Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలో దారుణమైన కేసుల్లో ఒకటి: 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కాడు?

ప్రపంచంలో దారుణమైన కేసుల్లో ఒకటి: 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కాడు?
, సోమవారం, 21 మార్చి 2022 (13:07 IST)
యూకేలోని కెంట్‌లో జరిగిన ఇద్దరు మహిళల హత్యలను చేధించడానికి సరిగ్గా 33 సంవత్సరాలు పట్టింది. కానీ, పరిశోధనలో బయటపడిన కలవరపెట్టే విషయాలు పరిశోధనను కొత్త మలుపు తిప్పాయి. ఏంటా హత్యలు? పరిశోధన ఎలా సాగింది?

 
వెండీ నెల్, కారోలిన్ పియర్స్ 1987లో తమ జీవితాన్ని నిర్మించుకునే దశలో ఉన్నారు. వారిద్దరూ 20ల వయసులోనే ఉన్నారు. వారిద్దరికీ ఒకరికొకరు తెలియదు. ఇద్దరూ ఉద్యోగస్థులే. ఇద్దరికీ స్నేహితులున్నారు. ఇద్దరూ యూకేలోని కెంట్‌లో టన్‌బ్రిడ్జ్ వెల్స్‌లో సింగిల్ బెడ్ రూమ్‌లో ఉండేవారు. ఆ ఊరు ప్రశాంతతకు పేరు. కానీ, డేవిడ్ ఫుల్లర్ అనే వ్యక్తి చేతిలో వారిద్దరి జీవితాలు తారుమారయ్యాయి.

 
హెచ్చరిక: ఈ కథనంలో సమాచారం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు.

 
25 సంవత్సరాల వెండీ నెల్ భర్త నుంచి విడిపోయాక ఒక సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలోకి వెళ్లారు. "పిల్లల్ని కని, జీవితాన్ని నిర్మించుకుందామనే ఆశలు కంటున్న సమయంలో వైవాహిక జీవితం విచ్చిన్నమవ్వడం ఆమె జీవితాన్ని కుదిపేసింది" అని ఆమె స్నేహితురాలు జూలీ మాంక్స్ చెప్పారు. ఆమె స్వతంత్రంగా ఉంటూ చాలా కష్టపడి పని చేసే మహిళ అని తెలిపారు. వెండీ సూపా స్నాప్స్ అనే ఫోటో షాప్‌లో పని చేసేవారు. జూన్ 22 రాత్రి ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను ఇంటి దగ్గర దించారు. ఆ మరుసటి రోజు రక్తం మడుగులో నగ్నంగా పడి ఉన్న ఆమె దేహం బయటపడింది.

 
ఇరుగు పొరుగు ఎవరూ ఏమీ వినలేదు. కానీ, ఆమెను దారుణంగా కొట్టి, లైంగికంగా వేధించి, పీక పిసికి చంపినట్లు తెలుస్తోంది. కారోలిన్ పీయర్స్‌కి 20 సంవత్సరాలు. ఆమె బస్టర్ బ్రౌన్స్ అనే ప్రముఖ రెస్టారంట్‌లో పని చేసేవారు. ఆమె ఇంటి నుంచి మాయమైన రోజు రాత్రి సహాయం కోసం ఆమె అరిచిన అరుపులు వినిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వెండీ శవం దొరికిన 3 వారాల తర్వాత రామ్నీ మార్ష్‌లోని పొలాల్లో ఉన్న డ్రైనేజిలో అర్ధనగ్నంగా పడి ఉన్న కారోలిన్ శవం దొరికింది. ఆమె ఒంటి మీద ప్యాంటు మాత్రమే ఉంది. ఆమె శవాన్ని ఒక ట్రాక్టర్ డ్రైవర్ చూశారు.

