పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ... తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమెనికాకు తీసుకెళ్లారని ఆరోపించారు. భారత్‌కు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో మాట్లాడించడానికి తీసుకెళుతున్నామంటూ కిడ్నాపర్లు తనకు చెప్పారని ఆయన ఆరోపించారు.
అంతకు ముందు మెహుల్ భార్య ప్రీతి కూడా మెహుల్ కిడ్నాప్ అయ్యారని పేర్కొన్నారు. మెహుల్ లాయర్లు కూడా వివిధ సందర్భాల్లో ఇదే విషయం చెప్పారు. ఆంటిగ్వా పోలీసులు తనను కిడ్నాప్ చేశారని జూన్ 2న చేసిన ఫిర్యాదులో పేర్కొన్న మెహుల్ చోక్సీ, ఈ కేసుకు సంబంధించి తన ఫిర్యాదులో అనేక విషయాలు పేర్కొన్నారు.
నాకు కరెంట్ షాక్ ఇచ్చారు
''మే 23న బార్బారా జబారికా తనను ఇంటి నుంచి తీసుకెళ్లాలని కోరింది. ఆమె నాకు చాలా కాలంగా స్నేహితురాలు. ఆమె కొన్నాళ్లు మా ఇంట్లో కూడా ఉంది. సాయంత్రం 5కు నేను బార్బరా ఇంటికి వచ్చాను. కాసేపటి తర్వాత ఆంటిగ్వా పోలీసులమని చెప్పుకున్న 8-10 మంది దృఢకాయులు ఇంట్లోకి ప్రవేశించారు. నన్ను తీవ్రంగా కొట్టారు. నా శరీరానికి కరెంటు షాక్ ఇచ్చారు. దాంతో నా చర్మం కమిలి పోయింది. నా ఫోన్, రోలెక్స్ వాచ్, పర్స్ లాక్కున్నారు. నా కళ్లకు గంతలు కట్టి, అక్కడి నుంచి తీసుకెళ్లారు'' అని చోక్సీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బార్బారా ఇంటి వెనక భాగం నుంచి తీసుకెళ్లి ఓ పడవలో కూర్చోబెట్టారని, ఆ తర్వాత తన కళ్లకు కట్టిన గంతలు విప్పారని చోక్సీ వివరించారు. అక్కడి నుంచి మరో పడవలోకి మార్చాక, తనను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లడం లేదని అర్ధమైనట్లు చోక్సీ వెల్లడించారు.
''ఆ పెద్ద పడవలో భారత సంతతికి చెందిన ఇద్దరు, కరీబియన్ సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఉన్న ఇద్దరు భారతీయులు కిరాయి సైనికులు. నన్ను కిడ్నాప్ చేయడానికి వారిని కొందరు నియమించారు'' అన్నారు చోక్సీ.
ఆ భారత నేతతో చోక్సీ మాట్లాడారా ?
కొన్నేళ్లుగా తనను ఫాలో అవుతున్నట్లు బోటులో కూర్చున్న భారతీయుడు చెప్పారని చోక్సీ తన అయిదు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను వాకింగ్‌కు ఎప్పుడు వెళతాను, నాకు ఇష్టమైన రెస్టారెంట్ ఏది లాంటి వివరాలన్నీ ఆయనకు తెలుసని పేర్కొన్నారు.
మరొక భారత సంతతి వ్యక్తి నా డబ్బు, బ్యాంకు ఖాతాల గురించి అడిగారని, తాను అతనికి సరైన సమాధానాలు చెప్పలేదని చోక్సీ తన ఫిర్యాదులో వెల్లడించారు. ఒక ప్రముఖ భారతీయ నేతతో మాట్లాడటానికి తనను ఓ ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళుతున్నట్లు వారు చెప్పారని, తన పౌరసత్వం వ్యవహారం తేలిన తర్వాత భారత్‌కు తరలిస్తారని వాళ్లు చెప్పినట్లు చోక్సీ తెలిపారు.
