Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ వరదలు: 24కు చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు

Advertiesment
కేరళ వరదలు: 24కు చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
, సోమవారం, 18 అక్టోబరు 2021 (11:57 IST)
కేరళలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. వరద నీటిలో గల్లంతైన అనేక మంది జాడ తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి.

 
రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వరదల కారణంగా ప్రభావితమైన వారికి, గాయపడిన వారికి క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 
కొట్టాయంలోనే వరద నీటిలో చిక్కుకున్న ఒక బస్సు నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కొండచరియలు విరిగిపడడంతో శిథిలాల కింద కొందరు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. సహాయ చర్యల కోసం, ఆహారం అందించడానికి హెలికాప్టర్లు వాడుతున్నారు. అనేక ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయాయి. చెట్లు కూలిపోయాయి.

 
కొల్లం, ఇతర తీర ప్రాంత పట్టణాలలో నీటిలో చిక్కుకుపోయిన ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కొట్టాయం, కూటికల్, ఇడుక్కి జిల్లాలలో 12 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొట్టాయం, ఇడుక్కి, పథనంతిట్ట జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

webdunia
కూలిపోయిన చెట్లు, కొండ చరియలు, మట్టి పెళ్లలు, బురద తొలగించడంలో స్థానికులు కూడా సహాయక బృందాలకు సాయం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వరద బాధితుల కోసం సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. కేరళలో భారీ వర్షాలతో వరదలు రావడం, కొండ చరియలు విరిగిపడడం తరచూ జరుగుతుంటుంది. 2018 వరదలలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

 
అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. అయితే, వాయుగుండం బలహీన పడడంతో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి