Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ అర్జున్ ఎంకే-1ఏ ట్యాంకులు పాకిస్తాన్ ట్యాంకుల కన్నా మెరుగైనవా?

భారత్ అర్జున్ ఎంకే-1ఏ ట్యాంకులు పాకిస్తాన్ ట్యాంకుల కన్నా మెరుగైనవా?
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (17:04 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
భారత సైన్యం అమ్ములపొదిలో త్వరలోనే అర్జున్ ఎంకే-1ఏ అనే కొత్త యుద్ధ ట్యాంకు చేరబోతోంది. అర్జున్ ఎంకే-1ఏ (ఆల్ఫా) కోసం భారత ప్రభుత్వం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి రూ.13.7 వేల కోట్లను వివిధ ఆయుధాలు, రక్షణ సామగ్రి కొనుగోళ్ల కోసం మంజూరు చేసింది. అర్జున్ యుద్ధ ట్యాంకులు కూడా ఇందులో భాగమే.

 
అర్జున్ ఎంకే-1ఏ ట్యాంకులు భారత్‌లోనే తయారవుతున్నాయి. ఇదివరకటి అర్జున్ ఎమ్-కే1కు మార్పులు చేసి, వీటిని రూపొందిస్తున్నారు. ఇదే శ్రేణిలో ఎంకే-2 ట్యాంకులు కూడా భారత్ వద్ద ఉన్నాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ అర్జున్ ట్యాంక్ మార్క్-1ఏ వర్షన్‌ను సైన్యం చీఫ్ ఎంఎన్ నర్వాణేకు అప్పగించారు. దక్షిణ భారత్‌లో తయారైన యుద్ధ ట్యాంకులు ఉత్తర భారత్ సరిహద్దులను కాపాడుతున్నాయని, దేశ ఐక్యతకు ఇది చిహ్నమని మోదీ ఆ సందర్భంగా అన్నారు.

 
అర్జున్ ఎంకే-1ఏలో ప్రధానంగా 14 మార్పులు చేశారు. లక్ష్యాన్ని ఈ ట్యాంకు త్వరగా వెంబడించి, దాడి చేయగలదని నిపుణులు చెబుతున్నారు. పగలూ, రాత్రీ, ఏ కాలంలోనైనా సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ ట్యాంకుపై నుంచి క్షిపణిని కూడా ప్రయోగించేలా దీనికి రూపకల్పన చేశారని, ఆ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు.

 
విశేషాలేంటి?
ఎంకే-1ఏలో వాడిన భాగాల్లో 54.3 శాతం దేశీయంగా తయారైనవే. ఇదివరకటి వర్షన్‌లో దేశీయ భాగాలు 41 శాతంగా ఉండేవి. ఈ ట్యాంకులో ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ కూడా ఇదివరకటి కన్నా మెరుగ్గా ఉంటుంది. గ్రెనేడ్ దాడులను, క్షిపణి దాడులను తట్టుకునే సామర్థ్యం మరింత ఎక్కువ. రసాయన దాడుల నుంచి రక్షణ ఉండేలా ప్రత్యేక సెన్సర్లను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

 
ఇందులోని కంచన్ మాడ్యులర్ కంపోజిట్ ఆర్మర్ ద్వారా నాలుగు వైపులా యాంటీ ట్యాంక్ ఆయుధాల నుంచి రక్షణ దొరుకుతుంది. ఈ ట్యాంకులోని లేజర్ వార్నింగ్ వ్యవస్థ దాడి ఎటువైపు నుంచి జరుగుతుందో చెబుతుంది. రిమోట్ కంట్రోల్ ఆయుధ వ్యవస్థ, అడ్వాన్స్ ల్యాండ్ నావిగేషన్ వ్యవస్థలను కూడా ఇందులో పెట్టారు. ఈ ట్యాంకులో 'ఫిన్ స్టెబిలైజ్డ్ పీర్సింగ్ డిస్కార్డింగ్ సెబట్'' గుండ్లు ఉంటాయి. శత్రువుల ట్యాంకులపై కచ్చితత్వంతో, త్వరగా దాడి చేసేందుకు ఇవి తోడ్పడతాయి.

 
దేశీయంగా తయారు చేసిన 120 ఎంఎం కాలిబర్ రైఫిల్ గన్‌ కూడా ఈ ట్యాంకులో ఉంటుంది. కంప్యూటర్ నియంత్రిత ఫైర్ కంట్రోల్ వ్యవస్థ కూడా ఇందులో ఉంది. అన్ని రకాల వెలుతురు పరిస్థితుల్లోనూ బాగా చూసేందుకు ఇది తోడ్పడుతుంది. ద్వితీయ ఆయుధాలుగా యాంటీ పర్సనల్ కో ఆక్సియల్ 7.62 ఎంఎం మెషీన్ గన్... యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, నేలపై ఉన్న లక్ష్యాల కోసం 12.7 ఎంఎం మెషీన్ గన్ కూడా ఉన్నయి. మునపటి ట్యాంకులకు భిన్నంగా రాత్రి పూట కూడా చూసేలా ఈ ట్యాంకును రూపొందించారు. దీనిలో 1400 హార్స్‌పవర్ ఉన్న ఇంజిన్ ఉంది. గంటకు 70 కి.మీ.ల వేగంతో వెళ్లగలదు.

