Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్: హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు, ‘హర హర మహాదేవ' నినాదాలు’

Advertiesment
కరోనావైరస్: హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు, ‘హర హర మహాదేవ' నినాదాలు’
, మంగళవారం, 5 మే 2020 (13:16 IST)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చనిపోయిన ఒక హిందూ మహిళకు నలుగురు ముస్లింలు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని కాన్పూర్ ప్రాంతంలో హిందువులు, ముస్లింల నివాసాలు పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ గతంలో మతపరమైన హింస కూడా చెలరేగింది. కరోనావైరస్ కారణంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే, తాజా ఘటన హిందూ-ముస్లిం ఐక్యతను చాటింది.

 
75 ఏళ్ల మహిళ మందాకిని త్రిపాఠి, కాన్పూర్‌లో ఉన్న ఉషా-కిరణ్ అపార్ట్‌మెంటులోని తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండేవారు. ఆమె పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే, గత సోమవారం ఆమె ఇంట్లో జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రాంతానికి చెందిన ఖాసిం గత 25 ఏళ్లుగా మందాకిని ఇంటికి రోజూ పాలు తీసుకొచ్చేవారు. ఎప్పటిలాగే ఆయన ఆ రోజు వెళ్లి ఇంటి బెల్లు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

 
ఆయన దగ్గర కూడా ఆ ఇంటి తాళంచెవి ఒకటి ఉంది. దానితో తలుపు తెరిచి చూడగా ఆమె నేలపై పడిపోయి కనిపించారు. ఖాసిం వెంటనే డాక్టర్‌కు ఫోన్ చేసి పిలిచారు. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయారని చెప్పారు. దాంతో, ఆ విషయాన్ని అమెరికాలో ఉంటున్న మందాకిని కుమార్తెకు వీడియో కాల్ ద్వారా ఖాసిం చెప్పారు.

 
లాక్‌డౌన్ కారణంగా విమానాలు నడవకపోవడంతో ఆమె భారత్ రాలేకపోయారు. అహ్మదాబాద్‌లో ఉంటున్న తన మేనమామ రజనీకాంత్ భాయ్‌కి ఆమె సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన బైకుపై మృతురాలి ఇంటికి వెళ్లారు. అంత్యక్రియలు చేద్దామంటే సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. ఆయన ఇబ్బందులను గమనించిన ఖాసిం అదే ప్రాంతంలో ఉండే డాక్టర్ హకీం యాసిర్, ఆరిఫ్ షేక్, సైజాద్ జరివాలా, ఫైజల్ భాయ్ మన్సూరీలను పిలిచారు.

 
"అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి బంధువులు ఇబ్బంది పడుతుండటాన్ని మేము గమనించాం. వెంటనే మా ప్రాంతంలోనే ఉండే మరికొందరిని పిలించాం. హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయడం మాకు పూర్తిగా తెలియదు. కాబట్టి, మృతురాలి సోదరుడు రజనీకాంత్ భాయ్‌ సూచనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాం” అని డాక్టర్ హకీం చెప్పారు.

 
ఆ నలుగురు ముస్లింలు ఎవరో తనకు పరిచయం లేదని, అయినా వాళ్లు తనకు సాయం చేశారని రజనీకాంత్ తెలిపారు. “అమెరికాలో ఉంటున్న మా మేనకోడలు, మరికొందరు బంధువులు మా అక్క అంత్యక్రియలను చూడాలని ఉందని అన్నారు. నా వయసు 64 ఏళ్లు. టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. దాంతో, ఆరిఫ్ షేక్ తన ఫోన్‌ నుంచి వీడియో కాల్ చేసి వాళ్లకు చూపించారు. మా బంధువులు కూడా కొద్ది మంది వచ్చారు. నలుగురు ముస్లిం సోదరుల సాయంతో శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లాం. మా అక్క ఉండేది నాలుగో అంతస్తులో. ముస్లిం సోదరులు నాకు సాయం చేయకపోతే, మా అక్క శవాన్ని కిందికి తీసుకురావడం నాకు సాధ్యమయ్యేదే కాదు” అని రజీకాంత్ వివరించారు.

 
“మాతో పాటు ఈ ముస్లిం సోదరులు కూడా ‘హర హర మహాదేవ’ అంటూ నినాదాలు చేశారు. వాళ్లు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరచిపోలేను” అని ఆయన అన్నారు. “హిందు సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమయ్యే వస్తువులు తీసుకొచ్చేందుకు నేనే వెళ్లాను. ముస్లిం వ్యక్తి.. హిందువుల అంత్యక్రియల వస్తువుల కోసం వచ్చారేంటి? అని దుకాణం యజమాని అడిగారు. 

 
ఒక హిందూ మహిళ చనిపోయారు, అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం అని చెప్పాను. అది వినగానే వెంటనే ఆయన గులాబీ పూలు కూడా తెప్పించి ఇచ్చారు. వాటికి డబ్బులు కూడా తీసుకోలేదు. మిగతా వస్తువులకు కూడా చాలా తక్కువ డబ్బులే తీసుకున్నారు. మనుషులు ఒకరికొరు సాయం చేసుకోవాలి. ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచించాలి” అని ఫైజల్ భాయ్ మన్సూరీ చెప్పారు.

 
“ముహబ్బత్ ఇత్నీ బార్కరార్ రఖ్ఖో కే మఝత్ బీచ్ మే నా ఆయే, తుమ్ ఉసే మందిర్ తక్ ఛోడ్ దో, వహ్ తుమ్హే మస్జిద్ తక్ ఛోడ్ ఆయే” అని ఉర్దూలో ఆయన సందేశం వినిపించారు. దాని అర్థం “ప్రేమ మధ్యలో మతం ఉండకూడదు. నీవు వారిని ఆలయం దగ్గర దించితే, వారు నిన్ను మసీదు దగ్గరికి తీసుకెళ్తారు.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?