Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పతంజలి కరోనిల్: కరోనాకు మందు తయారు చేశామన్న రాందేవ్ బాబా.. ప్రచార ప్రకటనలు ఆపాలన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ

పతంజలి కరోనిల్: కరోనాకు మందు తయారు చేశామన్న రాందేవ్ బాబా.. ప్రచార ప్రకటనలు ఆపాలన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
, బుధవారం, 24 జూన్ 2020 (12:34 IST)
కరోనిల్, శ్వాసారి వటి అనే రెండు మందులను కరోనా చికిత్స కోసం తయారుచేశామని యోగా గురు రాందేవ్‌కు చెందిన సంస్థ పతంజలి మంగళవారం ప్రకటించింది. కోవిడ్-19కి ఈ మందులతో ఆయుర్వేద చికిత్స చేయొచ్చని పతంజలి చెబుతోంది. పతంజలి యోగపీఠ్ హరిద్వార్‌లో ఉన్న తమ ప్రధాన కార్యాలయంలో కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా ఇది వంద శాతం సానుకూల ప్రభావం చూపించిందని ఆ సంస్థ చెప్పింది. అయితే, ఆయుష్ మంత్రిత్వ శాఖ మాత్రం ఆ ఔషధ ప్రకటనలను ప్రస్తుతానికి ఆపేయాలని సూచించింది.

 
ప్రకటనలు ఆపేయమన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 చికిత్స కోసం పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ మందులు తయారు చేసిందనే విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆ ఔషధాల వివరాలు అందించాలని పతంజలి సంస్థను కోరినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ఔషధాలను నిశితంగా పరిశీలించేవరకూ వాటి గురించి ప్రకటనలు, ప్రచారం ఆపివేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆ సంస్థను కోరిందని చెప్పింది.

 
ఆయుష్ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. ‘‘హరిద్వార్‌లోని పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ కోవిడ్-19కు ఆయుర్వేద మందులను తయారు చేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. ఆ సంస్థ వాదనలో వాస్తవాలు, వారు చెబుతున్న శాస్త్రీయ అధ్యయనం గురించి మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాచారం లేదు’’ అని తెలిపింది.

 
రాందేవ్ బాబా ఏం చెప్పారు?
“ఈ మందు ట్రయల్స్‌లో 280 మంది రోగులు పాల్గొన్నారు. వారందరూ కరోనా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రోగులపై మందును పరీక్షించేందుకు అవసరమైన అనుమతులు మేం ముందే తీసుకున్నాం” అని రాందేవ్ చెప్పారు. పతంజలి రీసెర్చ్ సెంటర్, ఎన్ఐఎంఎస్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జైపూర్) సంయుక్త కృషితో ఈ మందులు తయారు చేశామని రాందేవ్ చెప్పారు. “ఈ మందును మూడు నుంచి ఏడు రోజులు ఉపయోగిస్తే, కరోనా రోగి పూర్తిగా కోలుకుంటారు. 69 శాతం మంది మూడు రోజుల్లో, వంద శాతం మంది ఏడు రోజుల్లో కోలుకోవడం మేం చూశాం” అన్నారు.

 
ఎక్కడ పరీక్షించారు? ఎలా పరీక్షించారో చెప్పండి: ఆయుష్
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ తాము తయారు చేసిన మందు పేరు, అందులో ఏమేం ఉపయోగించారన్న వివరాలు కూడా అందించాలని ఆయుష్ శాఖ కోరింది. దానితోపాటూ ఔషధంపై ఎక్కడ, ఏ ఆస్పత్రిలో అధ్యయనం జరిగింది? ఆ సమయంలో ఎలాంటి ప్రొటోకాల్ పాటించారో చెప్పాలని అడిగింది. నమూనా పరిమాణం ఎంత, దానికి ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ నుంచి క్లియరెన్స్ లభించిందా?, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్, ఈ అధ్యయనానికి సంబంధించిన డేటా ఎక్కడ ఉందో చెప్పాలని కూడా కోరింది. ఇవన్నీ విచారించే వరకూ ఈ ఔషధానికి సంబంధించిన ప్రచార ప్రకటనలను నిలిపివేయాలని ఆయుష్ శాఖ స్పష్టంగా చెప్పింది. దాంతోపాటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీని ఈ ఔషధానికి సంబంధించిన లైసెన్స్ కాపీ ఇవ్వాలని కోరింది. ఉత్పత్తిని ఆమోదించడానికి సంబంధించిన వివరాలు కూడా అందించాలని చెప్పింది.

