Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడప జిల్లా : 16 ఏళ్ల బాలికపై పెట్రోల్ దాడి... ఈ కేసులో అసలేం జరిగింది..?

image

బిబిసి

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:05 IST)
హెచ్చరిక: ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉంటాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఓ 16 ఏళ్ల బాలికకు నిప్పు పెట్టడం సంచలనంగా మారింది. కడప జిల్లా బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న 16 ఏళ్ల బాలిక, 19వ తేదీన బద్వేలు సమీపంలో కాలిన గాయాలతో కేకలు వేయడంతో అక్కడ పొలాల్లో పని చేసేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ బాలికను ముందుగా బద్వేలు కమ్యూనిటి ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. ‘‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ’’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'ఎక్స్' వేదికగా విమర్శించారు.
 
ఏం జరిగింది?
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం, ‘‘బద్వేలుకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికకు, విఘ్నేష్ (19) అనే యువకుడితో గత 5 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కొంత కాలంగా వారు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కడపలోని ఓ హోటల్‌లో విఘ్నేష్ పని చేస్తూ ఉండేవాడు. ఆరు నెలల కిందట విఘ్నేష్‌కు మరో యువతితో పెళ్లి జరిగింది. ఆ యువతిని కూడా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, పెళ్లి తర్వాత కూడా మైనర్ బాలికతో సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు’’
 
‘‘సూసైడ్ చేసుకుంటా…’’
‘‘ఆ బాలిక బద్వేలు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. విఘ్నేష్ శుక్రవారం రాత్రి బాలికకు ఫోన్ చేసి శనివారం నాడు కలవాలని కోరాడు. కలవకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతా అని అన్నాడు. అలా ఉదయం ఇద్దరు కలిసి గోపవరం మండలంలోని పి.పి. కుంట సమీపంలో సెంచురీ ప్యానెల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఆమెతో శారీరకంగా కలిసిన తర్వాత, అతని వివాహం గురించి బాలిక అడగడంతో, వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెను కిందకు నెట్టి‌ పైన పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో, ఆ బాలిక మంటల్లో కాలుతూ సాయం కోసం కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అక్కడి నుంచి విఘ్నేష్ పరారయ్యాడు.’’ అని పోలీసులు తెలిపారు.
 
పథకం ప్రకారమే మైనర్ బాలికను విఘ్నేష్ చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమె నుంచి తప్పించుకోవడానికి ఈ పథకం వేశాడు. కడప నుంచి బద్వే‌లుకు బైక్‌పై వస్తూ దారిలో అలంఖాన్‌పల్లి సమీపంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో విఘ్నేష్ తన బైక్‌‌లో పెట్రోల్‌ పట్టించుకున్నాడు. తరువాత తన బైక్ ట్యాంక్‌ పైపు నుంచి ఒక బాటిల్‌లోకి పెట్రోల్ పట్టుకున్నాడు. దానిని తన బ్యాగ్‌లో పెట్టుకొని ఆమెను కలుసుకుని ఇద్దరూ కలసి పీపీ కుంట సమీపంలోని అడవిలోకి వెళ్లారు’’ అని ఎస్పీ తెలిపారు.
 
సీఎం సీరియస్..
ఈ దాడిలో బాలిక శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. బాలిక వాంగ్మూలం సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులు బృందాలుగా విడిపోయి విఘ్నేష్‌ను పట్టుకున్నారు. తన కూతురిని చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. అయితే, ఘటన జరిగిన రోజు బాధితురాలు మీడియాతో మాట్లాడిన మాటలు, పోలీసులు చెబుతున్న వాటికి పొంతన కుదరడంలేదు. చున్నీకి నిప్పు పెట్టాడని బాధితురాలు చెబుతున్నారు. పెట్రోల్ పోసినట్టు చెప్పడంలేదు. అయితే, చట్టానికి దొరక్కుండా ఉండేందుకు నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు అంటున్నారు.
 
‘‘అక్టోబర్ 19న పెట్రోల్ బంక్ వద్ద నిందితుడు ఉన్నట్లు నిర్ధారించే సీసీటీవీ ఫుటేజీతో సహా క్లిష్టమైన శాస్త్రీయ ఆధారాలు సేకరించాం. నిందితుడు నేరానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్, ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను ఘటనా స్థలం నుంచి సేకరించాం. నిందితుడు విఘ్నేష్ పథకం ప్రకారమే నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది" అని ఎస్పీ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. "నిందితుడు తన మొబైల్‌ను కడపలోనే ఉంచి, తన భార్య మొబైల్ ఫోన్‌ వాడాడు. తనను గుర్తించకుండా ఉండేందుకు తన భార్య మొబైల్ ఫోన్‌లోని కాల్ డేటాను తొలగించినట్లుగా గుర్తించాం’’ అని ఎస్పీ చెప్పారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడి దుస్తులతో పాటు బాలిక దుస్తులు, పుస్తకాలు ఉన్న బ్యాగు, సగం కాలిన ఒక ఖాళీ పెట్రోల్ బాటిల్, నిందితుడు తాగి పడేసిన సిగరెట్ పీకను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
 
సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టు
కడప నగర శివార్లలోని డీటీసీ సమీపంలో బద్వేలు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ‘‘త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు ఈ కేసు సిఫార్సు చేస్తాం. నిందితుడికి వెంటనే శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నాం’’ అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతిసారం బాధితులకు పవన్ రూ. 10 లక్షల సాయం: అద్భుత నాయకుడు అంటూ ప్రశంస