Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ అత్యాచారం - హత్య : 'ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా' గుర్తించండి...

Advertiesment
దిశ అత్యాచారం - హత్య : 'ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా' గుర్తించండి...
, గురువారం, 5 డిశెంబరు 2019 (12:40 IST)
దిశపై అత్యాచారం ఘటనకు సంబంధించి వారం రోజులుగా వస్తున్న వరుస కథనాలు చదువుతుంటే కంట్లో తడి ఆరడం లేదు. దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. అవసరమైన చర్చతో పాటు విక్టిమ్ బ్లేమింగ్, జడ్జ్‌మెంట్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఒకేరోజు హైదరాబాద్‌ శివార్లలో దిశ, వరంగల్‌లో యువతిపై అత్యాచారం, హత్య జరిగాయి. ముక్కూమొఖం తెలియని కామాంధుల చేతుల్లో ఒకరు అఘాయిత్యానికి గురయితే మరొకరు పుట్టిన రోజు నాడే తెలిసిన వ్యక్తి పశుత్వానికి బలయ్యారు.
 
ఇది మొదటిదీ కాదు, ఇక ఇదే చివరిది, ఇక ముందు ఇలాంటివి జరగవన్న ధైర్యమూ లేదు. అయినా ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతీసారీ మనసు ముక్కలైపోతుంది. గడచిన కాలాల్లోని గాయం రేగి రేగి మనసుని కుదిపేస్తుంది. స్త్రీ తన రెక్కలు చాచి ఎగిరే ప్రయత్నం చేస్తున్న కొద్దీ అన్నింటా సగం అని డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతున్న కొద్దీ... కాదు, నీ స్థానం అక్కడే అని మనల్ని అణగదొక్కడానికి ప్రపంచం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కొన్ని కనిపించే నేరాలు. కొన్ని కనిపించనవి.
 
చిన్నప్పటినుంచీ ఎంతో ప్రొటెక్టెడ్ లైఫ్ పొందిన నా జీవితంలోనే ఇలాంటి చేదు ఘటనలు చాలా ఉన్నాయి. మా చిన్నప్పుడు నాన్నగారు ఒడిషాలో ఉండేవారని, ఆ అందమైన బాల్య స్మృతుల్ని చాలా సార్లు సోషల్ మీడియాలో పంచుకున్నాను. అయితే నిజంగా అన్నీ అందమైన జ్ఞాపకాలేనా.. అంటే కచ్చితంగా కాదు. అందమైన గులాబీల్లాంటి స్మృతుల మధ్య ముళ్లగాయాలు అప్పుడప్పుడూ కలుక్కుమంటూనే ఉంటాయి.
webdunia
 
నిజానికి ఈ ఎబ్యూజెస్ ఫేస్ చేయని వాళ్లెవరైనా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హింసలో చాలావరకు దగ్గర బంధువులే ఉంటారు. ఈ హింస అనుభవించిన పిల్లలు పైకి చెప్పుకున్నా, పరువు చట్రంలో ఇరుక్కున్న తల్లితండ్రులు పిల్లల నోరు నొక్కేస్తారు. అక్కడనుంచి మ్యూజింగ్స్ ఇక ఎప్పుడూ ముందుకి సాగదు. ఆ తర్వాత ఇంటర్ రోజులూ, పుస్తకాలతో నేస్తం కట్టడం చెప్పగలుగుతా. కానీ మధ్యలో లంకె తెగిపోతుంది.
 
ఎలాంటి బాల్యం గడిపాం నేనూ అక్కా.. సీలేరు నుంచి చిత్రకొండ వచ్చేటప్పుడు మధ్యలో బస్సు దిగి అడవిలోకి వెళిపోయేవాళ్లం. పుస్తకాలు అన్నీ బస్సులో పడేసి అడివి లోలోపలికి వెళ్ళి కాయలూ, పూలు ఏరుకొచ్చేవాళ్ళం. ఎలుగుబంట్లూ, పులులూ కనిపించిన సందర్భాలు లెక్కలేనన్ని. ఇంక పురుగూ పుట్రా సంగతి చెప్పనక్కర్లేదు.
 