 
కారోలిన్, వెండీకి అయిన గాయాలు ఒకేలా ఉన్నాయి. దీంతో, వీరిద్దరి మరణాలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉందని డిటెక్టివ్‌లకు అర్ధమయింది. 1980లలో హంతకులను ట్రాక్ చేసేందుకు మొబైల్ ఫోన్లు కానీ, స్కాన్ చేసేందుకు సీసీటీవీలు కానీ అందుబాటులో లేవు. డీఎన్ఏ విశ్లేషణలు అంతగా అభివృద్ధి చెందలేదు. నేరస్థుల వివరాలతో కూడిన డేటా బేస్ 1988 వరకు అందుబాటులోకి రాలేదు. నేరపరిశోధకులకు కొన్ని ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. వెండీ ఇంటిలో ఒక షాపింగ్ బ్యాగ్ పై ఒక వేలి ముద్ర, తెల్లని బ్లౌజ్ పై కాలి అడుగుల జాడ దొరికాయి.

 
అయితే, కొత్తగా తయారైన డేటాబేస్‌లో పొందుపరిచిన వివరాలతో పరిశోధకుల దగ్గరున్న డీఎన్ఏ సరిపోలేదు. రెండు సార్లు బీబీసీ క్రైం వాచ్ విన్నపాలు చేసినప్పటికీ, ఈ విచారణ ముందుకు సాగలేదు. "విచారణ చేసే స్థాయిని తగ్గించాం కానీ, విచారణను పూర్తిగా మూసివేయలేదు" అని 2007లో ఈ కేసును విచారణ చేసిన డిటెక్టివ్ డేవ్ స్టీవెన్స్ బీబీసీతో చెప్పారు. 2019 నాటికి, పాడైపోయిన వీర్యం శాంపిల్ నుంచి డీఎన్ఏను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కొత్త మెళకువలను కనిపెట్టారు. ఇలాంటి శాంపిల్‌నే కారోలిన్ ప్యాంట్ నుంచి సేకరించారు.

 
ఇలా కొత్తగా కనిపెట్టిన టెక్నిక్‌కి అదనంగా ఫెమిలియల్ డీఎన్ఏ అనే కొత్త మెళకువ తోడయింది. దీంతో, నేరం జరిగిన స్థలంలో లభించిన డీఎన్ఏకు సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. "ఈ టెక్నిక్ చాలా కీలకం" అని మాజీ మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ నోయెల్ మెక్‌హుగ్ చెప్పారు. ఆయన కెంట్‌లో పరిశోధకులకు సలహా ఇచ్చారు. ఆయన ప్రస్తుతం నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి పని చేస్తున్నారు.

 
హంతకుడిని వేరే ఏదైనా నేరంపై అరెస్ట్ చేసి, డీఎన్ఏ సేకరించి, ఆ ప్రొఫైల్‌ను డేటా బేస్‌లో పొందుపరిస్తే తప్ప, నేరం జరిగిన స్థలంలో సేకరించిన డీఎన్ఏ శాంపిళ్లు ఎవరివనేవి గుర్తించలేం. కానీ, ఫెమిలియల్ డీఎన్ఏ వల్ల నేషనల్ డేటాబేస్‌లో ఉన్న 65 లక్షల నేరస్థుల ప్రొఫైల్స్‌ను పని చేయగలిగే స్థాయికి తగ్గించగల్గినట్లు మెక్ హుగ్ చెప్పారు. దీని వల్ల నేరస్థుడిని పట్టుకునే వీలుంటుంది. డేటాబేస్‌లో ఉన్న లిస్ట్‌లో ఉన్నవారెవరైనా హత్య జరిగిన ప్రదేశంలో నివసించారేమోనని అధికారులు పరిశీలించి చూశారు.

 
"అందులో చాలా పెద్ద జాబితా వచ్చింది. ఆ జాబితాలో నేరం చేసిన విధానానికి దగ్గరగా ఉన్నవారిని కొంత మందిని ఫిల్టర్ చేశాం" అని డెప్యూటీ సూపరింటెండెంట్ సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇవాన్ బీస్లీ చెప్పారు. హంతకుడి తోబుట్టువు డీఎన్ఏతో పాక్షికంగా మ్యాచ్ దొరికింది. దాంతో, పోలీసులు వారి కుటుంబ చరిత్రను పరిశీలించి ఒక వ్యక్తిని గుర్తించారు.

 
అతనే డేవిడ్ ఫుల్లర్. ఆయన 1950లో పుట్టారు. పోర్ట్స్‌మౌత్ లోని నేవీ షిప్ యార్డ్స్‌లో పని చేస్తూ ఎలక్ట్రీషియన్‌గా, మెయింటెనెన్స్ మ్యాన్‌గా శిక్షణ పొందారు. ఆయనకు స్కూల్‌లో కూడా బైకులు దొంగతనం చేయడం, ఆస్తులు తగలబెట్టడం లాంటి నేరాలు చేసిన చరిత్ర ఉంది. 1970లలో వరుసగా దోపిడీలు చేశారు. 2020 నాటికి ఫుల్లర్ ఆయన మూడవ భార్య, టీనేజీ కొడుకుతో కలిసి వెస్ట్ సస్సెక్స్‌లోని హీత్‌ఫీల్డ్‌లో నివాసముంటున్నారు. డిసెంబరు 03, 2020న పోలీసులు ఆయన ఇంటి తలుపు కొట్టారు. ఆయన ఇంటి చుట్టూ సీసీటీవీలు అమర్చి ఉన్నాయి.

 
టన్‌బ్రిడ్జ్ వెల్స్ గురించి తనకేమి తెలియదని, తానెప్పుడూ సూపా స్నాప్స్ షాప్‌కి కానీ, బస్టర్ బ్రౌన్స్‌కి కానీ వెళ్లలేదని ఫుల్లర్ పోలీసులతో వాదించారు. కానీ, అది సస్సెక్స్ పక్కనే ఉన్న పెద్ద పట్టణం. ఈ హత్యలతో తనకేమి సంబంధం లేదని చెప్పారు. "అది అబద్ధం" అని బీస్లీ అన్నారు. ఫుల్లర్ చెబుతున్నవన్నీ అబద్ధాలని నిరూపించాల్సిన బాధ్యత నేర పరిశోధకుల పై ఉంది. ఫుల్లర్ గుట్టల కొద్దీ పాత కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్‌లు, డిస్కులు, ఫోన్లు, 34,000 ఫోటోలు దాచి పెట్టుకున్నారు. తన జీవితం మొత్తాన్ని ఆయన రికార్డ్ చేశారు. ఆయన ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నప్పుడు ఇచ్చిన ఇన్ వాయిస్‌లు, రెస్టారెంట్లలో గడిపిన రాత్రుల గురించి రాసిన డైరీలు, సైక్లింగ్ క్లబ్‌లో చేసిన రైడ్లతో కూడిన ఫోటోలను భద్రపరిచారు.

 
ఈ ఇన్‌వాయిస్‌లన్నీ, టన్‌బ్రిడ్జ్ వెల్స్ చుట్టుపక్కల జరిగిన పనులకని పోలీసులు కనిపెట్టారు. ఆయన తరచుగా బస్టర్ బ్రౌన్స్‌కు వెళ్ళేవాడని ఆయన డైరీల ద్వారా తెలుస్తోంది. సైక్లింగ్ క్లబ్ వాళ్ళు సైక్లింగ్‌కి వెళ్లే మార్గంలోనే కారోలిన్ శవం దొరికిన ప్రదేశముంది. ఆ మార్గాన్ని ఆ క్లబ్ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆయన 1970, 80లలో వెండీ నివాసమున్న వీధిలోనే ఉండేవారు. 1980లలో ఎండలో బోర్లా పడుకుని ఉన్న ఫుల్లర్ ఫోటో ఒకటి దొరికింది. ఆ ఫొటోలో ఆయన ధరించిన క్లార్క్స్ షూ సోల్ కనిపిస్తోంది.

