Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జార్జి రెడ్డి: కొందరికి అభినవ చేగువేరా, ఇంకొందరికి ఆవేశపరుడు, ఇంతకీ ఆయన కథేంటి?

జార్జి రెడ్డి: కొందరికి అభినవ చేగువేరా, ఇంకొందరికి ఆవేశపరుడు, ఇంతకీ ఆయన కథేంటి?
, శుక్రవారం, 22 నవంబరు 2019 (14:26 IST)
జార్జి రెడ్డి... ఇప్పుడు తెలుగునాట చర్చలో ఉన్న పేరు. ఆయన మరణించిన 47 ఏళ్ల తరువాత కూడా చర్చనో, వివాదాన్నో రగిలిస్తున్న పేరు. ఆయన్ను అభిమానించే వామపక్షాల వారు అభినవ చే గువేరాగా చెప్పుకుంటారు. వ్యతిరేకించే హిందూ జాతీయవాదులు రౌడీగా కొట్టి పారేస్తారు.

 
ఇంతకీ జార్జి రెడ్డి ఎవరు? అతని అసలు కథ ఏంటి?
జార్జ్ ఎవరో సులువుగా చెప్పేందుకు ఆయన మిత్రుడిని, జార్జ్ హత్యా నేరం ఎదుర్కొన్న వ్యక్తినీ ఒకే ప్రశ్న అడిగింది బీబీసీ. ఆ ప్రశ్న... ఒకవేళ జార్జ్ 25 ఏళ్లకే చనిపోయి ఉండకపోతే ఏమయ్యుండేవారని మీరు అనుకుంటున్నారు. దానికి, జార్జ్ మిత్రుడు ఇచ్చిన సమాధానం, ఒక గొప్ప విప్లవకారుడు అయ్యుండేవాడు అని. జార్జ్ ప్రత్యర్థి ఇచ్చిన సమాధానం, ఏ అలజడులూ లేకపోతే ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యుండేవాడు అని.

 
జార్జ్ రెడ్డి వ్యక్తిత్త్వంలోని రెండు భిన్న కోణాలను ఈ సమాధానాలు పట్టి చూపుతాయి. జార్జ్ రెడ్డి విషయంలో ప్రత్యర్థులు కూడా అంగీకరించే విషయం ఆయన తెలివితేటలు. మిత్రులు కూడా అంగీకరించే విషయం ఆయన ఆవేశం. అవే మిగిలిన వారి కంటే జార్జ్ రెడ్డిని ప్రత్యేకంగా నిలిపాయి. చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ రెడ్డి, కేరళకు చెందిన లీలా వర్గీస్‌ల ఐదుగురు సంతానంలో జార్జ్ రెడ్డి ఒకరు. చిన్నప్పుడే తండ్రి దూరం అయ్యారు. ఉపాధ్యాయ వృత్తి చేస్తూ తల్లే పిల్లల్ని చదవించారు. 1962లో ఆ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది.

 
హైదరాబాద్‌లోని సెయింట్ పాల్ స్కూల్లో జార్జ్ చదువు మొదలైంది. పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు - ప్రస్తుత ఇంటర్ వంటిది), డిగ్రీ నిజాం కాలేజీలో చదివారు. పీజీ (ఎమ్మెస్సీ ఫిజిక్స్) ఉస్మానియా క్యాంపస్‌లో చదివారు. పీహెచ్‌డీ కోసం ఉస్మానియాలోనే చేరారు. మొదట్లో ఆయనకు మలయాళం, ఇంగ్లిష్ మాత్రమే వచ్చు.

 
విద్యార్థిగా జార్జ్ ప్రతిభను మిత్రులు, ప్రత్యర్థులు అందరూ అంగీకరిస్తారు. అతను చాలా తెలివైనవాడని, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండేవాడని మిత్రులు చెబుతారు. సైన్స్‌తో పాటు, ఇతర సామాజిక రాజకీయ అంశాలపై కూడా లోతైన అవగాహన ఉన్నవాడని చెబుతారు. "జార్జ్‌కి చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండేది. పీయూసీలో మార్కుల ఆధారంగా డాక్టర్ సీటు వస్తుంది. అప్పట్లో ఆయన పీయూసీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెకండ్ ర్యాంకు తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు తప్పనిసరిగా సీటు రావాలి. కానీ ఆశ్చర్యంగా లిస్టులో జార్జ్ పేరు లేదు. కారణం వెతికితే జార్జ్ నాన్-లోకల్ కావడంతో ఎంబీబీఎస్ సీటు రాలేదని తేలింది. దీంతో ఆయన బీఎస్సీలో చేరారు అని వివరించారు జార్జ్‌తో సన్నిహితంగా మెలిగిన ప్రదీప్ అనే మిత్రుడు.