కానీ ఎప్పుడూ ఆ భయం ఉండేది కాదు. మేం సరే, చిన్న పిల్లలం. నాన్నగారు వాళ్ళకి కూడా ఆ భయం ఉండేది కాదు. మా అఘాయిత్యాలు కంట్రోల్ చేయలేక మా బస్సు డ్రైవర్ నాన్నగారు వాళ్లకి బోలెడు కంప్లెయింట్స్ చేసేవారు. అయితే, ఆదుర్దా ఎప్పుడు మొదలయ్యిందంటే, మేం అడవిలోంచి జనారణ్యంలోకి వచ్చాక. చిత్రకొండలో ఎంత ఆలస్యమైనా కంగారు పడని అమ్మా, నాన్న తమకి అయిన వాళ్ళని నమ్మి చదువుల కోసమని తమ బంధువుల దగ్గర మమ్మల్ని వదిలినప్పుడు.. ఎందుకంటే అవి భయంకరమైన అనుభవాన్ని ఇచ్చిన రోజులు.
 
నిజానికి ఆ రెండేళ్లు, ఆ స్కూల్, ఆ స్నేహితులు, అక్క, మాకు గ్రామర్ చెప్పిన జానకిరామయ్య మాస్టారు.. చెప్పుకోవడానికి చాలా గొప్ప జ్ఞాపకాలున్నాయి. కానీ ఆ ఊరు, అ స్కూల్ గుర్తు రాగానే ఇంకో భయంకరమైన నీడ కప్పేస్తుంది. ఎందుకంటే ఆ గాయం మందులేనిది. మరపు రానిది. మమ్మల్ని వదిలింది చాలా చాలా దగ్గరి బంధువుల ఇంట్లో. వాళ్ళ పిల్లలు కూడా మా ఈడు వాళ్ళే . తండ్రి వయసు బంధువు మా పట్ల ఒడిగట్టిన నైచ్యం మాటల్లో చెప్పలేం . పగలంతా స్కూల్, చదువు, ఆట పాటలు.. అద్భుతంగా ఉండేది. కానీ సాయంత్రం ఇంటికి వచ్చాక నరకం కనిపించేది.
 
పైకి నాన్నా, తల్లీ అని పిలుస్తూ ప్రేమగా కనిపించే ఆ వ్యక్తి వికృత చేష్టలు భరించలేనంత దుఃఖాన్ని మిగిల్చేవి. చూసేవాళ్ళకి అతను తండ్రిలా భుజం మీద చేయేసి దగ్గరకి తీసుకున్నట్లే ఉండేది. కాని ఆ టచ్ లో వికృతత్వం మాకే అర్థమయ్యేది. వీటికన్నా అమ్మా నాన్నలకి చెప్పుకోలేకపోవడం చాలా డిప్రెషన్‌గా అనిపించేది.
webdunia
 
నాకు బాగా గుర్తు. తగ్గకుండా జ్వరం వేధించేది నన్ను. కొన్ని రోజులు ఈ హింస పడ్డాక, అమ్మ, నాన్నగారు వచ్చినప్పుడల్లా వెక్కిళ్ళుపెట్టి ఏడ్చేదాన్ని. ఏం జరిగిందంటే చెప్పలేక పోయేదాన్ని. చదువు మానేయాల్సి వస్తుందేమోనన్న భయం. ఆ చిన్న వయసుకి, అదే పెద్ద భయం. పైగా మాకు వేరే ఆప్షన్ లేదు. నాన్నగారు పని చేసే చోట హైస్కూల్ లేదు. కొన్నిరోజులు సాగాక, ఒక రోజు మా అత్తయ్యలు ఇద్దరు వచ్చారు మమ్మల్ని చూడడానికి.
 
అత్తయ్య ఎలా పసిగట్టిందో తెలీదు. అర్థం చేసుకుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య(మా అమ్మమ్మ)కి చెప్పింది. ఆ తర్వాత నాలుగు రోజులకి అమ్మమ్మ వచ్చింది. ఏం జరిగిందో, ఏం చెప్పిందో తెలీదు. నయానో భయానో మాకు వేధింపులు ఆగిపోయాయి. నాన్నగారు తన సర్వీస్ వదులుకుని ఆంధ్ర కాడర్‌కి వచ్చేశారు. అయితే దగ్గర బంధుత్వం, పరువుకి భయపడి ఆ హింసను బయట పెట్టకపోవడం మా మీద చూపించిన ప్రభావం అంతాఇంతా కాదు. ఆ తర్వాత ఆ ఊరికి వెళ్ళడానికి కూడా మేం ఇష్టపడకపోయే వాళ్ళం.
 
ఈ పరువు ప్రతిష్టలు, మధ్యతరగతి సూడో భయాలూ.. పిల్లల ఎబ్యూజ్ విషయంలో చేసే చేటు నాకు తెలుసు. అత్తి పత్తి ఆకుని చూసినప్పుడు నా మనసులో పదేళ్ళ మహీ కనిపిస్తుంది. భయంతో ముడుచుకుపోయిన మహీ.. ఎవరికైనా చెప్పుకోలేక ముడుచుకు పడుకుని ఏడ్చిన మహీ.. మునగ చెట్టు మీద పాకుతున్న గొంగళి పురుగుని చూస్తే నాకు ఆ దరిద్రుడి స్పర్శ జ్ఞాపకం వస్తుంది.
 
నా జీవితంలో ఎదురైన ఒకే ఒక్క చేదు అనుభవం.. నన్ను దాదాపు 33 ఏళ్ల తర్వాత కూడా అప్పుడప్పుడు నిలువనివ్వదు. ఆ తర్వాత నా జీవితంలోకి ఎంతో మంది గొప్ప స్నేహితులు వచ్చారు. నన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్న స్నేహితులు. ప్రాణంకన్నా ఎక్కువగా పదిలంగా చూసుకున్న మగ స్నేహితులూ ఉన్నారు నాకు. అయినా ఆ గాయం పోదు.
 
మరో చోట... మరో సారి... (కాదు కాదు, ఎన్ని చోట్లో... ఎన్ని సార్లో...)
ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి చోట స్త్రీ పురుషులు కలసి పనిచెయ్యవలసి రావటం చాలా మామూలు విషయం. జండర్ ఇష్యూ అనేది లేకుండా కేవలం సహోద్యోగుల్లా చూసే వారి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ అలా చూడటం ఒక నటన అయిన చోట, అది నటన అని ఏ ఒకరిద్దరికో అర్థమయి వారు ఆ వాతావరణంలో ఇమడలేక పోవడమూ, అందరితో సోషల్ గా మూవ్ కాకపోవడమూ వారి వ్యక్తిత్వలోపంగా ఎంచబడే చోట అసలు వారి బాధ ఎవరికని షేర్ చేసుకోగలరు?
webdunia
 
ఇదిగో ఇది ఇంకో అనుభవం..
ఒక ముఖ్యమైన కాల్ ఎటెండ్ చేస్తున్నాడు అతను. అతని ఎదురుగా కూర్చుని అవసరమైన డాటా అప్పటికప్పుడు అందిస్తున్నా. అవతలి వాళ్ళకి ఏదో కాంటాక్ట్ నంబర్ ఇవ్వవలసి వచ్చింది. యథాలాపంగా తన ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చి కాంటాక్ట్ నంబర్ తీయమని సైగ చేసాడతను. నేను తీసేలోపే అతని మెదడులో ఏదో మెరిసినట్లయి మెరుపు వేగంతో ఫోన్ వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
 
