Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా?

కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా?
, మంగళవారం, 5 మే 2020 (13:37 IST)
ఉమేష్ చౌదరి వయసు 37 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు. ఐదుగురు సభ్యుల కుటుంబం. జీవనాధారం ఆమే. ఈశాన్య దిల్లీలో నివసిస్తుంటారు. ఆఫీసులకు వెళ్లే వారికి వండిన ఆహారం అందిస్తుంటారు. అదే ఆమె ఉపాధి. నెల రోజులుగా ఆ పని లేదు. లాక్ డౌన్ కారణం. కుటుంబాన్ని పోషించుకునే దారి లేదు. నిత్యావసరాల కోసమూ కష్టపడుతున్నారు.

 
‘‘నాకు రోజూ 35 ఆర్డర్లు ఉండేవి. ఒక్కో టిఫిన్ మీద 60 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు ఆఫీసులు మూతపడ్డాయి. నాకు ఆర్డర్లు లేవు. బతకటానికి దాచుకున్న డబ్బులూ లేవు. ఆదాయం లేకుండా ఐదుగురున్న కుటుంబాన్ని ఎలా నడిపించాలి?’’ అని ఆమె ప్రశ్నించారు.

 
శారదా ప్రసాద్ (27)ది కూడా ఇలాంటి కథే. ఆమె మీర్జాపూర్ నుంచి వలస వచ్చారు. తోటమాలిగా పనిచేయటం, అద్దె ఇళ్లు చూపించటం వంటి చిన్నాచితకా పనులు చేస్తూ పొట్టపోసుకుంటుంటారు. ‘‘వ్యాపారాలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తమకే తెలియదని నా యజమానులు చెప్పారు. నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏం చేయాలో తెలియటం లేదు’’ అని ఆమె చెప్పారు.

 
కరోనావైరస్ కారణంగా భారతదేశంలో 10 కోట్ల నుంచి 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. నిరుద్యోగిత శాతం ప్రస్తుతం 26-27 శాతంగా ఉన్నట్లు ఆ సంస్థ చెప్తోంది. భారతదేశం దగ్గర అధికారికంగా శ్రామిక మార్కెట్ గణాంకాలు అధిక స్థాయిలో లేవు. అయితే.. కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల రెండుకోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు చెప్తున్న అమెరికా గణాంకాల కన్నా.. భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదు రెట్లు అధికంగా ఉంది.

 
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మార్చి 24వ తేదీ సాయంత్రం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ముగియాల్సిన ఏప్రిల్ 14వ తేదీన.. దీనిని మే మూడో తేవీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిని మరో రెండు వారాలు పొడిగించింది.

 
లాక్ డౌన్ ఫలితంగా నిత్యావసర సేవలు మినహా ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోవటంతో.. అసంఘటిత రంగాలకు చెందిన లక్షలాది మంది వలస శ్రామికులు.. తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లిన అనూహ్యమైన సామూహిక వలస దృశ్యాలు కనిపించాయి.

 
వ్యవసాయం, బ్యాంకింగ్, ప్రజా పనుల మీద ఆంక్షలను సడలించినప్పటికీ.. రవాణా సేవలు, వ్యాపారాలు అత్యధికంగా మూతబడే ఉన్నాయి. ఫలితంగా.. అసలే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సంక్షోభం మరింతగా విషమించే అవకాశం ఉంది.

 
లాక్‌ డౌన్ ప్రభావాలు
దేశంలో నిరుద్యోగిత మార్చి నెలలో 8.7 శాతం పెరిగినట్లు.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక చెప్తోంది. ఇది 43 నెలల్లో అత్యధికం. 2020 మార్చి 24 నుంచి 31వ తేదీ మధ్య వారం రోజుల్లో ఏకంగా 23.8 శాతానికి పెరిగింది. ‘‘మార్చి నెలలో శ్రామికుల భాగస్వామ్యం రేటు పూర్తికాలం తక్కువకు పడిపోయింది. నిరుద్యోగిత నిట్టనిలువుగా పెరిగింది. ఉపాధికల్పన పూర్తి కాలం దిగువకు దిగజారింది’’ అని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ రాశారు.