 
ఆ షూ ఆకారం వెండీ ఇంట్లో దొరికిన కాలి అడుగు జాడతో సరిపోతోంది. ఆయన వేలి ముద్రలు ఆ షాపింగ్ బ్యాగ్ పై దొరికిన రక్తపు మరకతో ఉన్న వేలి ముద్రతో పాక్షికంగా మ్యాచ్ అయింది. కొన్ని దశాబ్దాల క్రితం కారోలిన్ ప్యాంటు మీద సేకరించిన డీఎన్ఏతో ఫుల్లర్ డీఎన్ఏ శాంపిల్ మ్యాచ్ అవ్వడంతో కేసులో కొన్ని ఆధారాలు లభించినట్లయింది. సరిగ్గా 33 సంవత్సరాల తర్వాత పోలీసులు దొంగను కనిపెట్టగలిగారు. కానీ, ఈ పరిశోధన అంతటితో ముగియలేదు. అక్కడి నుంచి అది మరొక కలచివేసే మలుపు తిరిగింది.

 
ఆయన ఇంట్లో 1980ల నుంచి దాచి పెట్టిన కంప్యూటర్ హార్డ్ వేర్‌ను, వందలాది హార్డ్ డ్రైవ్‌లు, మెమొరీ కార్డులు, 2200 పనికిరాని స్టోరేజి డిస్కులను చేధించేందుకు నిపుణులు ప్రయత్నించారు. ఆయన దగ్గర 30 మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులున్నాయి. పరిశోధనలో భాగంగా వారొక కప్ బోర్డు చూశారు. అందులో ఒక క్యాబినెట్ ఉంది. దానిని గోడ నుంచి బయటకు తీస్తే, అందులో మరో 4 హార్డ్ డ్రైవ్‌లు దొరికాయి. అందులో ఒక ఆస్పత్రి మార్చురీలో ఫుల్లర్ తీసిన వీడియోలున్నాయి. వాటిని పరిశీలించినప్పుడు పరిశోధకులకు మరొక కలచివేసే విషయం తెలిసింది. ఆయన మృతదేహాలపై లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు బయటపడింది. ఈ విచారణలో ఈ కొత్త విషయం బయటపడింది.

 
"నాకు అర్ధం చేసుకోవడానికి చాలా కష్టమైంది. నా ఆలోచనలన్నీ 33 సంవత్సరాల నుంచి న్యాయం దొరకకుండా ఎదురు చూస్తున్న వెండీ, కారోలిన్ కుటుంబం చుట్టూ తిరిగాయి" అని నోయెల్ మెక్ హుగ్ చెప్పారు. "ఆఖరికి మరణం తర్వాత కూడా డేవిడ్ ఫుల్లర్ చేతిలో ఆ దేహాలు వేధింపులకు గురయ్యాయి". ఫుల్లర్‌ ఆస్పత్రుల్లో పనిచేసేవారు. ఆస్పత్రిలో అన్ని ప్రదేశాలకు వెళ్లే అవకాశముండేది. ఆయన తరచుగా మార్చురీకి వెళ్లేవారు. మరణించిన రోగుల శవాలను దాచిపెట్టే ఫ్రిడ్జ్‌లకు తలుపులుండేవి. ఒక వైపు సీసీటీవీ కెమేరాలు ఉండేవి. కానీ, పోస్ట్‌మార్టం జరిగే చోట ఎటువంటి కెమెరాలు ఉండేవి కావు.

 
ఫుల్లర్‌కి ఈ విషయం పూర్తిగా తెలుసు. దాంతో, ఆస్పత్రి నుంచి పోలీసులకు ఎటువంటి ఫుటేజీ దొరకలేదు. కానీ, ఫుల్లర్ సొంతంగా చిత్రించిన వీడియోలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి ద్వారా రోగుల చేతికున్న రిస్ట్ బ్యాండ్లను పరిశోధకులు చూడగలిగారు. వీడియోలలో ఉన్న మెటా డేటాను అదే సమయంలో మార్చురీలో ఉన్న రోగుల వివరాలతో పరిశీలించి చూశారు. ఫుల్లర్ చేతిలో వేధింపులకు గురైన వారి పేర్లను కూడా ఆయనొక నల్లని పుస్తకంలో రాసి పెట్టుకున్నారు.

