Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 తగ్గింది, భారత్‌లో ఎందుకు తగ్గించడం లేదు?

Advertiesment
కరోనావైరస్: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 తగ్గింది, భారత్‌లో ఎందుకు తగ్గించడం లేదు?
, సోమవారం, 4 మే 2020 (17:45 IST)
పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ తహ్రీకే ఇన్సాఫ్’ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేసింది. అందులో “అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. దీంతో, “సామాన్యులకు వీటి నుంచి కొంత ప్రయోజనం అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వం మే నెల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించింది” అని పెట్టారు.

 
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో, పెట్రో ధరలు తగ్గించాలని దేశ ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(OGRA) పాకిస్తాన్ శక్తి వనరుల మంత్రిత్వ శాఖను కోరినట్లు స్థానిక మీడియా చెప్పింది. పాకిస్తాన్ శక్తి వనరుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2020 మే నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. వాటి ప్రకారం లీటర్ పెట్రోల్ మీద 15 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ మీద 27.15, కిరోసిన్ మీద 30 రూపాయలు, లైట్ డీజిల్ మీద 15 రూపాయలు తగ్గించారు.

 
అంటే, ఒక లీటర్ పెట్రోల్ ఇంతకు ముందు 96 రూపాయలు ఉంటే ఇప్పుడు అది రూ.81 అయ్యింది. హైస్పీడ్ డీజిల్ ధర గతంలో లీటర్ 107 రూపాయలు ఉంటే అది ఇప్పుడు రూ.80 రూపాయలకు తగ్గింది.

 
నిర్ణయంపై ప్రశంసలు, విమర్శలు
పాక్ సోషల్ మీడియాలో కొంతమంది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. పెట్రో ధరలు తగ్గించడం వల్ల, కోవిడ్-19 మహమ్మారి వల్ల తమపై పడిన అదనపు ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం లభించిందని చెప్పారు. కానీ కొందరు ఆర్థిక అంశాల నిపుణులు ఈ నిర్ణయం ‘దురదృష్టకరం’ అంటున్నారు. పాకిస్తాన్‌ ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ కైసర్ బంగాలీ “చమురు ధరలు ఎప్పుడు తగ్గించినా ద్రవ్యోల్బణం, ప్రజా రవాణా ధరల్లో ఎలాంటి తగ్గింపు ఉండదు. వినియోగదారులకు ప్రయోజనం అనే ప్రచారం అవాస్తవం. చమురు అమ్మే కంపెనీలు తమ సేల్స్ పెంచుకోడానికే అలా చేస్తాయి” అన్నారు.

 
డాక్టర్ కైసర్ బలూచిస్తాన్ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, సింధ్ ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి సలహాదారుగా కూడా పనిచేశారు. “పెట్రోల్ ధరలు తగ్గించడం వల్ల కేవలం చమురు అమ్మే కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. చమురు ధరలు తగ్గించడానికి బదులు ప్రభుత్వం చమురును పాత ధరలకు అమ్మాలి. దానివల్ల వచ్చే లాభాలను ప్రభుత్వం రుణాలు చెల్లించడానికి, ఉత్పత్తుల జీఎస్టీ రేటు తగ్గించడానికి ఉపయోగించాలి. అలా చేస్తే, పరిశ్రమలు, ఉపాధిరంగాలకు ప్రోత్సాహం లభిస్తుంది” అని కైసర్ అన్నారు.

 
అంతర్జాతీయ మార్కెట్ ఎలా ఉంది?
ప్రపంచవ్యాప్తంగా చమురు పరిశ్రమ అంచనా ప్రకారం కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచంలో చమురు వినియోగం 35 శాతానికి పైగా పడిపోయింది. మొట్టమొదట చైనాలో తర్వాత యూరోపియన్ దేశాలతోపాటు లాక్‌డౌన్ వల్ల చమురు వినియోగంపై అత్యంత తీవ్ర ప్రభావం పడింది. కానీ అంతర్జాతీయ చమురు మార్కెట్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. చమురు ధరలు ఏకంగా నెగటివ్‌లోకి వెళ్లిపోయాయి. అత్యధిక చమురు నిల్వలు ఉంచుకోవాలని ఆశించిన దేశాలన్నింటికీ, ఇప్పుడు ఆ చమురు భారంగా అనిపిస్తోంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోడానికి బీజేపీ నేత, చమురు అంశాల్లో నిపుణులు నరేంద్ర తనేజాతో బీబీసీ మాట్లాడింది.

