Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?

Advertiesment
జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
, శనివారం, 14 నవంబరు 2020 (11:04 IST)
బెర్లిన్‌లో నాలుగేళ్లు గడిపిన తర్వాత అక్కడి సంస్కృతి, వాతావరణం నాకు క్రమంగా అర్థం కావడం మొదలైంది. నేను పుట్టిపెరిగిన అమెరికాతో పోలిస్తే.. ఇక్కడ నగ్నంగా గడపడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అమెరికాలో నగ్నత్వాన్ని శృంగార కోణంలో చూస్తుంటారు. కానీ, ఇక్కడ రోజువారి సాధారణ కార్యక్రమాల్లోనూ ప్రజలు నగ్నంగా కనిపిస్తుంటారు. నగ్నంగా అవిరి స్నానం చేసే గదులు, స్విమ్మింగ్‌ పూల్‌లో నగ్నంగా ఈత కొట్టడం లాంటివి నేను చాలాసార్లు చూశాను.

 
ఒకసారి బెర్లిన్‌లో నేను మసాజ్ కేంద్రానికి వెళ్లాను. అయితే, అక్కడ బట్టలు విప్పాలని అమెరికన్లకు మేము చెప్పాల్సి వస్తుందని మసాజ్ చేసే వ్యక్తి వ్యాఖ్యానించారు. జీవితంలో తొలిసారి నగ్నంగా ఉండేవారిని బహిరంగంగా చూసిన ఘటనను మనం ఎప్పుడూ మరచిపోలేమని అంటారు. బెర్లిన్‌ దక్షిణ న్యూకోల్న్ జిల్లాలోని హసన్‌హెయిడ్ పార్క్‌లో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. అక్కడ మధ్యాహ్నం కొందరు నగ్నంగా ఎండలో పడుకొని ఉన్నారు.

 
తర్వాత కొందరు స్నేహితులతో మాట్లాడటం, గూగుల్‌లో సెర్చ్ చేయడంతో పరిస్థితులు నాకు అర్థమయ్యాయి. బెర్లిన్‌లో సిటీ పార్కులు, బీచ్‌లలో నగ్నంగా తిరగడం సర్వ సాధారణమని తెలుసొచ్చింది. నగ్నత్వాన్ని ఇక్కడ ఎవరూ పరువు తక్కువగా లేదా అగౌరవంగా చూడరు. దీన్ని ‘‘ఫ్రీ బాడీ కల్చర్‌’’గా పిలుస్తుంటారు. జర్మన్‌లో దీని పేరు ‘‘ఫ్రీకోపెర్‌కల్చర్(ఎఫ్‌కేకే)’’గా వ్యవహరిస్తుంటారు. జర్మనీ డెమొక్రటిక్ రిపబ్లిక్ (ఈస్ట్ జర్మనీ-జీడీఆర్) జీవన విధానంలో ఇది కూడా భాగమే. దీని మూలాలు మనకు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. ప్రకృతిలో బట్టలు లేకుండా గడపడాన్ని ఒకవైపు సమాజానికి ప్రతిఘటనగా మరోవైపు అన్నింటి నుంచి ఉపశమనానికి సూచనగా చెబుతుంటారు.

 
‘‘నగ్నత్వం అనేది జర్మన్ సంప్రదాయంలో ఎప్పటి నుంచో భాగంగా వస్తోంది’’అని బెర్లిన్‌లోని ఫ్రేయీ యూనివర్సిటీలో ఆధునిక చరిత్ర విభాగం ప్రొఫెసర్ ఆర్నెడ్ బార్కాంపెర్ చెప్పారు. 20వ శతాబ్దం మొదట్లో ఇక్కడ లెబెన్స్‌రిఫార్మ్ (జీవన సంస్కరణ) ఉద్యమం పుట్టుకొచ్చింది. రసాయనాలు వాడని ఆహారం తీసుకోవడం, నచ్చిన వ్యక్తులతో స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనడం, సంప్రదాయ వైద్య విధానాలు, ప్రకృతితో వీలైనంత అనుంధానమై గడపడం లాంటి చర్యలను ప్రజలు జీవిన విధానాల్లో కలుపేసుకున్నారు.

