Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరా?

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరా?
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (20:38 IST)
తిరుమల తిరుపతి దేవస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తిరుమల కొండలు నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంటాయి. కరోనా కాలంలో కొంత విరామం వచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు దర్శనాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అప్పట్లో దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లోకి దళితులను రానిచ్చేవారు కాదు. తిరుమలలో కూడా అదే పరిస్థితి. దాదాపు వందేళ్ల క్రితం గాంధీ ఉద్యమ ఫలితంగా దళితులకు ఆలయ ప్రవేశ అవకాశం దక్కింది.

 
అయితే, ఇన్నేళ్లలో టీటీడీ చైర్మన్ పోస్టు గానీ... ఈవో, జేఈవో, డిప్యూటీ ఈవో వంటి కీలక పదవులు గానీ ఎస్సీ వర్గాలకు చెందినవారికి ఎప్పుడూ దక్కలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇటీవల టీటీడీ కార్యనిర్వాహణాధికారిగా కేఎస్ జవహార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన 27వ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటికే టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అదనపు ఈవోగా ఏవీ ధర్మారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.

 
టీటీడీ బోర్డుగా ఏర్పడి తొమ్మిది దశాబ్దాలు కావస్తోంది. బ్రిటీష్ హయంలో పాలకమండలిని ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకూ 50 మంది టీటీడీకి చైర్మన్లుగా పనిచేశారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీకి 50వ చైర్మన్. ఇక ఇప్పటివరకూ ఆలయానికి 26 మంది ఈవోలుగా పనిచేశారు. ప్రారంభం నుంచి ప్రభుత్వ అధికారిని ఈవోగానూ, ప్రజా ప్రతినిధిని చైర్మన్‌గానూ ప్రభుత్వాలు నియమిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వమే వారిని నియమిస్తుంది. కానీ ఇప్పటి వరకూ ఈ రెండు కీలక పదవుల్లో ఎస్సీలకు అవకాశం దక్కలేదని రికార్డులు చెబుతున్నాయి. అదనపు ఈవో స్థానంలో కూడా దళితులకు చోటు దక్కలేదు.

 
‘నియమిస్తే వెనక్కి పంపేశారు’
తిరుపతిలో పలువురు దళిత అధికారులు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తిరుపతి ఎంపీ స్థానం కూడా ఎస్సీ రిజర్వుడుగా ఉంది. అయినప్పటికీ ఆ పార్లమెంట్ స్థానంలోని ప్రధాన ఆలయంలో ఎస్సీలకు తగిన అవకాశాలు రావడం లేదనే విమర్శలున్నాయి. 1987-90 మధ్య కాలంలో తిరుమల జేఈవోగా ఆనాటి ఎన్టీఆర్ ప్రభుత్వం భూతలింగం అనే ఐఏఎస్ అధికారికి అవకాశం ఇచ్చింది. అయితే, ఆయన బాధ్యతలు స్వీకరించకుండా అప్పుడు కొందరు అడ్డుకున్నారని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకుడు కందరాపు మురళి బీబీసీతో చెప్పారు.

 
"భూతలింగం హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఉదయం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆయన బాధ్యతల స్వీకరణకు తిరుమల వెళ్లారు. కానీ, ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు నాటి ఈవో గా ఉన్న వెంకటపతిరాజు అంగీకరించలేదు. దానికి ప్రధాన కారణం అర్చకుల అభ్యంతరాలు. దళిత అధికారికి చేతికి కంకణం కట్టడం మా వల్ల కాదని నాటి అర్చకులు ససేమీరా అని చెప్పేశారు. ఇతర సంప్రదాయాల ప్రకారం జేఈవోకి గౌరవ మర్యాదలు కల్పించడానికి వారంతా నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని విధుల్లో చేర్చుకోవడం తన వల్ల కాదని ఈవో తేల్చి చెప్పేశారు. చివరకు ఆయన్ని మళ్లీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ వచ్చిన ట్రైన్‌లోనే సాయంత్రానికే తిరిగి వెనక్కి పంపించేసిన అనుభవం ఉంది" అంటూ ఆనాడు జరిగిన విషయాన్ని మురళి వివరించారు.

 
ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం ప్రస్తుతం జేఈవో, టీటీడీ చైర్మన్‌లను బీబీసీ సంప్రదించింది. కానీ, ఆ సమాచారం తమ వద్ద లేదని వారు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో హిందువులు సందర్శించే క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. అధిక ఆదాయం కలిగిన ధార్మిక క్షేత్రాల్లో ముందు వరుసలో ఉంటుంది. టీటీడీ కోసం ప్రత్యేక బోర్డుని 1932లోనే ప్రారంభించారు. అప్పటి వరకూ మహంతుల ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు నడిచేవి. 1936 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు సాగుతున్నాయి.

