Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్‌: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck

Advertiesment
కరోనావైరస్‌: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
, గురువారం, 22 అక్టోబరు 2020 (13:41 IST)
కరోనా వైరస్‌ మీద దేశం యుద్ధం చేస్తున్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారంనాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఆరోగ్య నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు హెచ్చరించారు. భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తి, దాని నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సంబంధించి ఈ ప్రసంగం సందర్భంగా మోదీ అనేక గణాంకాలను ఉటంకించారు. ఐతే, మోదీ చెప్పిన గణాంకాలను బీబీసీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ పరిశీలించింది. వాటిలో నిజానిజాలేంటో గుర్తించే ప్రయత్నం చేసింది.

 
మోదీ మాట: దేశంలో రోజువారీ కేసుల నమోదు సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మరణాల సంఖ్య కొన్నివందల్లో ఉన్నప్పుడే భారతదేశం అన్ని విధాలా అనువైన లాక్‌డౌన్‌ విధానాలు పాటించింది. ఈ విషయంలో చాలా దేశాలకన్నా భారత్‌ ముందుంది.

 
ఫ్యాక్ట్‌ చెక్‌: ఇండియాలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నమాట వాస్తవం. అయితే, తక్కువ మరణాలు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ విధించిన దేశాలలో భారత దేశం మొదటిది కాదు. సెప్టెంబర్‌లో వైరస్‌ నిర్ధారణ అత్యున్నత దశ (పీక్‌)కు వెళ్లినప్పటి నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య వారానికి, వారానికి క్షీణిస్తోంది. రోజువారీ మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది.

 
ఇక లాక్‌డౌన్‌ ఫలితాలను అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఒక్కోదేశం ఒక్కొక్క స్థాయిలో టెస్టులు చేపట్టింది. అందువల్ల కేసుల నమోదు సంఖ్యలో తేడాలున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు కూడా ఒక్కోదేశంలో ఒక్కోరకంగా ఉన్నాయి. భారతదేశంలో 562 కేసులు, 9 మంది మృతి తర్వాత మార్చి 25న లాక్‌డౌన్‌ ప్రకటించారు. 68 రోజులపాటు ఈ లాక్‌డౌన్‌ కొనసాగింది. లాక్‌డౌన్‌ తొలి దశ ముగిసిన జూన్‌ 1 నాటికి 1,90,535 కేసులు నమోదయ్యాయి. అంటే లాక్‌డౌన్‌ కాలంలో కేసులు ఐదింతలు పెరిగాయి.

 
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలు కూడా భారత్‌తోపాటు లేదంటే కాస్త అటు ఇటుగా లాక్‌డౌన్‌ విధించాయి. కొన్ని దేశాల్లో భారత్‌కు మాదిరిగానే కేసుల సంఖ్య తక్కువగా ఉంది. భారత్‌కన్నా ఒక రోజు ముందు అంటే మార్చి 24న నేపాల్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. అప్పటికి ఆ దేశంలో కేవలం రెండే కేసులున్నాయి. శ్రీలంక మార్చి 22న లాక్‌డౌన్‌ విధించగా ఆ రోజునాటికి ఆ దేశంలో 78 కేసులున్నాయి.

 
పెరూ, న్యూజీలాండ్‌లాంటి దేశాలు అంతకన్నా ముందుగానే లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. పెరూ మార్చి 16న లాక్‌డౌన్‌ విధించగా, అప్పటికి ఆ దేశంలో 71 కేసులున్నాయి. జూన్‌ ఆఖరి వరకు పెరూలో లాక్‌డౌన్‌ కొనసాగింది. లాటిన్‌ అమెరికాలో ఇదే అత్యంత సుదీర్ఘమైన లాక్‌డౌన్‌. కాకపోతే లాక్‌డౌన్ సమయంలో కూడా బ్రెజిల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నిబంధనలు సడలించిన జూన్‌ చివరి నాటికి 282,000 కేసులు నమోదయ్యాయి. న్యూజీలాండ్‌లో కూడా కేసులు ఆరింతలు పెరిగాయి. అయితే చాలా దేశాలకన్నా ఎక్కువగా ఇక్కడ టెస్టులు జరిగాయి. అందువల్ల కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.

 
మోదీ మాట: భారత్‌లో ప్రతి పది లక్షలమందిలో 83 మంది మరణించారు. అమెరికా, బ్రెజిల్‌, బ్రిటన్‌, స్పెయిన్‌లలో ఈ సంఖ్య సుమారు 600 ఉంది.

