Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?

Advertiesment
కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (18:27 IST)
కరోనావైరస్ మనకు తెచ్చిన అతిపెద్ద కష్టం ఒక మనిషికి మరో మనిషిని దూరం చేయడం. దానినే ఇప్పుడు మనం ఏకాంతం, క్వారంటైన్, సోషల్ డిస్టన్సింగ్ లాంటి మాటలతో చెప్పుకుంటున్నాం. సోషల్ మీడియాలో కరోనావైరస్‌కు సంబంధించి ఇటీవల వైరల్ అవుతున్న ఎన్నో ఫొటోలను మీరు చూసే ఉంటారు.

 
కొన్ని ఫొటోల్లో శవపేటికలతో ఉన్న జనాల వరుసలు మనకు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తే మనిషిని మరణం తర్వాత కూడా అంతం కాని ఒక వింత ఒంటరితనం చుట్టుముట్టినట్లు అనిపిస్తుంటుంది. ప్రస్తుతం తల్లి తన బిడ్డను ముద్దాడలేకపోతోంది. భర్త, భార్యను కౌగిట్లోకి తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అలా తాకడం వల్ల కరోనా వ్యాపిస్తుందేమో అనే భయం. ఇది ఒక అనూహ్యమైన క్షణం. మన ప్రియమైనవారిని సజీవంగా చూడాలంటే మనం వారికి దూరంగా ఉండాల్సి వస్తోంది.

 
ఇటలీలో ఆస్పత్రుల్లో తుదిశ్వాస వదిలే సమయంలో చాలామంది తమ కుటుంబ సభ్యులను చూడలేకపోతున్నారు. వారిని తాకలేకపోతున్నారు. చాలా కుటుంబాల్లో కూడా వైరస్ వ్యాపించింది. కానీ వారు అంత్యక్రియల్లో పాల్గొని, కన్నీటి వీడ్కోలు కూడా పలకలేకపోతున్నారు.

 
మనిషికి మనిషి దూరం
కరోనావైరస్ మనిషిని మనిషికి దూరం చేసింది. ఇది సినిమా డైలాగ్‌లా అనిపించినా, ఇప్పుడు ఇది కఠిన వాస్తవం. మనల్ని మనం కాపాడుకోవాలంటే, మిగతా వారికి మనల్ని మనం దూరం చేసుకోక తప్పదు.

 
గత కొన్ని రోజులుగా మీకు మీ స్నేహితుడిని హత్తుకోవాలనిపించినా, అలా చేయలేకపోతున్నామే... అనిపించింది. మీ సోదరి విదేశాల నుంచి ఇంటికొచ్చింది. కానీ, మీరు వెళ్లి ఆమెను కలవలేకపోతున్నారు. మీకు సొంత ఊరికెళ్లి మీ అమ్మనాన్నలను కలవాలని అనిపిస్తోంది. వారితో కలిసి గడపాలని అనిపిస్తోంది. కానీ, అలా చేయలేకపోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న భర్యాభర్తలకు ఏకాంత సమయం లభించినా, ఒకరికొకరు దగ్గరకావడానికి భయపడుతున్నారు.

 
మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఒకరిని ఒకరు తాకడానికే వణికిపోతున్నాం. పొరపాటున ఎవరినైనా తాకినా, మనం చేసే మొదటిపని చేతులు శుభ్రం చేసుకోవడం లేదా శానిటైజర్‌తో తుడుచుకోవడం. ప్రస్తుతం మనం ఉన్న ఈ సమయంలో అది చాలా అవసరం, కానీ మనం ఈ కష్టకాలంలో మనం ముఖ్యంగా ఒకటి కోల్పోతున్నాం. అదే ఒకరిని ఒకరు తాకడం లేదా స్పర్శించడం.

 
స్పర్శ మన జీవితంలో అంత ముఖ్యమైనదా, అది నిజంగా అవసరమా?
బీబీసీ ప్రతినిధి క్లౌడియా హెమండ్ మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఒక రేడియో కార్యక్రమం నిర్వహిస్తారు. ఆమె స్పర్శ మన జీవితంలో ఎంత ప్రాధాన్యం ఉంది అని ఆమె నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

 
జీవితంలో తొలి పరిచయం-స్పర్శ
తల్లి గర్భంలో బిడ్డ మొట్టమొదట పొందే అనుభవం స్పర్శ. ఆ తర్వాత వినడం, వాసన చూడడం, రుచి తెలుసుకోవడం లాంటి జ్ఞానాలు వికసిస్తాయి. తల్లి గర్భంలో కవలలు ఉంటే వారు మొట్టమొదట ఒకరిని ఒకరు తాకుతూ ఆ అనుభవం పొందడానికి ప్రయత్నిస్తారు అనేది ఆసక్తికరమైన విషయం. పుట్టిన తర్వాత బిడ్డకు సురక్షితంగా అనిపించేది తల్లి ఒడే.

 
ఆ అనుభూతి మన జీవితాంతం ఉండిపోతుంది. అందుకే ఏదైనా కష్టం వచ్చినపుడు మన సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు మనల్ని హత్తుకోగానే మనకు చాలా సురక్షితంగా అనిపిస్తుంది. “మీ సన్నిహితుల స్పర్శకు, మీ మనసులో ప్రశాంతతకు పరస్పరం సంబంధం ఉంటుంది” అని క్లాడియా రాశారు.