అయితే.. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నేను ఫోన్ తీసుకోవడం. అతను ఓపెన్ చేసి ఉంచిన గ్యాలరీలోకి చూడడం జరిగిపోయింది. తనతో పాటు పనిచేసే ఇంకో కొలీగ్ ఫొటో. క్లోజ్ అప్‌లో క్రాప్ చేసుకుని కింద కొన్ని కాప్షన్స్ యాడ్ చేసుకుని చూసుకుంటున్నాడు. ఆమె ఒక్కత్తేనా. ఆమె సర్వనామం కాదా. ఇంకెవరి ఫొటోలు.. ఎంతమంది ఫోటోలు.. ఏ రూపంలో ఉన్నాయో... ఇంకే రూపాల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో ఎవరికి తెలుసు. నిర్ఘాంతపోయి బయటకి వచ్చేశాను.
 
చాలాసార్లు ఇలాంటప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వలేం. బహుశా టానిక్ ఇమ్మొబిలిటీ లేక ఇన్వాలంటరీ పెరాలసిస్ అంటారనుకుంటా. మెదడు మొద్దుబారినట్లు అనిపించడం. నీ విలువని నువ్వెంతగా చెప్పుకో అదెవ్వరికీ పనికి రాదు. నువ్వెప్పటికీ ఒక అందమైన తోలు కప్పుకున్న మాంస ఖండానివే.. అది మాత్రమే నీ విలువ. కాకపోతే ఆ విలువ ఖరీదు అత్యాచారమో… మానసిక గాయమో… మరొకటో… మరొకటో… వెరసి అది నీ జీవితం.
 
బహిరంగంగా నేరాలు అని చెప్పదగిన విషయాల కంటే బంధువుల పేరుతోనూ, కాలేజీకి వెడుతున్నపుడో, ఆఫీసుకు వెడుతున్నపుడో, రహదార్లమీదా, బస్టాపుల్లో, బస్సుల్లో ఆఫీసుల్లొ జరిగే తంతులు ఇంకోరకం. చాలా సార్లు చెప్పుకోం. చెప్పుకోలేం. ఎన్నని, ఎన్ని సార్లని. మధ్య తరగతి మహిళలుగా మనం "Fear Of social Defeats"ను దాటుకుని బయటకి రాలేమని ప్రగాఢ నమ్మకమది. చిన్నప్పటి నుంచి మన చుట్టూ నిర్మితమైన అదృశ్య బందీఖానాలని దాటి మనం బయటకి రాలేని పరిస్థితులని సృష్టించిన సామాజిక మాయాజాలమిది. నూటికి ఒకరిద్దరు కూడా ఈ జాలాన్ని దాటి బయటకి రావడం అన్నది నేనెరుగను.
 
కొన్ని ప్రదేశాలను, కొన్ని సమయాలను పురుష లోకం కబ్జా చేసేసింది. స్త్రీలవి కావు అని తేల్చేసింది. అదెక్కడా రాసి ఉండదు. అదొక సామూహిక అవగాహనగా సమాజంలో ఇంకిపోయి ఉంటుంది. రాత్రి పూట నువ్వు ఒంటరిగా బస్టాప్లో నుంచున్నావంటే తోడు కోసం ఇన్వైట్ చేస్తున్నట్టే లెక్క. పగటిపూటైనా నువ్వు పార్కుకో, మరో పబ్లిక్ ప్లేస్ కో ఒంటరిగా వెళ్లావంటే తోడు కోసం వెతుకుతున్నట్టే లెక్క. ప్రతివాడూ తనని తాను సెల్ఫ్ ఇన్వైట్ చేసుకుని నిన్ను పలకరించేవాడే. అంటే ఈ పబ్లిక్ ప్లేస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పురుష ప్లేసెస్‌ గా వ్యవహారంలో ఉన్నాయి. వ్యావహారిక అర్థంలో పబ్లిక్ ఈజ్ పురుష్.
 