 
ఫ్యాక్ట్‌ చెక్‌: ఇది నిజమే. ఇండియాలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే చాలా కోవిడ్‌ మరణాలు రికార్డు కాలేదని నిపుణులు అంటున్నారు. ఇండియాలో ప్రతి మిలియన్‌ వైరస్‌ బాధితుల్లో 83 మరణించారు. అదే అమెరికాలో ఒక మిలియన్‌ జనాభాకు 664మంది, బ్రిటన్‌లో 644 మంది, బ్రెజిల్‌లో 725, స్పెయిన్‌లో 727 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

 
ప్రపంచ జనాభాలో 17% మంది భారతదేశంలో నివసిస్తుండగా, మొత్తం కోవిడ్‌ మరణాల్లో 10%మంది భారతీయులున్నారు. అయితే ప్రపంచ జనాభాలో అమెరికా వాటా 4% కాగా, మృతుల్లో మాత్రం 20%మంది ఆ దేశం వారే ఉన్నారు. వైరస్‌బారిన పడేవాళ్ల సంఖ్యతో పోల్చినప్పుడు భారత్‌లో మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది. కానీ దీనికి అనేక అంశాలు అంటే యువత ఎక్కువగా ఉండటంలాంటివి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

 
ఇండియా అన్ని కోవిడ్‌ మరణాలను రికార్డు చేయగలిగిందా అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. మరణాలను ఒక్కోదేశం ఒక్కో రకంగా రికార్డు చేయడంతో వీటిని పోల్చి చూడటం కూడా కష్టమే. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దక్షిణాఫ్రికాలాంటి దేశాలలో కూడా మరణాల రేటు చాలా తక్కువగా ఉంది.

 
మోదీ మాట: భారతదేశంలో ప్రతి పది లక్షలమందిలో 5,500మందికి మాత్రమే వైరస్‌ సోకుతోంది. కానీ అమెరికా, బ్రెజిల్‌లాంటి దేశాలలో ఈ సంఖ్య 25,000గా ఉంది.

 
ఫ్యాక్ట్‌చెక్‌: ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ అంచనాలు పూర్తిగా నిజం. అయితే ఏ స్థాయిలో వ్యాప్తి జరుగుతోందన్నది ఎన్ని టెస్టులు చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి పది లక్షలమందిలో ఎంతమందికి వైరస్‌ సోకిందన్న గణాంకాలలో భారతదేశం అమెరికా, బ్రెజిల్‌లతోపాటు ఇంకా అనేక దేశాలకన్నా తక్కువ సంఖ్యనే నమోదు చేస్తోంది.

 
అయితే నిర్ధారిత కేసుల సంఖ్య, టెస్టులు ఎన్ని జరిగాయన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఎక్కువ టెస్టులు జరిగితే అన్ని ఎక్కువ కేసులు బయటపడే అవకాశం ఉంది. తలసరి టెస్టుల సంఖ్య విషయానికి వస్తే అనేక దేశాలకన్నా భారతదేశం వెనకబడే ఉందని చెప్పాలి. కాకపోతే ఇటీవలి కాలంలో టెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారతదేశంలో అక్టోబర్‌ 20నాటికి ప్రతి వెయ్యిమందిలో 69మందికే టెస్టులు జరిపారు. కానీ అమెరికాలో ప్రతి వెయ్యిమందిలో 407మందికి, యూకేలో 377మందికి టెస్టులు జరిగాయి. 

 
మోదీ మాట: అతి తొందరగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను ప్రారంభించిన దేశాలలో భారతదేశం ఒకటి.

 
ఫ్యాక్ట్‌ చెక్‌: కొన్నిదేశాలు భారత్‌కంటే ముందుగానే ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించాయి. కానీ, వాటి నాణ్యత మీద అనేక సందేహాలున్నాయి. భారత్‌లో జూన్‌ 14న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులకు ఆమోదం లభించింది. జూన్‌ 18 నుంచి టెస్టులు మొదలయ్యాయి. అప్పటి వరకు పీసీఆర్‌ టెస్టుల మీదే ఆధారపడ్డారు. ఇవి కచ్చితమైన రిపోర్టు ఇచ్చినా, ఫలితాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.

 
భారత్‌కన్నా చాలా ముందుగానే ర్యాపిడ్‌ టెస్టులకు చాలా దేశాలు అనుమతించాయి. తొలిసారి పర్మిషన్‌ ఇచ్చిన దేశాలలో బెల్జియం ముందుంది. ఈ టెస్టులు చేసుకోవచ్చని ఆ దేశ ప్రభుత్వం మార్చిలోనే ఆరోగ్యశాఖకు అనుమతి ఇచ్చింది. కానీ టెస్టుల్లో కచ్చితత్వంలేదని తేలడంతో తర్వాత ఆ టెస్టులను బెల్జియం నిలిపేసింది.

 
అమెరికాలో యాంటీజెన్‌ టెస్టులకు మే 9న అనుమతి లభించింది. జపాన్‌లో మే 13 నుంచి ఈ టెస్టులు మొదలు పెట్టారు. దేశీయంగా తయారు చేసిన రెండు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లతోపాటు, దక్షిణ కొరియా, బెల్జియం, తైవాన్‌లు తయారు చేసిన కిట్లతో ఇండియాలో టెస్టులు జరిగాయి. అయితే బెల్జియం కిట్ల ప్రామాణికతపై సందేహాలు రావడంతో వాటి వాడకాన్ని భారత్‌ నిలిపేసింది. సరిగ్గా ఇవే అనుమానాలతో దక్షిణ కొరియా కూడా తాను తయారు చేసిన కిట్స్‌ను తమ దేశంలోనే వాడటం నిలిపేసి, కేవలం పీసీఆర్‌ టెస్టులను కొనసాగించింది.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ఎన్నికలు : అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. బీజేపీ హామీ