Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ విద్యార్థినిపై ప్లాన్ ప్రకారమే సామూహిక అత్యాచారం: ప్రెస్ రివ్యూ

Advertiesment
హైదరాబాద్ విద్యార్థినిపై ప్లాన్ ప్రకారమే సామూహిక అత్యాచారం: ప్రెస్ రివ్యూ
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (17:57 IST)
హైదరాబాద్‌ శివార్లలో విద్యార్థినిపై అత్యాచారం చేయాలని నిందితులు ముందే ప్లాన్ వేశారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. ముందుగా అనుకున్న పథకం ప్రకారమే నిందితులు ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్యచేయాలనీ భావించారని రాసింది. పోలీసు వాహనాల సైరన్లు నలువైపులా మోగుతుండటంతో వెనకడుగు వేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
వీళ్లంతా ముఠాగా ఏర్పడి అఘాయిత్యాలకు పాల్పడేవారని, మరికొందర్నీ అత్యాచారం చేశారని విచారణలో తేలినట్టు తెలిసింది. కేసు వివరాలను రాచకొండ పోలీసులు శుక్రవారం అధికారికంగా వెల్లడించే అవకాశముందని ఈనాడు చెప్పింది.

 
బాధిత విద్యార్థిని (19) మేడ్చల్‌కు సమీపంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగుతున్న యువతి అక్కణ్నుంచి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న ఆర్‌ఎల్‌నగర్‌లోని ఇంటికి ఆటోలో వెళ్లేది.

 
ప్రధాన నిందితుడు తన సెవెన్‌ సీటర్‌ ప్యాసింజర్‌ ఆటోను రాంపల్లి చౌరస్తా దగ్గరున్న అడ్డాలో నిలిపి ఉంచడంతో కొన్నిసార్లు ఆ ఆటోలోనూ ప్రయాణించింది. ఆ క్రమంలోనే అతడి కన్ను ఆమెపై పడింది. సహచరులైన మరో ముగ్గురు ఆటో డ్రైవర్లకు ఆమె గురించి చెప్పిన అతను, అదనుచూసి కిడ్నాప్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎప్పటిలాగే యువతి బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 5.45 గంటల మధ్య రాంపల్లి చౌరస్తా దగ్గర కళాశాల బస్సు దిగి ఆటో అడ్డా వద్దకు వచ్చింది.

 
ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు, ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేసి 'మ్యాటర్‌ రెడీగా ఉందంటూ' సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు మహిళలు, యువకుడు ఉండటంతో ఆమె యథావిధిగా అందులో ఎక్కింది. చౌరస్తా నుంచి కి.మీ. దూరంలో ఉన్న సత్యనారాయణ కాలనీ దగ్గర ఇద్దరు, ఆ తర్వాత కొంతదూరంలో మరొకరు దిగారు.

 
ఇంకొంచెం దూరంలో యువతి దిగాల్సిన ఆర్‌ఎల్‌నగర్‌ బస్‌స్టాప్‌ ఉంది. నిందితుడు ఆటోను అక్కడ ఆపకుండా వేగంగా యంనంపేటవైపు పోనిచ్చాడు. అనుమానించిన యువతి 'ఆటోను మన స్టాప్‌లో ఆపకుండా డ్రైవర్‌ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నాకు భయమేస్తోందంటూ' తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె బంధువులకు విషయం చెప్పగా, వాళ్లు డయల్‌ 100కు సాయంత్రం 6.30 గంటల సమయంలో ఫోన్‌ చేశారు.

 
ఆటో యంనంపేటకు చేరుకోగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి వెనుక సీట్లో యువతికి చెరోవైపు కూర్చున్నారు. మరోవ్యక్తి ఘట్‌కేసర్‌ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ యువతిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చారు. అందులోనే అందరూ అత్యాచారం చేశారని ఈనాడులో రాశారు. అదే సమయంలో పోలీస్‌ వాహనాల సైరన్‌ మోగడం, 'ఆటోలో అమ్మాయిని కిడ్నాప్‌ చేశారు.. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ' పోలీసులు మైకుల్లో ప్రకటిస్తుండటాన్ని విన్న నిందితులు దొరికితే ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయపడ్డారు.

 
యువతిని వ్యాన్‌ నుంచి కిందకు దించి పక్కనే పొదల్లో పడేసి పరారయ్యారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడను గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అన్నోజిగూడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. తదుపరి వైద్యపరీక్షల నిమిత్తం గురువారం నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోందని పత్రిక చెప్పింది.

 
రాంపల్లి చౌరస్తా దగ్గర సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టారు. ఆ క్రమంలోనే బాధితురాలితోపాటు మరో యువకుడు ఆటోలో ఎక్కినట్లు గుర్తించి విచారించారు. అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా అడ్డాలోని ఆటో డ్రైవర్లను ఆరాతీశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నలుగుర్ని గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందని కథనంలో చెప్పారు. కేసు దర్యాప్తును రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఈనాడు వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయ ఒప్పందంలో జగన్ హస్తం.. ఏ2 మధ్యవర్తి : అయ్యన్నపాత్రుడు