 
‘‘ఈ ఉద్యమంలోనే నగ్నత్వం కూడా ఒక భాగం. 19వ శతాబ్దం చివర్లో ఆవిర్భవించిన ఆధునిక సమాజానికి వ్యతిరేకంగా ఇది పుట్టింది’’అని ఆర్నెడ్ వివరించారు. బెర్లిన్ సహా పెద్ద పెద్ద నగరాల్లో ఈ కొత్త జీవన శైలి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని లీబ్నిజ్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ హిస్టరీ పోట్స్‌డామ్‌లో చరిత్రకారుడైన హన్నో హోక్‌ముథ్ చెప్పారు. వేయ్‌మార్ కాలం (1918-1933)లో చాలా కొద్ది మంది బీచ్‌లలో నగ్నంగా ఎండలో పడుకోవడం మొదలైంది. నిరంకుశ ప్రభుత్వం(1871-1918), కట్టుబాట్ల నుంచి నుంచి విముక్తికి దీన్ని ప్రతీకగా భావించేవారని ఆర్నెడ్ వివరించారు.

 
1926లో ఆడ, మగ కలిసి నగ్నంగా కసరత్తులు చేయడాన్ని ప్రోత్సహిస్తూ ఆల్ఫ్రెడ్ కోచ్ బెర్లిన్ స్కూల్ ఆఫ్ న్యూడిజంను స్థాపించారు. ఆరుబయట నగ్నంగా తిరగడమనేది ప్రకృతిలో మమేకం కావడమేనని, ఆరోగ్యానికి ఇది మంచిదని భావించేవారు. అయితే ఇలా నగ్నంగా తిరగడాన్ని నాజీలు నిషేధించారు. 1942లో నాజీ ప్రభుత్వం మళ్లీ నగ్నత్వంపై ఆంక్షలను సడలించింది. అయితే, వేధింపులకు గురైన యూదులు, కమ్యూనిస్టులకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు.

 
యుద్ధం అనంతరం జర్మనీని రెండు ముక్కలుగా విభజించిన తర్వాతే మళ్లీ నగ్నంగా ఆరుబయట గడపడం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తూర్పు జర్మనీలో మధ్య తరగతితో మొదలుపెట్టి అందరూ క్రమంగా ఈ విధానాలను అనుసరించారు. ‘‘కమ్యూనిస్టు జీడీఆర్‌లో గడిపేవారికి విదేశీయానం, వ్యక్తిగత హక్కులు, కొన్ని వస్తువుల విక్రయాలపై ఆంక్షలు కొనసాగాయి. దీంతో ఎఫ్‌కేకేతో ప్రజలకు కొంత ఉపశమనం కలిగినట్లు అనిపించేది. అన్నింటిపైనా నియంత్రణ విధించే ప్రభుత్వం నడుమ నగ్నంగా బీచ్‌లలో పడుకొని ప్రజలు కాస్త ఉపశమనం పొందేవారు’’అని ఆర్నెడ్ వ్యాఖ్యానించారు.

 
ఈ విషయంతో ఈస్ట్ బెర్లిన్‌లో పుట్టి పెరిగిన హాక్‌ముథ్ ఏకీభవించారు. తను చిన్నప్పుడు బీచ్‌లలో ఇలా నగ్నంగా పడుకొనేవారిని చాలా మందిని చూశారు. ‘‘వారిలో ఒకరకమైన స్వేచ్ఛ, విముక్తి కనిపించేది. అయితే దీన్ని అధికారికంగా అనుమతించాలని కమ్యూనిస్టు పార్టీని వారు కోరేవారు’’ ఆయన చెప్పారు.

 
ప్రభుత్వం, పోలీసుల కళ్లు గప్పి తూర్పు జర్మన్లు ఇలా ఆరుబయట నగ్నంగా తిరగడాన్ని, పడుకోవడాన్ని, సేద తీరడాన్ని కొనసాగించేవారు. 1971లో ఎరిక్ హోనెకెర్ అధికారంలోకి రావడంతో నగ్నత్వంగా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇక్కడి ప్రజలకు లభించింది. ‘‘ఎరిక్ హయాంలో జీడీఆర్‌లో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. విదేశీ విధానాలతోపాటు అంతర్గత విధానాలను సరళతరం చేశారు’’అని ఆర్నెడ్ వివరించారు. ‘‘మేం ఇక్కడ నగ్నంగా తిరగడాన్ని అనుమతిస్తున్నాం. ప్రోత్సహిస్తున్నాం కూడా. మాది స్వేచ్ఛాయుత సమాజం అని హాయిగా జర్మన్లు చెబుతుంటారు’’అని ఆర్నెడ్ చెప్పారు.