 
‘ఐసీఎంఆర్‌కు సంబంధం లేదు’‘బీబీసీ’తో మాట్లాడిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జరనల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్.. పతంజలి తయారు చేసిన ఔషధం గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు."కరోనిల్ అనే ఈ మందు కోవిడ్-19 రోగుల చికిత్సకు సమర్థమైనదని చెప్పడం సబబేనా?" అని అడిగినప్పుడు ఆయన "నేను అలాంటి ఏ ఔషధం గురించి మాట్లాడను. కానీ, ఈ మందుకు సంబంధించి ఏ ప్రయత్నాలలోనూ ఐసీఎంఆర్ పాల్గొనలేదు" అన్నారు.

 
ఆయుష్ శాఖ ప్రకటన వచ్చిన కాసేపట్లోనే పతంజలి సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ స్పందించారు. తాము ఆయుష్ శాఖకు ఈ ఔషధాలకు సంబంధించిన అన్ని వివరాలూ అందించామని ట్వీట్ చేశారు.‘‘ఇది ప్రభుత్వ ఆయుర్వేదానికి ప్రోత్సాహం, గౌరవం ఇస్తుంది. మా మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్‌ను దూరం చేశాం. రాండమైజ్డ్ ప్లాసిబో కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఎన్ని స్టాండర్డ్ పారామీటర్స్ ఉన్నాయో వాటన్నిటినీ వంద శాతం పాటించాం. దీనికి సంబంధించిన మొత్తం వివరాలను ఆయుష్ మంత్రిత్వ శాఖకు అందించాం’’ అన్నారాయన.

 
రాందేవ్ ప్రకటనతో సోషల్ మీడియాలో ఈ మందులపై చర్చ మొదలైంది. కరోనాకు మందు తయారు చేశామని రాందేవ్ ప్రెస్ కాన్ఫరెన్సులో చెప్పిన కాసేపట్లోనే ప్రజల నుంచి స్పందన మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు ఆయన్ను ప్రశంసిస్తే, కొంతమంది సెటైర్లు వేశారు. ‘చక్ దే ఇండియా’ సినిమాలోని ఒక మీమ్ షేర్ చేసిన స్మృతి అనే నెటిజన్ “హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇప్పుడు అందరితో ‘నాలో లేనిది అందులో ఏముంది’ అంటూ ఉంటుంది” అని ట్వీట్ చేశారు.

 
“పేరు ఎలా పెట్టాలో రాందేవ్ మెడిసిన్‌ను చూసి నేర్చుకోవాలి. ‘కరోనిల్’ అని ఎంత మంచి పేరు పెట్టారో” అని దీక్షిత్ అనే నెటిజన్ పోస్ట్ చేశారు. మిస్టర్ ఫ్రీక్ అనే మరో యూజర్... బాబా రాందేవ్ కరోనిల్ లాంచ్ చేయగానే.. “శాస్త్రవేత్తలంతా ఘోర అవమానం జరిగిందని అంటుంటారు” అని పెట్టారు. పవన్ జావర్ తన ట్విటర్‌లో “ఒక భారతీయుడు కరోనాకు చికిత్స కనిపెట్టాడు. ప్రపంచాన్ని కాపాడే మంచి పని చేశాడు. మనం ఆయన్ను చూసి గర్వపడాలి, ఎగతాళి చేయకూడదు” అని పోస్ట్ చేశారు.

 
అరుణ్ పుదూర్ అనే యూజర్ “కరోనిల్ నిజంగా పనిచేస్తే, అది విప్లవాత్మకం అవుతుంది. ఆయుర్వేదం మరోసారి ప్రపంచ పటంలో నిలుస్తుంది” అన్నారు. చింకీ ఒక మీమ్ షేర్ చేస్తూ “రాందేవ్ ఈ మందును లాంచ్ చేసిన తర్వాత టాప్ రీసెర్చర్‌తో ‘నా కళ్లలోకి చూడు’ అంటుంటారు” అని పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - చైనా సరిహద్దు వివాదం: గల్వాన్ లోయలో ఘర్షణపై అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవీ...