Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?

Advertiesment
Jagan
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (19:44 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వవస్థీకరణకు అంతా సిద్ధమయ్యింది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరబోతోంది. ఆరోజు ఏపీ సచివాలయం వేదికగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గవర్నర్‌ని ఆహ్వానించేందుకు బుధవారం సాయంత్రం భేటీ కాబోతున్నారు. తొలగించబోతున్న మంత్రుల వివరాలు, కొత్త మంత్రివర్గం పేర్లు సమర్పించే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది.


ఏది జరిగినా ఏపీలో ప్రస్తుత మంత్రుల్లో దాదాపుగా వైదొలగడం ఖాయంగా ఉంది. వివిధ సమీకరణాల రీత్యా ఒకరిద్దరికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన చేసిన ప్రకటనను బట్టి సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మంత్రులంతా దాదాపుగా రాజీనామాలు సమర్పించాల్సి ఉంటుంది.

 
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయడం ఇది రెండోసారి అవుతుంది. ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఉండగా, ఎన్నికలకు సుదూర సమయంలో మంత్రివర్గమంతా రాజీనామా చేసిన చరిత్ర ఎన్టీఆర్ హయంలో జరిగింది. అయితే అప్పట్లో ఆయన తన క్యాబినెట్ సహచరులందరినీ భర్తరఫ్ చేసేందుకు రాజీనామాలు తీసుకున్నారు. 1985లో రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్దికాలానికి మారిన రాజకీయ పరిణామాల్లో ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనమయ్యింది. 1989లో ఎన్నికలకు వెళ్లేందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 
ఇప్పుడు మాత్రం దానికి కొంచెం భిన్నం. జగన్ తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల పాటు మాత్రమే ఉంచుతామని మొదటే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా దాదాపు మూడేళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో ఇప్పుడు మంత్రుల రాజీనామాలు తీసుకోబోతున్నారు. ఈ సారి బర్తరఫ్ కోసం కాకుండా పునర్వవస్థీకరణ కోసం ఇలా జరుగుతోంది. దాంతో దాదాపుగా మంత్రులంతా రాజీనామా చేయడం ఏపీలో రెండోసారి అనుకున్నా, కేవలం పునర్వవస్థీకరణ కోసమే రాజీనామాలు చేయించడం ఇదే తొలిసారి. అది కూడా గతంలోనే ప్రకటించి చేయడం కూడా విశేషం.

 
ఎవరిని కొనసాగిస్తారు?
సీఎం జగన్ ప్రకటించినట్టుగా వివిధ సమీకరణాల రీత్యా ఒకరిద్దరు కొనసాగడం ఖాయంగా భావించవచ్చు. ఆ జాబితాలో ఎవరుంటారనే దానిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో సీఎం జగన్‌తో పాటుగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, మరో 19 మంది మంత్రులున్నారు. నిబంధనల ప్రకారం 25 మంది మంత్రులకి అవకాశం ఉంటుంది. గత నెలలో మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఒక్క స్థానం ఖాళీ అయ్యింది. వీరిలో ఇద్దరిని 2020లో తీసుకున్నారు. వారిలో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు ఉన్నారు.

 
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపులు, ముగ్గరు రెడ్లు, ఒకరు ఎస్టీ, ఒక క్షత్రియ, ఒక కమ్మ, ఒక వైశ్య, ఒక మైనార్టీ ఉన్నారు. మిగిలిన వారు బీసీలు. వారిలో మత్స్యకార, శెట్టిబలిజ, బోయ, కురుబ, యాదవ, తూర్పు కాపు, పోలినాటి వెలమ ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో కూడా కుల సమీకరణాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. బీసీ, ఎస్సీలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని కూడా ఆయన ప్రకటించారు.

 
తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగా తన టీమ్‌ని ఎంపిక చేయబోతున్న తరుణంలో దానికి అనుగుణంగా వివిధ సమీకరణాలకు ప్రాధాన్యతనివ్వడం ఖాయంగా చెప్పవచ్చు. అందులో భాగంగా బీసీ, ఎస్సీలకు బెర్తులు పెరుగుతాయని సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న మంత్రుల్లో కొనసాగించే నాయకుల విషయంలో కూడా ఈ సమీకరణాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. దాంతో బీసీ కులస్తులకే అవకాశం ఉంటుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ప్రధాన బీసీ కులం బోయ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా గోదావరి జిల్లాల్లో కీలకమైన శెట్టిబలిజ కులస్తుడు చెల్లుబోయిన వేణు ఉన్నారు. ఆయా కులాల నుంచి ఈ ఇద్దరే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారికి కొనసాగింపు ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో సీనియారిటీ ప్రాతిపదికన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ వంటి వారి పేర్లతో పాటుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా కొనసాగేవారిలో జాబితాలో ఉండొచ్చనే ఊహాగానాలున్నాయి.

