Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటక: కాంగ్రెస్ ఎక్కడ నెగ్గింది? బీజేపీ ఎక్కడ తగ్గింది?

Karnataka Election Result 2023
, శనివారం, 13 మే 2023 (23:19 IST)
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్‌కు 135 (మరో చోట లీడింగ్) , బీజేపీకి 65, జేడీ(ఎస్)కు 19 సీట్లు వచ్చాయి. మరో నాలుగు స్థానాల్లో ఇతరులు గెలిచారు.
 
తొలి నుంచే ఆధిక్యం
మే 10న పోలింగ్ జరగ్గా మే 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి నుంచే ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. లెక్కింపు మొదలైన గంటన్నరలోనే 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య అంతరం మొదట్లో కాస్త తక్కువగా కనిపించినా ఆ తరువాత ఆ గ్యాప్ పెరుగుతూ పోయింది. మధ్యాహ్నం కల్లా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది.
 
ఎవరు... ఎక్కడ... ఎలా?
విజయపుర, కొడగు, కలబురిగి, రాయచూరు, ధారవాడ, బళ్లారి, మైసూరు, తుముకూరు, మాండ్య, బెంగళూరు గ్రామీణం, యాదగిరి వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. కొడగు, బళ్లారిలో అయితే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణ కన్నడ, బెంగళూరు నగరం, బెళగావి జిల్లాల్లో బీజేపీ హవా కనిపించింది.
 
హైదరాబాద్-కర్ణాటక: బీదర్, కలబురిగి, యాదగిరి, రాయచూరు, కొప్పల్, విజయనగర, బళ్లారి జిల్లాలను హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో తెలుగు ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు.
 
టీవీ కన్నడ, న్యూస్-18 కన్నడల ప్రకారం... యాదగిరి(3/4), కలబురిగి(7/9), రాయచూరు(4/7), బళ్లారి(5/5) జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. కోస్తా కర్ణాటక: దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాలు ఉండే కోస్తాలో బీజేపీకి బాగా పట్టు ఉంది. మంగళూరు వంటి ప్రాంతాల్లో తరచూ మత ఘర్షణలు, మతం పేరుతో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఉడుపి(5/5), దక్షిణ కన్నడ(6/8) బీజేపీ హవా కనిపించగా ఉత్తర కన్నడలో కాంగ్రెస్(4/6) జోరు కనిపించింది.
 
పాత మైసూరు: మైసూరు(8/11), మాండ్య(5/7), చిక్‌మగుళూరు(5/5), చామరాజనగర్(3/4) జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం సంపాదించింది.
ముంబయి-కర్ణాటక: బెళగావి(11/18), ధారవాడ(4/7), విజయపుర(6/8), బగల్కోటె, గడగ(2/2), హవేరీ జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కనిపించింది.
 
తెలుగు ఓటర్ల తీర్పు
కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 6శాతం జనాభా తెలుగు వాళ్లే. బళ్లారి, కోలార్, రాయచూరు, తుముకూరు, చిత్రదుర్గ, యాదగిరి, బీదర్, కలబురిగి, బెంగళూరు(గ్రామీణ), బెంగళూరు(అర్బన్) జిల్లాల్లో తెలుగు వారి సంఖ్య ఎక్కువ. బెంగళూరు(అర్బన్)‌ తప్ప మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకుంది. ఆ లెక్కన చూస్తే తెలుగు ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. బెంగళూరు(అర్బన్)లో 28 సీట్లలో బీజేపీకి 15, కాంగ్రెస్‌కు 13 సీట్లు వచ్చాయి. 4 సీట్లున్న బెంగళూరు గ్రామీణంలోనూ 3 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి.
 
గాలి జనార్ధన్ రెడ్డి గెలుపు:
కొప్పల్ జిల్లాలోని గంగావతి ప్రాంతంలోనూ తెలుగు వాళ్లు ఎక్కువే. కొన్ని దశాబ్దాల కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి వెళ్లి స్థిరపడిన వారు ఉన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని స్థాపించిన గాలి జనార్ధన్ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేసి గెలిచారు. బళ్లారి సిటీ నుంచి పోటీ చేసిన ఆయన భార్య గెలవలేదు. ఒబుళాపురం మైనింగ్ కేసులో నిందితునిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి గతంలో బీజేపీ పార్టీలో చేరి కర్ణాటక మంత్రిగాను పని చేశారు.
 
గెలిచిన ప్రముఖులు:
బసవరాజు బొమ్మై-బీజేపీ
సిద్ధరామయ్య-కాంగ్రెస్
డీకే శివకుమార్-కాంగ్రెస్
హెచ్‌డీ కుమారస్వామి-జేడీ(ఎస్)
ప్రియాంక్ ఖర్గే-కాంగ్రెస్
గాలి జనార్ధన్ రెడ్డి-కేఆర్‌పీపీ
 
2018లో ఇలా...
2018లో కాంగ్రెస్‌కు 78 సీట్లు వచ్చాయి. ఈసారి 136 స్థానాల్లో అది గెలిచింది. అంటే 58 స్థానాలను అదనంగా దక్కించుకుంది.
 
బీజేపీకి 2018లో 104 సీట్లు రాగా ఈ సారి ఆ పార్టీ 64 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే 40 సీట్లను బీజేపీ పోగొట్టుకుంది.
 
ఇక జేడీ(ఎస్‌)కు 2018లో 37 సీట్లు వచ్చాయి. ఈసారి 20 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ.. 23శాతం ఉద్యోగాలు గోవిందా!