 
"జార్జ్‌కి టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో కూడా సీటు వచ్చింది. కానీ ఆయన చేరలేదు. ఉస్మానియాలో ఆయన ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన పీహెచ్‌డీకి గైడ్ చేయడానికి ప్రొఫెసర్లు ముందుకు రాకపోతే ఒక ఆస్ట్రానమీ డిపార్టుమెంటు ప్రొఫెసర్ జార్జ్‌కి అడ్మిషన్ ఇప్పించారు" అన్నారు ప్రదీప్.
webdunia
విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశం
1960-70లు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు ఊపు మీద ఉన్న కాలం. వామపక్ష ఉద్యమాలు భారతదేశం సహా ఎన్నోదేశాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ రోజులవి. అమెరికా-వియత్నాం యుద్ధం, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో జాత్యహంకారంపై తిరుగుబాట్లు, భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమం వంటి ఎన్నో ఉదంతాలు అప్పటి యువతను అభ్యుదయ భావజాలం వైపు నడిపించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జార్జ్‌ రెడ్డి అందుకు మినహాయింపు కాదు.

 
ఈ సమయంలోనే ఉస్మానియాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగింది. ఆ ఉద్యమం ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డికి చాలా ఇబ్బందిగా మారింది. నిజానికి అప్పటి వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం, హిందూ జాతీయవాద భావాలున్న విద్యార్థి సంఘాలూ బలంగానే ఉన్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల ప్రభావం కాస్త తక్కువగా ఉన్న రోజుల్లో జార్జ్‌ రెడ్డి యూనివర్సిటీలో అడుగుపెట్టారు.

 
జార్జ్ క్రమంగా విద్యార్థులను చేరదీసి, నాయకత్వం వహించి పీడీఎస్ (ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్) పేరుతో కార్యక్రమాలు నిర్వహించార‌ు. తరువాత రోజుల్లో ఆ పేరే పీడీఎస్‌యూ విద్యార్థి సంఘంగా మారింది. జార్జ్ రంగ ప్రవేశంతో ఉస్మానియాలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం బలం తగ్గింది. అప్పుడే బీజేపీ అనుబంధ ఏబీవీపీ పుట్టింది. దీంతో రైట్ వర్సెస్ లెఫ్ట్, ఏబీవీపీ వర్సెస్ పీడీఎస్‌యూ రాజకీయాలు మొదలయ్యాయి.

 
అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో, అనుబంధ కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండేవి. అవి హింసాత్మకంగా జరిగేవి. దీంతో ఈ విద్యార్థి సంఘాల మధ్య తరచూ కొట్లాటలు విపరీతంగా జరిగేవి. స్వతహాగా బాక్సర్, దానికితోడు ఆవేశపరుడైన జార్జ్‌ రెడ్డి ఈ గొడవల్లోనూ ఉన్నారు.

 
ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్
విశ్వవిద్యాలయ రాజకీయాల్లో జార్జ్‌ రెడ్డి చురుగ్గా ఉండేవారు. కింది కులాలు, చిన్న ఉద్యోగులు, కొత్త విద్యార్థులు వంటి బాధితుల పక్షాన ఉండి జార్జ్ పోరాటం చేసేవాడని ఆయన మిత్రులు చెబుతారు. ఎవరైనా వచ్చి తన కష్టం చెప్పుకుంటే ముందూ వెనకా చూడకుండా వారి తరపున వెళ్లి అవతలి వ్యక్తిని ఒప్పించో లేక భౌతికంగా కొట్టి అయినా సరే బాధితుడికి న్యాయం చేసే తత్వం అతనిదని చెబుతారు మిత్రులు. బాధితుల పక్షాన నిలబడే క్రమంలో తాను దెబ్బలు కొట్టాడు, దెబ్బలు తిన్నాడని అంటారు.