 
దేశంలో దాదాపు ఐదు కోట్ల మంది కార్మికులు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని భారత మాజీ ప్రధాన గణాంక అధికారి ప్రణోబ్ సేన్ పేర్కొన్నారు.

 
‘‘ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు 2018 నుంచి నెమ్మదిస్తూ వస్తున్నాయి. అసమానతల స్థాయి కూడా ఆమోదయోగ్యం కానంత అధికంగా ఉంది. 2011-12, 2017-18 సంవత్సరాలకు జాతీయ నమూనా సర్వే గణాంకాలు.. దేశంలో నిరుద్యోగిత చారిత్రక అధిక స్థాయికి పెరిగిందని, గ్రామీణ పేదలు ఆహార వినియోగం మీద చేసే వ్యయం పడిపోతోందని వెల్లడిస్తున్నాయి. అంటే 2017-18లో పేదరికం స్థాయి కనీసం 5 శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో కరోనావైరస్ భారత్ మీద దాడి చేసింది’’ అని నాబార్డ్ చైర్మన్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఆర్.రామకుమార్ వివరించారు.

 
అసలే బాగోలేని పరిస్థితిని లాక్‌డౌన్ చూపుతున్న ప్రతికూల ప్రభావం మరింతగా క్షీణింప చేసింది. మార్కెట్‌లో ఆహారం, ఇతర నిత్యావసరాలకు డిమాండ్ పడిపోవటం కూడా.. పేదల వినియోగ వ్యయం పడిపోయినట్లు చూపుతోంది. ‘‘మరోరకంగా చెప్తే.. ఇప్పటికిప్పుడు పేదరికం మీద సర్వే చేసినట్లయితే.. దేశంలో పేదరికం 2017-18 కన్నా అధిక స్థాయిలో ఉన్నట్లు నమోదవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండు త్రైమాసికాల పాటు మైనస్‌లో కాకపోతే.. కనీసం 0 – 1 మధ్య ఉంటుందనేది ఖచ్చితం’’ అని రామకుమార్ పేర్కొన్నారు.

 
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కటానికి ఆరోగ్య సిబ్బంది, అసంఘటి రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం గత నెల చివర్లో 1.7 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులకు నగదు బదిలీలు, ఆహార భద్రత, ఆరోగ్య సిబ్బందికి వైద్య బీమా తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. వ్యాపార సంస్థలు ఉద్యోగులను తొలగించవద్దని ప్రధాని మోదీ ఏప్రిల్ 14వ తేదీన ప్రసంగంలో కోరారు.

 
కానీ వ్యాపారాలు లేకుండా సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలనే అయోమయంలో వ్యాపార సంస్థల యజమానులు ఉన్నారు. దాదాపు రెండు కోట్ల మంది కార్మికులకు ఉపాధి కల్పించే నిర్మాణ రంగం.. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత మళ్లీ వారందరికీ ఉపాధి కల్పించే అవకాశం లేదని ఒక బడా ప్రాపర్టీ డెవలపర్ (స్థిరాస్థి వ్యాపారి) నిరంజన్ హరినందాని పేర్కొన్నారు.

 
‘‘పనులు మళ్లీ మొదలయ్యాక నిర్మాణదారులకు గతంలో ఉన్నంత సంఖ్యలో కార్మికులు అవసరం ఉండదు. తక్కువ మందిని పనుల్లో పెట్టుకోవటం ద్వారా ఖర్చులు తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తారు’’ అని చెప్పారాయన. ఎస్టీమ్ అపారల్ సర్వీసెస్ యజమాని సమీర్ మెహతా.. గత 26 సంవత్సరాలుగా అమెరికాతో పాటు యూరప్‌లోని పలు దేశాలకు దుస్తులు ఎగుమతి చేస్తున్నారు. ఆయన వస్త్ర పరిశ్రమలో 150 మంది కార్మికులు ఉన్నారు.

 
‘‘యూరప్, అమెరికాల నుంచి కొత్త ఆర్డర్లు ఇప్పటికే అడుగంటాయి. సమీప భవిష్యత్తులో ఆ మార్కెట్లు తెరుచుకునే అవకాశం కనిపించటం లేదు. కాబట్టి కార్మికులను తిరిగి చేర్చుకోవటం అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగానికి మద్దతు ఇవ్వటానికి మరింత ద్రవ్య మద్దతు అవసరమని నిపుణులు చెప్తున్నారు.

