Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: భారత్‌లో కొట్టిన చప్పట్ల శబ్దం నాసాకు వినిపించిందా? - బీబీసీ ఫ్యాక్ట్ చెక్

కరోనావైరస్: భారత్‌లో కొట్టిన చప్పట్ల శబ్దం నాసాకు వినిపించిందా? - బీబీసీ ఫ్యాక్ట్ చెక్
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:02 IST)
కరోనావైరస్ గురించి సోషల్ మీడియాలో పాపులర్ అయిన కొన్ని అవాస్తవాలు, తప్పుదోవ పట్టించే వార్తల నిజాయతీ, వాటి ప్రామాణికతను బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పరిశీలిస్తోంది. జేక్ గుడ్‌మెన్ ఇలాంటి కొన్ని వార్తలను తీసుకొచ్చినా, బీబీసీ మానిటరింగ్, ట్రెండింగ్, రియాలిటీ చెక్ వాటిని కొట్టిపారేసింది.

 
జెఫ్ బెజోస్ అలా చెప్పలేదు
కరోనావైరస్ గురించి మీకు బహుశా బిల్ గేట్స్ మెసేజ్ గుర్తుండే ఉంటుంది. నిజానికి దానికి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ మేం మరో బిలియనీర్ జెఫ్ బెజోస్ సందేశం అని చెప్పి వైరల్ చేస్తున్న ఓ ఫేక్ మెసేజ్‌తో వచ్చాం. బిల్ గేట్స్ ఇవ్వని ఒక సందేశం గురించి జెఫ్ బెజోస్ చెబుతున్నట్టు ఇది కనిపిస్తోంది. కానీ దీనికి జెఫ్ బెజోస్‌కు కూడా ఎలాంటి సంబంధం లేదు.

 
నకిలీ వార్త అని అమెజాన్ ధ్రువీకరణ
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కోవిడ్-19 గురించి ఆఫ్రికన్లకు ఒక కఠిన మెసేజ్ పంపించారని, అందులో “బిల్ గేట్స్ ఆఫ్రికాను అస్థిర పరచాలని చూస్తున్నారు. మీరు ప్రత్యేక రకం ఫేస్ మాస్క్ వేసుకోకండి, ఎందుకంటే అందులో విషపూరిత పదార్థాలు ఉన్నాయి” అని ఆఫ్రికన్లకు చెబుతున్నట్టు ఉంది.

 
ఈ ఫేక్ పోస్ట్ ఫ్రాన్స్‌లో వందల అకౌంట్ల నుంచి కాపీ, పేస్ట్ అయ్యింది. దీనిని మొదట డీఆర్ కాంగోలోని ఒక అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ అకౌంట్‌ను జనవరిలో ప్రారంభించారు. ఇదే పోస్టును 30 వేలకు పైగా ప్రజలు షేర్ చేశారు.

 
5జీ టెక్నాలజీకి కరోనాతో లింక్
5జీ టెక్నాలజీ, కరోనా వైరస్ మధ్య లింక్ ఉందని చెబుతున్న వదంతులను అసలు పట్టించుకోవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారం, అసాధ్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ కొందరు తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో దీనిపై కొన్ని తప్పుడు వాదనలు వ్యాపించేలా చేస్తున్నారు.

 
రకరకాల వ్యాధులు వ్యాపించడానికి కొత్త టెక్నాలజీ ఎలా కారణం అవుతోందో వేలసార్లు షేర్ చేసిన ఒక పోస్టులో చెప్పారు. ఆ పోస్టులో “1979లో 1జీ సమయంలో ఇన్‌ఫ్లూయెంజా వ్యాపించింది, 2జీ సమయంలో కలరా, అలాగే 5జీ సమయంలో కోవిడ్-19 వచ్చింది” అన్నారు. ఇదంతా అబద్ధం. ఈ ఘటనలకు, టెక్నాలజీకి ఎలాంటి సంబంధం లేదు.

 
కరెంటు స్తంభాలపై ఉన్న కొన్ని పోస్టర్లపై "కోవిడ్-19 అనేది ఎక్కడా లేదు. ఈ మరణాలకు అసలు కారణం 5జీనే" అని రాసి ఉండడం కనిపించింది. ఈ వాదన అవాస్తవం. “టెస్టింగ్ కిట్లకు కరోనావైరస్ సంక్రమించింది అని తెలిసిన తర్వాత చైనా ఇంటర్‌నెట్ కంపెనీ హువావేతో బ్రిటన్ తమ ఒప్పందం రద్దు చేసుకుంది” అని ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఇంగ్లిష్, అరబ్బీ, పోర్చుగీస్, ఫ్రెంచ్ భాషల్లో కొన్ని వేల సార్లు షేర్ చేశారు.