 
ఆయన “కరోనా మహమ్మారి వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్ కష్టాల్లో పడిన మాట వాస్తవమే. కానీ చమురు ఉత్పత్తిపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి ప్రయత్నిస్తున్న అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల మధ్య పరిస్థితిని ఇది మరింత సంక్లిష్టంగా మార్చింది” అన్నారు.

 
ఒపెక్ ప్లస్ దేశాల్లో మే 1న ఒప్పందం జరగనంతవరకూ, ఈ దేశాలు పోటీపడి ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. లాక్‌డౌన్ వల్ల డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. దానిపై ఒక ఏకాభిప్రాయానికి రావడంలో చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈదేశాలు రోజుకు 97 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. కానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో చమురు డిమాండ్ ప్రకారం ఆ ఉత్పత్తిని మూడో వంతుకు తగ్గించాలి. మార్కెట్ అంచనా ప్రకారం రోజుకు 3 కోట్ల బ్యారెళ్లు ఉత్పత్తి చేయాలి. అప్పుడు డిమాండ్, సరఫరా బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. మార్కెట్లో చమురు ధరలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి” అని తనేజా చెప్పారు..

 
అయితే భారత్ ఆ ప్రయోజనం ఎందుకు పొందడం లేదు. ఈ ప్రశ్నకు ఆయన “ముడి చమురు ధరలు భారత్‌కు ఒక కానుక లాంటివి. కానీ, నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల భారత్‌కు దాని ప్రయోజనం ఎక్కువగా లభించడం లేదు. ఎందుకంటే భారత్‌లో 9 రోజుల వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది” అన్నారు.

 
భారత్‌లో 2004 ధరలు ఉండాలి
కాంగ్రెస్ పార్టీ కూడా మార్చిలో “అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సుమారు 35 శాతం తగ్గాయి, తగ్గిన చమురు ధరల ప్రయోజనాలను భారత్ సామాన్యులకు ఎప్పుడు అందిస్తోంది, భారత ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్ 60 రూపాయల కంటే కిందికి ఎప్పుడు తీసుకొస్తుంది” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా “ప్రస్తుతం ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 2004 నవంబర్ నెలలో స్థాయికి చేరాయి. మోదీ ప్రభుత్వం భారత్‌లో చమురు ధరను 2004 ధరలకు ఎందుకు తీసుకురావడం లేదు” అన్నారు.

 
ఏప్రిల్ 21న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా తన ట్వీట్‌లో “ప్రపంచంలో ముడి చమురు ధరలు ఊహించని విధంగా తగ్గాయి. అయినా, మన దేశంలో పెట్రోల్ ధర లీటర్ 69, డీజిల్ 62 రూపాయలు ఎందుకుంది. ఈ విపత్తులో ధరలు ఎంత తగ్గిస్తే, అంత మంచిది. ప్రభుత్వం ఎప్పుడు వింటుంది” అన్నారు.

 
పాకిస్తాన్‌లో తగ్గిస్తే, భారత్‌లో తగ్గించరా?
పాకిస్తాన్‌లో పెట్రో ధరలు తగ్గించారనే వార్తలు వచ్చాక, భారత్‌లో కూడా సోషల్ మీడియాలో పాక్ తగ్గించినప్పుడు, భారత ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు అని అడుగుతున్నారు. మేం ఇదే ప్రశ్నను చమురు అంశాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహించే నరేంద్ర తనేజాను అడిగాం. ఆయన చమురు విషయంలో భారత్, పాకిస్తాన్‌లను పోల్చడం తప్పు అన్నారు.

