దక్షిణ భారత వివాదాస్పద మత గురువు, తనను తాను స్వామిగా చెప్పుకునే నిత్యానంద మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు. ఆయన ఆశ్రమం సర్వజ్ఞపీఠం కూడా వివాదాల్లో చిక్కుకుంది. స్వామి నిత్యానంద తమను కిడ్నాప్ చేసి, బంధించారన్న ఇద్దరు బాలికల ఆరోపణలతో ఆయనపై అహ్మదాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిత్యానంద ఆశ్రమం నిర్వహిస్తున్న ప్రాణప్రియ, తత్వప్రియ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి కేటీ కమారియాతో బీబీసీ మాట్లాడింది. "ఐపీసీ సెక్షన్ 365, 344, 323, 504, 506, 114 కింద చైల్డ్ లేబర్, కిడ్నాప్, వేధింపుల కేసులు నమోదు చేశాం" అని ఆయన చెప్పారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నిత్యానంద పరారయ్యారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. "నిత్యానంద 2016 నుంచి బయటే ఉన్నారు, కానీ, ఆయన విదేశాల్లో ఉన్నారా లేక వేరే ఎక్కడైనా ఉన్నారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని చెప్పారు.
అహ్మదాబాద్‌లో నిత్యానంద ఆశ్రమం బ్రాంచ్‌ను ప్రారంభించి ఎక్కువ రోజులు కాలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు పరిధి అహ్మదాబాద్ వరకే ఉన్నప్పటికీ, గుజరాత్ పోలీసులు బెంగళూరు సమీపంలో ఉన్న ఆయన ప్రధాన ఆశ్రమానికి కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
అసలు కేసు ఏంటి?
కనిపించకుండా పోయిన బాలికల తల్లిదండ్రుల తరపున గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వేశారు. 2012లో తమిళనాడులో నిత్యానంద ఆశ్రమం ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించినపుడు, తన నలుగురు కూతుళ్లను అక్కడికి పంపించానని వారు చెప్పారు. బాలికల వయసు 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉంటుందన్నారు. తర్వాత నిత్యానంద ఆశ్రమం వారు నలుగురు బాలికలను అహ్మదాబాద్‌లో ఉన్న ఆశ్రమానికి పంపించారని దంపతులు ఆరోపించారు.
గుజరాత్‌లోని నిత్యానంద ఆశ్రమం బ్రాంచ్ అహ్మదాబాద్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్ (ఈస్ట్) క్యాంపస్‌లో ఉంది. పోలీసులు బాలికలను వెతుకుతూ ఈ ఆశ్రమం బ్రాంచికి వచ్చినపుడు తమతో ఇద్దరు బాలికలు మాత్రమే బయటకు వచ్చారని, మరో ఇద్దరు బాలికలు అక్కడి నుంచి రావడానికి నిరాకరించారని చెప్పారు. కానీ, నిత్యానంద తన కూతుళ్లను అపహరించారని, వారిని అక్రమంగా నిర్బంధించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నిత్యానంద సంబంధిత వివాదం
అంతకు ముందు 2010లో స్వామి నిత్యానందపై మోసం, అశ్లీలత కేసులు నమోదయ్యాయి. ఆయనదే అని చెబుతున్న ఒక సెక్స్ సీడీ వెలుగులోకి వచ్చింది. అందులో ఒక దక్షిణ భారత నటితో ఆయనను అభ్యంతరకర స్థితిలో చూపించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో ఆ సీడీ విశ్వసనీయమైనదేనని తేలింది. కానీ, నిత్యానంద ఆశ్రమం మాత్రం భారత్‌లో జరిగిన ఫోరెన్సిక్ పరీక్షలను తప్పుబట్టింది. అమెరికాలోని ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో సీడీని మార్ఫింగ్ చేసినట్లు చెప్పారంది.
