ఆదివారం మధ్యాహ్నం ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి ఒక వ్యక్తి మృతదేహం జారి లండన్‌లోని గార్డెన్‌లో పడింది. కెన్యాలోని నైరోబీ నగరం నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్తున్న కెన్యా ఎయిర్‌వేస్ విమానం నుంచి ఆ శవం జారిపడిందని పోలీసులు తెలిపారు.
ఎవరి కంటా పడకుండా, రహస్యంగా విమానం కింది భాగంలోని చక్రాలు ఉండే ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో దాక్కుని లండన్ వెళ్లేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించి చనిపోయి ఉంటారని పోలీసులు చెప్పారు. ఆ విమానం ల్యాండైన తర్వాత తనిఖీ చేయగా, ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ఒక బ్యాగు, నీళ్ల బాటిల్, కొంచెం ఆహార పదార్థాలు కనిపించాయని కెన్యా ఎయిర్‌వేస్ సంస్థ తెలిపింది.
సాధారణంగా అనేకమంది వివిధ దేశాల నుంచి రహస్యంగా రోడ్డు లేదా సముద్ర మార్గాల ద్వారా యూరప్‌లోకి ప్రవేశిస్తుంటారు. కానీ, ఇలా విమానాల్లో దాక్కుని వెళ్లేవారు చాలా అరుదు. ఇలా విమానం కింది భాగంలో దాక్కుని ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, అలా వెళ్లేవారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువ అని విమానయాన రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్టు డేవిడ్ లర్న్‌మౌంట్ అంటున్నారు.
ఎందుకంత ప్రమాదకరం?
విమానం భూమి మీద ఉన్నంతసేపు చక్రాలు బయట ఉంటాయి. గాలిలోకి ఎగిరిన తర్వాత చక్రాలు విమానం లోపలికి వెళ్లిపోతాయి. చక్రాలు లోపల ఉండే ప్రాంతాన్ని 'ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్' అంటారు. చక్రాల పక్కనుంచి లోపలికి వెళ్లి ఆ ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో దాక్కుంటే ఎవరికీ తెలియకుండా ప్రయాణించొచ్చని ఆయన భావించి ఉంటారు. అయితే, ఆ ప్రాంతంలో దాక్కోవడం అత్యంత ప్రమాదకరమని, విమానం టేకాఫ్ అయిన తర్వాత చక్రాలు లోపలికి వెళ్లగానే వాటి మధ్య నలిగిపోయే ప్రమాదం ఉంటుందని లర్న్‌మౌంట్ అంటున్నారు.
ఒకవేళ చక్రాల మధ్య నలిగిపోకుండా జాగ్రత్తపడినా, ఎండలు బాగా ఉండే రోజుల్లో విమానం బ్రేకులు బాగా వేడెక్కుతాయి. ఆ వేడిని తట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఈ రెండింటి నుంచి తప్పించుకున్నా, విమానం గాలిలో బాగా ఎత్తుకు ఎగిరిన తర్వాత హైపోథెర్మియాకు గురవుతారు, ఆక్సిజన్ సరిపోదు. గాలి పీడనం తగ్గిపోతుంది.
విమానం క్యాబిన్‌లో పీడనాన్ని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఆక్సిజన్ సరైన మోతాదులో అందేందుకు కృత్రిమ ఏర్పాట్లు ఉంటాయి. కానీ, ల్యాండింగ్ కంపార్ట్‌మెంట్‌లో పరిస్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఆక్సిజన్ కొరత వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే అలా ప్రయాణించేవారిలో దాదాపు ఎవరూ ప్రాణాలతో బయటపడరు. ఒకవేళ ఆ సమస్యలను తట్టుకోగలిగినా, విమానం ల్యాండ్ అయ్యేవరకూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
విమానాశ్రయం సమీపించగానే, చక్రాలు బయటకు వచ్చేందుకు కిందివైపున ఉండే ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ ద్వారాలు తెరుచుకునే సమయంలో కిందపడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, లోపల ఉన్నవారికి "విమానాశ్రయం ఇంకా ఎంత దూరంలో ఉంది? చక్రాలు బయటకు ఎప్పుడు వెళ్తాయి?" అనేది తెలుసుకోవడం కష్టం.
"అందుకే, అలా రహస్యంగా ప్రయాణించేందుకు ప్రయత్నించేవారిలో చాలామంది ఎప్పుడో మధ్యలోనే చనిపోతారు లేదా స్పృహ కోల్పోతారు. విమానాశ్రయం సమీపిస్తున్నప్పుడు కింది ద్వారాలు తెరుచుకోగానే కిందపడిపోతారు" అని లర్న్‌మౌంట్ వివరించారు.
ఎవరైనా బతికారా?
ఇలా ప్రయాణించేవారు ప్రాణాలతో బయటపడటం చాలా చాలా తక్కువని విమానయాన నిపుణుడు అలాస్టైర్ రోసెషీన్ అంటున్నారు. 1947 నుంచి 2019 జులై 2 వరకు ప్రపంచవ్యాప్త సమాచారాన్ని అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (ఎఫ్‌ఏఏ) విశ్లేషించింది. ఆ డేటా ప్రకారం, ఏడు దశాబ్దాల కాలంలో 112 విమానాల్లో 126 మంది అలా గుట్టుగా ప్రయాణించేందుకు ప్రయత్నించారు. 126 మందిలో 98 మంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు, కానీ విమానం ల్యాండవగానే అరెస్టయ్యారు.
