Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

eBike Explosion: ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?

eBike Explosion: ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
, శనివారం, 26 మార్చి 2022 (23:01 IST)
తమిళనాడులోని వెల్లూర్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో ఇద్దరు మరణించారు. చిన అల్లపురానికి చెందిన దురైవర్మ(49) కేబుల్ టీవీ ఆపరేటర్. ఆయన కుమార్తె మొహన ప్రీతి (13) పోలూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. 

 
వీరు రెండు రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. బైక్‌కు చార్జింగ్ పెట్టి, బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయారు. అయితే, ఉదయం 3 గంటల సమయంలో ఒక్కసారిగా బైక్ పేలిన శబ్దం వచ్చింది. ఆ మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో వీరు బాత్‌రూమ్‌లోకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ విషపూరిత పొగ వ్యాపించడంతో వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మరణించారు.

 
‘‘ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం. వారు బైక్ కొన్న షోరూమ్‌కు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నాం. బహుశా రాత్రి సమయంలో విద్యుత్ వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు’’అని వెల్లూర్ డీఎస్‌పీ రాజేశ్ ఖన్నా బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

 
ఈ-బైక్‌లతో జాగ్రత్త..
ఎలక్ట్రిక్ బైక్‌లనే ఈ-బైక్‌లని పిలుస్తుంటారు. పర్యావరణహితమైన వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు, పన్ను రాయితీలను కూడా ప్రకటించింది. అయితే, ఈ బైక్‌లు ఒక్కోసారి అగ్ని ప్రమాదానికి గురవుతుంటాయి. వీటిలో అమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే దీనికి కారణం. ఈ బ్యాటరీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదం జరిగే ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 
లిథియం అయాన్ బ్యాటరీలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్యాటరీలను వందల సార్లు చార్జింగ్ పెట్టుకోవచ్చు. వీటి బరువు కూడా తక్కువే. మిగతా బ్యాటరీలతో పోలిస్తే, వీటిలో ఉపయోగించే లోహాల ప్రమాదకర స్థాయిలు కూడా తక్కువే. అయితే, ఇవి పూర్తిగా సురక్షితమైనవని కూడా చెప్పలేం.

 
ఎందుకు పేలుతుంటాయి?
లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. వీటి మధ్య ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉంటుంది. బ్యాటరీని చార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఆవేశపూరిత అయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొక ఎలక్ట్రోడ్‌కు పయనిస్తుంటాయి. అయితే, ఈ ఎలక్ట్రోడ్‌ల మధ్య నుండే ఎలక్ట్రోలైట్ ద్రావణం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది. ఇలా అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా బ్యాటరీ దెబ్బ తిన్నప్పుడు, విపరీతంగా వేడెక్కినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది. అందుకే ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉండే బ్యాటరీలను విమానాల్లో కూడా అనుమతించరు. ఈ-బైక్‌ల కాల పరిమితి ఎక్కువే ఉంటుంది. ఈ-కార్లు కూడా ఇటీవల కాలంలో ప్రముఖ్యం సంతరించుకున్నాయి. టెస్లా లాంటి కొన్ని సంస్థ ఈ-బస్సులను కూడా తీసుకొచ్చాయి.

 
ప్రమాదాలను అడ్డుకోవడం ఎలా?
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలనే వాటి నిర్వహణకు కొన్ని చర్యలు అవసరమని ఈ-బైక్ గోసైకిల్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ థోర్పే చెప్పారు.

 
సరైన భద్రతా ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే ఈ బైక్‌లను కొనుగోలు చేయాలి.
వాహనాలు కొనుగోలు చేసేముందే, కస్టమర్ మాన్యువల్‌ను పూర్తిగా చదవాలి.
బ్యాటరీకి తగిన బ్రాండ్ చార్జర్‌నే వాడాలి. తెగిపోయిన వైర్లుండే చార్జర్‌లను పక్కన పెట్టేయడమే మంచిది. ముఖ్యంగా చార్జింగ్ పెట్టేటప్పుడు గోడకు అమర్చివుండే ఫ్లగ్ పాయింట్లు ఎంచుకోవాలి.
చార్జింగ్ పెట్టేచోట స్మోక్ డిటెక్టర్ ఉండేలా చూసుకోవాలి. ఆ అలారం కూడా మనకు వినపడేలా చూసుకోవాలి.
బ్యాటరీ నీటిలో మునిగితే, అది దెబ్బతిన్నట్లుగా భావించాలి. అలా నీట మునిగిన బ్యాటరీలకు చార్జింగ్ పెట్టకూడదు.
ఈ-బైక్ బ్యాటరీలను ఐదేళ్లకొకసారి మారిస్తే మంచిది.
పాడైన లిథియం అయాన్ బ్యాటరీలను ఇళ్లలో ఉంచుకోవడం మంచిదికాదు. అలాంటి బ్యాటరీలను ఎలా నిర్వీర్యం చేయాలో కంపెనీలు సూచనలు ఇస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా పాటించాలి.
మార్కెట్లలో లభించే సెకండ్ హ్యాండ్ బ్యాటరీలను కొనుగోలు చేయకూడదు.
రాత్రిపూట బైక్‌లను చార్జింగ్ పెట్టి అలానే వదిలేయకూడదు.
ఈబైక్‌లను మరీ వేడిగా ఉండే లేదా మరీ చల్లగా ఉండే ప్రాంతాల్లో వదిలేయకూడదు.

 
అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలి?
అగ్ని ప్రమాదాలకు కారణం బ్యాటరీలే. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదానికి ముందు, కొన్ని సంకేతాలు వస్తుంటాయి. వింత వాసన, శబ్దాలు రావడం, పొగ రావడం లాంటివి మనం గమనించాలి. ప్రమాదం సంభవిస్తే, దాన్ని ఆపేందుకు మీరు సొంత ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. లిథియం అయాన్ బ్యాటరీ నుంచి వచ్చే మంటలు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ బ్యాటరీలు పేలేటప్పుడు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే, వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడమే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాయ్‌ఫ్రెండ్‌ కోసం కన్నబిడ్డను చంపేసింది.. మద్యం తాగించి..?