ఈ కేసులో నిత్యానందను అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన బెయిలుపై బయటకు వచ్చారు. బెంగళూరులో ఉన్న ఆయన ఆశ్రమంలో ఒకసారి రెయిడ్ కూడా జరిగింది. ఆ తనిఖీల్లో కండోమ్ ప్యాకెట్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2012లో స్వామి నిత్యానందపై అత్యాచారం ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు జైలు శిక్ష విధించారు. అప్పుడు, పరారైన ఆయన ఐదు రోజుల తర్వాత లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
నిత్యానంద పరారీలో ఉన్నప్పుడు పోలీసులు ఆయన ఆశ్రమంలో తనిఖీలు చేశారు. అక్కడ నిత్యానంద తన అనుచరులపై అత్యాచారం చేసేవారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అత్యాచారం, చట్టవిరుద్ధమైన పనులు లాంటి కేసులు, ఆరోపణలు కాకుండా ఆయన ఎన్నోసార్లు తన ప్రకటనలతో వివాదాల్లో నిలిచారు.
వివాదాస్పద ప్రకటనలు
నిత్యానంద ఒకసారి కోతులు, మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం, తమిళం మాట్లాడడం నేర్పిస్తున్నానని చెప్పారు. నిత్యానంద ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను కూడా సవాలు చేశారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతం తప్పని చెప్పారు. దీనిపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. స్వామి నిత్యానంద ఒక వైరల్ వీడియోలో బెంగళూరులో సూర్యుడిని 40 నిమిషాలు వరకూ ఉదయించకుండా ఆపానని కూడా చెప్పుకున్నారు. అంతే కాదు, ఒక ప్రవచనంలో భూతాలతో స్నేహం చేశానని కూడా చెప్పారు.
శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఇప్పటికీ జీవం కోసం వెతుకుతుంటే, చాలా ఏళ్ల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని నిత్యానంద చెప్పేశారు. అక్కడి నుంచి వారు ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూమిపైకి వస్తుంటారన్నారు. ఇలా నిత్యనంద వాదనలు, ప్రవచనాల లిస్టు చాలా పెద్దదే. అయితే, నిత్యానందను నమ్మేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వారు విదేశాల్లో కూడా ఉన్నారు. నిత్యానంద ఆశ్రమం వెబ్‌సైట్‌లో తను 27 భాషల్లో 500కు పైగా పుస్తకాలు రాశానని కూడా చెప్పారు.
నిత్యానంద ఎవరు?
నిత్యానంద అనుచరులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ మేం వారితో మాట్లాడాలని ప్రయత్నించినపుడు ఎవరూ ముందుకు రాలేదు. తమిళనాడులో పుట్టిన నిత్యానంద తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటారు. ఆయన వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం యూట్యూబ్‌లో నిత్యానంద వీడియోలకు 18 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో అత్యధికులు చూసే ఆధ్యాత్మిక గురువు తనే అని ఆయన చెప్పుకుంటున్నారు.
వెబ్‌సైట్ ప్రకారం నిత్యానంద 1978 జనవరిలో పుట్టారు. నిత్యానంద తండ్రి పేరు అరుణాచలం, తల్లి లోకనాయకి అని ఉంది. బాల్యంలో నిత్యానంద పేరు రాజశేఖరన్. ఆయనకు తన తాతగారి ద్వారా పూజలు, ఆచారాలపై ఆసక్తి ఏర్పడింది. తన తాతగారిని నిత్యానంద తొలి గురువుగా చెప్పుకున్నారు. నిత్యానంద 1992లో తన స్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు. ఆయన 12 ఏళ్ల వయసు నుంచి రామకృష్ణ మఠంలో చదువుకున్నారు.
ఆయన మొదటి ఆశ్రమం నిత్యానంద ధ్యానపీఠం 2003 జనవరిలో బెంగళూరు దగ్గర బిదాదిలో ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఉన్నది ఈ ఆశ్రమం బ్రాంచ్. ఇక్కడ నుంచే బాలికలను మాయం చేశారనే ఆరోపణలతో నిత్యానందపై కేసు నమోదైంది.