 
“పాకిస్తాన్ ఒక చిన్న, అసంఘటిత ఆర్థికవ్యవస్థ ఉన్న దేశం. దాని ఆర్థికవ్యవస్థ 280 నుంచి 300 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే అది మహారాష్ట్ర ఆర్థికవ్యవస్థ కంటే చిన్నది. అక్కడ మధ్యతరగతి చాలా తక్కువ. కానీ భారత్‌లో అత్యధికులు మధ్య తరగతివారే. ప్రధాన చమురు వినియోగదారులు వారే. అంటే రెండు దేశాల్లో శక్తి వనరుల వినియోగం పూర్తిగా భిన్నంగా ఉంటుంది” అన్నారు.

 
“ఎక్కువగా ముడి చమురు సరఫరా చేసేది ఇస్లామిక్ దేశాలే. అందుకే, అవి భారత్‌ కంటే పాకిస్తాన్‌కు చాలా సులభ షరతులు విధిస్తాయి. మనతో పోలిస్తే వారికి ఎక్కువ క్రెడిట్ కూడా లభిస్తుంది” అని తనేజా చెప్పారు. ఒక పీటీఐ నివేదిక ప్రకారం మామూలు రోజుల్లో భారత్‌లో రోజుకు 46 నుంచి 50 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగం ఉంటుంది. కానీ భారత చమురు మార్కెట్ అంచనా ప్రకారం కోవిడ్-19 మహమ్మారి వల్ల భారత్‌లో చమురు వినియోగం దాదాపు 30 శాతం తగ్గింది.

 
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్ దాదాపు 85 శాతం ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో భారత్‌కు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు చౌకగా లభిస్తున్నప్పుడు ప్రభుత్వం ఆ ప్రయోజనం ప్రజలకు అందించకూడదా? దీనికి సమాధానంగా “భారత్‌లో చమురు ధరల్లో దాదాపు 50 శాతం పన్నులు ఉంటాయి. దేశంలో చమురు డిమాండ్ తగ్గితే, ప్రభుత్వానికి పన్నులు కూడ తగ్గుతాయి. కేంద్ర-రాష్ట్రాలు రెండింటి పన్ను వసూళ్లలో పతనం నమోదవుతుంది” అన్నారు తనేజా

 
“మరో విషయం ఏంటంటే కరోనా మహమ్మారి వల్ల చమురు ధర తగ్గింది. అది వేరే ఏ కారణం వల్ల తగ్గినా, పెట్రో ఉత్పత్తుల ధర తగ్గించలేం. ఎందుకంటే, దానివల్ల భారత్‌లో పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా చూడాల్సి ఉంటుంది” అన్నారు తనేజా.

 
“గల్ఫ్ దేశాల్లో ఉంటున్న సుమారు 80 శాతం మంది భారతీయుల ఉపాధి చమురు మార్కెట్‌ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రభుత్వం వారి గురించి కూడా ఆలోచిస్తుంది. అన్ని గల్ఫ్ దేశాల ఆర్థికవ్యవస్థ చమురుపై ఆధారపడి ఉంది. చమురు ధరలు వరసగా పతనమైతే ఆ కంపెనీలు మూతబడతాయి. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉంది. దాని ప్రభావం అక్కడి భారతీయులపై, వారు పంపించే దాదాపు 50 బిలియన్ డాలర్ల సంపాదనపై కూడా పడుతుంది. అంతే కాదు, ఆ దేశాలకు భారత్ చేసే ఎగుమతులపై కూడా ప్రభావం ఉంటుంది. అందుకే ప్రపంచ ఆర్థికవ్యవస్థ, గల్ఫ్ దేశాల ఆర్థికవ్యవస్థ సుభిక్షంగా ఉండడం భారత్‌కు మంచిది” అని తనేజా చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "జగనన్న బీరు పండుగ" : లోకేశ్ సెటైర్లు