 
"నాయకులు ముందుగా అనుచరులను పంపి వ్యవహారం చక్కబెట్టమని చెబుతుంటారు. కానీ జార్జ్‌ అలా కాదు. ప్రమాదం ఎక్కడ ఉంటే అక్కడ తానే ముందు ఉండేవాడు. తరువాతే అనుచరులను పిలిచేవాడు. అటువంటి లక్షణం చేగువేరాలో ఉండేది. మాకు తెలిసిన వారిలో జార్జ్‌లో ఉండేది. అందుకే జార్జ్‌ని మేం ఒక హీరోలా చూసేవాళ్లం. ఉస్మానియాలో జీన్స్ వేసుకుని మెట్లు దిగుతూ జార్జ్ నడుస్తుంటే మేమంతా ఒక హీరో వస్తున్నట్టే చూసేవాళ్లం" అంటూ ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ప్రదీప్.

 
ప్రస్తుతం ఐఎఫ్‌టీయూ (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్.. జార్జ్‌ రెడ్డితో కలసి యూనివర్సిటీలో చదివారు. జార్జ్‌ కంటే నాలుగేళ్ల జూనియర్. విశ్వవిద్యాలయంలో ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన వారిలో ప్రదీప్ కూడా ఒకరు. "లైబ్రరీలో తల తిప్పేవాడు కాదు. అతనిపై చేగువేరా ప్రభావం ఉంది. జార్జ్‌ ప్రభావం మాలాంటి ఎందరిపైనో ఉంది. జార్జ్‌ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసేవాడు. అక్కడ పుస్తకాలు చదివే వాళ్లం. వాటిపై జార్జ్‌ మాకు చాలా విషయాలు చెప్పేవాడు. 

 
అంతర్జాతీయ రాజకీయాల నుంచి నూక్లియర్ ఫిజిక్స్ వరకూ ఎన్నో అంశాలు మాట్లాడుకునేవాళ్లం. రాజకీయ భావజాలం పరంగా మా ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లు కూడా వచ్చేవారు. నేను విప్లవం కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను అనేవాడు జార్జ్‌. ముందు ప్రశ్నించడం మొదలు పెట్టాడు. బృందంగా చేరాం. పీడీఎస్ అనే పేరు ఉండేది. ఆయన చనిపోయాకే పీడీఎస్‌యూ మొదలైంది" అని ప్రదీప్ తెలిపారు.
webdunia
జార్జ్‌ హత్య రోజు ఏం జరిగింది?
"1972 ఏప్రిల్ 14న ఇంజినీరింగ్ కాలేజీ ఎన్నికలకు ఒక రోజు ముందు అక్కడి విద్యార్థులను కలవడానికి వెళ్లారు జార్జ్. అక్కడి క్యాంటీన్లో తెలిసిన వారిని పలకరించారు. ఈలోపు వేరే వాళ్లు పిలిస్తే పదినిమిషాల్లో వస్తానని వెళ్లారు. ఇక రాలేదు. ఆయన వెళ్లిన హాస్టల్ దగ్గర మాటు వేసిన గూండాలు మీద పడి చంపేశారు. క్రూరంగా చంపారు. అంతకుముందే క్యాంపస్‌లో గూండాలు తిరుగుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆ హత్య ఆర్ఎస్ఎస్ వాళ్లే, ఆ భావజాలం వారే చేయించారు. అంతకు ముందు చాలా దాడులు జరిగాయి. ఒకసారి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు" అని హత్య గురించి వివరించారు జార్జ్ మిత్రుడు ప్రదీప్.

 
జార్జ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, నిర్దోషిగా బయటకు వచ్చిన సీహెచ్ నరసింహా రెడ్డికి కూడా జార్జ్ రెడ్డి గురించి బాగా తెలుసు. జార్జ్ రెడ్డి ఉన్న సమయంలోనే నరసింహా రెడ్డి యూనివర్సిటీలో ఉన్నారు. బీఏ, ఎంఏ ఎకనమిక్స్, సోషియాలజీ చదివి ఎంఫిల్‌లో చేరారు. నరసింహా రెడ్డి హిందూ జాతీయ వాద భావజాలం ఉన్న వ్యక్తి.

