Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ అత్యాచారం: 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్, కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

Advertiesment
హైదరాబాద్ అత్యాచారం: 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్, కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
, శుక్రవారం, 6 డిశెంబరు 2019 (14:44 IST)
'దిశ' అత్యాచారం, హత్య కేసు నిందితులు శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్లో మరణించారు. "విచారణలో భాగంగా నేరం జరిగిన తీరును రీకన్‌స్ట్రక్ట్ చెయ్యడానికి ఘటనా స్థలానికి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వద్దనున్న ఆయుధాన్ని లాక్కొన్న నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితులు నలుగురూ మరణించారు" అని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

 
ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసు అధికారులపై, ప్రత్యేకించి కమిషనర్ వీసీ సజ్జనార్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 'దిశ'కు జరిగిన అన్యాయానికి 10 రోజుల్లోనే న్యాయం జరిగిందంటూ బాధితురాలి తండ్రి కూడా వ్యాఖ్యానించారు. కొద్దిగా ఆలస్యం జరిగినా సరైన చర్యే జరిగింది అని ఎంపీ జయాబచ్చన్ వ్యాఖ్యానించారు.

 
నిందితులు తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు పోలీసులకు అంతకు మించిన మార్గం లేదు. న్యాయం జరిగిందనే అనుకోవాలి అని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగెల్ వ్యాఖ్యానించారు. "ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కచ్చితంగా నేరస్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మేం దీన్ని స్వాగతిస్తున్నాం. బిహార్‌లో కూడా మహిళలపై హింసకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు" అని ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై వ్యాఖ్యానించారు.

 
కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది? - మేనకా గాంధీ
మరోవైపు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ కూడా దీనిపై స్పందించారు. "ఇప్పుడు జరిగిన ఘటన చాలా భయానకమైనది. మీరు ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపకూడదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. నిందితులకు కోర్టు ద్వారా మరణశిక్ష పడేలా చేయాల్సింది. న్యాయ ప్రక్రియకు ముందే మీరు వారిని కాల్చి చంపాలనుకుంటే, ఇక కోర్టులు, చట్టాలతో పనేముంది?" అని ఆమె అభిప్రాయపడ్డారు.

 
"పోలీసులు చాలా ధైర్యంగా వ్యవహరించారు. న్యాయం జరిగింది. దీనిపై న్యాయపరమైన ప్రశ్నల సంగతి వేరే అంశం. కానీ, దేశ ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారనిపిస్తోంది" అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.

 
పేర్లు పెట్టడం కాదు, శిక్ష పడటం ముఖ్యం
"ఓ తల్లిగా, కూతురుగా, భార్యగా నేను దీన్ని స్వాగతిస్తున్నా. లేదంటే వాళ్లు ఏళ్ల తరబడి జైల్లో ఉండేవారు. నిర్భయ అసలు పేరు కూడా అది కాదు, ప్రజలే ఆ పేరు పెట్టారు. అయితే ఈ పేర్లు పెట్టడం కన్నా కూడా వారికి శిక్ష పడటమే ముఖ్యం" అని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. "ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిద్రాణంగా ఉంది. ఇక్కడి పోలీసులు, దిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి ప్రేరణ పొందాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడి నేరస్తులను అతిథుల్లాగా చూస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రస్తుతం ఆటవిక రాజ్యం నడుస్తోంది" అని మాయావతి విమర్శించారు.

 
మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదు: రెబెకా మమెన్ జాన్
ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, క్రిమినల్ లాయర్ రెబెకా మమెన్ జాన్ స్పందించారు. మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లే నేరం చేశారు అనడానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయా? ఏ కోర్టు అయినా వాటిని పరిశీలించిందా? ఏ కోర్టు అయినా నేరాన్ని నిర్థరించిందా? ఒకవేళ వాళ్లే నేరం చేశారు అనుకుంటే, అది నిర్థరించడానికి ఓ పద్ధతి ఉంది. దాన్ని తప్పితే, తర్వాత మీ వంతే కావచ్చు’’ అని అన్నారు.

 
‘‘అత్యాచార బాధితులకు సహాయం చేయడం చాలా సుదీర్ఘమైన, కఠినమైన ప్రక్రియ. దాన్ని మీరెప్పుడూ పాటించలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో, ఏం ఎదుర్కొన్నారో మీకు అవగాహన లేదు. సిగ్గుతో మీ తలలు దించుకోండి, భయంతో కూడా. ఇది మిమ్మల్ని వెంటాడుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

 
"మహిళలపై హింసకు సంబంధించిన కేసులను నేరుగా సుప్రీంకోర్టే విచారించే విధంగా చట్టాన్ని రూపొందించాలి. ప్రస్తుతం కింది కోర్టుల్లో మొదలయ్యే న్యాయ ప్రక్రియ, అలా కొనసాగుతూనే ఉంది" అని శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ పార్లమెంటుకు సూచించారు. న్యాయ వ్యవస్థ ద్వారా నిందితులకు శిక్ష పడుతుంది అనే విశ్వాసం పౌరుల్లో ఉండాలి కుమారి సెల్జా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఎన్‌కౌంటర్లను చట్టబద్ధం చేయాలని బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.

 
మరోవైపు, కాంగ్రెస్ నేత హుసేన్ దల్వాయ్ ఈ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకించారు. "ఇది తప్పు, దీన్ని సమర్థించకూడదు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, దాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీనికి మద్దతివ్వకూడదు. విచారణ జరగాలి. కేవలం కొద్దిమంది ఈ ఎన్‌కౌంటర్‌ను సమర్థించినంత మాత్రాన ఇది సరైన చర్య అయిపోదు. కొంతమంది మూకదాడులను కూడా సమర్థిస్తున్నారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

 
"హైదరాబాద్‌లో ఏం జరిగిందో నాకింకా వాస్తవాలు పూర్తిగా తెలియదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, నేను చెప్పగలిగేది ఒక్కటే, దీనిపై లోతైన విచారణ జరగాలి. ఇది నిజమైన ఎన్‌కౌంటరేనా లేక వాళ్లు నిజంగానే తప్పించుకోవాలని చూశారా, ఇంకేమైనా జరిగిందా అనే దానిపై విచారణ జరగాలి" అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు.

 
సోషల్ మీడియా ఏమంటోంది?
అయితే, పోలీసులు ఇలా చేసి ఉండకూడదని, కోర్టు ద్వారా వారి నేరాలు నిరూపణ జరిగి, శిక్ష పడి ఉండాల్సిందని కూడా కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. "తెల్లవారుజామున 3.30 గంటలకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ అంటే నమ్మలేకపోతున్నాం. మొత్తానికి జరిగిన దారుణ నేరానికి నిందితుల ఎన్‌కౌంటర్‌తో ముగింపు పలికారు" అని జీవన్‌లాల్ వెలగ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

 
"సజ్జనార్ గారికి, ఆయన బృందానికి ధన్యవాదాలు. నిర్భయ కేసులో నిందితుల విషయంలో కూడా ఇలాగే జరగాలి. 9 నెలల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టినవారి విషయంలో కూడా ఇదే జరగాలి. వాళ్లను కూడా ఇదే విధంగా చేయండి" అని జ్యోతిర్మయి కలువకొలను అభిప్రాయపడ్డారు. "ఆబిడ్స్, అమీర్ పేట్, కుకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎన్‌కౌంటర్ చేసి ఉంటే కొంతకాలమైనా ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారు. కోర్టులకు చాలా డబ్బును ఆదా చేశారు" అని జొన్న చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

 
అయితే, జొన్న చంద్రశేఖర్ వ్యాఖ్యపై రాఘవేంద్ర సునీల్ భిన్నంగా స్పందించారు. "బహిరంగంగా ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారు? అక్కడ వాళ్లు పారిపోతున్నట్లు సీన్ క్రియేట్ చెయ్యాలి. అందుకే ఆ స్పాట్‌కే తీసుకెళ్లారు" అని పోస్ట్ చేశారు. "తెలంగాణ పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు, ధన ప్రలోభాలకు లొంగకుండా అన్ని కేసులకూ పోలీసులు ఇదే విధానాన్ని అవలంభించాలి. గుడ్ జాబ్" అని రవిసుజికీ సుజికీ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

 
"వాళ్లు (నిందితులు) చేసింది 100శాతం తప్పే. వాళ్లు చేసినదానికి సరైన శిక్ష పడింది. కానీ ఒక ధనవంతుడో, పలుకుబడి ఉన్న వ్యక్తో ఇలా చేస్తే అప్పుడు కూడా ఇదే విధంగా ఎన్‌కౌంటర్ చేసే ధైర్యం ఉందా వీళ్లకి? చట్టం పేద ప్రజలను, ధనవంతులను ఒకేలా ట్రీట్ చెయ్యగలదా?" అని ప్రశ్నించారు మధు గౌడ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్ళను చూసి సిగ్గు తెచ్చుకోండి.. యూపీ ఖాకీలకు మాయావతి సలహా