Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్ పే మనీ రిక్వెస్ట్ మోసాలు, ఫేస్‌బుక్ ఫేక్ అకౌంటుతో సైబర్ నేరాలు

గూగుల్ పే మనీ రిక్వెస్ట్ మోసాలు, ఫేస్‌బుక్ ఫేక్ అకౌంటుతో సైబర్ నేరాలు
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (14:26 IST)
అనంతపురంలో తెలుగు మాస్టారుగా పని చేస్తున్న కాకర్ల దివాకర్‌ నాయుడుకి తన ఆప్తమిత్రుడు కోట పురుషోత్తం నుంచి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. అర్జంట్‌గా రూ.20 వేలు కావాలి, నెంబర్‌ పంపుతున్నా గూగుల్‌ పే చెయ్యమని దాని సారాంశం. వెంటనే ఆయన పంపించారు.

 
లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు లేక ఖాళీగా ఉంటున్న టీవీ సీరియల్స్‌ నటి రోజాకు ( పేరు మార్చాం) తన సహనటి ఇందు(అసలు పేరు కాదు) నుంచి మెసెంజర్‌ నుంచి ఓ సందేశం వచ్చింది. బాబాయ్‌ ఆరోగ్యం బాగా లేదు. అర్జంట్‌గా రూ. 50 వేలు కావాలన్నది అందులో ఉన్న అభ్యర్ధన. అడిగిన మొత్తాన్ని ఇందు ఇచ్చిన నంబర్‌కు ‘ఫోన్‌పే’ ద్వారా పంపారు రోజా.

 
దివాకర్‌ నాయుడు పంపిన రూ.10వేలు కోట పురుషోత్తంకు అందలేదు. రోజా పంపిన రూ.50వేలు ఇందు కు చేరలేదు. ఇవన్నీ ఎక్కడో దూరాన్నుంచి ఆపరేట్‌ చేస్తున్న సైబర్‌ మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. చట్టాలు ఎన్నిఉన్నా వాటిని తప్పించుకుంటూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు సైబర్‌ నేరగాళ్లు. ఒక వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఎకౌంట్ ఓపెన్‌ చేయడం, స్నేహితుడి రూపంలో అవసరానికి డబ్బు అడిగి గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి పేమెంట్‌ ఆప్షన్ల ద్వారా వారి నుంచి డబ్బులు దోచేస్తున్న ఘటనలు ఇటీవలీ కాలంలో తరచూ బైటపడుతున్నాయి.

 
“సమాజంలో పేరూ, ఫాలోయర్లు ఎక్కువగా ఉన్నవారి ఫేస్‌బుక్‌ ఎకౌంట్లు సైబర్‌ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ప్రముఖుల పేరుతో నకిలీ ఎకౌంట్లు సృష్టించి వారి ఫ్రెండ్స్‌లిస్టులో ఉన్నవారి నుంచి డబ్బులులాగే మోసాలు జరుగుతున్నాయి’’ అని పొదిలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెలమూరి శ్రీరామ్‌ చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ్ పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ క్రియేట్‌ చేసిన సైబర్‌ దుండగులు, ఆయన స్నేహితులిద్దరి నుంచి వేల రూపాయలు కొట్టేశారు. దీంతో ‘’నాపేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి వాటిని నమ్మవద్దు’’ అని ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రకటించుకోవాల్సి వచ్చింది.

 
ఇది ఒక్క శ్రీరామ్‌ అనుభవమే కాదు. పలువురు సెలబ్రిటీలు, ఉన్నత హోదాలో ఉన్నవారు ఫేస్‌బుక్‌లో ఇలా హెచ్చరిక నోట్‌లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవలే విజయనగరం జిల్లాలో ఒక ఎస్సై పేరు మీద నకిలీ ఎకౌంట్‌ సృష్టించి అతని బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కేసు బైటపడింది. వ్యక్తిత్వ వికాసం, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే తిరుపతికి చెందిన కోట పురుషోత్తం విషయంలో కూడా ఇదే జరిగింది.

 
ఆయన ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌లాంటిదే మరొకటి సృష్టించి, అనంతపురంలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న కాకర్ల దివాకర్‌ నాయుడికి రిక్వెస్ట్‌ పంపి ఆయన ఎకౌంట్‌ నుంచి రూ.10వేలు కాజేశారు సైబర్‌ దొంగలు. “నేనే కాదు నాకు తెలిసిన సెలబ్రిటీలు, పెద్ద హోదా ఉన్నవారిలో ఐదారుగురు వ్యక్తులవి నకిలీ ఎకౌంట్లు పుట్టించి రిక్వెస్టులు పంపుతున్నారని తెలిసింది. తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో’’ అన్నారు కోట పురుషోత్తం.

 
మోసం ఎలా మొదలవుతుంది ?
ఫేస్‌బుక్‌లో అప్పటికే ఫ్రెండ్‌లిస్టులో ఉన్నా అదే పేరు మీద మరోసారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తుంది. మరో ఎకౌంట్‌ క్రియేట్‌ చేశారేమోననుకుని ఓకే చెప్తాం. ఆ కాసేపటికే అవతలి వ్యక్తి నుంచి మెసేజ్‌ వస్తుంది. కొంచెం డబ్బు అవసరం ఉంది అని. స్నేహితుడు ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బు అడగడం ఏంటని అనుమానించిన వారు మోసపోవడానికి అవకాశం తక్కువ. అలా కాకుండా అయ్యో ఎంత అవసరముందో అని ఆదుర్ధాపడినవాళ్లు బుట్టలో పడినట్లే.

 
“పురుషోత్తంగారు ఎప్పుడూ ఇంగ్లీషులో మెసేజ్‌ పెట్టరు. కానీ ఇంగ్లీషులో మెసేజ్‌ వచ్చినప్పుడే డౌట్‌ వచ్చింది. ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ అచ్చం ఆయన ఎకౌంట్‌లాగే కనిపించడంతో డబ్బులు పంపాను. ఎందుకైనా మంచిదని వెంటనే కాల్ చేశాను. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది” అని తాను మోసపోయిన తీరును వివరించారు దివాకర్‌ నాయుడు. “ఈ తరహా ఫేస్‌బుక్‌ మోసాల్లో రెండు రకాలుంటాయి. నకిలీ ఎకౌంట్‌ క్రియేట్‌ చేయడం ఒకటయితే, ఫిషింగ్‌ అంటే ఎకౌంట్‌ను హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ సంపాదించి నేరుగా అసలు ఎకౌంట్‌ నుంచే మోసాలకు పాల్పడటం రెండో రకం’’ అని వివరించారు సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్‌.

 
“ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు 15 వరకు వచ్చాయి. కాకపోతే అవగాహన పెరగడం వల్ల చాలామంది నకిలీ ఎకౌంట్లను గుర్తించగలుగుతున్నారు’’ అన్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్‌. ఇంతకు ముందు ఝార్ఖండ్‌లోని జామ్‌తారా ప్రాంతం నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడే ముఠాలు ఎక్కువగా పని చేసేవి. అయితే ప్రస్తుతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, అల్వార్‌లాంటి ప్రాంతాల నుంచి ఈ ఫ్రాడ్‌ టీమ్‌లు పని చేస్తున్నాయని ఏసీపీ ప్రసాద్‌ వెల్లడించారు. “ఐటీ, టెక్నాలజీ మీద పట్టున్న కుర్రాళ్లు ఈ మోసాలకు దిగుతున్నారు’’ అన్నారు ప్రసాద్‌.

 
“అనుమానం రాకుండా చిన్నచిన్న మొత్తాలను అడుగుతారు. అర్జెంట్ అవసరానికి బదులు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. ఇందులో హైప్రొఫైల్ వ్యక్తులు, సెలబ్రిటీలు మోసపోరు. వారి స్నేహితులు బాధితులుగా మారతారు” అని వెలమూరి శ్రీరామ్‌ చెప్పారు. ఫేస్‌బుక్‌ ఫిషింగ్‌లో గతంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు కూడా సైబర్‌ దుండగులకు కనిపిస్తాయి. దీంతో వారు కూడా అదే తరహా భాషతో సంభాషించి అవతలి వ్యక్తిని తేలిగ్గా నమ్మించగలగుతున్నారని సైబర్‌ నిపుణులు అంటున్నారు.

 
ఎలా జాగ్రత్తపడాలి ?
“ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ లాక్‌ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. దానితోపాటు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఎనెబుల్ చేయడం ద్వారా చాలా వరకు ఇలాంటి వాటిని అడ్డుకోవచ్చు” అన్నారు నల్లమోతు శ్రీధర్‌. అయితే అమ్మాయిల పేరుతో వలవేసి ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌లు పంపే ప్రయత్నాలు కూడా చేస్తారు దుండగులు. అలాంటి అపరిచిత రిక్వెస్టులను యాక్సెప్ట్‌ చేయకపోవడం మంచిదని సైబర్‌ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

 
“అపరిచిత వ్యక్తుల రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశారంటే వారు మళ్లీ మీ ప్రొఫైల్‌లోకి చొరబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలను రిక్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తెలిసిన వారైతేనే అంగీకరించడం మంచిది’’ అని సైబర్‌ క్రైమ్ ఏసీపీ ప్రసాద్‌ అన్నారు. “డబ్బు పంపమని ఎవరైనా స్నేహితుడు ఫేస్‌బుక్‌లో అడిగితే గుడ్డిగా పంపడం కన్నా, ఒక్కసారి ఫోన్‌ చేసి మాట్లాడితే అది నిజమో కాదో తేలుతుంది. ఈ మాత్రం జాగ్రత్త అవసరం’’ అన్నారు కోట పురుషోత్తం.