 
అయితే, హువావేతో బ్రిటన్ డీల్ కొనసాగుతోంది. టెస్టింగ్ కిట్లకు కరోనా వ్యాపిస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. తర్వాత కరోనావైరస్, 5జీ టెక్నాలజీ, కొత్త 20 పౌండ్ నోట్‌కు లింకు పెట్టి మరో వదంతి కూడా వ్యాపించింది. సోషల్ మీడియాలో చాలా పోస్టుల్లో ఈ నోట్ వెనక 5జీ టెలీకాం టవర్ అని చెబుతున్న దానిపై కనిపించేది వైరస్ అని అంటున్నారు.

 
అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఈ నోట్ డిజైన్ జారీ చేసినపుడు అవేంటో వివరించింది. దాని ప్రకారం నోటుపై కరోనావైరస్‌లా అనిపిస్తున్నది నిజానికి టేట్ బ్రిటన్ ఆర్ట్ గ్యాలరీ గుమ్మటం, దీనిలో ఫోన్ టవర్‌లా కనిపిస్తున్నది మార్గరెట్ లైట్‌హౌస్.

 
అంబులెన్స్ వాయిస్ నోట్
మీరు ఒక వాయిస్ నోట్ కూడా వినే ఉంటారు. అందులో ఒక మహిళ తను సౌత్ఈస్ట్ కోస్ట్ అంబులెన్స్ సర్వీస్ (సీకాస్)లో పనిచేస్తున్నానని, పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ నుంచి అందిన అంతర్గత సమాచారాన్ని మీతో పంచుకుంటున్నానని చెబుతుంది. అయితే అది కూడా నిజం కాదు.

 
“ఇది ఒక ఫేక్ న్యూస్. ఈ మెసేజ్ పట్టించుకోవద్దని, దీనిని షేర్ కూడా చేయద్దని మేం ప్రజలను కోరుతున్నాం” అని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) చీఫ్ నర్స్ వివ్ బెనెట్ చెప్పారు. “రాకపోకలపై నిషేధం విధిస్తారని, కరోనావైరస్ వల్ల చనిపోయినవారిలో ఆరోగ్యంగా ఉన్నవారు, యువకులు ఎక్కుమంది ఉన్నారు” అని ఆ మహిళ చెబుతుంటారు. ఈ వాయిస్ మెసేజ్‌లో వాదనలు నిజం కాదని సీకాస్ చెబుతోంది.

 
చాలా మంది ఈ నోట్‌ను బీబీసీ రిపోర్టర్లకు, సీకాస్, పీహెచ్ఐకు పంపించారు. దీని గురించి సమాచారం అందించాలని కోరారు. వాటిని బట్టి ఇది వాట్సాప్‌లో ఇది విపరీతంగా వైరల్ అయ్యిందని తెలిసింది.

 
నాసాకు భారత్ చప్పట్లు వినిపించాయా
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారికి ధన్యవాదాలు చెబుతూ భారతీయులు మార్చిలో చప్పట్లు, శబ్దాలు చేయడం గురించి మరో పాపులర్ మెసేజ్ వైరల్ అవుతోంది. భారత్‌లో ప్రజలందరూ అలా చప్పట్లు కొట్టడం, శబ్దాలు చేయడం వల్ల వచ్చిన ధ్వనిని నాసా తమ శాటిలైట్ల ద్వారా విన్నదని, దాంతో కరోనావైరస్ తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.

 
శబ్దాలు అంత దూరం వినిపిస్తాయా?
ఈ మెసేజ్ రెండు వారాల క్రితం వచ్చింది. కానీ దీనిని కొందరు ఇప్పటికీ షేర్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ వాదనలను పూర్తిగా కొట్టిపారేసినా వారు అలా చేస్తూనే ఉన్నారు.

 
అమెరికా శాస్త్రవేత్త గురించి ప్రచారం
అలాగే, కరోనావైరస్‌ను తయారు చేసిన ఒక హార్వర్డ్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారని సోషల్ మీడియాలో తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వార్త వైరల్ అయ్యింది. ఎన్నో భాషల్లో సర్కులేట్ అయ్యింది. ఈ పోస్టును లక్షలసార్లు షేర్ చేశారు. వాటిలో “చార్లెస్ లీబర్‌ను అమెరికా అరెస్టు చేసింది. కరోనావైరస్‌ను సృష్టించి, దానిని చైనాకు అమ్మింది ఆయనే” అని చెప్పారు.

 
ఈ ఏడాది జనవరిలో చైనాతో ఉన్న పరిచయాల గురించి అబద్ధాలు చెప్పారని లీబర్‌ను అరెస్ట్ చేశారు. కానీ, అతడిపై వచ్చిన ఆరోపణలకు, కరోనావైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో చాలా పోస్టుల్లో జనవరిలో వచ్చిన అమెరికా న్యూస్ క్లిప్ కూడా ఉంది. వాటిని నేచురల్ రెసిపీస్ చూపించే ఒక స్పానిష్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దానిని రెండున్నర లక్షల సార్లకు పైగా షేర్ చేశారు.

 
కరోనావైరస్ జంతువుల నుంచి మనుషులకు వచ్చిందని, అది మానవ సృష్టి కాదని కోవిడ్-19 జన్యుపటం, దాని పరిణామ మార్పులను పరిశోధించడం వల్ల తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 108 కేసులు