Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?

Advertiesment
కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
, సోమవారం, 4 మే 2020 (14:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మార్పు రాబోతోందనే సంకేతాలు ఇచ్చారు. కొన్నిరోజుల క్రితం ఆయన దేశ సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కరోనా సంక్షోభం నుంచే ఒక కొత్త సందేశం ఇచ్చారు. ఒక కొత్త దిశను చూపించారు.

 
“ఒక విధంగా ఆ దారిలో నడవాలని మాకు మార్గనిర్దేశం చేశారు”. తర్వాత ఆయన “ఆ దారి ఏది, ఆ దిశ ఏది” అని నాటకీయ ధోరణితో ప్రశ్నిస్తారు. దానికి జవాబు స్వయంగా ఆయనే చెబుతారు. "ఈ కరోనా సంక్షోభ సమయంలో మనం స్వావలంబన సాధించి తీరాలనేది తెలుసుకున్నాం” అంటారు.

 
స్వావలంబన అంటే మామూలు విషయం కాదు, చాలా భావవ్యక్తీకరణ ఉన్న పదం. ఆయన తర్వాత “భారత్‌లో ఈ ఆలోచన శతాబ్దాల నుంచి ఉంది. కానీ మారుతున్న పరిస్థితులు ఇప్పుడు మనం స్వావలంబన సాధించాలనే విషయాన్ని మరోసారి దాన్ని గుర్తుచేశాయి. స్వావలంబన సాధించండి, స్వావలంబన సాధించండి” అంటారు.

 
స్వావలంబన గురించి ఆయన ఎంత నొక్కి చెప్పారంటే, దానిని బట్టి ఆయన ఆలోచన అవగతం అవుతుంది. అంతకు ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా “కరోనా సంక్షోభం తర్వాత వ్యవస్థ ఎలా ఉండాలి అనేదాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది” అన్నారు.

 
ఆయన దాని గురించి తన అభిప్రాయం చెప్పారు. “పాలన, పరిపాలన, సమాజం” సహకారంతో భారత్‌కు స్వావలంబన, స్వదేశీ అవసరమని నొక్కి చెప్పారు. స్వదేశీ ఆలోచనను ప్రోత్సహించిన భగవత్, “మన దగ్గర విదేశాల నుంచి ఏం వస్తున్నాయి? మనం వాటిపై ఆధారపడకూడదు. మన వస్తువులను మనం స్వయంగా ఉత్పత్తి చేసుకోవాలి, వాటిని మనమే ఉపయోగించాలి” అన్నారు. స్వదేశీ ఆలోచనను వ్యక్తిగత స్థాయి నుంచి కుటుంబం వరకూ అంతర్గతంగా అవలంబించాలి.

 
మహమ్మారి మొదలైన కొన్ని రోజుల్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ “దేశంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ నిర్మించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు స్వదేశీ పరిశ్రమలు ఎక్కువ స్వావలంబన సాధించాలని, జాతీయవాద స్ఫూర్తిని కూడగట్టాలని భావించారు. జాతీయత, స్వావలంబనను పెంచే స్ఫూర్తితో పరిశ్రమలు పనిచేయాలని గోయల్ అన్నారు.

 
ఒకే ఆలోచనలో ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్
స్వావలంబన, స్వదేశీ ఆలోచనల గురించి ప్రభుత్వం, అధికార బీజేపీ వారి సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. స్వదేశీ అనేది రైట్ వింగ్ ఒక ముఖ్యమైన లక్ష్యం. కరోనా సంక్షోభం ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్లకు ఒక అవకాశం ఇచ్చినట్లు అనిపిస్తోంది.

 
మహమ్మారి తర్వాత ప్రపంచంలో అన్ని పెద్ద దేశాలు స్వదేశీ ఉత్పత్తులను బలోపేతం చేయడంపై దృష్టిపెడతాయని, గ్లోబలైజేషన్ స్థానంలో ఒక అంతర్గత మార్కెట్‌ను ప్రోత్సహిస్తాయని, తమ కంపెనీలకు బయటి కంపెనీలనుంచి ఎదురయ్యే పోటీ నుంచి భద్రత కల్పిస్తాయని చాలామంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

 
“ఆర్థిక జాతీయవాదం అన్ని దేశాల్లో వస్తుంది. ఆర్థికవ్యవస్థ దిశ గురించి మళ్లీ ఆలోచిస్తున్నారు అనేది నాకు సంతోషంగా ఉంది. మేం ఏళ్ల నుంచీ స్వావలంబన, స్వదేశీ మోడల్‌ను సమర్థిస్తూ వస్తున్నాం” అని ఆరెస్సెస్‌కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ అరుణ్ ఓఝా చెప్పారు.

 
స్వదేశీ భారత్ ఒక దృష్టి
ఇప్పటి భారత యువతకు 70, 80 శతాబ్దంలో భారత ఆర్థికవ్యవస్థ ఈనాటి ఆధునిక ఆర్థికవ్యవస్థ కంటే ఎంతో భిన్నంగా ఉండేదని బహుశా తెలిసుండదు. అందులో నెహ్రూ సోషలిజం, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ ప్రభావం చాలా ఉంది. స్వదేశీ అనేది దేశ ఆర్థికవ్యవస్థ మంత్రంలా ఉండేది. అది స్వావలంభన, దాని అమలు, దేశీయ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వాటి నాణ్యత తక్కువగా, ధర ఎక్కువగా ఉండేది. బయట నుంచి వచ్చే విదేశీ వస్తువుల యజమానులను చాలా ప్రశంసనీయంగా చూసేవారు.

 
ప్రభుత్వ జోక్యం, కంట్రోల్ ప్రతి చోటా కనిపించేది. అప్పటి పాలనను ‘లైసెన్స్ రాజ్యం’, కోటా పర్మిట్ రాజ్యం’ అనేవారంటే దానికి అదే కారణం. అప్పట్లో, సామాన్యులకు లండన్ చాలా దూరంగా ఉండేది. విదేశీ పర్యటనలు డబ్బున్న వాళ్లకు, దేశంలోని ఉన్నతాదాయ వర్గాల కోసమే ఉండేవి. ఎవరైనా విదేశాలకు 500 డాలర్లు మాత్రమే తీసుకెళ్లాలి. అంబాసిడర్, ఫియట్ కార్లు స్వదేశీ కార్లు. ఆ తర్వాత విదేశాల కోసం భారత్ తన మార్కెట్‌ను తెరిచినప్పుడు 1991 చారిత్రక సంవత్సరంగా నిలిచిపోయింది.

 
అత్యంత కఠిన నిర్ణయాలలో ఈ ఆధునిక భారత్ ఒకటి. అప్పట్లో, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగే ఏదైనా విదేశీ కంపెనీ దేశాన్ని మళ్లీ బానిసలుగా మార్చుకుంటుందేమో అని ప్రజల్లో భయం ఏర్పడింది. దానికి ఒక మైండ్‌సెట్ పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది.

 
మైండ్‌సెట్ మార్చడంతో విదేశీ టెక్నాలజీ వచ్చింది. ఆధునికీకరణ జరిగింది. పాత ఉద్యోగాలు పోయాయి. కొత్త అవకాశాలు వచ్చాయి. మారుతీ-సుజుకీ తయారీ జరిగింది. విశాలంగా ఉన్న రోడ్లపై విదేశీ కార్లు దూసుకువెళ్లడం మొదలైంది. కొత్త ఫ్యాక్టరీలు వచ్చాయి. వివిధ రంగాల్లో విదేశీ వస్తువులు రావడం మొదలైంది. వాటి క్వాలిటీ స్వదేశీ వస్తువుల కంటే మెరుగ్గా, ధర తక్కువ ఉండడం కనిపించింది. దాంతో స్థానిక కంపెనీలు స్వయంగా మారడమో లేదంటే తమ వ్యాపారాలు మూసేయడమో జరిగింది.

 
భారత్ 1991లో మొదలుపెట్టిన, ఇదే విధానాన్ని చైనా 1978లో ప్రారంభించింది. అప్పుడు చైనీయులు తమ దేశాన్ని ఒక ‘గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌’గా మార్చేశారు. ప్రపంచంలోని ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు చైనాకు వచ్చి తమ ఫ్యాక్టరీలు తెరిచాయి. పేదరికంలో ఉన్న కోట్లాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు అమెరికా తర్వాత చైనా ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా నిలిచేలా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంది.

 
ఇటు, భారత్‌లో ఆ పని అసంపూర్తిగా మిగిలిపోయింది. ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. దేశంలో జనం దారిద్ర్యరేఖకు ఎగువకు కూడా వచ్చారు. ప్రాథమిక ఆరోగ్య సంక్షేమ రంగంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ఐటీ రంగంలో అభివృద్ధి జరిగింది. భారత్ దానికి ఒక పెద్ద కోటలా మారింది. కానీ నైపుణ్యం ఉన్న వారంతా భారీగా అమెరికా, యూరప్ వెళ్లిపోయారు.

 
స్వదేశీనే కానీ ముందులా కాదు
స్వదేశీ మోడల్ తిరిగి రావడం వల్ల, అది మనల్ని మరోసారి వృద్ధి రేటు రెండు, రెండున్నర శాతం ఉంటూ వచ్చిన 70, 80 దశకాలకు తీసుకెళ్తుందా. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్ స్టీవ్ హైక్ అది భారత్‌ను పంచవర్ష ప్రణాళికలు ఉన్నప్పటి ఆర్థికవ్యవస్థ వైపు నెట్టేస్తుందని, అందులో దేశం వృద్ధి రేటు సగం అయిపోతుందని అన్నారు.

