్రంగా జీవించడంతోపాటు లైంగిక జీవితం సహా తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలను తామే తీసుకునే మహిళల్ని ఇప్పటికీ నీతిలేనివారిగా, వ్యక్తిత్వంలేనివారిగా చూస్తున్నారు"అని లేఖలో వ్యాఖ్యానించారు. మహిళలపై లైంగిక హింస, మహిళల తప్పుల వల్లే అత్యాచారాలు జరుగుతాయనే అంశాలకు కోర్టు ఆదేశంలోని వ్యాఖ్యలు మద్దతు పలికేలా ఉన్నాయని భూషణ్ అభిప్రాయపడ్డారు.
"అత్యాచార ఆరోపణలు తప్పు అయితే కానివ్వండి.. కానీ ముందుగానే ఇలా ఆలోచించడం ఎందుకు? మహిళలను దోషిలా చూపించడం ఎందుకు? ఓ హైకోర్టు జడ్జి ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు"అని ఆమె వ్యాఖ్యానించారు. డిసెంబరు 2012లో దిల్లీలో ఓ యువతి దారుణ సామూహిక అత్యాచారం, హత్య అనంతరం భారీగా నిరసనలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త పతాక శీర్షికల్లో నిలిచింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడే అత్యాచార ఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి.
ప్రభుత్వ సమాచారం ప్రకారం.. ఏటా భారత్‌లో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. పైగా ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా సమాచారం ప్రకారం.. 2018లో 33,977 అత్యాచారాలు జరిగాయి. అంటే సగటున ప్రతి 15 నిమిషాలకు దేశంలో ఒక అత్యాచారం జరుగుతోంది. అయితే, నిజానికి అత్యాచారాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, వీటిలో చాలా కేసులు పోలీసుల వరకు రావని మహిళా హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.
లైంగిక దాడుల బాధితులు న్యాయం కోసం పోరాడరని.. ఎందుకంటే విచారణతో వారు మరింత వేదనకు గురవుతారని వందల సంఖ్యలో లైంగిక హింస కేసులను వాదించిన భట్ చెప్పారు. "లైంగిక హింసకు వివక్షతో దగ్గర సంబంధముంది. ఓ బాధితురాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే.. కోర్టు గదిలో ఉండే చాలా మంది ఆమెను నమ్మరు.". జస్టిస్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు.. ధైర్యంగా ముందుకు వస్తున్న బాధితురాళ్లను వెనక్కి తగ్గేలా చేస్తాయని ఆమె వివరించారు.
కోర్టు వ్యాఖ్యలు ఇలా మహిళలకు వ్యతిరేకంగా పురుషాహంకారాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని విమర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. 2017లో బీరు తాగడం, ధూమపానం చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, తన గదిలో కండోమ్స్ ఉంచుకోవడం లాంటి పనులుచేసిన బాధితురాలికి ఓ జడ్జి చీవాట్లు పెట్టారు. ఆమెను చాలా మందితో లైంగిక సంబంధాలుగల మహిళగా జడ్జి అభివర్ణించారు. ఆ సమయంలో సుప్రీం కోర్టు న్యాయవాది నూండి కరుణ.. బీబీసీతో మాట్లాడారు. ఆమెను అత్యాచారం చేయకుండా ఉండటానికి ఎలాంటి కారణమూలేదని చెప్పకనే న్యాయమూర్తి చెప్పినట్లయిందని కరుణ వ్యాఖ్యానించారు.
2016లోనూ ఓ అపహరణ, సామూహిక అత్యాచారం అనంతరం ఓ మహిళ ప్రవర్తించిన తీరును న్యాయమూర్తి ప్రశ్నించారు. "తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో ఆమె ఇంటికి వెళ్లిపోకుండా.. ఘటన స్థలంలోనే అంతసేపు ఎందుకుంది?" అని జడ్జి ప్రశ్నించారు. అత్యాచారానికి ముందే ఆమెకు లైంగిక సంబంధాలున్నాయనే అంశమూ మనం గుర్తుపెట్టుకోవాలని అనే కోణంలో ఆయన మాట్లాడారు.
లైంగిక దాడుల బాధితులను అవమానపరిచేలా న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన వ్యాఖ్యల జాబితాలో ఈ రెండు కేసులు కేవలం ఉదాహరణలు మాత్రమే. "ఏదిఏమైనా జడ్జిలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు" అని వార్విక్ యూనివర్సిటీ పూర్వ లా ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షి వ్యాఖ్యానించారు. "జడ్జిలు ఇలాంటి వ్యాఖ్యలుచేసే ముందు ఆలోచించుకోవాలి. తమకు ఇలాంటి ఆలోచనా దృక్పథం ఉంటే ఉండొచ్చు.. కానీ దాన్ని బయట పెట్టకూడదు."
కర్ణాటక హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు.. మహిళలపై వివక్ష చూపేలా ఉన్నాయని బక్షి అభిప్రాయపడ్డారు. "మహిళలకు అందరితోపాటు సమాన హక్కులున్నాయి. వారి గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి పనులూ చేయకూడదు. ఓ వర్గానికి వ్యతిరేకంగా జడ్జిలు ఇలా వ్యాఖ్యలు చేయొచ్చని ఎక్కడా లేదు.". దశాబ్ద కాలం క్రితం జడ్జిల వ్యక్తిగత మనోభావాలు కోర్టు ఆదేశాల్లో ఉండకుండా చూడాలని ఇలాంటి పోరాటమే బక్షి, మరో ముగ్గురు న్యాయవాదులు చేశారు.
1979లో ఆయన అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఓ పోలీస్ స్టేషన్‌లో 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం కేసులో దోషిగా నిరూపితమైన ఇద్దరు పోలీసులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. "ఆమె లైంగిక సంబంధాలకు అలవాటు పడివుంది. వైద్యుల నివేదికలోనూ ఆమెకు ఎలాంటి గాయాలూలేవని తేలింది. ఈ అత్యాచార కథను ఆమె అల్లింది" అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు అనంతరం బక్షి, న్యాయవాదులైన మిత్రులతో కలిసి బహిరంగ లేఖ రాశారు.
"సుప్రీం కోర్టులో పురుషాహంకార ధోరణులు కనిపిస్తున్నాయి. వీటిలో మార్పురావాలని మేం కోరాం" అని ప్రొఫెసర్ బక్షి వివరించారు. ఆ కేసుతో మహిళలపై హింస మీద దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అత్యాచారాలపై కొత్త చట్టాలను తీసుకొచ్చారు. 1983లో అత్యాచారం కేసులో తమ తప్పులేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుందని స్పష్టంచేస్తూ కేంద్రం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. మరోవైపు బాధితురాలి గత లైంగిక చర్యలను పరిగణలోకి తీసుకోకూడదని పేర్కొంది.
ఇప్పటికి 40 ఏళ్లు గడుస్తున్నా.. మహిళల గత లైంగిక చరిత్ర కేసుల తీర్పుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జస్టిస్ దీక్షిత్, సహా కొందరు జడ్జిలు లైంగిక చరిత్ర ఆధారంగా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పుపడుతున్నారు. "ఇలాంటి నమ్మకాలను మొదట న్యాయవ్యవస్థ విడిచిపెట్టాలి"అని భూషణ్ వ్యాఖ్యానించారు. "ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జస్టిస్ దీక్షిత్‌ను కోరాం. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే... సమానత్వపు, లింగ వివక్ష లేని న్యాయ వ్యవస్థకు గొప్ప సేవ చేసినట్లే."