Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Galwan Valley - America: భారత్-చైనా సరిహద్దు వివాదంలో భారత్‌కు అమెరికా పూర్తిగా మద్దతు ఇస్తుందా? ఇస్తే ప్రతిఫలంగా ఏం కోరుకుంటోంది?

Advertiesment
modi - biden
, బుధవారం, 15 జూన్ 2022 (19:40 IST)
గత కొన్ని రోజులుగా, ఇద్దరు సీనియర్ యూఎస్ అధికారులు భారతదేశం, చైనా మధ్య లద్దాఖ్ లో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన ప్రకటనలు చేసారు. ఈ వ్యాఖ్యల పై చైనా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. చైనా దూకుడు వైఖరి పై అమెరికా ఆందోళన వ్యక్తం చేయగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా ఆరోపించింది. ఈ ప్రకటనలను భారత్ ఎలా చూస్తోంది?

 
యుఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఫ్లిన్ బుధవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, లద్దాఖ్‌లో చైనా చేస్తున్న కార్యకలాపాలపై ఒక ప్రకటన చేశారు. "లద్దాఖ్‌లో జరుగుతున్న సైనిక కార్యకలాపాల స్థాయి చూస్తుంటే కళ్లు తెరిపించేలా ఉన్నాయి. వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో చైనా కొన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని అనుకుంటున్నాను. దీని పై అప్రమత్తత అవసరం" అని ఫ్లిన్ అన్నారు. ఆయన చేసిన ప్రకటన పై చైనా వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. లద్దాఖ్ పై యుఎస్ మిలిటరీ అధికారి చేసిన ప్రకటన సిగ్గుచేటు అని అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావ్ లీజాన్ అమెరికాను విమర్శించారు.

 
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ కూడా చైనా దూకుడు వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-లా సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ మాట్లాడుతూ, చైనా దూకుడు వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్‌కు మద్దతుగా మాట్లాడారు. భారత్‌తో సరిహద్దులో చైనా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోందని.. అమెరికా తన మిత్ర దేశాలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. అమెరికా సైనికాధికారులు ఈ ప్రకటన చేసినప్పటి నుంచి , భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ బీజేపీపై దండెత్తాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ అంశంపై ప్రకటన చేసింది.

 
భారత్ చాలా మధ్య వివాదానికి లద్దాఖ్ మూలకారణం ఎందుకయింది?
ఏప్రిల్ 2020లో తూర్పు లద్దాఖ్ లో వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర చైనా సైనిక బారికేడ్‌ను నిర్మించడంతో తాజా వివాదం మొదలయింది. గల్వాన్ వ్యాలీ, ప్యాంగ్ యాంగ్ త్సో, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాలు తలపడ్డాయి. జూన్ 15న జరిగిన ప్రతిష్టంభన హింసాత్మకంగా మారింది. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. తరువాత చైనా తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు కూడా మరణించినట్లు అంగీకరించింది. అయితే చైనాలో మరింత మంది సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంటారు.

 
ఫిబ్రవరి 2021లో, రెండు దేశాలు పాంగోంగ్ త్సో ఉత్తర , దక్షిణ తీరాల వెంబడి దశలవారీగా సైనిక చర్యల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. గోగ్రా హాట్ స్ప్రింగ్స్, డెమ్‌చోక్, దేప్సాంగ్ వంటి ప్రాంతాల దగ్గర వివాదం కొనసాగుతోంది. ఎల్‌ఏసీ కు సంబంధించి భారత్, చైనాల మధ్య కనీసం 12 ప్రదేశాల్లో చాలా సంవత్సరాలుగా వివాదాలున్నాయి. జూన్ 2020 తర్వాత, రెండు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో 14 రౌండ్ల చర్చలు జరిగాయి.

 
అమెరికా వ్యాఖ్యల పై చైనా స్పందన ఏంటి?
అమెరికా జనరల్ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ లీజాన్ స్పందిస్తూ.. సరిహద్దు వివాదం రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారమని అన్నారు. "ప్రస్తుతం, చైనా, భారతదేశం సరిహద్దుకు సంబంధించిన పరిస్థితి సుస్థిరంగా ఉంది. ఇరు దేశాల సైన్యాలు పశ్చిమ విభాగంలోని చైనా- భారత్ సరిహద్దు దగ్గర చాలా ప్రాంతాల్లో వైదొలిగే ప్రక్రియ పూర్తయింది. సరిహద్దు విషయం ఇరు దేశాలకు సంబంధించింది" అని అన్నారు. "ఇరు దేశాలు ఈ సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నాయి. కొంత మంది యూఎస్ అధికారులు ఈ విషయాన్ని వేలెత్తి చూపించి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించి కలహాలు సృష్టించాలని చూశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం" అని అన్నారు.

 
ఈ ప్రకటనకు ముందు కూడా లద్దాఖ్ సరిహద్దు వివాదం గురించి చైనా అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సెప్టెంబరు 2021 నుంచి చైనా ప్రభుత్వం సమకూర్చిన నిధుల సహాయంతో హ్యాకర్లు 7 ప్రభుత్వ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ల పై దాడి చేశారని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఒక నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు లద్దాఖ్ దగ్గర విద్యుత్ సరఫరా కేంద్రాల పై రెండు సార్లు దాడి చేసేందుకు ప్రయత్నించారని చెబుతూ అమెరికా చేసిన వాదనలను కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ ధృవీకరించారు. అయితే, ఈ హ్యాకర్లు చైనా ప్రభుత్వానికి సంబంధించిన వారని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఈ నివేదికకు చైనా స్పందిస్తూ అమెరికా చైనాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని అంది. "చైనా హ్యాకింగ్ గురించి అమెరికా ప్రభుత్వం, కొన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఒక పద్ధతి ప్రకారం ప్రచారాన్ని నిర్వహించడాన్ని గమనిస్తున్నాం" అని లీజాన్ అన్నారు.

 
చైనా ఎందుకలా ప్రకటన చేసింది?
అయితే, చైనా అమెరికా పై అంత తీవ్రమైన ఆరోపణలను ఎందుకు చేసింది? ఈ ప్రకటనను భారత్ ఎలా చూస్తుంది? క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న మార్పుల పై భారత్ దృష్టి పెట్టాలి అని చైనా వ్యవహారాల నిపుణులు మనోజ్ కేవల్‌రమణి అన్నారు. "ఎవరేమంటున్నారనే విషయం గురించి ఆందోళన చెందకుండా, క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2017 నుంచి వస్తున్న డేటా చూస్తుంటే, మౌలిక సదుపాయాల కల్పన, వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్థావరాన్ని ఏర్పాటు చేసే కార్యకలాపాలు పెరిగాయి. ఇది భారత జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చు" అని ఆయన అన్నారు.

 
"చైనా నుంచి వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యపరచలేదు. చైనా మిగిలిన ప్రపంచాన్ని కూడా అమెరికా పట్ల ఉన్న వైషమ్యపు కోణంలోనే చూస్తుంది. ఇలాంటి స్పందన రావడం సాధారణమే" అని అన్నారు. ఈ వాదనను చైనా వ్యవహారాల నిపుణులు అల్కా ఆచార్య కూడా సమర్ధించారు. "చైనా ఇలా స్పందించడం చాలా సహజం. ఈ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోవడం చైనాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం భారత్ వైపు నుంచి కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలి. చర్చలు జరుగుతున్నాయి. చైనా ఎటువంటి ఒప్పందం చేస్తుందో చూడాలి. కానీ, చైనా దృష్టిలో అమెరికా రెండు దేశాలను విడదీయాలని చూస్తోందని భావిస్తోంది".

 
భారత్-చైనా వివాదంలో అమెరికా ఎక్కడుంది?
భారత్ చైనా మధ్య లద్దాఖ్ వివాదం 2020లో మొదలయింది. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో అమెరికన్ అధికారులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల చైనా చేసిన ప్రకటనకు కూడా ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. చైనా వాస్తవ నియంత్రణ రేఖ ను ఉల్లంఘిస్తే భారత్ ను రక్షించేందుకు రష్యా ముందుకు రాదని రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలయిన నెల రోజుల తర్వాత భారత్ కు విచ్చేసిన అమెరికా డిప్యూటీ భద్రతా సలహాదారు దలీప్ అన్నారు. ఈ ప్రకటన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మార్పులేమైనా వచ్చాయేమోననే ప్రశ్నలు ఎదురయ్యాయి. "అమెరికా విదేశాంగ విధానం దగ్గరకొచ్చేసరికి బైడెన్ కూడా ట్రంప్ విధానాన్నే కొనసాగిస్తున్నారు.

 
అయితే, ట్రంప్ పాలనలో మొదలైన మిత్ర దేశాలతో ఉన్న ఉద్రిక్తతలను బైడెన్ పాలనలో తగ్గడమే ప్రధానమైన మార్పు" అని మనోజ్ అన్నారు. "అయితే, చైనాకు సంబంధించిన విధానంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులు పెరిగాయి. మిలిటరీ, ఆర్ధిక విధానాలకు సమన్వయం ఉండేలా చూసుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో చేయాల్సింది చాలా ఉంది" అని ఆయన అన్నారు. సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులను భారత్ చాలా జాగ్రత్తగా గమనిస్తోందని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 
"సరిహద్దులను పరిరక్షించుకోవడం ముఖ్యం. సరిహద్దులో పరిస్థితిని ఏకపక్షంగా మార్చేసే ప్రయత్నాలను మేమెప్పటికీ అంగీకరించం. అందుకు తగిన సమాధానాన్ని మీరెదుర్కోవాల్సి ఉంటుంది" అని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ స్పష్టం చేశారు. "భద్రత విషయానికొస్తే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాం. భారత్ ను సురక్షితంగా ఉంచేందుకు మనకి సహాయం చేస్తున్న మిత్ర దేశాల పాత్రను కూడా గుర్తిస్తాం. మాకున్న అవకాశాల పై ఎవరినీ నిర్ణయం తీసుకోనివ్వం" అని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అమెరికా విదేశాంగ విధానాన్ని భారత్ ఎలా చూస్తోందనే ప్రశ్న ఉదయిస్తుంది.

 
"చైనాతో ఉన్న వివాదాన్ని భారత్ సొంతంగానే పరిష్కరించుకోవాలని చాలా మంది భావిస్తారు. అమెరికా చైనా వ్యవహారంలో తలదూర్చాలనుకుంటే, పూర్తిగా భారత్ వైపు నిలబడాలి. కానీ, దలీప్ సింగ్ కూడా ప్రకటన చేశారు. భారత్ అమెరికా వైపు నిలబడి రష్యాకు వ్యతిరేకం అవ్వాలని అమెరికా భావిస్తోంది. కానీ, అమెరికా చైనా విషయంలో భారత్ కు మద్దతుగా నిలబడుతుందనే ప్రకటనను ఇప్పటి వరకు చేయలేదు. భారత్ ను అమెరికా వైపు నిలబడేలా చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటనను చూస్తుంటే భారత్ చైనా ల మధ్య మరొకరు జోక్యం చేసుకొనవసరం లేదని చెప్పినట్లు స్పష్టమవుతోంది" అని అల్కా ఆచార్య అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఐడీఏఐ కీలక నిర్ణయం.. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు..?