Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ వల్ల పాకిస్తాన్‌లో కశ్మీర్‌ మీద చర్చ స్వరూపమే మారిపోయిందా?

Advertiesment
మోదీ వల్ల పాకిస్తాన్‌లో కశ్మీర్‌ మీద చర్చ స్వరూపమే మారిపోయిందా?
, శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:56 IST)
ఫ్రాన్స్‌లో జీ-7 దేశాల సమావేశాలు జరిగినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడిగా భేటీ అయ్యారు. అంతకు ముందు జులై చివరి వారంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను వాషింగ్టన్‌లో కలిశారు. ఇమ్రాన్, ట్రంప్ కలిసిన సమయానికి భారత్ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయలేదు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కోసం నిధుల సేకరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

 
ఇమ్రాన్‌ తనను కలిసినప్పుడు పీఎం మోదీ కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయాలని జపాన్‌లో తనను కోరారని ట్రంప్ చెప్పారు. అయితే, భారత్ దానిని తక్షణం ఖండించింది. ఇమ్రాన్‌ఖాన్ అమెరికా నుంచి తిరిగొచ్చాక "తనకు వరల్డ్ కప్ గెలిచి వస్తున్నట్టు" ఉందన్నారు. మధ్యవర్తిత్వం గురించి చెప్పిన ట్రంప్ పాకిస్తాన్‌ వాదనను సమర్థించారని చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా నుంచి తిరిగొచ్చి పది రోజులు కూడా కాక ముందే, భారత్ జమ్ము-కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నామని ప్రకటించింది.

 
భారత్ చేసిన ఈ ప్రకటనను ఇమ్రాన్ అసలు ఊహించలేదు. ఆయన ట్రంప్ మధ్యవర్తిత్వం మాటను తన గెలుపుగా భావిస్తున్న సమయంలో, ప్రధాని మోదీ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికే తెరదించారు. ఇమ్రాన్ ఖాన్, ట్రంప్ సమావేశమైన సరిగ్గా నెల తర్వాత మోదీ, ట్రంప్ ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో కలిశారు. ఇమ్రాన్ ఖాన్‌ కలిసినప్పుడు కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం గురించి మాట్లాడిన ట్రంప్, ఫ్రాన్స్‌లో మోదీని కలిసినప్పుడు కశ్మీర్ అంశాన్ని భారత్-పాకిస్తాన్ కలిసి పరిష్కరించుకుంటాయని అన్నారు.

 
మోదీ, ట్రంప్ సమావేశం తర్వాత పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ "ప్రపంచం కశ్మీర్‌కు అండగా నిలిచినా, నిలవకపోయినా పాకిస్తాన్ దానికోసం చివరి శ్వాస వరకూ పోరాడుతుందని" చెప్పారు. కశ్మీర్‌పై భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రతి వేదికపైనా తన మాట చెబుతూ వస్తోంది. కానీ, దానికి ఎక్కడా విజయం దక్కడం లేదు.

 
మోదీ ఇదే పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను కూడా కలిశారు. ఆయన కూడా భారత్, పాక్ కలిసి ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాయని అన్నారు. తర్వాత మోదీ యూఏఈ వెళ్లారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయేద్‌' అందుకున్నారు. యూఏఈ నుంచి మోదీకి లభించిన పురస్కారంపై పాకిస్తాన్‌లో తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ అయితే తన యూఏఈ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. తర్వాత మాట్లాడిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ "డిప్లొమసీ మతం కంటే భిన్నమైనది" అన్నారు.
webdunia

 
కశ్మీర్ పెద్ద అంశం కాలేదు
అలాంటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పాకిస్తాన్ కశ్మీర్‌ అంశంపై ప్రపంచ నేతల దృష్టిని ఆకర్షించగలదా అనే ప్రశ్న కూడా వస్తుంది. అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా ఉన్న హుసేస్ హక్కానీ ట్విటర్‌లో "ట్రంప్ ఇప్పుడు భారత్-పాకిస్తాన్ పరస్పరం కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుంటాయని చెబుతున్నారు. అంటే మధ్యవర్తిత్వం మాట అంతేనా" అన్నారు.