కొంతమంది విమానం గాలిలోకి ఎగురుతున్నప్పుడే కిందపడి చనిపోయారు. మరికొందరు మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరు చక్రాలు లోపలికి వెళ్లేటప్పుడు వాటి మధ్య నలిగిపోయారు. ఎఫ్‌ఏఏ డేటా ప్రకారం, ఇలాంటి ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నించిన కేసులు 40 దేశాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా క్యూబాలో 9, డొమినికన్ రిపబ్లిక్‌లో 8, చైనాలో 7, దక్షిణాఫ్రికాలో 6, నైజీరియాలో 6 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో వారు ఏ దేశం నుంచి బయలుదేరారన్న వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. ప్రాంతాల వారీగా చూస్తే, ఆఫ్రికాకు చెందిన 34 మంది, కరీబియన్ ప్రాంతానికి చెందిన వారు 19 మంది, యూరప్‌లో 15 మంది, ఆసియాలో 12 మంది ఈ తరహా ప్రయాణం చేసేందుకు ప్రయత్నించారు.
427 మీటర్ల ఎత్తు నుంచి తాజా ఘటనలో మృతి చెందిన వ్యక్తి కింద పడ్డాడు. లండన్‌లో విమానం నుంచి ఇలా పడిపోవడం ఇదే తొలిసారి కాదు. 2015 జూన్‌లో పశ్చిమ లండన్‌లోని ఒక కార్యాలయం భవనం మీద ఒక వ్యక్తి శవం కనిపించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి లండన్ వస్తూ 427 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం నుంచి పడి అతడు చనిపోయినట్లు తర్వాత తెలిసింది. అదే విమానంలో అతనితోపాటు ప్రయాణించిన మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
దీనికి మూడేళ్ల ముందు 2012 సెప్టెంబర్‌లో మొజాంబిక్‌కు చెందిన జోస్ మటడా అనే వ్యక్తి లండన్ వీధుల్లో శవమై కనిపించారు. అంగోలా నుంచి హీత్రూ విమానాశ్రయానికి వస్తున్న విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుంచి ఆయన జారిపడ్డారు. అదే ఏడాది దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరం నుంచి బయలుదేరిన విమానం హీత్రూ చేరుకున్న తర్వాత ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో వ్యక్తి మృతదేహం బయటపడింది. 2010లో 20 ఏళ్ల రొమేనియా వ్యక్తి వియన్నా నుంచి హీత్రూకు ఒక ప్రైవేటు విమానంలో అలాగే ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డారు.
దిల్లీ నుంచి లండన్ వెళ్లిన వ్యక్తి
1969 - క్యూబాలోని హవానా నుంచి మాడ్రిడ్‌కు ప్రయాణించిన 22 ఏళ్ల అర్మాండో సోకర్రాస్ రామిరెజ్ కొద్దిపాటి అనారోగ్యంతో బయటపడ్డారు. 1996 - భారత్‌కు చెందిన అన్నదమ్ములు పర్దీప్ సైనీ, విజయ్.. దిల్లీ నుంచి 10 గంటలపాటు రహస్యంగా ప్రయాణించి లండన్‌కు వెళ్లారు. 23 ఏళ్ల పర్దీప్ ప్రాణాలతో బయటపడ్డారు, హీత్రూ విమానాశ్రయం సమీపిస్తుండగా విమానం నుంచి జారిపడి విజయ్ మరణించారు. 2000 - ఫ్రాన్స్‌లోని తాహితి నుంచి అమెరికాలోని లాస్ ఏంజెలిస్ వరకు బోయింగ్ 747 విమానంలో 6,437 కిలోమీటర్లు ప్రయాణించి క్షేమంగా చేరుకున్నారు ఫిడెల్ మారుహి.
2002 - క్యూబా నుంచి కెనడాకు నాలుగు గంటల ప్రయాణం చేసిన 22 ఏళ్ల విక్టర్ అల్వారెజ్ మోలినా ప్రాణాలతో బయటపడ్డారు. 2014 - అమెరికాలోని హవాయ్ రాష్ట్రంలోని మావోయీ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్ వరకు బోయింగ్ 767 విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో 15 ఏళ్ల అబ్బాయి యాహ్యా అబ్ది ప్రయాణించారు.
తనిఖీలను ఎలా తప్పించుకుంటారు?
ప్రతి విమానం టేకాఫ్ అయ్యే ముందు విమానాశ్రయం గ్రౌండ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తారు. మరి, ఇలా గుట్టుగా ప్రయాణాలు చేసేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారు? "ఆ తనిఖీలు పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో విమానంలోకి చొరబడతారు. అందులోనూ, విమానాశ్రయంలో పనిచేసే నైపుణ్యం లేని సిబ్బంది కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. లేదా విమానాశ్రయంలో బాగా తెలిసిన సిబ్బంది ద్వారా వెళ్లేవారు మరికొందరు ఉంటారు. అలా ప్రయాణించడం ప్రమాదకరమని, గాలిలోనే చనిపోతామని వారికి అవగాహన ఉండదు" అని లర్న్‌మౌంట్ అంటున్నారు.