పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన రోగాలు రావంట. ఒంటరిగా ఉంటున్న వాళ్లతో పోల్చితే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని.. ఆరోగ్యకరంగా జీవించేందుకు పెళ్లి ఓ చక్కని మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయంపై బ్రిటన్‌లో 10 లక్షల మందిపై అధ్యయనం జరిగింది. వారంతా అధిక రక్తపోటు.. డయాబెటిస్ వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారే. వీళ్లలో ఒంటరిగా ఉంటున్న వారికంటే పెళ్లైన వారు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనూ.. వివాహితులు తొందరగా కోలుకుంటున్నారని తేలింది.
ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 50 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిని పరిశీలిస్తే.. అవివాహితుల కంటే వివాహితులు 16శాతం ఎక్కువ కాలం బతుకుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
వివాహంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే.. పెళ్లై విడిపోయిన, భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న వారి విషయంలో మాత్రం పరిశోధకులు ఓ స్పష్టతకు రాలేదు.