 
"ఎవరినీ వదిలిపెట్టేవాడు కాదు" అని సీనియర్ క్రౌన్ ప్రాసిక్యూటర్ లిబ్బీ క్లార్క్ చెప్పారు. "ఆయన చాలా సార్లు మృతదేహాల దగ్గరకు వెళ్లేవారు. ఇది నేనెన్నడూ చూడని చాలా సవాళ్లతో కూడిన కలచివేసే కేసు" అని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా చూడని దారుణమైన కేసుల్లో ఇదొకటి. 18- 85 సంవత్సరాలు దాటిన వారిలో సుమారు 100 మంది బాధితులు ఫుల్లర్ చేతిలో వేధింపులకు గురైనట్లు పోలీసులు లెక్కపెట్టారు. ఫుల్లర్ చిన్న పిల్లలను కూడా లైంగికంగా వేధించినట్లు పరిశోధనల్లో తెలిసింది.

 
కానీ, ఫుల్లర్ అందరికీ సహాయకరంగా ఉండేవాడని ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బంది చెప్పారు. నవ్వుతూ పనులను చేసేవాడని చెప్పారు. ఫుల్లర్ చేసిన నేరాలన్నీ ఒక ప్రత్యేకమైన సరళిని పాటించినట్లు ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ రిచర్డ్ బాడ్‌కాక్ చెప్పారు. "ఫుల్లర్ సాడో మాసోచిజంను ప్రదర్శించాడని ఆయన మానసిక పరిస్థితి తెలియచేస్తోంది". "మాయ చేసే ప్రవర్తన తప్ప సొంత సమస్యలను పరిష్కరించుకోగలిగే నేర్పు లేకుండా ఉండటంగా చెప్పవచ్చు". "ఫుల్లర్ నేర ప్రవృత్తి లైంగిక వాంఛలతో మొదలై, హత్యలు చేసేవరకు వెళ్లినట్లు ఆయన 1970లలో చేసిన వరుస దోపిడీల వల్ల తెలుస్తోంది" అని బ్యాడ్‌కాక్ చెప్పారు.

 
"కొన్ని విపరీతమైన పనులు చేస్తున్నట్లు తెలిసినప్పటికీ, ఆ నేరం చేస్తున్న క్షణంలో మాత్రమే వారు బ్రతుకుతారు".
వెండీ కారోలీన్ పైన జరిగిన లైంగిక హత్యలకు, తర్వాత మార్చురీలో జరిగిన నేరాలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు బ్యాడ్‌కాక్ చెప్పారు. ఇవి హత్య కంటే కూడా మానసికంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలని అన్నారు. "ఇలాంటి ప్రవర్తనను నెక్రోఫిలియా అనవచ్చు. దీనికి వేరే పదం లేదు" అని అన్నారు. అయితే, ఈ నేరానికి చట్టప్రకారం కనీసం 2 సంవత్సరాల శిక్ష ఉంటుంది. ఈ కేసు ప్రభుత్వాన్ని శిక్ష విషయంలోపునరాలోచించుకునేలా చేసింది.

 
ఫుల్లర్ 2008 - 2020 వరకు మృతదేహాలపై అత్యాచారాలు జరుపుతూనే ఉన్నారు. కానీ, ఆయన రికార్డులో స్పష్టంగా కనిపిస్తున్న ఒక లోపం ఉంది. 1987-2008 వరకు ఆయన చేసిన నేరాల గురించి సమాచారం లేదు. కెంట్ పోలీసులు ఆ సమయంలో కెంట్‌లో కనిపించకుండా పోయిన వారి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎవరినైనా హత్య చేశారా, లేదా వేధించారా అనేది పరిశీలిస్తున్నారు. "ఒక రోజు ఎవరైనా మా తలుపు తట్టి.. ‘‘మేం అతడిని పట్టుకున్నాం’ అంటే నేను అప్పుడు సంబరాలు చేసుకుంటాను. చాలా కాలం పాటు పట్టుపడకుండా దాక్కున్న వ్యక్తి , దేముడంటూ ఉంటే తప్పకుండా దొరకాలి" అని 2007లో వెండీ నెల్ తండ్రి బీబీసీతో చెప్పారు. ఆ రోజు నిజంగానే వచ్చింది. కానీ, దురదృష్టవశాత్తు బిల్ నెల్ 2017లో మరణించారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్‌లో కెమికల్ ప్లాంట్‌పై రష్యా దాడి