 
టీటీడీ మొదటి చైర్మన్‌గా పి వెంకట రంగరాయన్ నియమితులయ్యారు. కే సీతారామిరెడ్డి మొదటి టీటీడీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1956 నుంచి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆ అవకాశం వస్తోంది. ఈవోకి తోడుగా మరో ఇద్దరు సంయుక్త కార్యనిర్వహణాధికారులు (జీఈవో) ఉంటారు. ఆ పోస్టులకు కూడా కొన్నిసార్లు ఐఏఎస్ అధికారులకు అవకాశం ఇస్తుంటారు. అత్యధిక సందర్భాల్లో గ్రూప్-1 అధికారులు విధుల్లో ఉంటారు. ఈ మూడు పోస్టుల్లో ఎస్సీలకు ఇంతవరకూ అవకాశం దక్కలేదు. ఎస్సీలకు అవకాశం ఇచ్చిన ఆ ఒక్క సందర్భంలో వచ్చిన ప్రతిఘటనతో ఆ తర్వాత ప్రభుత్వాలు అలాంటి ప్రతిపాదనలు విరమించుకున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు.

 
పాలక మండలిలో కూడా అరకొరగానే
టీటీడీ చైర్మన్ పదవికి చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పోటీ పడుతుంటారు. ఆ చైర్మన్ గిరీ కోసం నేతలు సుదీర్ఘకాలం ఎదురుచూడటం సాధారణమే. అయితే, ఈ పోస్టుకు ఆశావాహుల జాబితాలో ఎస్సీ నేతల పేర్లు పెద్దగా వినబడవు. ఇటీవల కాలంలోనైతే అలాంటి ఆనవాళ్లు కూడా లేవు. టీటీడీ పాలకమండలి సభ్యుల్లో కూడా ఎస్సీలకు అరకొరగానే అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుత పాలకమండలిలో 36 మంది సభ్యులు ఉంటే, అందులో ఎస్సీలు ఇద్దరే.

 
ప్రభుత్వం అన్ని పదవులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చేసిన చట్టాల ప్రకారం ఆరుగురు ఎస్సీలకు, నలుగురు ఎస్టీలకు చోటు దక్కాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని తిరుపతికి చెందిన ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రశాంత్ కుమార్ వ్యాఖ్యానించారు. "టీటీడీ చైర్మన్ పదవుల కోసం కాకపోయినా, బోర్డు సభ్య పదవుల కోసం చాలామంది ఆశావాహులుంటారు. కానీ వారికి అవకాశం రావడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన బడా బాబులను పిలిచి పదవులు ఇస్తున్నారు గానీ రాష్ట్రానికి చెందిన ఎస్సీలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. ఎస్టీలను ఎందుకు విస్మరించారనే దానికి సమాధానం కూడా లేదు. ఇది పూర్తిగా వివక్షకు తార్కాణం. ఎస్సీ, ఎస్టీల గురించి ఎన్ని మాటలు చెప్పినా, చిన్నచూపు ఏ స్థాయిలో ఉందో ఈ వ్యవహారం చాటుతుంది" అంటూ ప్రశాంత్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 
ఆలయంలోకి రానివ్వలేదని గాంధీ ఆందోళన
తిరుమల కొండకు మొదట్లో దళితులను రానిచ్చేవారు కాదు. చివరకు 1925 డిసెంబర్‌లో ఓ ఎస్సీ భక్తుడు పరయా తిరుచానూరు ఆలయంలో ప్రవేశించడంతో ఆనాటి బ్రిటీష్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ వార్తను అప్పుడు పత్రికల్లో చూసిన కాంగ్రెస్ నేత రాజగోపాలాచారి హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు.

 
నాటి మేజిస్ట్రేట్ ముందు వాదించి పరయాని విడిపించారు. అంతటితో సరిపెట్టకుండా ఆయన ఈ సమాచారం గాంధీకి తెలియజేయడంతో నేరుగా గాంధీ కూడా తిరుపతి చేరుకుని పెద్ద ఆందోళనకు పూనుకున్నారు. 33 మంది ఎస్సీలతో కలిసి ఆలయ ప్రవేశానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. చివరకు వైశ్రాయ్ జోక్యంతో వారు ఆలయంలో అడుగుపెట్టే అవకాశం దక్కింది.

