Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మియన్మార్: సీనియర్ లీడర్‌ను పేగులు బయటకు వచ్చేలా పొడిచి చంపేశారు

మియన్మార్: సీనియర్ లీడర్‌ను పేగులు బయటకు వచ్చేలా పొడిచి చంపేశారు
, బుధవారం, 9 జూన్ 2021 (16:29 IST)
చేతుల్లో ఎలాంటి ఆయుధాలూలేని నిరసనకారులపై మియన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపడాన్ని చూసి ప్రపంచ దేశాలు షాకవుతున్నాయి. ఫిబ్రవరిలో తిరుగుబాటు అనంతరం ఇక్కడ 800 మందికిపైగా నిరసనకారులు మృత్యువాతపడ్డారు. ఎక్కువ మంది కాల్పుల వల్లే మరణించారు. ఆంగ్‌ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ) పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల దారుణ హత్యలు మియన్మార్ సైన్యం అరాచకాలను కళ్లకు కడుతున్నాయి.

 
మార్చి 6, శనివారం మియన్మార్‌లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. దానికి సరిగ్గా మూడు రోజుల ముందు, భారీ హింసా కాండ ప్రజ్వరిల్లింది. అప్పుడు ఒకే రోజు 38 మంది నిరసనకారులను సైన్యం పొట్టనపెట్టుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ‌ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెబుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఎన్ఎల్‌డీ ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 1న సైన్యం కూలదోసింది. తాము చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను సైన్యం బయటపెట్టలేదు.

 
సూచీతోపాటు సీనియర్ ఎన్‌ఎల్‌డీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. దీంతో సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ నిరసనలపై ఎలా స్పందించాలో మొదటి మూడు వారాలు సైన్యానికి అర్థంకాలేదు. అయితే, ఫిబ్రవరి చివరినాటికి ఉక్కుపాదం మోపడాన్ని మొదలుపెట్టారు. ఇక మార్చి మొదటివారంలో ఎవరినీ వదిలిపెట్టబోమనే సంకేతాలను సైన్యం ఇచ్చింది.’ సెంట్రల్ యంగూన్‌లోని పబేదాన్ ప్రాంత ఇరుకు సందుల్లో వలస పాలన కాలంనాటి భవనాల నడుమ ఇక్కడ విధ్వంసకర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

 
బలగాలను అడ్డుకునేందుకు కొన్ని వీధుల్లో ఉద్యమకారులు బారికేడ్లు కట్టారు. కానీ, చాలాచోట్ల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పబేదాన్‌లో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఇక్కడ ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ టౌన్‌షిప్‌లో మొత్తంగా ఎనిమిది మసీదులు ఉన్నాయి. గత ఏడాది ఇక్కడ జరిగిన ఎన్నికల్లో సీథూ మాంగ్ గెలిచారు. ఎన్‌ఎల్‌డీ మొత్తంగా నిలబెట్టిన ఇద్దరు ముస్లిం అభ్యర్థుల్లో సీథూ ఒకరు.

 
సీథూకు ప్రచార నిర్వహకుడిగా కిన్ మాంగ్ లాట్ పనిచేశారు. కిన్ ఒక ఎన్‌ఎల్‌డీ కురువృద్ధుడు. చాలా ఏళ్ల క్రితమే ఆయన ఇక్కడ స్థిరపడ్డారు. ఒక బౌద్ధ కుటుంబంతో కలిసి కిన్ ఇక్కడ ఉండేవారు. కిన్‌కు ఒక పర్యటక సంస్థ ఉండేది. వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చే షాప్‌ కూడా ఉంది. 1988 నుంచి ఆయన ఎన్‌ఎల్‌డీలో చురుగ్గా ఉండేవారు. పార్టీ స్థానిక విభాగానికి ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన ఇక్కడ చాలా మందికి సుపరిచితుడు. ఆయన్ను అందరూ ఇష్టపడతారు.

 
‘‘అతను చాలా నిష్ఠతో ఉండేవారు. రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేసేవారు’’అని బీబీసీతో సీథూ చెప్పారు. సైన్యం నుంచి తప్పించుకునేందుకు సీథూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గోప్యంగా ఆయన బీబీసీతో మాట్లాడారు. ‘‘అన్ని మతాల వారూ ఆయన్ను గౌరవించేవారు. ప్రజలకు ఆయన చాలా సేవ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి కొత్త పార్కులు కట్టించారు. ఎన్‌ఎల్‌డీలో ఆయన చాలా ముఖ్యమైనవారు’’.

 
శవాన్ని తీసుకుపొమ్మన్నారు..
ఆ రోజు రాత్రి 9 దాటిన తర్వాత సైనికులు.. కిన్ మాంగ్ లాట్ తలుపుకొట్టారు. తలుపుకొట్టింది సైనికులేనని ఇరుగుపొరుగువారు గుర్తించారు. అంతేకాదు వారు మానవ హక్కుల ఉల్లంఘనల్లో రాటుదేలిన 77వ పదాతి దళ విభాగం సభ్యులని చెప్పారు. ‘‘నిజానికి వారు మాంగ్ మాంగ్‌ను వెతుక్కుంటూ వచ్చారు. ఎన్‌ఎల్‌డీ సీనియర్ నాయకుల్లో మాంగ్ ఒకరు. ఆయన న్యాయవాది కూడా. ఆయన చాలా రోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు’’అని కిన్ సన్నిహితుడు కో ట్యూ క్యీ చెప్పారు.

