Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విక్రయానికి విశాఖపట్టణం... కేంద్రం నోటిఫికేషన్ జారీ

విక్రయానికి విశాఖపట్టణం... కేంద్రం నోటిఫికేషన్ జారీ
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉండే విశాఖపట్టణం నగర భవిష్యత్‌ ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పిలుచుకునే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం పూర్తిగా ప్రైవేట్‌పరం చేయనుంది. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇపుడు విశాఖలోని అత్యంత విలువైన భూములను కేంద్రం అమ్మకానికిపెట్టింది. అవికూడా ప్రభుత్వ స్థలాలు కావడం గమనార్హం. 

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ భూములను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వరంలోని నవరత్న సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) ప్రకటన చేసింది. ఇందులో బీచ్ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల భూమి సహా మొత్తం 18 ఆస్తులు ఉన్నాయి. అలాగే, బీచ్ రోడ్డు మార్గంలోని భూమి ధరను రూ.1,452 కోట్లుగా ఎన్‌బీసీసీ నిర్ణయించింది.

స్థలాల వివరాలు, వాటి ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి? వంటి పలు వివరాలను ఎన్‌బీసీసీ ఇంటర్నెట్‌లో పెట్టింది. 

‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా కొన్ని స్థలాలను ఏపీ ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించిందని, ఆయా స్థలాలకు ప్రభుత్వం తరపున తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని తెలిపింది. దరఖాస్తు ఫారాన్ని కూడా ఇంటర్నెట్‌లో పెట్టింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ ముందస్తు మొత్తం (ఈఎండీ) సమర్పించాలని సూచించింది.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాల పేరుతో నిధులన్నీ పంచిపెడుతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా నిండుకుంది. చేతిలో రూపాయి లేక ఉద్యోగులకు జీతాలివ్వడానికి నానా తంటాలు పడుతోంది. ఇపుడు, పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో ఖరీదైన భూములను వేలానికి పెట్టింది. ఇంతకుముందు కూడా ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్న స్థలాలను, పరిశ్రమలకు ఉద్దేశించిన భూములను వేలం వేస్తామని ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే, ప్రభుత్వం అమ్మదలచిన బీచ్‌ రోడ్డు స్థలానికి సంబంధించి.. తప్పనిసరిగా కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) అనుమతులు తీసుకోవాలి. తీరానికి అతి సమీపాన అంత పెద్ద భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులు లభిస్తాయా అనేది అనుమానమే. ఇది ఎంతవరకు ముందుకు వెళుతుందనేది వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలెబ్రిటీలు ఓవర్.. ఇక సీఎంల వంతు.. త్రిపుర సీఎంకు కరోనా