 
కొత్త జిల్లాల లెక్కన సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య రెట్టింపయ్యింది. 26 జిల్లాలుగా మారింది. దాంతో 25 మంది మంత్రులను ఎంపిక చేయాల్సిన తరుణంలో ఏదో ఒక జిల్లాకి అవకాశం కష్టమవుతుంది. అదే సమయంలో కుల సమీకరణాలకు తోడుగా ప్రాంతీయ సమీకరణాలు కూడా సరితూగాలంటే మరికొంత సమస్య అవుతుంది. ప్రస్తుత మంత్రుల్లో కోనసీమ, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. అదే సమయంలో తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దాంతో కొత్త మంత్రివర్గ కూర్పులో ఏ ఏ జిల్లాలకు అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరం. కులాల వారీ సమీకరణాల రీత్యా ఒకటి రెండు జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. దాంతో రెండు లేదా మూడు జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కష్టమే అవుతుందనే అభిప్రాయం ఉంది.

 
ఆశావాహుల జాబితా పెద్దదే..
జగన్ మంత్రివర్గంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈసారి క్యాబినెట్లో జూనియర్, సీనియర్ అనే దానితో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చాయి. తొలిసారి గెలిచిన వారు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. వయసులో మూడు పదుల వారు కూడా సుదీర్ఘ అనుభవం కలిగిన వారిని కాదని బెర్త్ దక్కించుకున్నారు. దాంతో కొత్త మంత్రుల విషయంలో కూడా అనుభవం ప్రాతిపదికన ఉంటుందా లేదా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఎన్నికల వేళ అవసరాలు, ఈ కాలంలో ఎదురయిన అనుభవాలతో సీనియర్లకు ఛాన్స్ వస్తుందనే వాదన బలంగా ఉంది. దానికి తగ్గట్టుగా సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.

 
ఆరంభం నుంచి జగన్ వెంట ఉన్న నాయకుల్లో ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి సీనియర్లు సైతం ఆశావాహుల జాబితాలో ఉన్నారు. వీరంతా తొలి మంత్రివర్గంలోనే తమకు అవకాశం ఉంటుందని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత రోజా, రాంబాబు వంటి వారికి వివిధ పదవులు కట్టబెట్టారు. ఆశావాహుల జాబితాలో రెడ్డి కులస్తుల సంఖ్య పెద్దదే ఉన్నప్పటికీ ముగ్గురు లేదా నలుగురికి మించి ఉండదు. అందులో ఇప్పుడున్న వారిలో పెద్దిరెడ్డి, బుగ్గన, బాలినేనిలో ఏ ఒక్కరికి కొనసాగింపు దక్కినా కొత్త వారి అవకాశాలు మరింత తగ్గిపోతాయి. దాంతో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటి ఆరేసి దఫాలు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారి ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.

 
వారితో పాటుగా రెడ్డి కులస్తులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వారు సైతం ఆశావాహుల్లో ఉన్నారు. మైనార్టీల నుంచి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా అంజాద్ భాషా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఆ స్థానంలో హఫీజ్ ఖాన్ (కర్నూలు) , ముస్తాఫా( గుంటూరు తూర్పు) వంటి వారు సీటు ఆశిస్తున్నారు.

 
కాపు కోటాలో ప్రస్తుత నలుగురు మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబుని కూడా తొలగిస్తే కొత్తగా అనకాపల్లి జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్ లేదా కరణం ధర్మశ్రీ, కాకినాడ జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, తూగో జిల్లా నుంచి జక్కంపూడి రాజా, పగో జిల్లా నుంచి గ్రంధి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి సామినేని ఉదయభాను వంటి వారి పేర్లు ప్రబలంగా వినిపిస్తున్నాయి. వైశ్య కులానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో అన్నే రాంబాబు(గిద్దలూరు) లేదా కోలగట్ల వీరభద్రస్వామి( విజయనగరం) కి ఛాన్స్ ఉండొచ్చు.

 
క్షత్రియ కోటాలో చెరుకువాడ శ్రీరంగనాధ రాజు స్థానంలో అదే జిల్లా నుంచి ముదునూరు ప్రసాదరాజు(నరసాపురం) పేరు వినిపిస్తోంది. బ్రాహ్మణలకు అవకాశం కల్పిస్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి(బాపట్ల) లేదా మల్లాది విష్ణు(విజయవాడ సెంట్రల్)కి ఛాన్స్ వస్తుంది. కమ్మ కులస్తుల్లో కొడాలి నానిని తప్పిస్తే ఎమ్మెల్సీగా ఉన్న తలశిల రఘురాం లేదా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (ఎన్టీఆర్ జిల్లా)తో పాటుగా అబ్బయ్య చౌదరి (దెందులూరు) పేర్లు వినిపిస్తున్నాయి.

 
తూర్పు కాపు నేత బొత్స సత్యన్నారాయణ వైదొలగాల్సి వస్తే ఆయన స్థానంలో అదే కుటుంబం నుంచి బొత్స అప్పన నర్సయ్య గానీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి గానీ ఛాన్స్ ఉంటుంది. బీసీ వెలమల నుంచి ధర్మాన కృష్ణదాస్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకి అవకాశం ఉండొచ్చని కృష్ణదాస్ స్వయంగా ప్రకటించడం విశేషం.

