Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీకి జగన్ లేఖ: విశాఖ ఉక్కు కోసం అఖిలపక్షంతో వస్తాను, అపాయింట్‌మెంట్ ఇవ్వండి - Newsreel

మోదీకి జగన్ లేఖ: విశాఖ ఉక్కు కోసం అఖిలపక్షంతో వస్తాను, అపాయింట్‌మెంట్ ఇవ్వండి - Newsreel
, మంగళవారం, 9 మార్చి 2021 (17:48 IST)
విశాఖ ఉక్కులో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో స్పష్టం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అఖిల పక్షంతో కలిసి వస్తానని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తమకు ఉన్న ఆందోళనలను నేరుగా వచ్చి చెబుతామని, అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ ఆ లేఖలో కోరారు.

 
తాజా లేఖలో ఆయన తాను గతంలో(ఈ ఏడాది ఫిబ్రవరి 6న) లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ అందులో పేర్కొన్న అంశాలను మరోసారి ప్రస్తావించారు. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) ఎదుర్కొంటున్న సమస్యలను ఆ లేఖలో స్పష్టంగా తెలియజెప్పానని.. ఆ సంస్థ కోలుకునేలా చేయడానికి వివిధ పరిష్కార మార్గాలూ చూపుతూ 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరానని జగన్ తన తాజా లేఖలో గుర్తు చేశారు.

 
లేఖలో ఏముందంటే..
''ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణ ఆవశ్యకత, ఆ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న సెంటిమెంటును మరోసారి మీ దృష్టికి తెస్తున్నాను. సంస్థ ఆర్థికంగా కోలుకుని, తిరిగి సుస్థిరత సాధించేలా చేయడానికి వివిధ ప్రత్యామ్నాయాలున్నాయి. 2002-2015 మధ్య ప్లాంట్ మంచి పనితీరు కనబరిచి లాభాలు ఆర్జించింది. సంస్థకు 19,700 ఎకరాల భూములున్నాయి.. వాటి విలువే లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది.

 
సొంతంగా కేప్టివ్ మైన్స్ లేకపోవడమన్నది సంస్థ లాభాల సాధనకు ఆటంకంగా ఉంది. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు కేంద్రం నుంచి మద్దతు కనుక అందిస్తే సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించొచ్చు. సంస్థకు గనులను కేటాయించడం, ఇన్‌పుట్ వ్యయం తగ్గించే చర్యలు చేపట్టడం, అధిక వడ్డీ అప్పులను తక్కువ వడ్డీ అప్పులతో తీర్చేలా సహకరించడం, భూముల విక్రయంతో రుణాలను ఈక్విటీగా మార్చడం వంటి చర్యలతో వంటి మార్గాలను పరిశీలించొచ్చు.

 
ఇవన్నీ నేరుగా మీకు వివరించేందుకు కార్మిక సంఘాలు సహా అన్ని పార్టీల ప్రతినిధులతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. వీలైనంత వేగంగా అపాయింట్‌మెంట్ ఇవ్వగలరు'' అని ముఖ్యమంత్రి జగన్ ఆ లేఖలో కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి పేరుతో లోబరుచుకున్నాడు, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా