Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా, ఇప్పుడు కలిసి ఆడబోతున్నా’’

Advertiesment
చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా, ఇప్పుడు కలిసి ఆడబోతున్నా’’
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:28 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదనే అంశం ఇటీవల ఐపీఎల్ వేలం సందర్భంగా చర్చనీయమైంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రా జట్టు ఆటగాడు హరిశంకర్ రెడ్డికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో చోటు దక్కడం ఆసక్తికరంగా మారింది.

 
రంజీ టోర్నీతో పాటుగా ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో సత్తా చాటిన మారం హరిశంకర్ రెడ్డిని ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో సీఎస్‌కే కొనుగోలు చేసింది. ‘బాహుబలి ల్యాండ్ నుంచి’ వస్తున్న ఆటగాడంటూ హరిశంకర్ గురించి ట్వీట్ చేసింది. ఓ మారుమూల పల్లెలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన హరిశంకర్... అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లీగ్‌కు ఎంపికయ్యేందుకు సాగించిన ప్రస్థానం ఆసక్తికరమే.

 
రోడ్డు సౌకర్యం లేని పల్లె నుంచి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. అందులోనూ కడప జిల్లా రాయచోటి ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామ శివారులో నాగూరివాండ్లపల్లె ఉంది. ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. సెల్ ఫోన్ కవరేజ్ కూడా పూర్తిగా అందుబాటులో లేదు. ఆ గ్రామంలో రైతు రామచంద్రారెడ్డి, భార్యతో కలిసి తమ నాలుగెకరాలం పొలం సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. అందులో ఒకరు ఉపాధి కోసం కువైట్‌లో ఉండగా, రెండో కుమారుడు హరిశంకర్ రెడ్డి క్రికెట్ ఆడుతున్నాడు.

 
బడి కన్నా మైదానమే ఎక్కువ...
హరిశంకర్ 1998 జూన్ 2న పుట్టాడు. చిన్ననాటి నుంచి క్రికెటే ప్రాణంగా పెరిగాడు. తండ్రి చిన్నకారు రైతు అయినా, హరిశంకర్ మాత్రం క్రికెట్ చుట్టూనే మనసు పెట్టి ప్రయత్నాలు చేసేవాడని అతని చిన్ననాటి స్నేహితుడు రమేశ్ చెబుతున్నారు. రమేశ్‌ది కూడా నాగూరివాండ్లపల్లె గ్రామమే.

 
"మొదటి నుంచి హరిశంకర్ ఆటలకే ప్రాధాన్యమిచ్చేవాడు. బడి కూడా మానేసి మ్యాచ్ చూడడానికే వెళ్లేవాడు. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో... చదువుకోరా అని చెబుతున్నా తాను క్రికెట్‌లోనే ఎదుగుతానని చెప్పేవాడు. చివరకు కడపలో జిల్లా స్థాయిలో రాణించి అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి వరుసగా రాణిస్తూ రంజీ జట్టు వరకూ ఎదిగాడు. తోటి వాళ్లమంతా చదువులు, ఆ తర్వాత ఏదో పనులు చేసుకుంటున్నా హరిశంకర్ మాత్రం తనకు నచ్చిన క్రికెట్‌ని వదిలిపెట్టలేదు. ఇంట్లో పెద్దగా సహకారం లేకపోయినా స్వయంశక్తితో ఎదిగాడు" అంటూ రమేశ్ బీబీసీకి వివరించారు.

 
టీ20 లీగ్‌తో వెలుగులోకి..
సయ్యద్ ముస్తక్ అలీ టీ20 లీగ్ జోనల్ స్థాయిలో ప్రారంభ మ్యాచ్ తోనే హరిశంకర్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. రైట్ ఆర్మ్‌ ఫాస్ట్ మీడియం బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ ఆటగాడు 2017-18 సీజన్ తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అక్కడి నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో హరిశంకర్ రెడ్డి ఆటగాడిగా మరింత నైపుణ్యం సాధిస్తూ ఎదుగుతూ వచ్చాడు. ప్రతి సీజన్‌లోనూ బంతితోనూ బ్యాట్‌తోనూ రాణించాడు. హార్డ్ హిట్టర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

 
తొలుత ఆంధ్రా అండర్ 19 జట్టు తరపున అతడు రాణించాడు. ఆ తర్వాత విజయ్ హజారే టోర్నీలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018 జనవరిలో కేరళ జట్టుతో జరిగిన ముస్తక్ అలీ టోర్నీలో తీసిన 4 వికెట్లు అతని కెరీర్‌ని నిలబెట్టాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ దేశవాళీ క్రికెట్‌లో 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన హరిశంకర్ 19 వికెట్లు తీశాడు.