 
ఎస్సీ నాయకుల్లో ప్రస్తుతమున్న నారాయణ స్వామి, విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనితతో పాటుగా ఆదిమూలపు సురేష్‌ని కూడా తొలగిస్తే కొత్తగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేపూడి చిట్టిబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, నందిగామ ఎమ్మెల్యే ఎం జగన్మోహన్ రావు, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎస్ ఎన్ పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రస్తుతం విప్‌గా ఉన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే కే. శ్రీనివాసులు వంటి వారు రేసులో ఉంటారు.

 
బీసీలలో యాదవ కులస్తుడు అనిల్ కుమార్ స్థానంలో పెనమలూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ కే పార్థసారధి లేదా తణుకు ఎమ్మెల్యే కే నాగేశ్వరరావులో ఒకరికి ఛాన్స్ ఉంటుందని సమాచారం. శెట్టిబలిజ వేణుని తొలగిస్తే ఆయన స్థానంలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ (గౌడ్)కి అవకాశం దక్కుతుంది. కురుబ కులస్తుడు శంకర నారాయణ (పెనుగొండ) స్థానంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు.

 
మత్స్యకార కులం నుంచి సీదిరి అప్పలరాజుని తొలగిస్తే కోనసీమ జిల్లా నుంచి పొన్నాడ సతీష్(ముమ్మిడివరం) ముందుకొస్తారు. కాళింగ కులానికి చోటు కల్పించాలని భావిస్తే స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం రేసులోకి వస్తారు. ఎస్టీల నుంచి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీ వాణీ స్థానంలో అదే జిల్లాకు చెందిన విశ్వసరాయి కళావతి( పాలకొండ), పి రాజన్నదొర( సాలూరు) ఆశావాహులుగా ఉన్నారు. వారితో పాటుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా రేసులో ఉన్నారు. వీరితో పాటుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని (రజక), రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(లింగాయత్) వంటి వారు సైతం జగన్ మీద ఆశాభావంతో ఉన్నారు.

 
శాసన మండలి నుంచి..
వీరితో పాటుగా మండలి నుంచి గతంలో జగన్ తొలుత ఇద్దరికి అవకాశం ఇచ్చారు. మూడు రాజధానుల చట్టాలకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో మండలి రద్దు ప్రతిపాదన చేసిన జగన్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఇద్దరు నేతలను రాజ్యసభకు పంపించారు. వారిలో పిల్లి సుభాష్‌ చంద్రోబోస్, మోపిదేవి వెంకట రమణ ఉండగా వారి కులాలకే చెందిన వేణు, అప్పల రాజుకి క్యాబినెట్లో చోటు దక్కింది.

 
ప్రస్తుతం మండలి రద్దు ప్రతిపాదన ఉపసంహరించుకున్న తరుణంలో ఎమ్మెల్సీలుగా ఉన్న నేతలు కొందరు మంత్రిమండలి ఆశావాహుల్లో ఉన్నారు. వారిలో దువ్వాడ శ్రీనివాస్ (కాళింగ), సి రామచంద్రయ్య (బలిజ), తోట త్రిమూర్తులు(కాపు), పండుల రవీంద్రబాబు(ఎస్సీ)తో పాటుగా తలశిల రఘురాం(కమ్మ) పేరు కూడా వినిపిస్తోంది. మండలి నుంచి కూడా చోటివ్వాలని జగన్ భావిస్తే వీరిలో ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.

 
మంత్రివర్గం లేకుండానే పాలన.. ఎన్టీఆర్ కాలంలో ఏం జరిగందంటే..
"ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో బడ్జెట్ వివరాలు లీకయ్యాయి. దాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రివర్గ సహచరులే వాటిని పత్రికలకు అందించారని అనుమానించారు. దాంతో తన క్యాబినెట్ అంతా పిలిచి రాజీనామాలు తీసుకున్నారు. గవర్నర్‌కి సమర్పించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు మంత్రివర్గం లేకుండానే పాలన సాగింది. దాదాపు నెల రోజులకు పైగా కేవలం సీఎం మాత్రమే ఉన్నారు. అదో ప్రత్యేకమైన అనుభవం. ఇప్పుడు జరుగుతున్నది దానికి భిన్నం. కానీ ఈసారి కూడా మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది కూడా జగన్ మొదటే చెప్పి చేస్తున్నారు కాబట్టి పెద్ద విచిత్రం లేదు. అయినా ఇలా మంత్రులందరితో దాదాపుగా రాజీనామాలు తీసుకోవడం మాత్రం అరుదైన విషయమే." అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి.

 
నాలుగేళ్ల క్రితం కేసీఆర్ కూడా తన మంత్రివర్గంలో కేవలం డిప్యూటీ సీఎంగా మహమ్మద్ అలీని మాత్రమే తీసుకుని నెల రోజులు పాలన సాగించిన అనుభవం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి నిర్ణయానుసారం ఉంటుంది కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయని ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రోటోకాల్ గురించి సీఎస్‌కు తెలియదా.. ఇగో మనిషిని కాదు : గవర్నర్ తమిళిసై