Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు

Advertiesment
Andhra Bank
, శనివారం, 31 ఆగస్టు 2019 (19:10 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో భాగంగా విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేశారు. ఇప్పుడు మరో 10 బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

 
ఆ పది బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పునాదులు వేసుకుని, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలు ఉన్న ఆంధ్రా బ్యాంకు కూడా ఉంది. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంటే, ఈ విలీనం తర్వాత ఆంధ్రాబ్యాంకు పేరు కనుమరుగు కానుంది.

 
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) ప్రధాన కేంద్రంగా స్థాపించారు. 1923 నవంబర్ 20న ఈ బ్యాంకు పేరు రిజిస్టర్ అయింది. లక్ష రూపాయల మూలధనం, రూ. 10 లక్షల అధీకృత మూలధనం (ఆథరైజ్డ్ క్యాపిటల్‌)తో 1923 నవంబర్ 28న కార్యకలాపాలు ప్రారంభించింది.

 
ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయ చేసినప్పుడు ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్ బ్యాంచ్‌లు, 76 ఎక్స్‌టెన్షన్ కౌంటర్లు ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,904 శాఖలు ఉన్నాయి. 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు (30.09.2018 నాటికి). హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 
లోగో ప్రత్యేకతలు:
ఆంధ్రాబ్యాంకు లోగోలో పెద్ద ఇన్ఫినిటీ ( అనంతం ) చిహ్నం ఉంటుంది. అది వినియోగదారుల కోసం ఏ పని చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధం అనే అనే సందేశాన్ని సూచిస్తుంది. గొలుసు మాదిరిగా కనిపించే తమ లోగో ఐక్యతను సూచిస్తుందని, ఎరుపు, నీలం రంగులు చైతన్యాన్ని, దృఢత్వాన్ని సూచిస్తాయని ఆంధ్రాబ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో (అప్పట్లో కృష్ణా జిల్లాలో ఉండేది) 1880 నవంబర్‌ 24న అతి సామాన్య కుటుంబంలో డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు. ఉపకార వేతనాలతోనే ఆయన ఉన్నత చదువులు అభ్యసించారు. 1901లో మద్రాస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం (బందరు)లో వైద్యుడిగా ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు.

 
అలా... లక్ష రూపాయలు పోగుచేసి 1923 నవంబర్ 20న ఆయన ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. ఆంధ్రాబ్యాంకుతో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915లో కృష్ణా కోఆపరేటివ్‌ సెంట్రల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీతో కలిసి అనేక కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషించారు. గాంధీ చేపట్టిన సత్యాగ్రహం ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

 
పట్టాభి సీతారామయ్య స్వయంగా రచయిత. 'జన్మభూమి' అనే పత్రికను ఆయన నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను ప్రామాణికంగా అక్షరబద్ధం చేసిన తొలివ్యక్తి కూడా ఆయనే. 1928లో ఏర్పాటు చేసిన భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సంఘానికి ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. 1948లో జరిగిన సదస్సులో పట్టాభిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1952 నుంచి 1957 వరకు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. 79 ఏళ్ల వయసులో 1959 డిసెంబర్‌ 17న కన్నుమూశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపా పరువు తీసిన కోడెల... కె ట్యాక్స్ పైన హైకోర్టు కీలక ఆదేశాలు