 
1990లో తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీతో కలవడంతో.. తూర్పు ప్రాంతంలో నిబంధనలు ఎత్తివేశారు. అయితే, క్రమంగా నగ్నంగా బయట తిరగడమూ తగ్గింది. 1970, 80ల్లో బీచ్‌లు, పార్క్‌లలో లక్షల మంది నగ్నంగా కనిపించేవారు. అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2019లో కేవలం 30,000 మంది మాత్రమే నగ్నంగా బీచ్‌లో పడుకోవడానికి తమ వద్ద రిజిస్టర్ చేయించుకున్నారని ద జర్మన్ అసోసియేషన్ ఫర్ ఫ్రీ బాడీ కల్చర్ తెలిపింది. వారిలో చాలా మంది 50, 60ల వయసులో ఉన్నవారేనని పేర్కొంది.

 
ఇప్పటికి కూడా జర్మనీ సంస్కృతిపై, ముఖ్యంగా తూర్పు జర్మనీ సంస్కృతిపై ఎఫ్‌కేకే ప్రభావం కనిపిస్తుంది. ‘‘నగ్నంగా తిరిగేందుకు గుర్తించిన ఒక బీచ్‌లో నగ్నంగా పడుకున్న వ్యక్తి బ్యాగును ఓ పంది పట్టుకొని పరిగెత్తింది’’లాంటి శీర్షికతో ఇక్కడ వార్తలు కనిపిస్తుంటాయి. ఎఫ్‌కేకేతోపాటు ఏళ్ల నుంచీ ఇక్కడ కొనసాగుతున్న నగ్నంగా తిరిగే అలవాట్లు, సంప్రదాయాలు దేశ వ్యాప్తంగా ‘‘నగ్నంగా తిరిగే ప్రాంతాలు’’ నెలకొల్పడానికి బాటలు పరిచాయి. చాలాచోట్ల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో వీటికి దగ్గరి సంబంధాలుంటాయి. వీటిని వెతికేందుకు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరముండదు.

 
ఎండలో నగ్నంగా పడుకొనేందుకు అనుమతించే బీచ్‌లు, నగ్నంగా ఆవిరి స్నానంచేసే కేంద్రాలు, స్పాలు లాంటి ప్రాంతాల జాబితా మనకు Nacktbaden.deoffers వెబ్‌సైట్‌లో తేలిగ్గానే దొరుకుతాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించాలని అనుకునే వారి కోసం న్యూడ్ యోగా, వాలీ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌లను కూడా ద స్పోర్టింగ్ క్లబ్ ఎఫ్‌ఎస్‌వీ అడాల్ఫ్ కోచ్ అందుబాలోకి తెచ్చారు. తూర్పు జర్మన్లను ఎఫ్‌కేకే సంస్కృతి ఒకచోటకు చేరుస్తోంది. తూర్పు జర్మనీలోని న్యూడ్ బీచ్‌లను చూస్తూ సిల్వా స్టెర్న్‌కోఫ్ పెరిగారు. ఫ్రీ బాడీ కల్చర్‌లో కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని తమ పిల్లలకు అందించాలని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. మన శరీరం గురించి మనం విశాల దృక్పథంతో ఉండటాన్ని ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు.

 
‘‘ఇప్పటికీ చాలా మంది తూర్పు జర్మన్లు ఈ విధానాలను అనుసరిస్తుంటారు. నా పిల్లలకు కూడా దీన్ని నేర్పించాలని నేను భావిస్తాను. మన శరీరం గురించి మనం సిగ్గుపడకూడదని పిల్లలకు చెబుతాను’’అని ఆమె చెప్పారు. ‘‘నగ్న శరీరాలను శృంగారానికి అతీతంగా చూడటమనేది.. ప్రజలను రూపురేఖలకు అతీతంగా చూసేందుకు సహకరిస్తుంది. కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని చూసేందుకు తోడ్పడుతుంది’’అని ఆమె వివరించారు.

 
‘‘మీకు నగ్నంగా కనిపించేవారిని చూడటం అలవాటు అయితే, వారిని చూసినప్పుడు పెద్దగా ఆలోచనలేమీ రావు’’అని ఆమె చెప్పారు. ‘‘తూర్పు జర్మనీలో అందరిలోనూ ఒకటి కచ్చితంగా కనిపిస్తుంది. ముఖం, రూపురేఖలు చూసి మనుషులు ఎలాంటి వారో ఒక అంచనాకు రారు. వారు మనసును చూస్తారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడికే భర్త నుంచి అప్పు తీసిచ్చిన భార్య, అది కాస్తా బయటపడటంతో...