 
అమెరికాలో ఎన్నో ఏళ్లపాటు పనిచేసి తిరిగి ముంబయి వచ్చిన రంజితా పరాడ్కర్ ఆధునిక భారతదేశంలోనే పుట్టారు. “అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ వివాదాస్పదం. అది ఒక రాజకీయ స్లోగన్. స్వావలంబన ఒక ప్రశంసనీయమైన చర్య. కానీ అది అధికార పార్టీని రాజకీయ అజెండాకు దూరంగా ఉంచేయవచ్చు” అన్నారు.

 
‘స్వదేశీ’ పాత మోడల్ నడవదు అని ఆమె చెబుతున్నారు. “ఎందుకంటే అది ఎప్పుడూ విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా ఉంది. దేశంలో వస్తువులు తయారు చేయడం మంచి అడుగే. ఈరోజు భారత్ టెక్నాలజీలో చాలా ముందుంది. ఇక్కడి వస్తువుల క్వాలిటీ, ధరలు కాంపిటీటివ్‌గా ఉన్నాయి. అందుకే స్వదేశీ కొత్త రూపం భిన్నంగా ఉంటుంది. దానిని హిందుత్వ ఆలోచనాధోరణికి జోడిస్తారేమో అనేదే నా భయం” అని పరాడ్కర్ అన్నారు.

 
ఆమె ఆలోచనల ప్రకారం “దేశానికి ఆ సత్తా ఉంది, దేశంలో నిపుణులైన కార్మికులు కూడా ఉన్నారు. దానిని సరిగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మనం విదేశీ కంపెనీతో పోటీపడడంలో బెదిరిపోవడం, విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో వెనక్కు తగ్గడం గానీ ఉండకూడదు”.

 
ఆధునిక భారత కంపెనీలు క్వాలిటీ, ధర
స్వదేశీ, స్వావలంబన గురించి మాట్లాడేవారు తక్కువ ఖర్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వృద్ధి, వినిమయం తగ్గించడం గురించి కూడా మాట్లాడుతున్నారు. స్వదేశీ జాగరణ్ మంచ్ అరుణ్ ఓఝా “ఒక కుటుంబం దగ్గర ఒకే చోట ఐదు కార్లు ఉండాల్సిన అవసరం ఏముందని ఆలోచించాలి. మనం ఒక భారత సబ్బు ఉపయోగిస్తుంటే, రకరకాల విదేశీ సబ్బుల అవసరం ఏముంది” అన్నారు.

 
ఆయన స్థానిక కంపెనీలను ఉదాహరణగా చెబుతున్నారు. తక్కువ ధరకు శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మెషిన్ తయారు చేసిన తమిళనాడు, కోయంబత్తూర్‌లోని అరుణాచలం మురుగనాథమ్ కంపెనీ గురించి చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ శానిటరీ నాప్కిన్స్ ను 10 శాతం మహిళల వరకూ చేరిస్తే, ఆయన వాటిని పెద్ద సంఖ్యలో మహిళలకు చేరువ చేశారన్నారు. ఆయన జీవితం పైనే ’ప్యాడ్ మేన్’ అనే సినిమా తీశారు.

 
ప్రధాని కూడా గ్రామ సర్పంచులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడారు. “బలమైన పంచాయతీలు స్వావలంబన గ్రామాలు కూడా ఆధారమే. అందుకే పంచాయతీ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో, ప్రజాస్వామ్యం కూడా అంత బలంగా ఉంటుంది. ఆఖరి మలుపులో ఉన్న సామాన్యుడికి కూడా అదే అభివృద్ధి ప్రయోజనాలు లభిస్తాయి. ఆయన మారుమూల గ్రామాలకు కూడా చేరుకున్న తక్కువ ధర స్మార్ట్ ఫోన్‌ను ఉదాహరణగా చెప్పారు.

 
చైనా కంపెనీలు భారత్ వైఖరిని వ్యతిరేకిస్తాయా?
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల కరోనా సంక్షోభం తర్వాత చైనాపై కోపంతో విదేశీ కంపెనీలన్నీ తమ ఫ్యాక్టరీలు భారత్‌కు తీసుకురావాలని అనుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండో పసిఫిక్ నిపుణులు ఫైజల్ అహ్మద్ అంగీకరించలేదు. “నేను దీన్ని ఒప్పుకోను. కంపెనీలు చైనా నుంచి తమ పరిశ్రమలను తీసుకొచ్చి భారత్‌లో ఎందుకు పెడతాయి. చైనా-అమెరికా మధ్య ట్రేడ్‌వార్ సమయంలో కూడా అలాంటి అంచనాలు వచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు” అన్నారు.