 
జీ-7 దేశాల సమావేశంలో కూడా కశ్మీర్ అంశం లేదు. న్యూయార్క్ టైమ్స్‌ జీ-7 సమావేశంలో ఇరాన్, చైనా ట్రేడ్ వార్ ప్రధాన అంశం అని రాసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సమావేశానికి హఠాత్తుగా ఇరాన్ విదేశాంగ మంత్రిని కూడా పిలిపించారు. ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందాన్ని తెంచుకోకూడదని యూరప్ భావిస్తోంది. ట్రంప్ కూడా ఆ ప్రయత్నాలను తోసిపుచ్చడం లేదు.

 
చైనాతో జరుగుతున్న ట్రేడ్ వార్‌పై కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. కానీ కశ్మీర్ గురించి ఈ వేదికపై ఎలాంటి చర్చ జరగలేదు. కశ్మీర్‌పై ట్రంప్ ముందు మాట్లాడిన ప్రధాని మోదీ "ఇది ద్వైపాక్షిక అంశం, ఇందులో ఏ మూడో దేశాన్నీ ఇబ్బంది పెట్టం" అన్నారు.
ఈ మాటను సమర్థించిన అధ్యక్షుడు ట్రంప్ "రెండు దేశాలు పరస్పరం ఈ సమస్యను పరిష్కరించుకోగలవని" అన్నారు.

 
మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్స్, ఆగస్టులో ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయడాన్ని పాకిస్తాన్‌తో దశాబ్దాల నుంచీ ఉన్న విధానాల్లో మార్పులుగా చూస్తున్నారు.

 
గుర్రుగా పాకిస్తాన్
ట్రంప్ మోదీ సమావేశం తర్వాత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడుతూ "ఇద్దరు నేతలు వ్యాపారం, ఇంధన వనరులు లాంటి అంశాలపై మాట్లాడారు. కానీ, కశ్మీర్‌పై ఎలాంటి చర్చలూ జరగలేదు" అన్నారు. మోదీ ట్రంప్‌తో కలిసి చేసిన సంయుక్త ప్రకటన చూస్తుంటే, ఆయన పాకిస్తాన్‌తో చర్చలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్టే అనిపిస్తోంది. ప్రధాని, "భారత్, పాకిస్తాన్ రెండూ మొదట ఒకే దేశంగా ఉన్నాయి. మేం ఈ సమస్యను కలిసి పరిష్కరించుకుంటాం" అన్నారు.
webdunia

 
భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ హిందుస్తాన్ టైమ్స్‌లో "ఇప్పుడు చర్చలు జరపడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదు. విచిత్రం ఏంటంటే ఇంతకు ముందు పాకిస్తాన్ చర్చలకు ముందుకొచ్చేది. భారత్ దాన్ని తిరస్కరించేది. కానీ, ఇప్పుడు భారత్‌తో చర్చల వల్ల అర్థం లేదని ఇమ్రాన్ ఖానే అంటున్నారు" అని చెప్పారు.

 
పాకిస్తాన్, భారత పాలిత కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తుతోంది. కానీ, ట్రంప్‌కు మానవ హక్కుల కంటే వాణిజ్య సంబంధాలే ముఖ్యం. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, మాజీ దౌత్యవేత్తలు ఇమ్రాన్ ఖాన్‌ను చుట్టుముడుతున్నారు.

 
పాకిస్తాన్ ప్రధాన విపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ జర్దారీ భుట్టో ఆగస్టు 26న మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్‌కు కశ్మీర్‌పై ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. "పాకిస్తాన్ మొదట శ్రీనగర్ తీసుకుందామని మాట్లాడేది. ఇప్పుడు ముజఫరాబాద్ కాపాడుకుందామనే మాట చెబుతోంది" అని బిలావల్ అన్నారు.