 
ఇలా మొదలయ్యాయి...
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)... యుద్ధ వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ (సీవీఆర్‌ఈడీ)తో కలిసి అర్జున్ శ్రేణి ట్యాంకులకు 1972లో రూపకల్పన చేయడం మొదలుపెట్టింది. వీటి ఉత్పత్తి 1996లో ప్రారంభమైంది. 2004లో 124 అర్జున్ ట్యాంకులను సైన్యానికి అప్పగించారు. పశ్చిమ ఎడారిలో వీటిని మోహరించారు. ఆ తర్వాత కొత్త అవసరాల దృష్ట్యా ట్యాంకులకు మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

 
దీంతో డీఆర్‌డీఓ ఆధునికీకరించిన ట్యాంకులను తయారు చేసింది. ఇప్పుడు సైన్యానికి అప్పగిస్తున్న 118 అర్జున్ ట్యాంకుల ఫైరింగ్ సామర్థ్యంలో మునుపటి ట్యాంకుల కన్నా మెరుగైనవి. అదనంగా చాలా సదుపాయాలను కూడా వీటిలో జోడించారు. ఆధునికీకరించిన 118 అర్జున్ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు 2012లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. కానీ, ఫైరింగ్ సామర్థ్యం సహా చాలా రకాల ట్యాంకులను ఇంకా మెరుగుపరచాలని సైన్యం కోరింది.

 
ఈ నేపథ్యంలోనే 2015లో రూ.14 వేల కోట్ల వ్యయంతో రష్యా నుంచి 464 మీడియం వెయిట్ టీ-90 ట్యాంకులను భారత్ కొనుగోలు చేసింది. భారత్ వద్ద అధికంగా రష్యా నుంచి వచ్చిన టీ-72, టీ-90 ట్యాంకులే ఉన్నాయి. ఆధునికికరించిన తర్వాత అర్జున్ ట్యాంక్ మార్క్-1ఏకి 2020లో ఆమోదం లభించింది.

 
పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు ఇవే...
అర్జున్ ఎంకే1ఏ ట్యాంకులతో పాకిస్తాన్‌కు సవాలు తప్పదని భారత మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ వద్ద ఎక్కువగా చైనా, ఉక్రియన్ సాంకేతికతపై ఆధారపడ్డ ట్యాంకులే ఉన్నాయి. కొన్ని ట్యాంకులను చైనాతో కలిసి పాకిస్తాన్ అభివృద్ధి చేసుకుంది. అల్ ఖాలిద్, అల్ జరార్ ట్యాంకులు ఇలాంటివే. ఉక్రెయిన్ టీ80యూడీ ట్యాంకులు, చైనా టైప్-85, 69, 59 ట్యాంకులు కూడా పాకిస్తాన్ వద్ద ఉన్నాయి.

 
టీ-80 యూడీ ట్యాంకు
టీ-80 యూడీ ట్యాంకు అధునాతనమైన, చాలా సురక్షితమైన యుద్ధ ట్యాంకు. ఉక్రెయిన్ దీన్ని రూపొందించింది. పాకిస్తాన్ సైన్యం వద్ద ఇవి 324 దాకా ఉన్నాయి. దీనిలో ఏ45 ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. భారత్ దగ్గర ఉన్న టీ-72 ట్యాంకుల కన్నా మెరుగైన ఆర్మర్ ప్రొటెక్షన్ వీటికి ఉంది. కానీ, భారత్ దగ్గరున్న భీష్మ ట్యాంకులతో పోలిస్తే ఇవి వెనుకంజలోనే ఉంటాయి.

 
టీ80-యూడీలో 125 ఎంఎం స్మూత్‌బోర్‌ గన్ ఉంది. దీని రేంజ్ ఐదు కి.మీ.ల వరకూ ఉంటుంది. తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లను కూడా దీనితో లక్ష్యంగా చేసుకోవచ్చు. 7.62 ఎంఎం మెషీన్ గన్, దూరం నుంచి నియంత్రించే 12.7 ఎంఎం యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మెషీన్ గన్ కూడా ఈ ట్యాంకులో ఉంటాయి. 1000 హార్స్‌పవర్ సామర్థ్యం ఉన్న ఇంజిన్ దీని సొంతం.

 
అల్ జరార్
చైనాతో కలిసి పాకిస్తాన్ అభివృద్ధి చేసిన రెండో తరం యుద్ధ ట్యాంకు ఇది. దీనిలో 125 ఎంఎం స్మూత్‌బోర్‌ గన్, 12.7 ఎంఎం యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మెషీన్ గన్ ఉంటాయి. ఈ ట్యాంకు 65 కి.మీ.ల వేగంతో కదలగలదు. దీని ఇంజిన్ సామర్థ్యం తక్కువే. బరువు సుమారు 40 టన్నుల వరకూ ఉంటుంది.

 
అల్ ఖాలిద్
దీన్ని కూడా చైనా, పాకిస్తాన్ కలిసి అభివృద్ధి చేశాయి. దీనిలో 125 ఎంఎం స్మూత్‌బోర్‌ గన్ ఉంటుంది. 46 నుంచి 48 టన్నులకు బరువుండే ఈ ట్యాంకు 1200 హార్స్‌పవర్ డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. గంటకు 72 కి.మీ.ల వేగంతో ఇది ప్రయాణించగలదు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ట్యాంకులను పోల్చి, ఏవి మెరుగైనవో చెప్పడం కష్టమని రక్షణ నిపుణుడు రాహుల్ బేదీ అంటున్నారు.

 
''ట్యాంకుల సామర్థ్యాన్ని నిర్ణయించడంలో రెండు అంశాలు కీలకం. ఒకటి వాటి వేగం. రెండోది ఫైరింగ్ సామర్థ్యం. అర్జున్ ట్యాంకులు చాలా విషయాల్లో పాకిస్తాన్ ట్యాంకుల కన్నా మెరుగైనవే. అర్జున్ ట్యాంకుల్లో శక్తిమంతమైన జర్మన్ ఇంజిన్ ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్నవాటిలో ఎక్కువగా ఉక్రెయిన్‌వే. కానీ, పాకిస్తాన్ ట్యాంకుల వేగం ఎక్కువ'' అని ఆయన అన్నారు. ట్యాంకులకు సానుకూలతలు, ప్రతికూలతలు యుద్ధ పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉంటాయని రాహుల్ అభిప్రాయపడ్డారు.

 
‘తేలికైన ట్యాంకులు అవసరం’
అర్జున్ ఎంకే-1ఏ భారత్‌కు చాలా ఉపయోగకరమైందేనని, అయితే తేలికైన యుద్ధ ట్యాంకులు అవసరం చాలా ఉందని నిపుణులు అంటున్నారు. ''ఎంకే-1ఏ బరువు 68 టన్నులు. ఇంత బరువు ఉన్న కారణంగా, దీని వేగం తక్కువగా ఉంటుంది. పంజాబ్‌లోని వంతెనలు, రోడ్లపై వీటిని ఉపయోగించడం సాధ్యం కాదు. రాజస్థాన్ సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఇవి భారీగా ఉంటాయి కాబట్టి రైళ్ల ద్వారానూ తరలించడం కుదరదు. వీటి కోసం ప్రభుత్వం ట్యాంకు క్యారియర్లను తెప్పిస్తోంది'' అని రాహుల్ బేదీ అన్నారు.

 
''వీటి ఫైరింగ్ సామర్థ్యం, కొన్ని ప్రాంతాల్లో వేగం బాగానే ఉంది. కానీ, తేలిక ట్యాంకుల అవసరాన్ని ఇప్పుడు భారత్ గుర్తిస్తోంది. దేశంలో యుద్ధ ట్యాంకులను ఎక్కువగా రాజస్థాన్, పంజాబ్‌ల్లోనే వినియోగిస్తారు. లద్దాఖ్‌ సరిహద్దుల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తేలిక ట్యాంకులను మోహరించింది. అవి 30-34 టన్నుల బరువు ఉంటాయి. మన టీ-72, టీ-90 ట్యాంకులు మాత్రం బరువు ఎక్కువగా ఉండి, తక్కువ వేగంతో నడుస్తాయి. 40 టన్నుల బరువు ఉండే ట్యాంకులైనా మనకు అవసరం. తేలిక ట్యాంకుల అవసరం గురించి 15 ఏళ్ల నుంచీ చర్చ జరుగుతోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ విషయంలో వేగంగా పనిచేస్తోంది'' అని ఆయన వివరించారు.

 
భారత సైన్యం ఒప్పందం చేసుకున్న 30 నెలల తర్వాత అర్జున్ ఎంకే-1ఏ ట్యాంకుల డెలివరీ మొదలవుతుంది. అవి కూడా ఏడాదికి 30 చొప్పున ట్యాంకులను అందిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనూషను అందుకే హత్య చేశాడు: ఎస్పీ విశాల్