Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్-3: 'విక్రమ్' ల్యాండర్‌ను పరీక్షించిన ఈ మట్టి అక్కడ తప్ప ఇండియాలో ఎక్కడా దొరకదు

image
, మంగళవారం, 22 ఆగస్టు 2023 (20:57 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జులై 14న చంద్రయాన్-3ను విజయవంతంగా పరీక్షించింది. అనంతరం వ్యోమనౌక నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడింది. ఆగస్టు 23 సాయంత్రం 6.04 నిమిషాలకు ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపనుంది. దీని కోసం ఇండియా మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. అయితే, చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను పరీక్షించేందుకు అచ్చం చంద్రుడిపై ఉండే మట్టి నమూనా ఇస్రోకు అవసరమైంది. ఆ తరహా మట్టి భారత దేశంలో తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో మాత్రమే దొరుకుతుంది. దీని కథ తెలుసుకోవాలంటే మనం కాస్త గతంలోకి వెళ్లాలి.
 
1950లలోనే నమక్కల్ జిల్లా పరమతివేలూర్‌లోని చిట్టంబూండి, గున్నమలైలలో ఆంత్రోసైట్ రాళ్లను గుర్తించారు. అయితే, వీటికీ చంద్రుడిపై ప్రయోగాలకు చాలా కాలం వరకూ ఎలాంటి సంబంధమూ ఉండేది కాదు. అయితే, ఇంచుమించు ఇలాంటి ఆంత్రోసైట్ రాళ్లే చంద్రుడు ఏర్పడినప్పుడు అక్కడి ఉపరితలంపైనా ఏర్పడ్డాయి.
 
చంద్రుడిపై ఆంత్రోసైట్ రాళ్లను గుర్తించిన ‘అపోలో’
1970లలో అపోలో మిషన్‌లలో చంద్రుడిపై ఆంత్రోసైట్, బసాల్ట్ రాళ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. చంద్రయాన్ మొదటి రెండు ప్రయోగాలకు ముందు పరీక్షల్లో అలాంటి రాళ్లు ఇస్రోకు అవసరమయ్యాయి. దీంతో భారీగా డబ్బులు చెల్లించి వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. అప్పుడే ఈ తరహా రాళ్లు భారతదేశంలో ఎక్కడున్నాయో పరిశోధన చేపడితే, ఇక్కడ కూడా అవి దొరికే అవకాశం ఉంటుందని అప్పటి ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై భావించారు. దీనిలో భాగంగానే అప్పట్లో ఐఐటీ ముంబయిలోని సెంటర్ ఫర్ జియో-ఇన్ఫర్మేషన్, ఆస్ట్రోనమీ పరిశోధకుడు అన్బజగన్ సాయాన్ని ఇస్రో పరిశోధకులు కోరారు.
 
ఈ మట్టి కోసం దేశంలో ఇస్రో పరిశోధకుల అన్వేషణ
అన్బజగన్ నేతృత్వంలో ఇస్రో పరిశోధకులు ఈ మట్టి కోసం దేశంలోని చాలా ప్రాంతాల్లో శిలలు, మట్టి నమూనాలను పరిశీలించారు. దీంతో చిట్టంబూండిలోని మట్టి చంద్రుడిపై మట్టికి 99 శాతం సరిపోలుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆంత్రోసైట్ రాళ్లను సేలంలోని ఒక క్వారీలో మట్టిగా చేశారు. ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు చేపట్టిన పరీక్షల్లో ఆ మట్టినే ఉపయోగించారు. నాడు ఈ మట్టిని ఇస్రోకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన అన్బజగన్ ప్రస్తుతం సేలం పెరియార్ యూనివర్సిటీలో జియోఇన్ఫర్మేషన్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
 
అవి భూమి మొదట్లో ఏర్పడిన రాళ్లు: అన్బజగన్
తాజా ప్రయోగంలో ఆ మట్టి, శిలల పాత్ర గురించి అన్బజగన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘చంద్రుడిపై మనకు ముఖ్యంగా రెండు రకాల రాళ్లు కనిపిస్తాయి. అవే ఆంత్రోసైట్, బసాల్ట్ రాళ్లు. దక్షిణ ధ్రువంలో ఆంత్రోసైట్ రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. నమక్కల్ జిల్లాలోని చిట్టంబూండి, గున్నర్‌లలో 1950లలోనే సుబ్రహ్మణ్యం అనే పరిశోధకుడు ఈ రాళ్లను గుర్తించారు. ఇవి భూమి మొదట్లో ఏర్పడిన రాళ్లు’’ అని ఆయన చెప్పారు. ‘‘1970లలో అపోలో మిషన్‌లలో చంద్రుడిపై అంత్రోసైట్, బసాల్ట్ రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అప్పుడే ఇలాంటి రాళ్లు భూమిపై ఎక్కడ దొరుకుతాయనే పరిశోధనలు జరిగాయి’’ అని ఆయన వివరించారు.
 
‘‘భారత్‌లోనూ ఐఐటీ-బాంబే, సేలం పెరియార్ యూనివర్సిటీ, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి ఈ రాళ్ల కోసం పరిశోధన మొదలుపెట్టాం. అనంతరం చిట్టంబూండిలోని ఆంత్రోసైట్ రాళ్ల రసాయన స్వరూపం 99 శాతం వరకూ చంద్రుడిపై శిలలతో సరిపోలుతున్నట్లు తెలిసింది’’ అని అన్బజగన్ చెప్పారు. ‘‘చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను పరీక్షించేందుకు చంద్రుడిపై శిలలను పోలిన ఆంత్రోసైట్ రాళ్లు కావాలని మమ్మల్ని కోరారు. దీంతో మేం ఇస్రోకు వాటి నమూనాలను పంపించాం. వీటినే ఆ ప్రయోగంలో ఉపయోగించారు’’ అని ఆయన వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్.. తెలంగాణాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు