Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం ఎలా ఉంది... కొత్త ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి?

computers
, శనివారం, 13 మే 2023 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కాలేజీలలో కంప్యూటర్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఇంజినీరింగ్ అంటేనే కంప్యూటర్ ఇంజినీరింగ్ అనే స్థాయికి చేరిందనే వాదన కూడా ఉంది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలలో కలిపి మొత్తం 24,904 సీట్లు సీఎస్ఈలో ఉంటే 99 శాతం భర్తీ అయిపోయాయి. దాదాపుగా అన్ని సీట్లు తొలి విడత కౌన్సిలింగ్‌లోనే నిండిపోయాయి. అదే సమయంలో మెకానికల్ ఇంజినీరింగ్ 12,678 సీట్లు ఉంటే 4,760 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మెకానికల్ మాత్రమే కాదు, సివిల్, ట్రిపుల్-ఈ కూడా అంతే. వాటితో పోలిస్తే ఈసీఈ కొంత మెరుగ్గా ఉంది. సీఎస్ఈలో సీటు రానివారి ఈసీఈలో చేరడంతో ఆ కోర్సు కొంత నిండుతోంది.

మారుమూల ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి ప్రతిష్టాత్మక విట్ ఏపీ, ఎస్ఆర్ఎం సహా అన్ని కాలేజీల్లోనూ ఇదే రీతిలో ఉంది. దానికి కారణం సీఎస్ఈలో ఇంజినీరింగ్ పట్టా అందుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలనే ఆలోచన ఎక్కువ మందిలో ఉండడమే. మరి దానికి తగ్గట్టుగా ఏపీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయా? కంపెనీలు వస్తున్నాయా? ఐటీలో అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
 
ఎక్కువ ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ రంగంలోనే...
కంప్యూటర్ విద్య అభ్యసించి విదేశాల్లో స్థిరపడాలనే లక్ష్యంతో జీఆర్ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అత్యధికులు తెలుగువారే ఉన్నారని ఇటీవల అధికారిక లెక్కలు వెలువడ్డాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుంటూరు, విజయవాడ, విశాఖ నగరాల నుంచి జీఆర్ఈకి హాజరయ్యే వారి సంఖ్య దేశంలోనే టాప్ 10లో ఉన్నట్టు గుర్తించారు. ఏపీ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడుతున్న వారిలో అత్యధికులు ఐటీ రంగంలోనే ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో పనిచేస్తున్న వారిలో ఏపీకి చెందిన ఉద్యోగులు గణనీయంగా కనిపిస్తారు.
 
కరోనా లాక్‌డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పల్లెల్లో సాఫ్ట్‌వేర్ నిపుణుల సందడి కనిపించేది. కొన్ని గ్రామాల్లో చిన్నపాటి కంపెనీలను తలపించే స్థాయిలో ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి పనిచేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు రావడం దానికి కారణం. ఒకనాడు ఉద్యోగాలంటే టీచర్లు, పోలీస్ కానిస్టేబుల్ అన్నట్టుగా ఉన్న స్థితి నుంచి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ జాబ్‌లకు మళ్లింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐటీ, వాటి అనుబంధరంగాల్లో స్థిరపడాలనే ఆలోచన విస్తృతమయ్యింది.
 
స్థానికంగా ఉపాధి మాటేమిటి?
దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందిన ప్రాంతాలను గమనిస్తే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలలోనే ఈ రంగం కేంద్రీకృతమయ్యింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, నోయిడా వంటి నగరాలు దానికి ఉదాహరణ, అహ్మదాబాద్, కోచి వంటివి ఇటీవల ఎదుగుతున్న తీరు కూడా దీనికి అద్దంపడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అలాంటి పెద్ద నగరాల జాబితాలో విశాఖ మాత్రమే ఉంది. విశాఖలో ఐటీ అభివృద్ధి కోసం గతంలో కొంత ప్రయత్నం జరిగింది. టెక్ మహీంద్రా( అప్పట్లో సత్యం కంప్యూటర్స్) వంటి సంస్థలు టవర్స్ కట్టాయి. రిషికొండ ప్రాంతంలో ఐటీ పార్క్ అభివృద్ధికి కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో కంపెనీలు రాలేదు. దాంతో ఐటీలో ఉపాధి కోసం ఎగబడుతున్న అత్యధికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లక తప్పని స్థితి ఉంది.
 
"రాష్ట్రంలో ఐటీ కంపెనీలు నామమాత్రం. అక్కడక్కడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసినా అవన్నీ చాలా చిన్న సంస్థలు. ప్రముఖ సంస్థలు వస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. అవి నిజంగా ఆచరణ రూపం దాల్చితే ఇతర సంస్థల రాకకు అవకాశం ఉంటుంది. కానీ మెట్రోపాలిటన్ సిటీలకు బయట ఐటీ అభివృద్ధి అంత సులువు కాదు. అందుకే విశాఖను అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి రాయితీలు, తగిన చొరవ ఉంటే విశాఖలో ఐటీ ఇండస్ట్రీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టాలి" అని ఐటీ ఉద్యోగి కే శివ అభిప్రాయపడ్డారు. గతంలో కేవలం హైదరాబాద్ మీద కేంద్రీకరించి, విశాఖ మీద తగిన శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, ఇప్పటికైనా దాని మీద దృష్టి సారించాలని ఆయన బీబీసీతో అన్నారు.
 
ఏపీ ఎక్కడుంది?
రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు గడుస్తోంది. కానీ గుర్తించ దగ్గ స్థాయిలో ఐటీ అభివృద్ధి జరగలేదు. విశాఖ, అనంతపురం, తిరుపతిలను ఐటీ కాన్సెప్ట్ సిటీలుగా ప్రకటించారు. కానీ ఆచరణలో ఫలితాలు ఆశించినంతగా లేవు. విజయవాడ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి కొన్ని అడుగులు పడ్డాయి. కానీ లక్ష్యాలకు చేరలేదు. ఎలక్ట్రానిక్స్‌లో రాష్ట్రం ముందంజ వేస్తోంది. ముఖ్యంగా శ్రీ సిటీ కేంద్రంగా నెలకు 3.5 మిలియన్ల మొబైల్ ఫోన్లు, ఏడాదికి 3 మిలియన్ల టీవీ సెట్ల తయారీ సామర్థ్యం సాధించింది. కానీ ఐటీలో మాత్రం అదే మోతాదులో అభివృద్ధి లేదు. ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌లో అగ్రస్థానం సాధించడం, నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉండడం, జీఎస్టీడీపీలో మెరుగుదల వంటి వివిధ సానుకూలతలున్నట్టు చెబుతున్నప్పటికీ ఐటీ విస్తరణ మాత్రం జరగడం లేదు.
 
ఏపీలో ప్రస్తుతం 195 ఇంజినీరింగ్/ఎంసీఏ కాలేజీలున్నాయి. 18 ప్రభుత్వ యూనివర్సిటీలున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ లాంటి సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. ఏటా 51వేల మంది ఐటీ నిపుణులను సిద్ధంచేసే సామర్థ్యం ఉందని స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చెబుతోంది. ఇవన్నీ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పునాది అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్రంలో కొత్తగా 51 కంపెనీలు ఏర్పాటు కాగా మొత్తం రూ. 600 కోట్లకు పైగా విలువ చేసే ఎగుమతులు రాష్ట్రం నుంచి చేసినట్టు ఏపీ ఐటీ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 28,096 మందికి ఉపాధి దక్కినట్టు వార్షిక నివేదికలో పేర్కొంది. తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 2014లో 3,23,396 మంది ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 8,27,124కి పెరిగింది. దాంతో అక్కడితో పోలిస్తే ఐటీ రంగంలో ఏపీ సుదూరంలో ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
 
