Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Hyderabad-BJP National Executive: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం చేస్తారు?

BJP
, శనివారం, 2 జులై 2022 (12:15 IST)
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటూ నగరంలో ఉంటారు. బీజేపీలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిఆర్ఎస్ - బీజేపీ మధ్య నడుస్తోన్న రాజకీయ యుద్ధం కారణంగా ఈ సమావేశాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.

 
జాతీయ కార్యవర్గంలో ఏం చేస్తారు?
బీజేపీ పార్టీలో అతి ముఖ్యులైన నాయకులను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తారు. దేశం మొత్తం కలపి దాదాపు 350 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా మూడు నెలలకు ఒకసారి సమావేశం అయ్యి వివిధ అంశాలపై పార్టీ వైఖరి, గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తులో పార్టీ పాటించాల్సిన విధానం వంటివి చర్చిస్తారు. వాటిని ఆయా కార్యవర్గ సభ్యులు తమ శ్రేణులకు తెలియజేసి పార్టీ నిర్ణయాలు పాటించేలా చూస్తారు. ఒక రకంగా సమకాలీన అంశాలు, ఎన్నికలు, ఇతర రాజకీయ విషయాలపై బీజేపీ వైఖరిని నిర్ణయించుకునే వేదిక ఈ కార్యవర్గ సమావేశం. 2004లో ఒకసారి హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు.

 
''ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట బీజేపీ ఇటువంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా, అక్కడి కార్యకర్తలకు మనో ధైర్యం ఇచ్చి, ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వ్యూహాన్ని పటిష్టం చేస్తుంటుంది. గత సమావేశం రాజస్థాన్ లో జరిగింది. ఇప్పుడు తెలంగాణలో జరగుతోంది'' అని బీబీసీకి చెప్పారు తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన రావు.

 
ఏర్పాట్లు..
దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, 15 రాష్ట్రాలకు పైగా ముఖ్యమంత్రులు ఇతర నాయకులు వస్తోన్న సమావేశం కావడంతో భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాల్లో హైటెక్స్, పెరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, జాంలు ఉంటాయి. వేల సంఖ్యలో పోలీసులు భద్రతా ఏర్పాటు చూస్తున్నారు. అటు అతిథులకు భోజనం, వసతిలో భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ. ప్రధాని మొదటి రోజు ప్రైవేటు హోటల్‌లోనూ, రెండవ రోజు రాజ్ భవన్ లోనూ బస చేయనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వేదిక అలంకరణ జరిగింది. బీజేపీ తన సమావేశాల్లో మాంసాహార భోజనం పెట్టదు. ప్రత్యేకంగా తెలంగాణ శాకాహార వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు. ప్రాంగణం దగ్గర ఒక ఎగ్జిబిషన్ పెట్టారు.

 
షెడ్యూల్..
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శుక్రవారమే వేదిక దగ్గరకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ వస్తారు. ఈరోజు ఉదయం జేపీ నడ్డా హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ జాతీయ కమిటీల సభ్యులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 నుంచి కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఇది బహిరంగ సభ కాదు. కేవలం ఆహ్వానం ఉన్న వారినే లోనికి రానిస్తారు. తిరిగి రేపు అంటే ఆదివారం సాయంత్రం వరకూ సమావేశాలు జరుగుతాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోదీ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించడంతో కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. ఆ తరువాత ఆదివారం సాయంత్రం సికిందరాబాద్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

 
ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ సమావేశాల మధ్యలో వివిధ ప్రాంతాల నాయకులతో మోదీ సమావేశం అవుతారు. 3వ తేదీన మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. కొందరు బీజేపీ నాయకులు 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో ఉండి అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు.

 
టార్గెట్ తెలంగాణ..
సమావేశాలకు రెండు రోజుల ముందే తెలంగాణలో 119 నియోజకవర్గాలకు 119 మంది జాతీయ నాయకులను బీజేపీ పంపింది. వారిలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో జనసమీకరణ పర్యవేక్షించారు. ఎస్సీ లేదా ఎస్టీల ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. బూత్ స్థాయి కమిటీలతో సమావేశం అయి ఆ వివరాలను జాతీయ కమిటీలకు ఇవ్వనున్నారు. స్థానిక సంఘ్ పరివార్ పెద్దలతో పాటూ, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులు వంటి పలుకుబడి ఉన్న వ్యక్తులతో సమావేశం అయ్యారు.

 
స్థానిక చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. - ఇవన్నీ చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు, హైదరాబాద్‌లో స్థిరపడిన 15 రాష్ట్రాలకు చెందిన వారితో విడివిడిగా 19 సమావేశాలు పెట్టింది బీజేపీ. నగరంలోని రకరకాల ప్రదేశాల్లో రకరకాల ఫంక్షన్ హాళ్లలో ఈ సమావేశాలు శుక్ర, శని వారాలు జరుగుతాయి. వాటికి కూడా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులు హాజరవుతారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆ రాష్ట్రాల వారి మద్దతు బీజేపీకి కూడగట్టేలా ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishal on Political Entry: 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావట్లేదు.. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేయట్లేదు'