Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: లాక్‌డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?

కరోనావైరస్: లాక్‌డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:13 IST)
మీరు కరోనావైరస్ హాట్‌స్పాట్ ప్రాంతంలో నివసించని వారయితే, నిత్యావసరాలను షాపుల నుంచి కొనుగోలు చేస్తుంటే, ఎప్పుడూ వాడే మీ ఇష్టమైన సరకులు ఇప్పుడు మీకు దొరక్కపోవచ్చు. చాలామంది మ్యాగీ కనిపించడం లేదని అంటున్నారు. కొంతమంది తాము తినే బిస్కెట్లు ఎక్కడా లేవని చెబుతున్నారు.

 
21 రోజుల లాక్‌డౌన్‌లో అవసరమైన సరుకులపై ఎలాంటి నిషేధం లేదు. ప్రజలకు ఆ సరకులు దొరుకుతున్నాయి కూడా. కానీ లాక్‌డౌన్ పెరిగితే, రాబోవు రోజుల్లో గోదుమపిండి, పప్పులు, బియ్యం, ప్యాక్డ్ ఫుడ్ లాంటి అవసరమైన వస్తువుల కొరత కనిపించవచ్చు.

 
షాపు వాళ్లు అంటే రిటెయిలర్స్ తమ దగ్గర ప్రస్తుతానికి నాలుగైదు రోజుల స్టాక్ ఉందని చెబుతున్నారు. అయితే, కొన్ని బ్రాండ్స్ వస్తువులు ఇప్పటికే నిండుకున్నాయి. ఈ రిటెయిలర్లకు సరుకులు సప్లై చేసేవారు మాత్రం తమ దగ్గర 10- 15 రోజుల స్టాక్ ఉందని చెబుతున్నారు. కానీ రవాణా సమస్యల వల్ల చాలా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ వస్తువులను రిటెయిలర్ల వరకూ చేర్చలేకపోతున్నారు.

 
నిజానికి, రైతుల పంటలు మార్కెట్ల వరకూ చేరాక, అక్కడి నుంచి ఫ్యాక్టరీలకు, తర్వాత అక్కడి నుంచి సరుకులుగా మారి ప్యాకింగ్‌లో హోల్‌ సేలర్ దగ్గరకు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటెయిలర్స్ దగ్గరకు చేరుకుంటాయి. దీనినే సప్లై చెయిన్ అంటారు. కానీ, చాలా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రస్తుతం ఆగిపోయి ఉంది. ముందు ముందు దాని ప్రభావం నేరుగా వినియోగదారులపై, అంటే నాపై, మీపై పడవచ్చు.

 
ఫ్యాక్టరీలు స్తంభించాయి
లాక్‌డౌన్ రెండు లేదా మూడు వారాలు పెరిగితే అవసరమైన సరుకుల సమస్య కచ్చితంగా వస్తుందని గుడ్‌గావ్ చాంబర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వికాస్ జైన్ చెబుతున్నారు. “ఎఫ్ఎంసీజీలో డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటెయిలర్ వరకు ఒక పూర్తి సప్లై చెయిన్ ఉంటుంది. అందులో సాధారణంగా మూడు నాలుగు వారాల గ్యాప్ ఉంటుంది. వాళ్ల దగ్గర కనీసం ఆ వారాలకు సరిపడా స్టాక్ ఉంటుంది. అందుకే మూడు వారాల లాక్‌డౌన్ వల్ల ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలూ రాలేదు. కానీ, దీనిని ఇంకా పెంచడం అంటే సవాళ్లు ఎదురవుతాయి” అన్నారు.

 
ఎఫ్ఎంసీజీ అంటే ‘ఫాస్ట్ మూవింగ్ కంజుమర్ గూడ్స్’ దీనినే సాధారణంగా ‘కంజుమర్ ప్యాకేజ్డ్ గూడ్స్’ అని కూడా అంటారు. వీటిలో సబ్బులు, డిటర్జెంట్, షాంపూ, టూత్‌పేస్ట్, షేవింగ్ ప్రొడక్ట్స్, షూ పాలిష్, ప్యాకేజ్డ్ ఫుడ్, స్కిన్ కేర్ వస్తువులు లాంటివి ఉంటాయి. అంటే, వికాస్ జైన్ చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకూ సరుకు చేరుకోలేదు. అంటే వారి ముందున్న దారి కష్టాలతో నిండి ఉంటుంది.

 
అవసరమైన వస్తువుల ఫ్యాక్టరీలను నడిపించడానికి యజమానులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కానీ ఫ్యాక్టరీల దగ్గర లేబర్ లేరు. వలస కూలీలు అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పర్మనెంట్ వర్కర్లు కూడా ఫ్యాక్టరీలకు రావడం లేదు. వారిలో కేవలం 10 నుంచి 15 శాతం వర్కర్లు మాత్రమే వస్తున్నారు.

 
అటు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ రిటెయిల్ కమిటీ చైర్మన్ సాకేత్ దాల్మియా “మరో 10-15 రోజులు నడిచిపోతుంది. ఎందుకంటే మొదట తక్కువగా అమ్ముడవుతూ వచ్చిన బ్రాండ్స్, ఇప్పుడు అమ్ముడుపోతాయి. మీకు కిసాన్ కెచప్ దొరక్కపోతే, మ్యాగీ కెచప్ వెతుకుతారు. మాగీ నూడుల్స్ దొరక్కపోతే, వేరేవి చూసుకుంటారు. శక్తిభోగ్ ఆటా దొరక్కపోతే, వేరేది ఎంచుకుంటారు. కానీ ఆ తర్వాత సవాలు ఎదురవుతుంది. అందుకే ఫ్యాక్టరీలు నడిపించడానికి చర్యలు తీసుకోవాలి” అన్నారు.

 
వీటిలో, ముఖ్యంగా తినడానికి ఉపయోగించే పదార్థాల విషయానికి వస్తే, వికాస్ జైన్ చెబుతున్న దాని ప్రకారం ఫుడ్ ఫ్యాక్టరీలను నడపకపోవడం వల్ల మనం చాలా నష్టం భరించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో లైన్ ఆగకుండా నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టరీలో హైజీన్ స్టాండర్ట్స్ అన్నీ ఉండాలి. దానితోపాటూ దానిలో మైక్రో బయాలజీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

 
కానీ ఆ లైన్ స్టార్ట్-స్టాప్ అవుతూ ఉంటే ఫ్యాక్టరీ కాస్ట్ చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే దానిని మాటిమాటికీ శుభ్రం చేసి నడిపించాల్సి ఉంటుంది. దానిని శానిటైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. స్టార్ట్-స్టాప్ వల్ల మధ్య మధ్యలో ఉత్పత్తి పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిని మధ్య మధ్యలో ఆపాల్సి వస్తోంది. ఎందుకంటే ట్రక్ డ్రైవర్లు తక్కువగా ఉన్నారు. అందుకే చాలా తక్కువ ట్రిప్పులు వేస్తున్నాయి.

 
గోధుమపిండి, పప్పు, బియ్యం
“ప్రస్తుతానికి దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోధుమపిండి, పప్పు, బియ్యం, నూనె లాంటి నిత్యావసరాల కొరత లేదు. ఇక ముందు కూడా ఫుడ్ గ్రెయిన్ రవాణా ఫ్లో ఇలాగే కొనసాగితే ఈ కొరత లేకుండా ఉండగలం” అని దిల్లీ ఫుడ్ గ్రెయిన్ అసోసియేషన్‌కు చెందిన అక్షయ్ నరేశ్ గుప్తా చెప్పారు.

 
“లేబర్ వెళ్లిపోయారు. ట్రక్ డ్రైవర్లు లేరు. నిత్యావసర సరుకుల చెయిన్ బలహీనపడితే, వస్తువులు ప్రజల వరకూ ఎలా చేరుతాయి” అంటారు నరేశ్. “ట్రక్ డ్రైవర్లకు దారిలో ఎక్కడా చాయ్ గానీ, తినడానికి గానీ ఏదీ దొరకడం లేదు. కొన్ని రవాణా అవుతున్నాయి. అయితే కిరాయి ఎక్కువైంది. అంటే, మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చే పప్పు క్వింటాలుకు మొదట్లో 150 రూపాయలు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అది క్వింటాల్ 250 రూపాయలు అయ్యింది”.

 
“లేబర్ కొరత వల్ల ఫుడ్ గ్రెయిన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ చాలావరకూ మూతపడి ఉంది. వాటిని తెరిపించాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మిల్లులో పిండి కొట్టినపుడు దాన్ని ప్యాక్ కూడా చేయాలికదా” అన్నారు నరేశ్. “బియ్యం సిద్ధంగా ఉంటాయి, కానీ వాటిని ప్యాక్ చేయడానికి సంచులు లేకపోతే పని ఎలా నడుస్తుంది. గోధుమలు కూడా ఉంటాయి. కానీ వాటిని తరలించాలంటే గోనె సంచులు కావాలి కదా”.