 
"జార్జ్ హత్య జరిగినప్పుడు నేను దాదాపు 3 కి.మీ. దూరంలో ఉన్న A హాస్టల్లో ఉన్నాను. అందరూ హడావుడిగా కర్రలు పట్టుకు వెళుతుంటే నేనూ వెళ్లాను. అక్కడ కొందరు నాపై దాడిచేయబోతే పోలీసులు నన్ను ఒక పక్క గదిలో కూర్చోబెట్టారు. తరువాత నన్ను స్టేషన్‌కి తీసుకెళ్లారు. రాత్రికి నన్ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆ హత్య ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ నేను ఇరుక్కుపోయి నష్టపోయాను. ఆయనకి కాంపస్ బయట కూడా చాలా మంది శత్రువులున్నారు. నేను 5 నెలలు జైల్లో ఉండి, తరువాత నిర్దోషిగా విడుదలయ్యాను. కేసు విచారణ 60 రోజులు సాగింది. 60 కత్తిపోట్లు వాస్తవం కాదు. రెండు గాయాలే ఉన్నాయి. కావాలంటే మీరు చార్జిషీట్ చదవొచ్చు" అన్నారు నరసింహా రెడ్డి.

 
"నాకూ జార్జ్‌కీ మధ్య సంబంధం 1971 సెప్టెంబరు 4 వరకూ ఒకటి, ఆ తరువాత ఒకటి. అంతకు ముందు జార్జ్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నాకంటే మా నారాయణదాసుతో ఇంకా క్లోజ్. కలసి తిరిగేవాళ్లు. కానీ సెప్టెంబరు 4న నామీద దాడి చేశాడు. అప్పటి నుంచి నేనూ ఆయనా దూరంగా ఉన్నాం. ఆరోజు చెన్నమనేని విద్యాసాగర రావు, నారాయణదాసుతో పాటు, నాపైనా దాడి జరిగింది. గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ దగ్గర ఉంటే వచ్చి నన్ను ముఖం మీద కొట్టాడు. పిచ్చి లేచిందా, ఎందుకు కొడుతున్నావని అడిగితే మళ్లీ కొట్టారు. ఈలోపు అక్కడ ఉన్నవాళ్లు తిరగబడ్డారు. అప్పటి నుంచే సంబంధం కట్ అయింది. జార్జి నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ జీపు అన్నీ అక్కడే ఉన్నాయి" అని చెప్పారు నరసింహా రెడ్డి.

 
"ఆ గొడవ తరువాత ఓయూతో పాటూ సిటీలోని అన్ని కాలేజీల్లో ఏబీవీపీ వాళ్లు లెఫ్ట్ వాళ్లను కొట్టారు. నన్ను 'హిట్లర్ సేనాని' అంటూ కరపత్రాలు వేశారు. ఆ గొడవలతో ఒక నెల రోజులు కాలేజీలన్నిటికీ సెలవులు ఇచ్చారు. తరువాత చాలా గొడవలు జరిగాయి. జార్జ్ నాతో గొడవ పడటానికి స్పష్టమైన కారణం తెలీదు. కానీ నేననుకోవడం, ఒకటి గాంధీ మెడికల్ కాలేజీ ఎన్నికల్లో, మనం సీనియర్లుగా జోక్యం చేసుకోకూడదని జార్జ్‌కి చెప్పాను. ఆ మాటలు ఆయనకు నచ్చలేదు. తరువాత విద్యానగర్ బస్తీలో కొందర్ని కొట్టడానికి కాంపస్ విద్యార్థులను తీసుకెళ్లాలనుకున్నాడు. 