 
మనం చర్మం ద్వారా స్పర్శ అనుభూతిని పొందుతాం. మన జ్ఞానేంద్రియాల్లో కళ్లు, ముక్కు, చెవులు, నాలుక కంటే చర్మం అత్యంత ముఖ్యమైనది. అందుకే, మనం మనకు తెలీకుండానే చాలా నిర్ణయాలను, అంటే.. కూరగాయలు తాజాగా ఉన్నాయా లేదా, ఎవరికైనా జ్వరం ఉందా అనేవి ఈ స్పర్శ ద్వారానే తీసుకుంటాం. అంతే కాదు ఎవరినైనా తాకి వారిలో ఎలాంటి భావాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోగలం.

 
అందుకే మనకు ప్రస్తుత పరిస్థితి దారుణంగా అనిపిస్తోంది. ఎందుకంటే మనం ఇంతకు ముందులా మనం మన జ్ఞానేంద్రియాలపై ఆధారపడలేం. ప్రపంచం గురించి తెలుసుకోడానికి మనం వాటిని ఉపయోగించలేం.

 
“ఈ వ్యాధి మన ఒక ఇంద్రియాన్ని మాత్రం చాలా ఘోరంగా ప్రభావితం చేస్తోంది. అదే స్పర్శ. మనుషులకే కాదు.. జంతువులకు కూడా స్పర్శ చాలా కీలకం. కానీ కోవిడ్-19 వల్ల మనం ఒక విధంగా ఒకరికొకరు దూరంగా వెళ్తున్నాం” అని కేఈఎం ఆస్పత్రి మానసిక వ్యాధి విభాగం మాజీ డీన్ డాక్టర్ శుభాంగి పార్కర్ అన్నారు.

 
అభద్రతా భావం
“ప్రేమ, స్పర్శలకు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఉంటుంది. మనం సురక్షితంగా ఉన్నాం అనే భావనను ఆ రెండూ మనకు అందిస్తాయి. అవి మనకు ఎలాంటి ఆందోళన లేకుండా ఉపశమనం అందిస్తాయి” అంటారు పార్కర్.

 
“మన ప్రపంచ జ్ఞానం స్పర్శ మీదే ఆధారపడిందని చెబితే అతిశయోక్తిగా అనిపించవచ్చు. మనకు ఇష్టమైన వ్యక్తి మనల్ని తాకితే, మన శరీరంలో పాజిటివ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. రెండోది స్పర్శ మానసిక వ్యాధులను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుంది. చాలాసార్లు స్పర్శ బీపీ, డయాబెటిస్‌ నియంత్రణకు సహకారిస్తుంది. మనం ఒకరినొకరు తాకడానికి ఎంతగా అలవాటుపడిపోయామంటే, మనల్ని ఎవరైనా తాకకపోతే ఏదో బాధగా, వెలితిగా, లేదంటే అభద్రతగా అనిపిస్తుంది” అని పార్కర్ చెప్పారు.

 
ముందు ముందు ఏమవుతుంది?
కోవిండ్-19 కచ్చితంగా మనల్ని ఒకరికొకరు దూరం చేసింది. ఈ కష్టకాలంలో మనకు ఎవరి సపోర్ట్ లేకుంటే దీన్నుంచి మనం ఒంటరిగా మందుకు ఎలా వెళ్లగలం. కానీ, ఇక్కడ అత్యంత ముఖ్యమైన, కీలకమైన విషయం డాక్టర్లు, ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే అన్ని సూచనలనూ మనం కచ్చితంగా పాటించాలి.

 
వాటికి పాటించడానికి ఏమాత్రం సంకోచం ఉండకూడదు. అంతేకాదు, ఇలాంటి సమయంలో మనం సంయమనంతో వ్యవహరించడం చాలా అవసరం. ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో ఈ స్పర్శను భర్తీ చేయడం కష్టమే.. అది లేని లోటును మనం భరించాలి. కానీ, కొన్ని చేయడం వల్ల మన ఆ అభద్రతాభావాన్ని కచ్చితంగా తగ్గించవచ్చు.

 
“ప్రేమ కూడా స్పర్శ లాంటిదే. దానిని మాటల్లో వ్యక్తం చేయవచ్చు. అందుకే మనసు విప్పి మాట్లాడండి.. మీ మాటలతో అవతలివారిని ఉపశమనం కలిగించండి. వారి బాధను పంచుకోండి. మనం ఒకరినొకరు తాకలేకపోయినా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయచ్చు. మన పరిచయస్తులు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం” అని డాక్టర్ పార్కర్ చెప్పారు.

 
మీకు సంతోషంగా అనిపించే పనులు చేయండి. నెగటివ్ ఆలోచల నుంచి బయటపడి, సంతోషంగా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని ఒక ప్రతిజ్ఞ చేయండి. సోషల్ మీడియాలో కొత్త స్నేహితులను చేసుకోండి. పాత మిత్రులతో మాట్లాడండి. ఎప్పుడో మీపై కోపంతో దూరమైన వారితో కూడా మాట్లాడి దగ్గర తీసుకోడానికి ఇదే సమయం.

 
కరోనావైరస్ మనల్ని కచ్చితంగా ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితం చేసుండచ్చు. కానీ అది మన కోసం ఒక కొత్త ప్రపంచం తలుపులు తెరిచింది. బయటి ప్రపంచంలోకి వెళ్లకూడదని మీకు చెబితే, లోపల మీలో ఉన్న మిమ్మల్ని వెతుక్కోండి. బహుశా ఈ ఏకాంత సమయంలో మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఏదో ఒక కారణం తప్పకుండా దొరుకుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూల్ ఫీజు : ప్రైవేట్ స్కూల్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్స్... తేడా వస్తే..