 
అసలు సమస్య లేబర్, రవాణా
అవసరమైన వస్తువుల సరఫరాను దేశవ్యాప్తంగా కొనసాగించడం ఒక పెద్ద సవాలులా మారింది అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చెబుతోంది. కాట్, ఆల్ ఇండియన్ ట్రాన్స్ పోర్ట్ వెల్ ఫేర్ అసోసియేషన్ దీని గురించి చర్చిస్తున్నాయి. వారి వివరాల ప్రకారం గత రెండు మూడు రోజులుగా పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ రవాణా ఇప్పటికీ పూర్తిగా ఆపరేట్ కావడం లేదు.

 
నిజానికి, ప్రభుత్వం మొదట నిత్యావసరాలు రవాణా చేయడానికి మాత్రమే ట్రక్కులకు అనుమతి ఇచ్చింది. కానీ ట్రక్కులు ఏదైనా ఒక ప్రాంతానికి లోడ్ కోసం వెళ్తుంటే, అవి అక్కడివరకూ ఖాళీగా వెళ్లలేవు. ఈ నష్టం గురించి ఆలోచించిన చాలా ట్రక్కులు ఆగిపోయాయి. వారం తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ట్రక్కుల్లో పెద్దగా అవసరం కాని వస్తువులను కూడా తీసుకెళ్లచ్చు అంటున్నాయి. కానీ, అప్పటికే చాలామంది ట్రక్కు డ్రైవర్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

 
కాట్ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్ బీబీసీతో “సప్లై చెయిన్‌కు సంబంధించిన అన్ని వర్గాలు పరస్పర భాగస్వామ్యం చాలా అవసరం. అందులోని టోకు వ్యాపారులు/పంపిణీదారులు, చిల్లర వ్యాపారులు, తయారీదారులు లేదా ఉత్పత్తిదారులు, ట్రాన్స్ పోర్టర్లు, కొరియర్ సేవలు, వస్తువులకు అవసరమైన ముడి సరుకు తయారీదారులతోపాటూ ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఉత్పత్తిదారుల మధ్య ఎక్కువ అన్యోన్యత అవసరం” అన్నారు.

 
కేంద్ర హోంమంత్రి, వాణిజ్య మంత్రితో మాట్లాడానని ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. “ఈ చెయిన్‌ను కొనసాగించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అందులో అన్ని విభాగాల ప్రతినిధులు ఉండాలని, వారు రోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సప్లై చెయిన్‌లో వచ్చిన ఏదైనా సమస్యలను వెంటనే పరిష్కరించుకునేలా అది ఉండాలని నేను వారిని కోరాను” అని ఆయన చెప్పారు.

 
అవసరమైన వస్తువుల ఫ్యాక్టరీల యజమానులతో ప్రభుత్వం చర్చలు నడుస్తున్నాయి. వాటిని నడిపించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ రిటెయిల్ కమిటీ కో చైర్మన్ ప్రదీప్ అగ్రవాల్ ప్లాంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే సూచనలు కూడా ఇస్తున్నారు. వాటి వర్కర్లను అక్కడే ఉండడానికి చోటు క ల్పిస్తామని లేదంటే వారు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసుకుంటామని అంటున్నారు. దానితోపాటు వర్కర్లకు భోజనం, సరైన హెల్త్ కేర్, శుభ్రత విషయం కూడా చూసుకుంటామని యజమానులు చెబుతున్నారు.

 
ఎఫ్ఎంసీజీ భారత ఆర్థికవ్యవస్థలో నాలుగో అతిపెద్ద సెక్టర్. అవసరమైన రా మెటీరియల్, చౌక లేబర్, పూర్తి వాల్యూ చెయిన్‌ ఉండడం వల్ల మార్కెట్‌లో భారత్ గట్టి పోటీని ఇస్తోంది. 2017-18లో ఎఫ్ఎంసీజీ సెక్టర్ సంపాదన దాదాపు మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు. 2020 వరకూ అది పెరిగి 7 లక్షల 25 వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాలు దీనికి సుమారు 45 శాతం భాగస్వామ్యం అందిస్తున్నాయని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను కూడా మాస్క్ ధరిస్తున్నా, అందుకే: సీఎం కేసీఆర్