 
కానీ అక్కడి వారు ఓయూలోనే పనిచేసేవారు. దీంతో వెళ్లొద్దని నేను విద్యార్థులకు చెప్పాను. ఇది మనసులో పెట్టుకున్నాడు. తనకు ఎవరైనా వ్యతిరేకం ప్రవర్తిస్తే మనసులో పెట్టేసుకుంటాడు. ఎవరేం చెప్తే అదే వినేవాడు. అలా చాలా గొడవల్లో ఇరుక్కున్నాడు. మేం ఎన్నోసార్లు అతనికి అండగా నిలబడ్డాం. అతని నేచర్ కొట్టడమే. ముందు వెనుకా చూడకుండా కారణం లేకుండా కొట్లాటలు పెట్టుకునేవాడు. అతని గురించి తెలియక.. స్నేహం చేసి, సహకారం అందించి తప్పు చేశామా అని అప్పుడప్పుడూ అనిపిస్తూంటుంది" అన్నారు నరసింహా రెడ్డి.

 
"నాకు జార్జ్ రెడ్డి చాలా ముందు నుంచీ తెలుసు. వాళ్ల కుటుంబానికి, మాకు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడి ద్వారా పరిచయం. జార్జ్‌ది డిస్టర్బ్ అయిన కుటుంబం. నాపై దాడి చేసిన రోజు కూడా ఇంటికి అక్క వచ్చింది. భోజనానికి రా అని పిలిచాడు. జార్జ్ కోపం గురించి స్వయంగా అతని తల్లే నాతో అంది. వీడి కోపం ఎప్పటికైనా ఇబ్బందే. ప్రమాదమే అనేది. నేను.. అలా అనకమ్మా అనేవాడిని. నువ్వు నా కొడుకులాంటోడవు అనేది. నాపై దాడి జరిగిన తరువాత నాకు ఆ కుటుంబంతో సంబంధాల్లేవు" అని చెప్పుకొచ్చారు నరసింహా రెడ్డి.

 
కాంగ్రెస్ పాత్ర ఉందా?
జార్జ్ రెడ్డిని కాంగ్రెస్ వాడుకుంది అని ప్రత్యర్థులు ఆరోపిస్తారు. అది తప్పనీ, జార్జ్ స్వతంత్ర్యంగా వ్యవహరించారనీ చెబుతారు మద్దతుదారులు. "కాంగ్రెస్ పార్టీ జార్జ్‌ని ఉపయోగించుకుంది. 1966 వరకూ యూత్ కాంగ్రెస్ పెత్తనం ఉండేది ఓయూలో. తరువాత కాంగ్రెస్ దెబ్బతింది. ఒకసారి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఇండిపెండెంట్లు, ఏబీవీపీ భావజాలం ఉండేవాళ్లం కలసి పోటీ చేశాం. తరువాత విడిపోయాం. తరువాత నేను, వెంకయ్య నాయుడు, నారాయణ దాసు వంటి వాళ్లం ఏబీవీపీని ప్రారంభించాం. 

 
ఓయూలో తెలంగాణ ఉద్యమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నామని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి మేమంటే కోపం. పైగా ఓయూలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం పట్టు సడలిపోయింది. అప్పుడు వారికి జార్జ్ ఒక ఆయుధంలా దొరికాడు. మామీద ఉసిగొల్పారు. అతను మాపై దాడి చేస్తే, ఒకడు చస్తాడు, ఇంకొకడు జైలుకు వెళ్తాడు అని కాంగ్రెస్ ఉద్దేశం. అందుకే జార్జ్ చేత నాపై దాడి చేయించారు. జార్జ్ మరణం తరువాత ఒక ఏడాది ఏబీవీపీ పడిపోయింది. తిరిగి నేను వెళ్లి, మళ్లీ అభివృద్ధి చేశాను" అని తన వాదన వివరించారు నరసింహా రెడ్డి.

 
"మొదట్లో కాంగ్రెస్ విద్యార్థి సంఘం వారితో జార్జ్ స్నేహంగా ఉన్నాడు. అప్పట్లో 'కాంగ్రెస్ ఫర్ సోషలిజం' అనే విభాగం ఉండేది. వారితో కలసి చర్చల్లో పాల్గొనేవాడు. తరువాత కూడా కనిపిస్తే పలకరించడం లాంటిది ఉండేది. అప్పటి కార్మిక మంత్రి రవీంద్రనాథ్ రెడ్డితో పరిచయం ఉండేది. అప్పుడప్పుడూ కలుస్తూండేవారు. అతనితో కూడా సోషలిజం ఫోరం ద్వారానే పరిచయం. కానీ 1971 నాటికే అవన్నీ కట్ చేసేసుకున్నాడు. ఎప్పుడూ కాంగ్రెస్‌తో కుమ్మక్కు అనేది లేదు. జార్జ్ ఎప్పుడూ మార్క్సిస్ట్ భావాలతోనే ఉండేవాడు. తాను విప్లవానికి సిద్ధం అనేవాడు. కానీ కాంగ్రెస్ అతణ్ని తమవాడిగా చూపించుకోవడానికి ప్రయత్నించేది. కేరళలో యూత్ కాంగ్రెస్ సభలు జరిగితే, దానికి జార్జ్ రెడ్డి ప్రాంగణం అని పేరు పెట్టారు" అని తమ వాదన వివరించారు ప్రదీప్.

