మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు ఎక్కువగా ఉండే అలీరాజ్‌పూర్‌లో ఒక ఘటన చోటుచేసుకుంది. ఒక బాలికను, మరో యువకుడితో కలిపి తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతోపాటూ, వారిద్దరినీ ఊరంతా ఊరేగించారు. బాలికపై ఆ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఈ వ్యవహారంలో బాధితురాలినీ శిక్షించారు. ఆమెను కూడా కొట్టి ఊరంతా తిప్పారు.
ఇదంతా బాధితురాలి కుటుంబ సభ్యులే చేశారని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో, పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. ఇద్దరినీ ఊరేగిస్తున్న సమయంలో కొందరు 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు అందరినీ అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాగ్వానీ బీబీసీతో చెప్పారు.
"ఈ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారో, అందరినీ అదుపులోకి తీసుకున్నాం. అంటే, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశాం. ఇదంతా చేసింది బాలిక కుటుంబంలోని వారే. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశాం" అని భాగ్వానీ చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఘటన అలీరాజ్‌పూర్, జోబట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఛోటీ ఖట్టాలీలో జరిగింది. అక్కడ ఒక 16 ఏళ్ల బాలికను 21 ఏళ్ల యువకుడితో కలిపి తాడుతో కట్టేసి, వారిని ఊరంతా తిప్పారు.
బాలిక, యువకుడు ఇద్దరూ గుజరాత్‌లో పనిచేసేవారు, వారు తర్వాత తిరిగి తమ గ్రామాలకు వచ్చారు. తర్వాత యువకుడు ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ల ఊరొచ్చాడు. అదే సమయంలో ఆ యువతి ఇంట్లో వాళ్లు అతడిని పట్టుకున్నారు. బాలికతో కలిపి తాడుతో కట్టేసి ఇద్దరినీ ఊరేగించారు. ఈ మొత్తం ఘటనను మొబైల్లో చిత్రీకరించిన వాళ్లు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మైనర్ అయిన బాధితురాలు ఝీరీ గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఒక యువకుడిపై కేసు పెట్టింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరినీ తాడుతో కట్టేసి కొట్టి ఊరేగించడంపై మరో కేసు నమోదైంది. అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అప్పటికే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. రెండో ఫిర్యాదులో ఉన్న నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. వీరందరినీ యువతి సమీప బంధువులుగా గుర్తించారు. వారందరిపైనా కొట్టడం, అవమానకరంగా ప్రవర్తించడం, హత్యాయత్నం లాంటి కేసులు నమోదు చేశారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాగ్వానీ, మిగతా పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. "బాధితురాలికి యువకుడు చాలాకాలంగా తెలుసు. వాళ్లకు గుజరాత్‌లో ఉన్నప్పుడే పరిచయం ఉంది. ఆమెను కలవడానికే యువకుడు గ్రామానికి వచ్చినపుడు ఈ ఘటన జరిగింది" అని ఆయన తెలిపారు.
యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ రిపోర్ట్ ప్రకారం ఆదివాసీలు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లా దేశంలోని అత్యంత పేద జిల్లాల్లో ఒకటి. పేదరికంతోపాటూ అక్షరాస్యతలోనూ ఈ జిల్లా చాలా వెనకబడి ఉంది. ఇక్కడి జనాభా ఎక్కువగా జీవనోపాధి కోసం గుజరాత్‌లోని ఫ్యాక్టరీలు లేదా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు.
ఆదివాసీ సమాజం వారు ఇంతకుముందు కూడా, ఈ ప్రాంతంలోని మహిళలకు ఘోరమైన శిక్షలు విధించినట్లు కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదివాసీ సమాజాలు తమ కంటూ ప్రత్యేకంగా స్థానిక కట్టుబాట్లు చేసుకుంటున్నాయి. ఏం జరిగినా వాటి ప్రకారమే శిక్షలు కూడా విధిస్తుంటాయి.