గత 9 ఏళ్లలో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఐటీ విస్తరించింది. 1990వ దశకం మధ్య నుంచి వేగంగా పెరిగింది. రాష్ట్ర విభజన నాటికి 2014లో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి రూ. 57,258 కోట్లుగా ఉంది. 2022 నాటికి అది రూ. లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని తెలంగాణ బడ్జెట్‌లో వెల్లడించారు. 2014 నాటికి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఎగుమతుల విలువ సుమారు రూ. 200 కోట్లుగా ఉండేది. గడిచిన 9 ఏళ్ల కాలంలో అది 2022 నాటికి రూ. 932 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 6వేల నుంచి 28వేలకు పెరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దాంతో అప్పుడూ, ఇప్పుడూ హైదరాబాద్ ఐటీ కేంద్రంగా ఉండగా, ఏపీలో ఐటీ విస్తరణ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.
 
పరిస్థితి మారుతుందా?
ప్రతీ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేతకలుంటాయి. ఏపీ కూడా లాజిస్టిక్స్, మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ వంటి రంగాల్లో తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోటీపడి ముందడుగు వేస్తోంది. పరిశ్రమల సంఖ్యలో కూడా ఏపీలో 16,924 ఉండగా తెలంగాణలో 15,274 మాత్రమే ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక (2023) చెబుతోంది. ఐటీలో కూడా ఏపీలో పరిస్థితి మారుతుందని, త్వరలోనే ప్రముఖ కంపెనీలు వస్తాయనే ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
 
"ఇటీవల పెట్టుబడుల సదస్సు జరిగింది. అనేక సంస్థలు ముందుకొచ్చాయి. అదానీ డేటా సెంటర్ నిర్మాణం మొదలవుతోంది. ఇన్ఫోసిస్ కూడా 3 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. హెచ్‌సీఎల్ లాంటి సంస్థలు కూడా విస్తరిస్తున్నాయి. ఇతర కంపెనీలు కూడా వస్తాయి. ఐటీ పాలసీ కూడా రూపొందించాం. పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. అనేక ఆటంకాలున్నప్పటికీ రాష్ట్రంలో కూడా ఐటీ విస్తరిస్తుంది. విశాఖ కేంద్రంగా ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటాం. టైర్ 2, 3 సిటీల మీద కొన్ని కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడుతున్నాం" అని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న వనరులను వినియోగించుకుని రాష్ట్రం పురోగతి సాధిస్తోందని, ఐటీ పాలసీకి అనుగుణంగా పెట్టుబడులు వస్తాయని ఆయన తెలిపారు.
 
చాలా కృషి చేయాలి
ఏపీలో ఐటీ అభివృద్ధి అంత సలువు కాదని ఐటీ నిపుణులు అంటున్నారు. దానికి చాలా ప్రయత్నాలు జరగాల్సి ఉంటుందని విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ యజమాని గద్దె వీరేశ్ అన్నారు. "ఐటీ పాలసీ ప్రకటించి రెండేళ్లు దాటింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి అంత సానుకూలత లేదు. పెద్ద కంపెనీలు కూడా విస్తరణ, నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీలో ఐటీ అభివృద్ధికి తక్షణమే ఫలితం దక్కుతుందని చెప్పలేం. ప్రభుత్వాలు పట్టువిడవకుండా ప్రయత్నాలు కొనసాగించాలి. కంపెనీలకు రాయితీల విషయంలో ఉదారంగా ఉండాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ కంపెనీలు టైర్ 2 సిటీల వైపు దృష్టి పెడుతున్న తరుణంలో విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో శిక్షణ పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ఉపాధి స్థానికంగా దక్కాలంటే సుదీర్ఘకాలం పడుతుందని వీరేశ్ బీబీసీతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ప్రధాని మోదీ ఓడిపోయారు..