 
"దేశంలోని విపక్షాలతో యుద్ధం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్. మోదీతో మాత్రం పోరాడలేకపోతున్నారు. మోదీ ఎన్నికల్లో గెలిస్తే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని ఆయనే అన్నారు. ఇదేనా ఆ పరిష్కారం. ఇది కశ్మీర్‌ను అప్పగించడమే. ముస్లిం దేశాల్లో కూడా మోదీకి అవార్డులు ఇస్తున్నారు. అది మన విదేశాంగ విధానం వైఫల్యమా. మీకు అన్నీ ముందే తెలుసు, అయినా ఏం చేయలేకపోయారు" అన్నారు.

 
"మొదట్లో పాకిస్తాన్ విధానం భారత్ నుంచి శ్రీనగర్ లాక్కోవాలి అనేలా ఉండేది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అసమర్థత వల్ల మనం ముజఫరాబాద్‌ను ఎలా కాపాడుకోవాలా అనేలా ఉంది. ఇది మన విదేశాంగ విధానం అసమర్థత" అని విమర్శించారు. పాకిస్తాన్ ప్రముఖ పత్రిక డాన్ తన ఎడిటోరియల్‌లో "భారత్ కశ్మీర్‌లో అరాచకం సృష్టిస్తోందని ప్రపంచానికి చెప్పడంలో ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ దురదృష్టవశాత్తూ విఫలం అయ్యాయి" అని రాసింది.

 
డాన్ తన కథనంలో "మన సన్నిహిత ముస్లిం దేశాలు కూడా మోదీకి స్వాగతం పలకడంలో మునిగి ఉన్నాయి. కశ్మీర్లో భారత్ ఏకపక్ష నిర్ణయం తర్వాత కూడా ముస్లిం దేశాలు అలా చేస్తున్నాయి. మొదట కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పిన ట్రంప్ కూడా ఇప్పుడు మోదీతో కలిసిపోయారు" అని రాసింది.
webdunia

 
 
భారత్‌లో పాకిస్తాన్ హై కమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ కూడా పాకిస్తాన్‌లోని ఒక టీవీ ప్రోగ్రాంలో కశ్మీర్‌ అంశంలో ఇమ్రాన్ ఖాన్ విధానాలపై దేశంలో విమర్శలు వచ్చాయని చెప్పారు. "కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ముస్లిం దేశాల మద్దతు కూడా కూడగట్టలేకపోయింది" అన్నారు.

 
"యూఏఈ మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయేద్ ఇచ్చింది. ఆ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు. ఆ ప్రక్రియ చాలా ముందు నుంచే ప్రారంభమైంది. మోదీ చాలా తెలివైనవారు. దానికి సరైన సమయాన్ని ఎంచుకున్నారు. ఆగస్టు 5న కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసి, తర్వాత తనకు అవార్డు ఇచ్చే యూఏఈ, బహ్రెయిన్ వెళ్లాలని, పాకిస్తాన్‌కు ముస్లిం దేశాల మద్దతు పొందే అవకాశం ఇవ్వకూడదని మోదీ ముందే నిర్ణయించుకున్నారు" అని బాసిత్ అన్నారు.

 
"చైనా ఒకవైపు హాంకాంగ్‌లో నిరసనలు, మరోవైపు అమెరికాతో ట్రేడ్ వార్ సమస్యల్లో మునిగివుంది. అమెరికాకు ఇరాన్ సంక్షోభం, చైనా అంశాలే ప్రధానం. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అది ఎలాగోలా డిఫాల్టర్ కాకుండా బయటపడింది. భారత్‌లో కూడా విపక్షాలు అసమర్థంగా ఉన్నాయి. అందుకే మోదీ ప్రభుత్వ కశ్మీర్‌లో 370 రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య..ఎక్కడ.?