Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీరియడ్స్‌లో శెలవు కావాలా? కుదరదు ఈ మాత్ర వేసుకో... ఎక్కడ?

Advertiesment
పీరియడ్స్‌లో శెలవు కావాలా? కుదరదు ఈ మాత్ర వేసుకో... ఎక్కడ?
, గురువారం, 11 జులై 2019 (17:36 IST)
తమిళనాడులోని కొన్ని వస్త్ర పరిశ్రమల్లో పని చేసే మహిళలకు నెలసరి వచ్చినప్పుడు సెలవులు పెట్టకుండా చూసేందుకు యాజమాన్యాలు వారికి నొప్పి నివారణ మందులు ఇస్తున్నట్లు బయటపడింది. ఆ మందుల కారణంగా మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ పరిశీలనలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఆ సంస్థ వందమంది మహిళలతో మాట్లాడింది. నొప్పి నివారణ మందులను తాము పని చేసే చోటే ఇచ్చారని వారు చెప్పారు. వారంతా పేద బడుగు వర్గాలకు చెందిన మహిళలు.

 
తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండుగల్ ప్రాంతాలలో అనేక వస్త్ర పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో తమిళనాడులోని వివిధ ప్రాంతాలతో పాటు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా అనేకమంది పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలే. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు వాళ్లకు నొప్పి నివారణ మందులు ఇస్తున్నారు.

 
ఎలాంటి నైపుణ్యం లేని వైద్యుల సలహా లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ మందులు ఇస్తున్నారని, దాంతో ఆ మహిళల రుతుచక్రం దెబ్బతింటోందని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న కొందరు మహిళలతో బీబీసీ మాట్లాడింది. 26 ఏళ్ల జెన్నీ.. దిండుగల్ ప్రాంతంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నారు.

 
"'సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాలా నొప్పి వస్తుంది. కానీ, మా మిల్లు అధికారులు ఇచ్చే ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత నుంచి నెలసరి సమయంలో నొప్పి తగ్గిపోయింది. నేను బయట దుకాణాలలో కొన్ని మందులను కొని వేసుకున్నాను, కానీ వాటి వల్ల పెద్దగా నొప్పి తగ్గేది కాదు. దాంతో, మిల్లులో ఇచ్చే బిల్లలనే వేసుకుంటున్నాను. కొన్నాళ్లుగా నాకు బ్లీడింగ్ చాలా తగ్గిపోయింది. గతంలో మూడు రోజుల వరకూ బ్లీడింగ్ అవుతుండేది. ఇప్పుడు ఒక రోజే అవుతోంది. అందుకని, ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆపేశాను. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాను" అని జెన్నీ చెప్పారు.

 
ఈ మిల్లుల్లో ఇచ్చే మాత్రలకు ఎలాంటి కవర్లూ ఉండవని మరో మహిళ కమలా జ్యోతి చెప్పారు. "మాకు ఆ మందుల పేర్లు కూడా తెలియదు. మిల్లులో పనిచేస్తున్నప్పుడు పీరియడ్స్ వస్తే, మధ్యలో పని ఆపేసి ఇంటికి వెళ్లలేం. అలా వెళ్తే రోజు కూలీ రూ. 300 వదులుకోవాల్సిందే. మిల్లులో విశ్రాంతి తీసుకునే వీలుండదు. నిరంతరం మెషీన్లను నడుపుతూనే ఉండాలి. కాబట్టి, మందు బిల్లను వేసుకుని పని కొనసాగిస్తుంటాను" అని జ్యోతి వివరించారు.
webdunia

 
"నాతోపాటు పనిచేసే చాలామంది మహిళలకు నెలసరి ఆలస్యం అవుతోంది, కొందరికి అబార్షన్లు కూడా అవుతున్నాయి. ఆ సమస్యలకు ఈ ట్యాబ్లెట్లే కారణమని మాకు తెలియదు. ఆ మందుల వల్లే అలా అవుతోందని తెలిసిన తర్వాత భయమేస్తోంది. దాంతో, వాటిని తీసుకోవడం తగ్గించాను.

 
ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటే బ్లీడింగ్ తగ్గుతుంది. మూడు నాలుగు రోజులకు బదులు, రెండు రోజులకే బ్లీడింగ్ ఆగిపోతుంది. నాతో పాటు పనిచేసే కొంతమంది పెళ్లికాని అమ్మాయిలు కూడా ఈ మందు బిల్లలు వేసుకుంటున్నారు. వాటివల్ల కలిగే దుష్ప్రభాల గురించి వారు ఆలోచించడంలేదు. సెలవులను తగ్గించుకోవడం గురించి మాత్రమే వాళ్లు ఆలోచిస్తున్నారు.