 
‘‘ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ జీడీపీలో 0.8 శాతం. అది సరిపోదు’’ అంటున్నారు. ‘‘అసంఘటిత రంగంలో నెలకు 9 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు’’ అని స్వతంత్ర ఆర్థికవేత్త అరుణ్‌కుమార్ చెప్పారు. భారతదేశపు శ్రామిక శక్తిలో 94 శాతం అసంఘటిత రంగంలోనే ఉందని ఆయన అంచనా.

 
పేదరికం పెరుగుతుంది
లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న క్రమంలో భారతదేశం జీవితాలు – జీవనాధారాలకు మధ్య ఊగిసలాడుతోంది. ఈ సంక్షోభం భారత శ్రామిక మార్కెట్‌ మీద చూపబోయే దీర్ఘకాలిక సామాజికార్థిక పర్యవసానాల గురించి హెచ్చరికలు కూడా వచ్చాయి.

 
ఐక్యరాజ్యసమితి 2019 బహుళ పేదరిక సూచీ ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో 36.9 కోట్ల మంది పేదలు ఉన్నారు. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ అసమానాతల (సీఆర్ఐ) సూచీ లోని 157 దేశాల జాబితాలో భారతదేశం 147వ స్థానంలో ఉంది. దేశ జానభాలో ఒక పెద్ద భాగం రోజు వారీ పనుల మీద, ప్రభుత్వ రాయితీలు, సేవల మీద ఆధారపడి జీవిస్తుంటారు కాబట్టి.. కరోనావైరస్ ప్రభావంతో పేదరికం మరింత తీవ్రమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

 
పరిస్థితిని ఈ మహమ్మారి మరింతగా విషమింపజేసింది. ఎందుకంటే డిమాండ్, సరఫరా రెండూ కుప్పకూలాయి. ఉత్పత్తిని పునఃప్రారంభించటం ఒక సవాలుగా మారుతుంది. చాలా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దీనిని తట్టుకుని మనుగడ సాగించలేవు. ఈ మాంద్యం పేదరికాన్ని మరింతగా పెంచుతుంది.

 
దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చెప్తోంది. భారతదేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర పేదరికంలో కూరుకుపోతారని ఆ సంస్థ అంచనా. ఈ మహమ్మారి ప్రభావంతో.. పేదరికం మీద పోరాటం పదేళ్ల నుంచి, కొన్ని ప్రాంతాల్లో 30 ఏళ్లకు నెట్టేస్తుందని ఆక్స్‌ఫామ్ భావిస్తోంది. నిరుద్యోగిత దీర్ఘకాలం కొనసాగినట్లయితే అది సామాజిక అశాంతికి దారితీయవచ్చునని నిపుణులు అంటున్నారు.

 
‘‘అత్యధిక ఆకాంక్షలు గల యువ భారతీయుల మీద ఎన్నడూ చూడని ఈ ఆర్థిక ఒత్తిడి.. విస్తృత అసంతృప్తికి దారితీస్తుంది. దురదృష్టవశాత్తూ హింస.. మైనారిటీలు, ఇతర బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ మహహ్మారి విజృంభణకు మతంరంగు పులమటం కొనసాగితే ఈ పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చు’’ అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఎకానమీ అండ్ గ్రోత్ ప్రోగ్రామ్ అధిపతి మిహిర్ స్వరూప్ శర్మ బీబీసీతో పేర్కొన్నారు.

 
‘‘ఈ బాధను అధిగమించటానికి బాధ్యతను సమానంగా పంచటాన్ని మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది’’ అని స్వతంత్ర రచయిత, జర్నలిస్ట్ రజని బక్షి అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంక్షోభం తీవ్రత మొత్తం పేదల మీద చూపకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, వారిని ఒంటరిగా వదిలేయకూడదని ఆమె సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధరలు పెంచినా వెనక్కి తగ్గని తాగుబోతులు.. వైన్ షాపుల ఎదుట భారీగా క్యూ