అయితే,చోక్సీ చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చోక్సీని తీసుకురావడానికి డొమెనికాకు వెళ్లిన వివిధ భారతీయ ఏజెన్సీల అధికారుల బృందం జూన్ మొదటి వారంలో తిరిగి ఇండియా వచ్చింది. మే 24 నుంచి చోక్సీ డొమెనికాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.
మే 23 రాత్రి 11.30 గంటలకు డొమెనికా తీరంలో అనుమానాస్పదంగా కనిపించిన చోక్సీని అరెస్టు చేసినట్లు డొమెనికా పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, డొమెనికాలో అక్రమంగా ప్రవేశించినట్లు మే 28న పోలీసులు ఆయనపై అభియోగాలు మోపారు.
''కిడ్నాపర్లు తమ ప్రణాళిక విఫలమైనందుకు అవాక్కయ్యారు. వారు చాలా అసహనంగా కనిపించారు. ఆపరేషన్ ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ వారికి పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారు నా దగ్గరి నుంచి లాక్కున్న డబ్బును తిరిగి ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ తీసుకుని బోటు నడుపుతున్న వ్యక్తికి ఇచ్చారు. ఎవరితోనో చర్చలు జరిపిస్తామన్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా, నా దగ్గర డబ్బు లేకుండా చేసి నన్ను వదిలి పెట్టారు. నేనెక్కడ ఉన్నానో నా కుటుంబానికి గానీ, లాయర్‌కు గానీ చెప్పలేదు. డొమెనికా పోలీసు కమిషనర్‌కు అప్పగిస్తామని మాత్రం చెప్పారు'' అని చోక్సీ పేర్కొన్నారు.
చోక్సీ ఒక మహిళతో ఉన్నారంటూ మొట్ట మొదట ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌన్ ప్రకటించారు. తన ప్రియురాలితో గడపడానికి చోక్సీ డొమెనికాకు వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అక్కడే చోక్సీ అరెస్టయ్యారు. ఆంటిగ్వాను విడిచి వెళ్లడం చోక్సీ చేసిన అతి పెద్ద తప్పని బ్రౌన్ అన్నారు.
ఆ తర్వాత, చోక్సీ ఎవరితో గడిపారన్న విషయం మే 23 వరకు తెలియ లేదు. కొన్ని రోజులకు బార్బారా పేరు బయటకు వచ్చింది. చోక్సీ భార్య కూడా తాను కొన్ని నెలలుగా ఆయన్ను తరచూ కలుస్తున్నట్లు వెల్లడించారు.
డొమెనికా ప్రధానమంత్రి ఏం చెప్పారు?
''చోక్సీ అనే భారత పౌరుడిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అధికారులు చట్ట ప్రకారం నడుచుకుంటారు. దీని గురించి బహిరంగంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు'' అని డొమెనికా ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెరిట్ అన్నారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఈ కేసు విచారణలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు.
''ప్రస్తుతం ఈ కేసులో భారత ప్రభుత్వం పార్టీగా మారలేదు. కేవలం డొమెనికా అధికారులకు మనం సహకరిస్తున్నాం. ప్రభుత్వం ఇందులో పార్టీగా మారితే, అటార్నీ జనరల్ కోరితే భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి నేను సిద్ధం'' అని హరీశ్ సాల్వే పేర్కొన్నారు.
డొమెనికాలో అక్రమంగా ప్రవేశించినందుకు చోక్సీపై కేసు కొనసాగుతోంది. అయితే, ఆయనను బలవంతంగా డొమెనికాకు తీసుకు వచ్చారని, ఆయన్ను ఆంటిగ్వా పంపాలని, ఆయనపై ఆంటిగ్వాలో రెండు కేసులు విచారణలో ఉన్నాయని చోక్సీ లాయర్లు డొమెనికా కోర్టును కోరారు.