ఒకవేళ ఎవరైనా అన్ని బంధనాలనీ తెంచుకుని తమ మీద జరిగిన అఘాయిత్యాలని ప్రస్తావిస్తున్నప్పుడు ప్రస్తావిస్తున్న వ్యక్తులు మనవారైతే ఒకలా లేదంటే మరోలా స్పందన ఉంటుంది. ఆయా వ్యక్తులతో మనకున్న అవసరాల ప్రాధాన్యతలే ప్రమాణమై మనం మరొకరి వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నాం. ఇది కనిపించని దాడి. ఈలోకంలో ప్రతి ఒక్కరూ అత్యున్నతంగా భావించుకునేది తన అహాన్నే… అలా భావించుకోకుండా ఉంటే మనం ఏమీ సాధించలేము కూడా. కానీ అదే మనం పక్కవారి అహాన్ని మనకి తెలియకుండానే అనుమానిస్తాం. హేళన చేస్తాం.
 
మనం కరెక్ట్ ఉంటున్నాం కాబట్టి మనని ఎవరూ ఇబ్బంది పెట్టలేదనే ఒక మిథ్యావాదనతో మనల్నిమనం మభ్య పరచుకుంటూ మన చుట్టూ మనమే ఒక స్వార్థపూరితమైన కంచెని నిర్మించేసుకుంటున్నాం తప్ప, పక్కవారి అనుభవాల మీద ఎలాంటి తీర్మానాలైనా నిర్వచించటానికి మనకేం హక్కు ఉంది అన్న ఆలోచనని మాత్రం రానివ్వం.
 
అన్నిటికన్నా పెద్ద సమస్య.. చాలా సార్లు ఆ క్రూకెడ్‌నెస్‌ని నిరూపించలేకపోవడం. ఇద్దరు స్నేహితుల మధ్య పరిమితికి లోబడిన సాహచర్యం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునే పరిస్థితి ఉన్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది. అయితే ఇష్టాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ, ఒక వ్యక్తికి ఎంత ఉందో.. ఆ కోరికని నిరాకరించే స్వేచ్ఛ ఎదుటి వ్యక్తికి కూడా ఉందని అందరూ అర్ధం చేసుకోవాలి.
 
అలాగే సమాజంలో విపరీతమైన హిపోక్రసీ పేరుకుపోయి ఉంది. ఓవైపు సెక్సు గురించి మాట్లాడుకోం. మాట్లాడడాన్ని ఇష్టపడం. అదో టాబూ. అదే సమయంలో మరోవైపు సమాజంలో విపరీతమైన యావ పేరుకుపోయి ఉంటుంది. దొంగగా వంకరగా మురికిగా దాని గురించి మాట్లాడుకునే వాతావరణం నేరపూరితమైన సమాజాన్ని తయారుచేస్తుంది. ఆరోగ్యకరంగా చర్చించుకోలేని తీర్చుకోలేని ఏ కోరిక అయినా నేరరూపం తీసుకుంటుంది.
 
శరీరాన్ని బాధలకి గురిచెయ్యడమే హింస అని పిలవబడే సమాజంలో… అడుగడుగునా... అడుగు పెట్టిన ప్రతి చోటా మనసు మీద చేయబడే గాయాలకి అసలు పేరేం పెట్టాలి? పనిలో ఎంత సామర్ధ్యముండనీ, హోదాలో ఎంత గొప్ప దానివవ్వూ… నువ్వు ఆడదానిగాకాక సహోద్యోగిగా గుర్తించబడటం అన్నది జరగనంతవరకూ మనిషిగా స్త్రీ స్థానం ప్రశ్నార్ధకమే!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత వాయుసేన అధిపతి జస్ట్ ఎస్కేప్...?!