ట్విటర్‌లో #NitinGadkari అనే హ్యాష్‌టాగ్ ఈ రోజు ట్రెండింగ్‌లో ఉంది. బీజేపీ నేత సుబ్రహ్మణియన్ స్వామి తాను చేసిన ఓ ట్వీట్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను నితిన్ గడ్కరీకి ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం గడ్కరీ కేంద్ర రహదారులు, భవనాల శాఖను నిర్వహిస్తుండగా.. హర్షవర్ధన్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖను చూస్తున్నారు.
సుబ్రహ్మణియన్ స్వామి తన ట్వీట్‌లో ''ముస్లిం ఆక్రమణదారులను, బ్రిటిష్ వలస పాలకులను ఎదుర్కొని నిలబడిన విధంగానే కరోనా వైరస్ మహమ్మారి నుంచి కూడా భారతదేశం నిలదొక్కుకుంటుంది'' అని పేర్కొన్నారు. ''ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే, మనం కరోనా మూడో వేవ్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, దీనిపై యుద్ధం చేసే బాధ్యతను నితిన్ గడ్కరీకి ఇవ్వాలి. ప్రధాన మంత్రి కార్యాలయం మీద ఆధారపడితే లాభం లేదు'' అని సుబ్రహ్మణియన్ స్వామి ట్వీట్ చేశారు.
గడ్కరీకి ఎందుకివ్వాలి?
ఓ డాక్టర్ సుబ్రహ్మణియన్ స్వామిని ఇదే ప్రశ్న అడిగారు. దానికి ఆయన ''ఎందుకంటే కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నితిన్ గడ్కరీ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు" అని స్వామి సమాధానం ఇచ్చారు.
అంటే, ప్రధానిని అసమర్థుడిగా పరిగణించాలా అని ఓ వ్యక్తి ఆయన్ను ప్రశ్నించగా ''బాధ్యతలు మరొకరికి అప్పజెప్పడం అంటే అసమర్థులని అర్థం కాదు'' అన్నారు స్వామి. పీఎంఓ (ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్) అంటే ప్రధాని కాదని, అది ఒక శాఖ అని ఆయన పేర్కొన్నారు.
స్వామికి మద్దతు
సుబ్రహ్మణియన్ స్వామి చేసిన సూచనను సోషల్ మీడియాలో చాలామంది సమర్ధించినట్లు కనిపించింది. ఆరోగ్యశాఖను నితిన్ గడ్కరీకి అప్పజెప్పాలని చాలమంది కోరారు. స్వామి సూచనలను సమర్ధించిన వారిలో డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తల నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. ప్రస్తుత ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తన అధికారాలను వినియోగించుకోవడంలో, అమలు చేయడంలో చాలా సాఫ్ట్‌గా ఉన్నారని, ఆయనకు స్వేచ్ఛ లేనట్లుగా ఉందని స్వామి పేర్కొన్నారు. ''హర్షవర్ధన్‌తో పోలిస్తే గడ్కరీ అందుకు భిన్నంగా, బలంగా ఉంటారు.'' అన్నారు స్వామి.
టార్గెట్‌గా మారిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వీటికి ఆక్సిజన్ కొరత, బెడ్లు, వెంటిలేటర్లు, ఔషధాల కొరత కూడా తోడైంది. మరోవైపు వ్యాక్సినేషన్ వేగం కూడా తగ్గింది. తమకు టీకా అందడం లేదని చాలా రాష్ట్రాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో కఠిన లాక్‌డౌన్ విధించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖలు రాస్తు, ట్వీట్‌లు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కోర్టుల నుంచి కేంద్రానికి మందలింపులు
ప్రతిపక్ష పార్టీలే కాదు, ఇటు కోర్టులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మందలిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ హైకోర్టు నుంచి, దిల్లీ హైకోర్టు వరకు కేంద్ర ప్రభుత్వం నిత్యం టార్గెట్ అవుతోంది. ఆక్సిజన్ కొరతపై మోదీ ప్రభుత్వం మీద దిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ''మీరు ఉష్ట్రపక్షి కావచ్చు. కానీ మేం కాదు. ప్రజలు చనిపోతుంటే మేం చూస్తూ మౌనంగా ఉండాలా?'' అని ప్రశ్నించింది.
ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తుంటే, పశ్చిమ బెంగాల్, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిందని బీజేపీపై ఆరోపణలు వినిపించాయి. ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల కొరత వంటి వాటిపై విదేశీ మీడియా కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కథనాలను ప్రచురించింది.