Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైజీరియా: 300 మందికిపైగా పాఠశాల విద్యార్థుల కిడ్నాప్, ఆందోళనలో తల్లిదండ్రులు

నైజీరియా: 300 మందికిపైగా పాఠశాల విద్యార్థుల కిడ్నాప్, ఆందోళనలో తల్లిదండ్రులు
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (17:21 IST)
నైజీరియాలోని వాయువ్య భాగంలో ఉన్న జంఫారా రాష్ట్రంలో కొన్ని వందల మంది స్కూలు విద్యార్థులు శుక్రవారం అపహరణకు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్కూలులో సాయుధులు దాడి చేసిన తరువాత 300 మందికి పైగా విద్యార్థులు కనిపించటం లేదని ఒక టీచర్ బీబీసీకి చెప్పారు. ఈ దాడులు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు నిర్ధరించినప్పటికీ దాడుల గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు.

 
ఇటీవల కాలంలో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులను అపహరించడం ఇదే. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఆయుధాలతో తిరిగే ముఠాల సభ్యులు స్కూలు పిల్లలను బంధించడం ఇక్కడ తరచుగా జరుగుతూ ఉంటుంది. గత వారం నైజర్ సెంట్రల్ స్టేట్‌లో అపహరణకు గురైన 42 మందిని ఇంకా విడుదల చేయలేదు. అందులో 27 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.

 
గత డిసెంబరులో దుండగులు 300 మందికి పైగా అబ్బాయిలను అపహరించి చర్చల తర్వాత వదిలి పెట్టారు. జంగబీలో ఉన్న ప్రభుత్వ బాలికల సెకండరీ స్కూలు దగ్గరకు శుక్రవారం ఆయుధాలు ధరించిన దుండగులు వాహనాలు, మోటార్ సైకిళ్లతో వచ్చి దాడి చేసినట్లు స్కూలు టీచర్ ‘పంచ్’ అనే న్యూస్ సైట్‌‌కి చెప్పారు.

 
కొందరు దుండగులు ప్రభుత్వ భద్రతాదళాలకు చెందినవారిలా దుస్తులు ధరించారని ఒక టీచర్ చెప్పినట్లు ‘పంచ్’ పేర్కొంది. వారు విద్యార్థులను బలవంతంగా వాహనాలలోకి ఎక్కించి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు.

 
ఆందోళనలో తల్లిదండ్రులు
విద్యార్థుల అపహరణ సమాచారం తెలిసినవెంటనే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. స్కూలు చుట్టుపక్కల ఉన్న పొదల్లో తమ పిల్లల కోసం వెతుకుతున్నారని బీబీసీ అబూజా ప్రతినిధి ఇషాక్ ఖలీద్ తెలిపారు. దాడి జరిగిన సమయంలో 421 మంది విద్యార్థులు ఉండగా కేవలం 55 మంది మాత్రమే స్కూలులో మిగిలారు. మిగిలిన వారంతా అపహరణకు గురయ్యారని టీచర్ చెప్పారు

 
ఉత్తర నైజీరియాలో ఆయుధాలు ధరించిన దుండగులు విద్యార్థులను అపహరించిన ప్రతి సారి చిబోక్ అమ్మాయిల ప్రస్తావన వస్తుంది. ఈ ప్రాంతంలో గతంలో కూడా విద్యార్థులను స్కూళ్ల నుంచి అపహరించినప్పటికీ వాటికి తగినంత ప్రచారం లభించలేదు. చిబోక్ అమ్మాయిలను ఎత్తుకుని వెళ్లిన బోకో హరామ్ సభ్యులు వారిని అపహరించాలనే ప్రణాళికతో రాలేదు. కానీ, స్కూలులో ఉన్న బల్లలను దొంగలించాలని వచ్చారు. కానీ, ఆ ఘటనకు జరిగిన ప్రచారంతో పిల్లలను అపహరించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు.

 
పెద్ద సంఖ్యలో పిల్లలను స్కూళ్ల నుంచి అపహరించడం మాత్రం ఇక్కడ ఎక్కువవుతోంది. కిడ్నాపైనవారి విడుదల కోసం పెద్ద మొత్తంలో సొమ్మును ఇస్తున్నారన్న వాదనను నైజీరియా ప్రభుత్వం ఖండిస్తోంది. పిల్లల కిడ్నాప్‌లు ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి వ్యూహం ఉన్నట్లు కనిపించటం లేదు. దుండగులకు స్థిరమైన ఆర్ధిక అవకాశాలు కల్పించడం ద్వారా వారితో ఒక ఒప్పందానికి రావచ్చని కొంత మంది ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.

 
ఇది చాలా వివాదాస్పదమైన వ్యూహమైనప్పటికీ ఇలాంటి వ్యూహాలు నైజర్ డెల్టా ప్రాంతంలో సత్ఫలితాలను ఇచ్చాయి. 2009లో కిడ్నాపర్లకు క్షమాభిక్ష పెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో నేరాలు తగ్గాయి. తాజా ఘటనలోనూ కిడ్నాపర్లతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ అర్జున్ ఎంకే-1ఏ ట్యాంకులు పాకిస్తాన్ ట్యాంకుల కన్నా మెరుగైనవా?