 
జార్జి పాతికేళ్ల వయసులో చనిపోయాడు. జార్జి చనిపోయి దాదాపు యాభై ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ రాజకీయ భావాజాలాల గురించి అవగాహన ఉన్న వారి మధ్య మాత్రమే జార్జ్ రెడ్డి గురించి చర్చ సాగుతూ వచ్చేది. కానీ తాజా బయోపిక్‌తో అతని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో విడుదలైన మణిరత్నం 'యువ', భాను చందర్ 'అలజడి' సినిమాలు కూడా జార్జ్ స్ఫూర్తితో వచ్చినవే అంటారు.

 
జార్జి ఉండుంటే ఎలా ఉండేవారు?
"మిత్రత్వమే కాదు. చాలాసార్లు శత్రుత్వం కూడా ఇబ్బందిగా ఉండేది. జార్జ్ ఒక ఆవేశపరుడు అంటాను. మంచివాడు - చెడ్డవాడు అనను. చాలా మందిని కొట్టాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కారణాలు లేకుండా కొట్టేవాడు. ఒకవేళ నేను అంతకు మించి అతని గురించి ఏమన్నా శత్రుత్వంతో చెప్పాడు అంటారు. ఒకవేళ జార్జ్ బతికి ఉండుంటే, 'నువ్వు చెడ్డోనివి రా', అని మొహం మీదే చెప్పేవాడిని. కమ్యూనిస్టుల్లో ఎప్పుడూ లీడర్లు బావుంటారు. కార్యకర్తలు సమిధలవుతారు. జార్జ్ విషయంలోనూ అదే జరిగింది. ఈ విద్యార్థి సంఘ గొడవల్లో ఓయూలో రెండు తరాలు దెబ్బతిన్నాయి. ఇలా జరగకూడదు. ఈ గొడవలు లేకపోతే జార్జ్ ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యుండేవాడు" అన్నారు నరసింహా రెడ్డి.

 
"జార్జ్‌ని పరిచయం చేయాల్సి వస్తే నేను చెప్పే మాట.. ఆయన ఓ మల్టీ ఫాసినేటెడ్ పర్సనాలిటీ. ఇంటలెక్చువల్. ఎకడమిక్ బ్రిలియంట్. ఫైటర్. బాక్సింగ్ చాంపియన్. జార్జ్ కింది కులాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసిపోయేవాడు. పెద్ద కులాలవారు ఆధిపత్య ధోరణి చూపించినప్పుడు సహించేవాడు కాదు. అంతేకాదు, యూనివర్సిటీలో చిరుద్యోగుల తరపున కూడా జార్జ్ మాట్లాడేవాడు. అందుకే అతను అందరికీ ఆప్తుడయ్యాడు. పేదల బాధలు చూసి చలించేవాడు. కారణం లేకుండా జార్జ్ ఎవర్నీ కొట్టలేదు. కానీ తప్పు ఉంటే ఎంతటి వారినైనా ఎదిరించేవాడు. వీటితో పాటు అతను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండేవాడు. పీజీ పూర్తి చేసే నాటికే ఒక స్పష్టమైన దృక్పథానికి వచ్చేశాడు. ఒకవేళ మరణించకుండా ఉండుంటే జార్జ్ ఒక గొప్ప విప్లవకారుడు అయ్యుండేవాడు" అని ప్రదీప్ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారు బాతుగుడ్లు మాకవసరంలేదు: బుగ్గన రాజేంద్రనాథ్