 
‘‘వారు మాంగ్ అనుకొని కిన్ తలుపుకొట్టారు. బయటకు వచ్చిన కిన్‌ను యంగూన్ సెంట్రల్ హాల్‌కు తీసుకెళ్లారు’’. తిరుగుబాటు అనంతరం సైన్యం మొదట ఆధీనంలోకి తీసుకున్న భవనాల్లో యాంగూన్ సెంట్రల్ హాల్ ఒకటి. ఆ మరుసటి రోజు, కిన్ మాంగ్ లాట్ కుటుంబానికి పోలీసుల నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఉత్తర యంగూన్‌లోని సైనిక ఆసుపత్రికి వచ్చి కిన్ మృతదేహాన్ని తీసుకెళ్లమని వారికి చెప్పారు. ‘‘ఆయనకు గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయారు. ఆసుపత్రిలో చేర్పించాం. అందుకే మీకు చెబుతున్నాం’’అని ఫోన్‌లో చెప్పారు.

 
అయితే, 58ఏళ్ల కిన్ చాలా ఆరోగ్యంగా ఉండేవారని, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని ఆయన కుటుంబం చెబుతోంది. కిన్ ఒంటిపై చాలా గాయాలు ఉన్నాయని, ఆయన బట్టలు కూడా రక్తంతో తడిసి ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘‘శవపరీక్ష చేసినట్లుగా ఆయన శరీరం కోసి ఉంది. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు’’. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థల్లో పనిచేస్తున్న వైద్యులు.. కిన్ మృతదేహానికి తీసిన చిత్రాలు పరిశీలించారు. కిన్ ఎలా చనిపోయారో స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ, నిర్బంధంలో హింస వల్లే చనిపోయి ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని వారు వివరించారు.

 
‘‘పేగులు బయటకు వచ్చేశాయి’’
అయితే, ఎన్‌ఎల్‌డీకి చెందిన మరో సీనియర్ నాయకుడు జ్యూ మ్యాట్ లిన్ (46)ను మరింత దారుణంగా హత్యచేశారు. పార్టీలో కిన్ కంటే జ్యూ కాస్త సీనియర్. అందుకే ఆయనపై మరింత బలప్రయోగం జరిగినట్లు కనిపిస్తోంది. ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ఒకేషనల్ కాలేజీల్లో ఒక కాలేజీకి జ్యూ డైరెక్టర్. నిర్బంధానికి ముందురోజు జ్యూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. సైనికుల్ని ఆయన శునకాలు, ఉగ్రవాదులతో పోల్చారు.

 
‘‘జ్యూ చాలా శక్తిమంతమైన నాయకుడు’’అని ఎన్‌ఎల్‌డీ నాయకుల్లో ఒకరు చెప్పారు. ‘‘జ్యూ మంచి వక్త. తిరుగుబాటు అనంతరం ఇక్కడి ప్రజలను ఆయన మాత్రమే ఏకం చేయగలిగారు. ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు’’. విద్యార్థులతో కలిసి జ్యూ బయటకు వెళ్లి వచ్చిన వెంటనే, కాలేజీ గేట్లు బద్దలుకొట్టుకుంటూ సైన్యం లోపలకు వచ్చింది. అయితే, గోడ దూకి వెళ్లిపోవాలని విద్యార్థులు చెప్పినప్పటికీ జ్యూ వెళ్లలేదు. జ్యూతోపాటు ఏడుగురిని కాలేజీలోనే అరెస్టుచేశారు.

 
మధ్యాహ్నం మూడు గంటలకు జ్యూ భార్య డ్యా ఫ్యూ విన్‌కు ఫోన్ వచ్చింది. జ్యూ చనిపోయారని ఆమెకు చెప్పారు. కిన్ మరణించిన అదే ఆసుపత్రికి రావాలని ఆమెకు సూచించారు. అయితే, జ్యూ మృతదేహం అక్కడ అత్యంత దారుణమైన స్థితిలో కనిపించింది. ఆయన శరీరాన్ని మధ్యగా కోసేశారు. కడుపులోని పేగులు కూడా బయట కనిపించాయని జ్యూ భార్య తెలిపారు. జ్యూ వీపుపై కూడా పెద్ద గాయం ఉందని ఆయన భార్య వివరించారు. అయితే, స్టీల్ పైపు పట్టుకుని పైకి ఎక్కబోతూ వెనక్కి పడిపోయి, జ్యూ చనిపోయారని సైన్యం వెల్లడించింది.

 
జ్యూ మొహం కూడా గుర్తుపట్టలేకుండా తయారైంది. అయితే, బాగా పాడవడం వల్లే మృతదేహం ఇలా అయ్యుంటుందని పీహెచ్‌సీ డాక్టర్ తెలిపారు. జ్యూ చనిపోయిన మూడు రోజుల వరకూ ఆయన మృతదేహాన్ని ఆయన భార్యకు అప్పగించలేదు. కనీసం ఆ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో కూడా పెట్టలేదు. ఇంత దారుణంగా ఎన్‌ఎల్‌డీ నాయకుల్ని ఎందుకు చంపారో తెలియడం లేదు. అయితే, వీరిని దారుణంగా హతమార్చడం ద్వారా, నిరసనకారులకు సైన్యం గట్టి సందేశం పంపాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జ్యూ హత్య విషయంలో స్పందించాలని సైన్యాన్ని బీబీసీ కోరింది. అయితే ఈ వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయనొస్తానంటే నేనొద్దంటానా : ఈటల రాకపై షర్మిల కామెంట్స్