 
"ఆలయంలో అడుగుపెట్టేందుకు కూడా ఎస్సీలు పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. గాంధీ చొరవతోనే ఆనాడు ఆలయ ప్రవేశ అవకాశం వచ్చింది. అలాంటిది కీలక పదవుల్లోకి రావాలంటే మరింత ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం పెరగాలి. ఇటీవల ఒకరిద్దరు ఎస్టీ అధికారులు జేఈవో వరకూ వచ్చారు. కానీ కీలక పదవులు ఎస్సీలకు రావడానికి మరిన్ని ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఆధిపత్యం వహిస్తున్న వారు అంత త్వరగా అంగీకరించే అవకాశం లేదు. అందుకే తిరుమలలో తగిన న్యాయం జరగడం లేదు" అంటూ మాజీ కేంద్రమంత్రి, తిరుపతికి చెందిన చింతా మోహన్ బీబీసీతో అన్నారు.

 
దళిత గోవిందం విగ్రహాలు మూలకు’
వైఎస రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దళిత గోవిందం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేంకటేశ్వర స్వామిని దళితులకు చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆ సందర్భంగా ప్రకటించారు. అయితే దళిత గోవిందం పేరుతో ఎస్సీ పేటలకు ఉత్సవ విగ్రహాలను కాకుండా డమ్మీ విగ్రహాలు తీసుకెళ్లారంటూ అప్పట్లో ఆందోళనలు కూడా జరిగాయి. దళిత పేటల్లో పూజలందుకున్న తర్వాత ఆ విగ్రహాలు తీసుకొచ్చి స్టోర్ రూమ్‌ల్లో మూలనపడేయడంతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో తాము నిరసనలు కూడా చేపట్టామని ఆ సంఘం నాయకుడు ఆండ్ర మాల్యాద్రి బీబీసీతో చెప్పారు.

 
"తిరుమలో నేటికీ వివిధ రూపాల్లో కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రసాదం తయారీలో బ్రాహ్మణులు మినహా మిగిలిన వారికి అవకాశం లేదు. ఆ ప్రసాదాలను తరలించే కార్మికులు మాత్రం దళితులుంటారు. కానీ తయారీ విషయంలో మాత్రం ఆంక్షలున్నాయి. ఇతర అనేక అంశాలలో కింది స్థాయి సిబ్బంది పట్ల వివక్ష ఉన్నట్టు పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది. మేము ఆందోళనలు కూడా చేశాము. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల విషయంలో కూడా ఇలాంటి వివక్ష ఉంది. కేరళ వంటి రాష్ట్రాల్లో అర్చకులుగా ఎస్సీలకు అవకాశం ఇస్తుంటే మన దగ్గర ఇలాంటి పరిస్థితి సరికాదు. ప్రభుత్వాలు చొరవ చూపితే ఫలితం వస్తుంది. అధికారులలో కూడా అందరికీ అవకాశం కల్పించేందుకు ప్రయత్నం చేయాలి" అని మాల్యాద్రి డిమాండ్ చేస్తున్నారు.

 
డిక్లరేషన్ మీద దుమారమే గానీ, ఇలాంటి వివక్షతకు అడ్డు వేయలేరా
అన్యమతస్తుల ఆలయ ప్రవేశం విషయంలో డిక్లరేషన్ చుట్టూ ఇటీవల పెద్ద రాజకీయ దుమారం రేగింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ బ్రహ్మోత్సవాలకు హాజరయిన నేపథ్యంలో పెద్ద చర్చ సాగింది. ఆలయంలో విధుల నిర్వహణకు ఎస్సీ అధికారులను విస్మరిస్తున్న అంశంపై చర్చ జరగకపోవడం విచారకరం అని అని రిటైర్డ్ ఆర్డీవో పి రమేష్ బాబు అభిప్రాయపడ్డారు.

 
"ఎస్సీ అధికారులలో కొందరు ఇతర మతస్థులున్నా, హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏకంగా ఎస్సీని రాష్ట్రపతి చేయగలిగిన దేశంలో ఆలయంలో అధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కకపోవడం వివక్షగానే భావించాలి. ఉత్తరాది అధికారులకు సైతం తిరుమల ఆలయంలో ఈవోగానూ,ఇతర బాధ్యతల్లోనూ అవకాశం ఇచ్చారు. వారిలో కూడా ఎస్సీ అధికారులను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో అందరికీ అవకాశం కల్పించడం ద్వారా ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

 
సీఎం దృష్టికి తీసుకెళతాను.. భవిష్యత్తులో అవకాశం వస్తుంది
టీటీడీలో ఎస్సీ అధికారులకు అవకాశం దక్కడం లేదన్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్ బీబీసీతో చెప్పారు. "ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాల కలెక్టర్లకు గానూ ఆరుగురు ఎస్సీలున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. టీటీడీలో కూడా అందరికీ అవకాశాలు వస్తాయి. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాను. భవిష్యత్తులో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. రాబోయే మూడేళ్లలో అలాంటి మార్పులను చూడవచ్చు" అని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజటివ్