Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొవిడ్ మాటున‌ పెరుగుతోన్న టీబీ మరణాలు

Advertiesment
కొవిడ్ మాటున‌ పెరుగుతోన్న టీబీ మరణాలు
విజ‌య‌వాడ‌ , శనివారం, 16 అక్టోబరు 2021 (11:09 IST)
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో గడిచిన దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా క్షయ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కొవిడ్‌ కారణంగా క్షయ నిర్ధారణ, చికిత్సలో ఆటంకం కలగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. క్షయ వ్యాధిపై చేస్తోన్న పోరు తగ్గే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీబీ నివారణ, చికిత్సపై శ్రద్ధ చూపాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. 
 
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో ఒకటిగా నిలిచిన క్షయ వ్యాధిపై జరుగుతోన్న పోరులో భాగంగా గత కొన్నేళ్లుగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మహమ్మారి రూపంలో వచ్చిపడిన ఈ పిడుగు ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2020లో 15లక్షల మంది క్షయ రోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా అంతకుముందు ఈ సంఖ్య 14లక్షలుగా ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ సంఖ్య లక్ష పెరిగింది. అంతేకాకుండా 2021, 2022 సంవత్సరాల్లో వీటి ప్రభావం అధికంగా ఉండవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
కొవిడ్‌ విజృంభణ కారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం 71లక్షల కేసులు నిర్ధారణ కాగా ఈ ఏడాది (2020) ఆ సంఖ్య 58లక్షలకు పడిపోయినట్లు తేలింది. దీంతో నిర్ధారణ కాని క్షయ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా వ్యాధి నిరోధక చికిత్స తీసుకుంటున్న వారి శాతం కూడా భారీగా తగ్గినట్లు వెల్లడైంది. ప్రస్తుతం 28లక్షల మంది మాత్రమే ఈ చికిత్స పొందుతున్నారని.. అంతకుముందుతో పోలిస్తే 28శాతం తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
 
ప్రమాదకరమైన క్షయ వ్యాధి పోరులో భాగంగా 2030 నాటికి 90శాతం మరణాలు, 80శాతం కేసులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటినుంచి 2020 నాటికి క్షయ మరణాల్లో దాదాపు 9శాతం, కేసుల్లో 11శాతం తగ్గుదల కనిపించింది. కానీ, ఊహించని రీతిలో విరుచుకుపడిన కొవిడ్‌ మహమ్మారి వల్ల క్షయ నిర్మూలన ప్రణాళికకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్మూలన సాధ్యమైన, చికిత్స అందుబాటులో ఉన్న, ప్రాచీనమైన ఈ వ్యాధి తీవ్రత పెరగడం ఆందోళనకరమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. క్షయ రోగుల సేవలపై కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా పడిందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో క్షయ నివారణ, నిర్ధారణ, చికిత్సను అందించడంలో తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
 
ఇదిలాఉంటే, కొవిడ్‌-19 కంటే ముందు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం క్షయ కేసుల్లో 90శాతం కేవలం ముప్పై దేశాల్లోనే ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా భారత్‌, నైజీరియా, దక్షిణాఫ్రికా, వియత్నాం దేశాల్లోనే అత్యధిక మంది క్షయ బారినపడుతున్నారు. గతేడాది దాదాపు 15లక్షల మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 2లక్షల 14వేల మంది హెచ్‌ఐవీ రోగులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2021, 2022 సంవత్సరాల్లో క్షయ బాధితులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీ భక్తులు