 
చెన్నైకి ఎంపిక కావడం పట్ల సంతోషం
ఇటీవల నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో హరిశంకర్ రెడ్డిని బేస్ ప్రైస్ రూ. 20 లక్షలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. ఈ అవకాశం తన కెరీర్‌ని మరో మెట్టు ఎక్కిస్తుందనే ఆశాభావంతో ఉన్నాడు హరిశంకర్ రెడ్డి. ధోనితో ఒక్క ఫొటో తీసుకుంటే చాలనుకున్న తనకు ఇప్పుడు ధోనితో కలిసి ఆడుతూ, ప్రయాణించే అవకాశం వచ్చిందంటూ ఆనందం వ్యక్తపరుస్తున్నాడు.

 
"ఆటలో రాణిస్తే అవకాశాలు వస్తాయని అనుకున్నాను. అందుకు తగ్గట్టుగా కష్టపడ్డాను. అనేక మంది తోడ్పాటు అందించారు. ఏసీఏ సహా సాటి ఆటగాళ్ల ప్రోత్సాహం ఉంది. ఎప్పటికైనా ధోనితో ఒక్క ఫొటో తీసుకుంటే చాలనుకున్న నాకు ఇలాంటి అవకాశం వచ్చింది. సీనియర్ల నుంచి చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది. ధోని నుంచి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నన్ను జట్టులోకి తీసుకున్న సీఎస్‌కే యాజమాన్యానికి ధన్యవాదాలు" అంటూ హరిశంకర్ బీబీసీతో తన ఆనందం పంచుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ మ్యాచులు, శిక్షణ నిమిత్తం అతడు మధ్యప్రదేశ్‌లో ఉన్నాడు. త్వరలోనే సీఎస్‌కే క్యాంపులో చేరతానని చెప్పాడు.

 
‘అలా వదిలేశారేంటి అని చాలామంది అన్నారు’
హరిశంకర్ తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవమ్మ కూడా తమ కొడుకు ఎదిగిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లో వారు వ్యవసాయం చేసుకుంటూ వరి, శనగ పంటలు పండిస్తూ కుటుంబం నడుపుతున్నారు. ఆవులు పెంచుకుంటూ పాలు అమ్ముతున్నారు. ‘‘ఇద్దరు బిడ్డల్లో ఒకరు పనుల కోసం కువైట్ వెళ్లారు. రెండో బిడ్డ ఎప్పుడూ ఆటలంటూ ఊరూరా తిరగడం చూసి మాకు మొదట్లో ఆందోళన ఉండేది’’ అని హరిశంకర్ తల్లి లక్ష్మీదేవమ్మ బీబీసీతో చెప్పారు.

 
"మా వాడికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. కాలేజీకి కూడా సరిగా పోకుండా ఎక్కడ ఏ చిన్న మ్యాచ్ జరిగినా వెళ్లిపోయేవాడు. వ్యవసాయంలో ఎప్పుడూ చిన్న సాయం కూడా చేయలేదు. ఏంటీ బిడ్డ ఇలా అయిపోయాడని భయమేసేది. అడిగితే మీకు తెలియదులే అనేవాడు. కానీ రెండేళ్లుగా కొంత స్థిరపడ్డాడు. ఆదాయం కూడా సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ వరకూ వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. నిన్నటి వరకూ... ‘ఏంటీ మీ బిడ్డను అలా వదిలేశారు’ అని చాలామంది అనేవారు. ‘ఏం చేయగలడు... ఎలా బతుకుతాడు...’ అని అడిగేవారు. ఇప్పుడు మళ్లీ అదే జనం అభినందిస్తున్నారు. వాడు ఈ స్థాయికి చేరడం చూసి మాకు మాటలు కూడా రావడం లేదు. మరింత ఎదుగుతాడని ఆశిస్తున్నాం" అని ఆమె అన్నారు.

 
‘జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తా’
ప్రస్తుతం టీమ్ ఇండియాలో స్థానం దక్కాలంటే చాలా పోటీ ఉంది. జట్టులో మీడియం పేసర్‌గా స్థానం దక్కడం కష్టమే అయినా గట్టిగా ప్రయత్నిస్తానని హరిశంకర్ రెడ్డి అంటున్నాడు. "స్థిరంగా రాణిస్తే అవకాశాలు వస్తాయి. నా అనుభవం అదే చెబుతోంది. కాబట్టి ఐపీఎల్‌లో చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అనుభవం వస్తుంది. అప్పుడు టీమ్ ఇండియాలో చోటు ఆశించవచ్చు. సీఎస్‌కే లాంటి జట్టులో చోటు రావడంతో సంతృప్తిగా ఉంది. రైతుబిడ్డగా ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను" అంటూ తన లక్ష్యాలను బీబీసీకి వివరించాడు హరిశంకర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి : ఉత్తరాఖండ్