 
ప్రాథమిక మౌలిక సదుపాయాలు, హై టెక్నాలజీ విషయంలో భారత్ ఇప్పుడు చైనా కంటే చాలా వెనకబడి ఉంది. భారీ స్థాయి ఉత్పత్తి, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయడం చైనా ప్రత్యేకత. అందుకే మల్టీనేషనల్ కంపెనీలు చైనా నుంచి బయటకు వెళ్లడం జరగదు అన్నారు. “భారత్ తన ఆర్థిక విధానాలు మార్చుకుని, స్వదేశీ వైపు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే, చైనాలో ఉంటే విదేశీ కంపెనీల్లో కొన్ని భారత్ వచ్చేస్తాయనే దానిలో అసలు అర్థమే లేదు” అంటారు.

 
కరోనా సంక్షోభం ప్రపంచ ఆర్థికవ్యవస్థను కుదిపేస్తోంది. భారత్ కూడా దాన్నుంచి బయటపడలేదు. మార్పు అవసరమే. ఇలాగే ఉండడం అనేది ప్రత్యామ్నాయం కాదు. ఇప్పుడు మార్పు కోసం ఏ దారి ఎంచుకున్నా దేశంలోని 135 కోట్ల మంది ఆర్థిక భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుంది.

 
స్వదేశీ భారత్ ఏ స్థాయికి వెళ్తుంది
అమెరికా జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ స్టీవ్ హెచ్.హైక్ బీబీసీకి ఈమెయిల్ ద్వారా తన అభిప్రాయం పంపించారు. “ఒక ఆర్థిక సవరణ రూపంలో ప్రధానమంత్రి మోదీ పెద్ద స్థాయిలో చర్యలు తీసుకోవడం కనిపించడం లేదు. ఆయన నేతృత్వంలో న్యాయ వ్యవస్థ, పౌర సేవల్లో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఫలితంగా భారత్ అవినీతిలో చిక్కుకుపోయింది. ఆర్థిక రంగంలో ఎన్‌పీఏలు, మొండి రుణాల పర్వతాలను పెంచడం తప్ప దేశం ఏదీ సాధించలేదు. అపఖ్యాతి తెచ్చిపెట్టిన నోట్లరద్దును ఎవరు మర్చిపోగలరు?” అన్నారు.

 
భారత్‌లో సంస్కరణలు లేని సమయంలో మోదీ ఉపఖండాన్ని ఒక బలహీన ప్రాంతంగా వదిలేశారు. అది తన సామర్థ్యం కంటే తక్కువ పనిచేస్తోంది. అధికారంలో ఉండడానికి, భారీ స్థాయిలో తమ హిందూ మూలాలను ప్రేరేపించడానికి ప్రధాని, బీజేపీ పాతకాలపు కుల, మత ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పుడు వారు జెనోఫోబియా(విదేశీ వ్యతిరేకత)ను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇది చాలాకాలం నుంచీ భారత్ ప్రాంతీయ లక్షణంగా ఉంది. అది ఎప్పుడూ లోలోపల అదిమిపెట్టినట్టు ఉంటుంది.

 
మోదీ విదేశీ వ్యతిరేకతను ఆశ్రయించినపుడు ఆయనకు ఏం లభించింది? ఒక ఊరూ పేరులేని పురాతన స్వదేశీ ఆర్థిక పథకం. భారతదేశ వినాశకరమైన పంచవర్ష ప్రణాళికల్లో స్వదేశీ విధానం భాగమే అన్నది గుర్తుంచుకోవాలి. స్వదేశీ భారత్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుంది. ఉపఖండం ఆర్థికాభివృద్ధి సామర్థ్యంలో సగం కోతకు గురవుతుంది. ప్రభుత్వ అణచివేతకు ప్రోత్సాహం లభిస్తుంది. 

 
రాజకీయ నాయకులు, అవినీతి అధికారులకు మరింత బలం వస్తుంది. స్వదేశీ ఆలోచన అధికారం చేజిక్కించుకోవాలని చూసే మోదీ-బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. ఈ ‘ఏకీకృత అధికారం’తోపాటు అన్ని అంశాలూ రాజకీయమై పోతాయి. ప్రతి సమస్యా రాజకీయమవుతుంది. అన్ని రకాల విలువలు, నిర్ణయాలూ రాజకీయంలో భాగమైపోతాయి. ఇక, భారత స్వదేశీ ఆదేశాలను పాటించనివారి కోసం లాఠీలు కూడా సిద్ధంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగాజలంతో కరోనా వైరస్‌ను తరిమికొట్టవచ్చా?