 
వారాంతాలు మినహా సెలవులు తీసుకోకుండా అన్ని రోజులూ పనిచేస్తే మాకు రూ.1000 అదనంగా ఇస్తారు. అందుకే, రోజు కూలీ కోల్పోకుండా ఉండటంతో పాటు, ఆ వెయ్యి రూపాయలు కూడా వస్తాయన్న ఆలోచనతో చాలామంది మహిళలు నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నారు" అని జ్యోతి చెప్పారు.

 
నెలసరి సమయంలో మహిళా సిబ్బంది విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కల్పించే నిబంధనలు ఉంటే, తాము ఇలాంటి మాత్రలు తీసుకునే అవసరం ఉండదని ఆమె అంటున్నారు. ఇళ్ల నుంచి పనికెళ్లే మహిళలతో పోలిస్తే, పరిశ్రమల వద్దే హాస్టళ్లలో ఉంటూ పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. వారు సెలవులు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి, తప్పనిసరిగా ట్యాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తోంది.
webdunia

 
"మేము వరుసగా మాత్రలు తీసుకుంటే, నాలుగైదు నెలల పాటు పీరియడ్స్ రావు. 5 నెలల తర్వాత చాలా బ్లీడింగ్ అవుతుంది, తీవ్రమైన నొప్పి ఉంటుంది. దాంతో, భయపడి ఆ మందులను తీసుకోవడం మానేశాను. అయినా ఇప్పుడు నాకు రోజు మొత్తం సెలవు అక్కర్లేదు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గంటపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది" అని 21 ఏళ్ల విమల చెప్పారు. గత మూడు నెలలుగా కంపెనీలలో తమకు మాత్రలు ఇవ్వడం ఆపేశారని ఆమె తెలిపారు.

 
తమిళనాడు వస్త్ర పరిశ్రమ కార్మికుల సంఘం నాయకురాలు దివ్య మాట్లాడుతూ... "ట్యాబ్లెట్లను ఇవ్వడం చాలా కాలంగా కొనసాగుతోంది. వాటివల్ల ఎదురయ్యే పరిమాణాల గురించి మాకు ఇప్పుడు అర్థమవుతోంది. ట్యాబ్లెట్ల పంపిణీకి వైద్య పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించడంలేదు. ఎలాంటి కవర్ లేని మందు బిల్లలను ఇస్తున్నారు. ఇలా చేయడం తప్పు.

 
పీరియడ్స్ సమయంలో విశ్రాంతి లేదా సెలవు కావాలని అడిగితే ఆ ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోండని చెబుతారు. సంతానం కలగటంలేదంటూ మా సంఘం కార్యదర్శి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఆమె కొంతకాలంగా తరచూ ఈ ట్యాబ్లెట్లు తీసుకునేవారు. వాటివల్లే తనకు గర్భం రావడంలేదేమో అని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఈ మిల్లుల్లో పనిచేసే చాలామంది మహిళా కార్మికులు అనీమియా, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు" అని అన్నారు.

 
సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సెల్వరాజు మాట్లాడుతూ... " పీరియడ్స్ సమయంలో మహిళలను ఎలా చూసుకోవాలన్న దానికి సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. తమిళనాడు అధికారులు ఈ కార్మికులతో మాట్లాడుతున్నారు. ఆ నిబంధనలను ఎవరూ అతిక్రమించేందుకు వీల్లేదు. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మరెప్పుడూ జరగకూడదు. ఈ విషయంపై మాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మేము అందుకు సిద్ధంగా ఉన్నాం" అన్నారు.

 
అలాంటి మాత్రలు గర్భదారణ సమస్యలకు కారణమవుతాయా? అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించాం. అందుకోసం, కోయంబత్తూరుకు చెందిన గైనకాలజిస్టు డాక్టర్. రజనితో మాట్లాడాం. "ఈ నొప్పి నివారణ మాత్రల వల్ల గర్భధారణ సమస్యలు వస్తాయని కచ్చితంగా చెప్పలేం. అయితే, ఈ తరహా మందులు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్‌ను తగ్గిస్తాయి. నొప్పి నివారణ మందుల విషయానికొస్తే, ముందు నొప్పి ఎందుకొస్తుందన్నది తెలుసుకోవాలి. మహిళా కార్మికుల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నొప్పికి అది కారణం కావచ్చు.

 
కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో పనిచేసే చాలామంది మహిళలు చికిత్స కోసం వస్తుంటారు. వారిలో చాలామంది మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినరు. కేవలం ఒక గ్లాసు టీ, కొన్ని బిస్కెట్లతో సరిపెట్టుకుంటారు. ఆ బిస్కెట్లలో మైదా, చక్కెర మాత్రమే ఉంటాయి. మిగతా పోషకాలేమీ ఉండవు. దానివల్ల వారిలో సత్తువ తగ్గిపోతుంది" అని డాక్టర్. రజని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆండ్రాయిడ్ ఫోన్ల'కు ఏజెంట్ స్మిత్ భయం