 
పట్టుకోవడం ఎలా ?
“ఫేస్‌బుక్‌ సంస్థకు ఐపీ అడ్రస్‌ పంపడం ద్వారా వారు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసారో తెలుసుకోవచ్చు. కానీ ఆ సంస్థ నుంచి స్పందన సరిగా ఉండటం లేదు. అందుకే నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్‌ ఆధారంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు ఏసీపీ ప్రసాద్‌. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డి కింద మూడు సంవత్సరాలు, ఐపీసీలో సెక్షన్‌ 419, 420 కింద ఏడేళ్ల వరకు శిక్షించే అవకాశం ఉందని ఏసీపీ ప్రసాద్‌ వెల్లడించారు.

 
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపార్ట్‌మెంట్‌ వాళ్ల పేరుతో మోసాలు చేసేవారిని పట్టుకోవడానికే పోలీసులకు సాధ్యం కావడం లేదని, సామాన్యులు చేసే ఫిర్యాదులను పట్టించుకునే పరిస్థితిలేదని సైబర్‌ నిపుణులు అంటున్నారు. కోర్టు ఆర్డర్‌లు ఉంటే తప్ప కేసు నమోదు చేసే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.

 
'గూగుల్‌ పే'తో మరో తరహా మోసం
గూగుల్‌ పే, ఫోన్‌పే పేరుతో సైబర్‌ నేరాలలో మరో రకం మోసం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తువులను అమ్మే ఓఎల్‌ఎక్స్‌లాంటి సైట్‌ల నుంచి ఫోన్‌ నంబర్లను సేకరించి బ్యాంక్‌ ఎకౌంట్లను కొల్లగొడుతున్నారు కొందరు దుండగులు. ఆన్‌లైన్‌లో పెట్టిన వస్తువు ధరను దుండగులు ఏమాత్రం బేరమాడకుండా ఓకే చేస్తారు. గూగుల్ పే లేదా ఫోన్‌పే నంబర్‌ పంపితే డబ్బులు ఎకౌంట్‌లో వేస్తామని చెబుతారు. రిసీవర్‌ లింక్‌ పంపి క్లిక్‌ దాన్ని క్లిక్‌ చేయమని అడుగుతారు. దాన్ని గమనించకుండా క్లిక్‌ చేస్తే, అమ్మే వ్యక్తి ఎకౌంట్‌ నుంచి కొనే వ్యక్తి ఎకౌంట్‌కు డబ్బు వెళ్లిపోతుంది.

 
“ఓఎల్‌ఎక్స్‌లో నేను పెట్టిన ధరకు రూపాయి కూడా బేరమాడకుండా కొనడానికి ఓ అపరిచిత వ్యక్తి కాల్‌ చేశాడు. తనకు నెట్‌వర్క్‌ ఇష్యూస్‌ వస్తున్నాయని, త్వరగా తాను పంపిన లింక్‌ క్లిక్‌ చేస్తే డబ్బులు మీ ఎకౌంట్‌లో డబ్బులు పడిపోతాయని హడావుడి పెట్టాడు. సందేహం వచ్చి లింక్‌ క్లిక్‌ చేసి చూశా. అది రిక్వెస్ట్‌ లింక్‌’’ అని దిల్లీలో తన సోఫా అమ్మడానికి ప్రయత్నించిన తెలుగు వ్యక్తి రవి తన అనుభవాన్ని వివరించారు. సెండ్‌ మనీ, రిక్వెస్ట్‌ మనీ ఆప్షన్ల ఎంపికలో తొందరపాటుగా వ్యవహరిస్తే ఎకౌంట్‌ నుంచి డబ్బులు మాయమవడం ఖాయమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 
వాట్సప్‌ కాల్స్‌తో జాగ్రత్త
అందమైన అమ్మాయిల ద్వారా అబ్బాయిలతో మాట కలిపి ఆ తర్వాత వారిని బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బు లాగడం మరో తరహా మోసం. “అమ్మాయిల నుంచి వాట్సప్‌ కాల్‌ అనగానే అబ్బాయిలు ఐసయి పోతారు. అవతలి వ్యక్తులు వీరిని జాగ్రత్తగా ముగ్గులోకి దింపుతారు. నగ్నంగా చూడాలనుందని రెచ్చగొడతారు. వారు ఆ పనికి దిగగానే స్క్రీన్‌ షాట్లు తీసి బెదిరింపులు మొదలు పెడతారు’’ అని ఏసీపీ ప్రసాద్‌ వెల్లడించారు. అపరిచిత వ్యక్తులతో కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా లేకపోతే బ్లాక్‌మెయిల్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. సోషల్‌ మీడియాను ప్లాట్‌ఫామ్‌లను వాడుకునే విషయంలో జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు తప్పవని సైబర్‌ క్రైమ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. యాపిల్ ప్రకటన